"ఏం చేద్దాం పీటర్?" ఏమీ తోచక పీటర్ ని సలహా అడిగాడు అర్జునరావు.

 

    పీటర్ ముందు పెద్దగా నవ్వాడు. మందు అతని మస్తిష్కం మీద బాగా పనిచేస్తోంది.

 

    "ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎలాంటివాడినయినా చిత్తు చేయగల మీ క్రిమినల్ బ్రెయిన్ ఏమయింది? నవ్వుతూ నవ్వుతూ వెనుక నుంచి చావు దెబ్బకొట్టగల మీ శక్తి సామర్ధ్యాలు, మేధస్సు ఏమయిపోయాయి? మొత్తానికి వీడవడోగాని అసాధ్యుడిలా వున్నాడు..." అంటూ నవ్వాడు పీటర్ వెర్రిగా.

 

    పీటర్ అన్న చివరి మాటలకు అర్జునరావు ఉలిక్కిపడ్డాడు.

 

    "మొత్తానికి... వీడెవడోగానీ...? ఎవడు వాడు...? నీక్కూడా వాడెవడో తెలీకుండా మనమధ్యకు రప్పించావా?" అనుమానంగా చూస్తూ అడిగాడు అర్జునరావు.

 

    "ఏమిటో ఒక్కమాట ఒకసారి వింటూనే అర్థమయి చావడం లేదు. ఒక్కో మాటను నాలుగుసార్లు అటు తిప్పి ఇటు తిప్పి సినిమా డైలాగుల్లా మార్చి మార్చి అంటే మతిపోయి, మందు దిగిపోయింది" అన్నాడు కనకారావు కన్ ఫ్యూజ్ అవుతూ.

 

    "ఈమధ్య నువ్వేం వాగుతున్నావో నీకు తెలీడం లేదు" కోపంగా అన్నాడు పీటర్.

 

    ఒక్కక్షణం అని సైగచేసి కనకారావు పక్కగదిలోకి వెళ్ళి బీరువాలో వున్న మాన్షన్ హౌస్ బాటిల్ మూత పెరికి గటగటా రా కొట్టేసి తిరిగి హాల్లోకి వచ్చాడు.

 

    "కొంకిరికాణా అంటే ఏమిటి?" కనకారావు తూలకుండా వుండేందుకు విశ్వప్రయత్నం చేస్తూ అడిగాడు.

 

    "తెలీదు" పీటర్ ఆశ్చర్యపోతూ అన్నాడు.

 

    "అరకాలు అంటే...?"

 

    "తెలీదు"

 

    "ఇడిత్తల వెధవా అంటే?"

 

    "ఇడిత్తల అంటే తెలీదు. వెధవా అంటే పనికిరాని వాడని"

 

    "అరబ్రెయిన్ అంటే?"

 

    "తెలీదు"

 

    "మరదే... నాకూ తెలీదు. అర్థమయ్యేటట్టు అచ్చ తెలుగులో తిట్టి చస్తే అర్థమయిచచ్చేది. అది సంస్కృతమో... కొంకిణి భాషో... కంకర భాషో...? తిట్ల సంగతలా వుంచి అసలా తిట్లు ఏ భాష నుంచి లాక్కొచ్చాడో తెలీదు పిచ్చ... యమపిచ్చ తిట్లు... తిట్టిన తిట్టు తిట్టకుండా... ఊపిరి తీసుకోకుండా విరగతిట్టేశాడు మహానుభావుడు. మాటలతో షాక్ ట్రీట్ మెంటిచ్చేంత గొప్పోడు. దిమ్మ తిరిగిపోయి మతి పోగొట్టుకొని వచ్చాను. ఓరినాయనో...ఆ ముసలోడికి ఎదురుగా ఎవరెళ్ళినా మసే...మంట రేగకుండా మసి చేసేస్తాడు అందుకే నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలీకుండా పోతోంది" అలుపొచ్చినవాడిలా ఫ్లోర్ మీద కూలబడిపోతూ అన్నాడు కనకారావు.   

