"మూడు నెలలుగా అనుకుంటున్న పని ఇప్పటికి పూర్తిచెయ్యగలిగాను" అన్నాడు.

 

    "ఏవిటదీ?"

 

    "స్టార్ హోటల్స్ లో మిగిలిపోయిన ఫుడ్ ని నగరంలోని వివిధ ఆర్గనేజ్ లకి రోజూ పంపించే విషయమై మాట్లాడ్తూ వచ్చాను. చివరికి ఒప్పుకున్నారు.

 

    హైద్రాబాద్ సమీపంలోని స్టార్ హోటల్స్ యజమానులు, లయన్స్ క్లబ్ సహకారంతో ఈ పనిని చేస్తారు. ఆర్ఫనేజ్ పిల్లలు రోజూ మనకంటే రిచ్ ఫుడ్ తింటారన్నమాట!" అన్నాడు.

 

    అతను నవ్వడం లేదు. కానీ అతని కళ్ళు మెరుస్తున్నాయి. బహుశా మనసు నవ్వుతోందేమో!

 

    అతను గిటార్ వాయిస్తాడని ఆ రోజువరకూ నాకు తెలీదు. అతను గిటార్ వాయిస్తుంటే వింటూ చాలాసేపు ఉండిపోయాను. చాలా హుషారుగా ఉన్నాడు.

 

    మన దైనందిన జీవితం ఒక మనిషి తలపులతో ఉత్సాహభరితం అవుతోందంటే అతనంటే మనకి ఇష్టం పెరిగిపోతోందన్నమాట!

 

    రోగులని చూస్తే ఇదివరకు నాలో కలిగేలాంటి చిన్నపాటి విసుగు కూడా కలగడంలేదు.

 

    వాళ్ళమీద దయా, ప్రేమా కలుగుతున్నాయి. తనకేమీ కాని అనాధపిల్లల కోసం రాత్రింబగళ్ళు ఆలోచించి పాటుపడుతున్న - చంద్ర గుర్తొస్తాడు.

 

    చంద్ర బర్త్ డే అని నానమ్మ చెప్పింది. అతని కోసం వైట్ కుర్తా, పైజామా కొన్నాను. అతను అస్తమానం వేసే డ్రెస్ అదే మరి! కేక్ తీసుకుని వెళ్ళేసరికి చంద్ర లేడు. పక్కవీధిలో మెకానిక్ షెడ్లో పనిచేస్తున్న కుర్రాడికి యాక్సిడెంట్ అవడంతో హాస్పటల్ కి తీసుకెళ్ళాడట.

 

    నాన్నమ్మకి నేను వంటల్లో సాయం చేశాను. అన్నం, కూరా, సాంబారు, సేమ్యా పాయసం చేశాము.

 

    పిల్లలతో కలిసి బైట క్రికెట్ ఆడసాగాను.

 

    చంద్ర నలిగి, మాసిపోయిన బట్టలతో పెరిగిన గెడ్డంతో నీరసంగా వచ్చాడు. పుట్టినరోజు పూట అతను అలా ఉండడం నాకు బాధనిపించింది.

 

    "అలా ఉన్నారేం?" అన్నాను.

 

    "కొంచెం రక్తం ఇవ్వవలసి వచ్చింది" అని నిలబడలేక మంచంమీద వాలాడు.

 

    "హాస్పిటల్ లో పాలూ, బ్రెడ్డూ లాంటివి ఏమైనా ఇచ్చారా?" అడిగాను.

 

    "అది ధర్మాసుపత్రి...అక్కడ అంత ధర్మబుద్ధి ఉండదు!" అన్నాడు.

 

    నానమ్మ వచ్చి "తలంటుపోసుకో పద" అంది.

 

    "కాసేపు ఆగు" అన్నాడు.

 

    నేను బట్టల ప్యాకెట్ చేతికిస్తూ "స్నానం చేసి ఇవి వేసుకోండి...విష్ యూ హేపీ బర్త్ డే!" అన్నాను.

 

    "బర్త్ డే రోజునే కాదు నేను ప్రతిరోజు హేపీగా ఉంటాను. ప్రతివాళ్ళూ అలాగే ఉండాలి" అన్నాడు.

 

    "నిజమే! అతను చేస్తున్న వర్క్ లో ఎంతటి ఆనందాన్ని పొందుతాడో? ప్రతి పనిలో తృప్తి, అంతులేని ఆత్మవిశ్వాసం."

