శ్యాంసుందర్ విదిలించుకోబోతూనే స్పృహ తప్పిపోయాడు.

 

    "ఇతరుల ప్రాణాలగురించి అంతగా పట్టించుకోని నీకు మాత్రం నీ ప్రాణాల మీద యింత తీపి ఉండటం చిత్రమే శ్యాం. కమాన్."

 

    ఆగివున్న కారు వెనుక సీటులోకి నెట్టాడు శ్రీహర్ష.


                                                            *  *  *


    విశాఖ నగరంలో ఎప్పటిలాగే తెల్లవారినా వాతావరణం రోజులా లేదు.

 

    యస్పి శ్యాంసుందర్ అదృశ్యంకావడం రాష్ట్ర పోలీసువిభాగాన్ని అతిగా కలవరపరిచిన విషయమైతే ఆరోజు దినపత్రికలో ప్రచురింపబడిన వార్తలు ప్రజల్ని మరింత విభ్రమానికి గురిచేసాయి.

 

    ఈ దేశంలో లిబియో టెర్రరిస్టులు అడుగుపెట్టడమేమిటీ అని ఆలోచించలేదు తొంభైశాతం ప్రజలు.

 

    యస్పి శ్యాంసుందర్ ని ఆ టెర్రరిస్టులే హెచ్చరిక ప్రకారం కిడ్నాప్ చేసేరని తీర్మానించేసుకున్నారు.

 

    మిగతా పదిశాతం మేధావులు ఈ విషయానికి అట్టే ప్రాధాన్యతనివ్వలేదు. రోజురోజుకీ దేశాన్ని చిత్రమైన మలుపు తిప్పుతున్న పొలిటికల్ స్టంట్స్ లో ఇదో భాగమనుకుంటూ సరిపెట్టుకున్నారు.

 

    అయితే ఆ మేధావుల్ని ఆకట్టుకున్న విషయం మరోటుంది.

 

    అది యస్పి శ్యాంసుందర్ ని నగ్నంగా నడిరోడ్డుపై నడిపిస్తామని టెర్రరిస్టుల నాయకుడి స్టేట్ మెంటు.

 

    అలా నడిపించే ప్రాంతమేదో ఖచ్చితంగా తెలిస్తే వీలుచూసుకుని అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని తిలకించాలనుకున్నారు కాని యిదమిద్దంగా అది తేలనందుకు కించిత్తు నిరాశచెందారు కూడా...

 

    దేశ రాజధానిలో వున్న ఉపప్రధాని సుదర్శనరావుగారు శమంత్ మరణానికి సంతృప్తి చెందినా యస్పి శ్యాంసుందర్ అదృశ్యమే జీర్ణించుకోలేకపోతున్నారు.

 

    అందుకే కేంద్ర హోంశాఖ కార్యదర్శి ద్వారా ఆంధ్రరాష్ట్ర డిజిపిని అలర్ట్ చేసారు.

 

    యస్పి శ్యాంసుందర్ "స్ట్రేకింగ్" కార్యక్రమాన్ని నిరోధించలేకపోతే ఆ తర్వాత అది సవ్యసాచికి, అంతకుమించి తన ముద్దులకొడుకు మహేంద్రదాకా విస్తరించి తన ప్రతిష్టకే తలవొంపుగా మారే ప్రమాదముంది.

 

    ఉదయం తొమ్మిదిన్నర కల్లా పోలీసు ఇంటెల్లిజెన్స్ అధికారులు విశాఖపట్టణానికి చేరి టెర్రరిస్టుల (?) చర్యని ప్రతిఘటించటానికి సమాయత్తమై వందల సంఖ్యలో స్పెషల్ పోలీస్ ని రంగంలోకి దింపేసారు...

 

    నగరంలో ఎక్కడ చూసినా పోలీసులే.

 

    ఏ ప్రాంతంలో గమనించినా కథలు కథలుగా చర్చించుకుంటున్న జనమే.

 

    అయితే శమంత్ అంత్యక్రియలకి ఏ లోటూ జరగలేదు.

 

    మార్చురీనుంచి శమంత్ శవాన్ని పోలీస్ లాంఛనాలతో వూరేగిస్తున్నారు.

 

    వందల సంఖ్యలో జనంతోబాటు డిజిపి ఆధ్వర్యంలో పోలీసు బేండ్ కూడా విషాద రాగాన్ని ఆలపిస్తూ శమంత్ శవంవున్న పోలీసుజీపుని అనుసరిస్తుంది.

 

    శమంత్ ఆ నగరంలో ఏయస్పిగా అడుగుపెట్టి దశాబ్దాలు కాలేదు.

 

    రెండు మూడేళ్ళు మాత్రమే అయినా ఎంతమంది అభిమానాన్ని పొందగలిగాడని...

 

    విధి నిర్వహణలో ఏ ఒత్తిడినీ అంగీకరించని నిజాయితీపరుడిగా చాలామందికి ఆరాధ్యుడు కావడంతో కొందరు నిశ్శబ్దంగా కంటతడి పెట్టుకుంటున్నారు.

 

    అదికాదు చూసేవాళ్ళ మనసు ద్రవింపజేసింది.

 

    రేవతి ఆక్రందన... ఒక ఐపియస్ ఆఫీసరు భార్య అయినా శమంత్ లాగే ఆమె కూడా అనాధే కాబట్టి ఓదార్చే దిక్కులేక శమంత్ శవంపై పడి యింకా రోదిస్తూంది.

 

    ఆ క్షణంలో ఆమెకు "లల్లూ" గుర్తుకు రావటంలేదు.

 

    రేపటి శూన్యంలాంటి భవిష్యత్తు జ్ఞప్తికి రావడంలేదు. సమాధి అయిపోయిన చాలా సత్యాలు, ఉనికి కోల్పోయిన యెన్నో వాస్తవాలు స్ఫురణ కొస్తున్నాయి.

 

    చట్టాన్ని రక్షించే అధికారులూ శాసనాలుచేసే రాజకీయం కలిసి భర్తని హత్య చేసింది. నూరేళ్ళ సౌభాగ్యాన్ని మంటగలిపేసింది. రాడే ఏ దేవుడూ దిగి రాడేం... నడి బజారులో నిజాయితీ యింత దారుణంగా హత్య చేయబడితే కనీసం తర్జనితో దుర్మార్గాన్ని చూపించే ధైర్యాన్ని ప్రదర్శించడేం...

 

    అలా ఆమె ఎన్ని గంటలుగా రోదిస్తూందో ఆమెకు గుర్తులేదు. ఇంకా ఎన్ని దశాబ్దాలపాటటు చెరగని ఈ స్మృతిని ఆరని కళ్ళలో ఆశ్రువుల్లా దాచుకోవాలో తెలీక నలిగిపోతూంది.

 

    ఊరేగింపు ఓ మలుపు చేరుకోగానే దిగిపొమ్మన్నాడు డిజిపి. మరో రెండు ఫర్లాంగుల దూరంలోవున్న స్మశానం దగ్గరికి ఆమె రావడం అతడికిష్టంలేనట్టు. "వెళ్ళిపో అమ్మా. ప్లీజ్ లీవ్..." అనునయంగా అన్నాడు.  

 

    ఒక జీవితకాలం తన భర్తకి దూరంకాలేనన్న భావమో. అదీకానినాడు ఆ శవంతోబాటు సహగమనంచేయాలన్న తలంపో అమాంతం శమంత్ పాదాన్ని చుట్టేసింది. "వద్దు. ఆయన్ని తీసుకెళ్ళొద్దు. నాకు నా భర్త కావాలి."

 

    ఊరేగింపు ఆగిపోయింది కొన్ని క్షణాలపాటు.

 

    వెక్కిపడిపోతూ "నాకు... నా భర్త..." కన్నీళ్ళతో శమంత్ పాదాల్ని అభిషేకిస్తూంది "నా భర్త కావాలి."

 

    ఆమెకు ఎలా నచ్చచెప్పాలో ఎవరికీ తోచడంలేదు. ఏడుపు ఉధృతమై ఇప్పుడు మరీ మొండిగా శమంత్ శవాన్ని పెనవేసుకుపోయింది. "ఏమండీ... నేనేమైపోవాలి. నేనూ, లల్లూ మీరు లేకుండా... ఎలా బ్రతకాలి."

 

    భుజంపై చేయిపడిందెవరిదో.

 

    ఆమె తేరుకోలేదింకా.

 

    "అమ్మా రేవతీ" శ్రీహర్ష కంఠం వినిపించింది.

 

    వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు పసిపిల్లలా లేచింది. "అన్నయ్యా. మరేమో... ఆయన్ని తీసుకుపోతున్నారు" కంప్లయింట్ లా చెప్పింది వెక్కిపడుతూనే.

 

    ఊరేగింపు కదిలింది మళ్ళీ.

 

    "అ... న్న... య్యా... వద్దంటే... వినడంలేదు."

 

    ముందుకు పరుగెత్తబోయిన రేవతిని పొదివి పట్టుకున్నాడు.

 

    "వదులన్నయ్యా... ఆయన..." పిచ్చిదానిలా కలవరపడుతూ బలంగా విదిలించుకుంటుంది.

 

    "ఆయన చచ్చిపోయారన్నయ్యా. ఆరోజు మీరు రక్షించారే. ఆయన్ని అందరూ కలిసి చంపేసారు. నిజం. నీమీద ఒట్టు."

 

    "అమ్మా రేవతీ" ఏ గుండె అర పగిలిందో శ్రీహర్ష కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి "ఫర్ గెటిట్"

 

    "ఎలా" ఉక్కిరిబిక్కిరయిపోయింది "నాకెవరున్నారని."

 

    "అన్నయ్య... మీ అన్నయ్య వున్నాడుగా..." లాలనగా ఆమె ముంగురుల్ని సవరించాడు.

 

    ఆ మాత్రం ఓదార్పుకి గుండెవాగుకి చివరి గండిపడినట్టు బావురుమంటూ శ్రీహర్ష గుండెలపై వాలిపోయింది.