 

    అతనికి ఈ బర్త్ డేస్ అవీ సెలబ్రేట్ చేసుకోవడం పట్ల ఇంట్రెస్ట్ లేదు. దేవుడికి కానీ తల్లిదండ్రుల ఫోటోలకి కానీ దండం కూడా పెట్టినట్లు నాకు ఎప్పుడూ కనిపించలేదు! బహుశా అతని దైవం చుట్టూ ఉన్న చిన్నారుల కళ్ళల్లో కనిపిస్తుందేమో! అందుకనే వాళ్ళతో ఎక్కువ సమయం గడుపుతాడు.

 

    గంగ అనే అమ్మాయి పై పనులన్నీ చేతూ ఉంటుంది. "సంద్రం" బాబు అంటుంది. నిజంగా అతను సంద్రమే!


                                  *  *  *


    నాలో అతనిపట్ల కలుగుతున్న భావాలు నాకు సిగ్గు కలిగిస్తున్నాయి. అతను మాత్రం నాపట్ల ఆకర్షితుడైనట్లు కానీ, నన్ను ఆడపిల్లగా ట్రీట్ చేసి ప్రత్యేకంగా చూసినట్లు కానీ ఎప్పుడూ కనిపించలేదు.

 

    ఇంటికి ఓ రోజు అతనే వెల్లవేశాడు. పిల్లలతో బాటు కుంచె తీసుకుని నేనూ వేస్తుంటే అతను వారించలేదు. అతను సోమరితనాన్ని భరించలేడు! గంగ మొగుడు కష్టపడకుండా కూర్చుని తింటున్నాడని తెలిసి చితకబాదాడుట! నేనేవెళ్ళి కట్టుకట్టి మందులిచ్చి వచ్చాను. ఆ దెబ్బలకి కట్లుకడుతూ 'అతను కొట్టాడని' తలచుకుని వాటికి ప్రేమగా సపర్యలు చేశాను.

 

    ఫూలిష్ నెస్ కి పరాకాష్ట ప్రేమ! అది అతనిపట్ల నాకు ఏర్పడి...అతనికి మాత్రం ఏర్పడకపోవడం విధి!


                                                         *  *  *


    నానమ్మ ఈ రోజు బాధపడింది.

 

    "వీడికి ఈ వయసులో వచ్చే సహజమైన ఆలోచనలు రావడం లేదమ్మా! ఎంతసేపూ అన్యాయాలూ, దురాగతాలూ, సమసమాజం అంటున్నాడు.

 

    "అసలు ఏ పిల్లనైనా ఇష్టపడి పెళ్ళి చేసుకుంటాడా? చేసుకుంటే ఆ అమ్మాయి వీడి తత్వం అర్థం చేసుకుని కాపురం చేస్తుందా అని! నేను దాటిపోయేలాగా పిచ్చి నాగన్నకి తోడు దొరకాలమ్మా!" అంది.

 

    ఆవిడ నా గురించే ఆ మాటలు అంటోందేమోనని నా బుగ్గలు ఎర్రబడ్డాయి.

 

    ఓ రోజు సడెన్ గా చంద్రం హాస్పిటల్లో నన్ను వెతుక్కుంటూ వచ్చాడు.

 

    నాకు గాబరావేసి "నానమ్మ బావుందా?" అన్నాను.

 

    "ఆ...ఆ...ఇటునించి వెళ్తుంటే గుర్తొచ్చారు. అందుకే వచ్చాను" అన్నాడు. అంతలోనే "కాదు... మీకోసమే ఇటు వచ్చాను" అన్నాడు.

 

    చల్లని వెన్నెలలో మోహదీహసన్ గజల్ విన్నట్లుగా నా గుండె ఒక్కసారిగా లయతప్పింది!

 

    "నిన్న మీరు ఆ పీన్ గాడికి ఇచ్చిన మందువల్ల వాడు చాలా రోజులకి ఆయాసం లేకుండా హాయిగా పడుకున్నాడు. అర్థరాత్రి దాటాక ఆయాసపడ్తూ లేచి కూర్చుని వాడు పడే మూగవేదన చూడడం కష్టంగా ఉండేది. నిన్నవాడు ఆదమరిచి నిద్రపోతుంటే ఆ సమయంలో మీరు గుర్తొచ్చి అమాంతం వచ్చేయాలనిపించింది.