 

    "ఇంతకీ ఎవడు వాడు...?"

 

    "యములోడు"

 

    "ఆ పిచ్చి మాటలే వద్దన్నాను" పీటర్ మండిపడ్డాడు.

 

    "ఆహా... హా...హా... అవును నాకు పిచ్చే... పిచ్చెక్కే పిచ్చిమాటలు మాట్లాడుతున్నా. నన్నిలా వదిలేయండి మహానుభావులారా... లక్షపోతే పోయె... గుంజలోది బుర్రకాయలో గుజ్జు నజ్జయ్యేలా వుంది పరిస్థితి ఉన్న పళాన వదిలేస్తే తిరిగి నా పాత వ్యాపార మెట్టుకొని కత్తెర్లమ్మి నేనే మీకు లచ్చ... ఒక లచ్చ ఇస్తా వదిలేస్తారా...?" ఆశగా అడిగాడు కనకారావు.

 

    కనకారావువేపు ఆ ఇద్దరూ జాలిగా చూశారు.

 

    "యములోడు అంటే ఎవరు?" అనునయిస్తున్నట్టుగా అడిగాడు పీటర్.

 

    "చిన్న యములోడి బాబు"

 

    "చిన్న యములోడెవరు?"

 

    "పెద్ద యములోడి కొడుకు"

 

    కనకారావు పరిస్థితికి జాలిపడాలో కోప్పడాలో తెలీక ఆ ఇద్దరూ కొద్దిక్షనాలు అయోమయంలో పడ్డారు.

 

    'చిన్న యములోడంటే సామంత్ అవునా?" అర్జునరావు కనకారావు మరింత బెంబేలు పడిపోకుండా అనునయిస్తున్నట్టుగా అడిగాడు.

 

    అవునన్నట్టు తలూపాడు కనకారావు.

 

    "పెద్ద యములోడంటే వాడి తండ్రి అవునా..."

 

    "అయ్యాబాబోయ్... మీ గుజ్జు ఇంకా బొజ్జలోకి రాలేదు. సరిగ్గా చెప్పారు" సంబరపడిపోతూ అన్నాడు కనకారావు.

 

    "పీటర్... నలభైవేలు, ఒక కారు కనకారావుకివ్వు" అన్నాడు అర్జున్ రావు సడెన్ గా ఓ నిర్ణయానికొస్తూ.


                                                      *    *    *    *


    కారు తూనీగలా చల్లటి పైరగాలిని చీల్చుకుంటూ రోజ్ గార్డెన్ కేసి దూసుకుపోతోంది.

 

    డ్రైవింగ్ సీటులో వున్న సామంత్ గుండెలో విచిత్రమైన ఉద్వేగం ఉరకలు వేస్తుంటే పక్కనే వున్న నాయకి తడిదేరిన పెదవులు సన్నగా వణుకుతున్నాయి.

 

    అతని బ్రహ్మచర్యం, ఆమె వర్జినిటీ మరో గంటలో తమ తమ అస్థిత్వాల్ని కోల్పోబోతున్న అద్భుతమైన సంఘటన, సమాగమం గుర్తుకు వస్తూ వార్ని కుదిపివేస్తోంది.

 

    ఆ మధురక్షణాలు ఎందరికో తారసపడ్డాయి. తామసాన్ని కలిగించాయి. అవి ఎదురవుతాయని, ఎదురయి ఆనందామృతపు అంచులకు తీసుకెళతాయని వారికి తెలుసు. ఎదురయినా క్షణాలు ఎలా గడిచిపోతాయో, ఏ ఊసులు చెబుతాయో, ఏ అనుభూతుల్ని పంచుతాయో, అప్పుడేమి జరుగుతుందో, ఏ క్రియలో పాల్గొనాలో వారికి థియొరిటికల్ గా తెలుసు.

 

    కాని తీరా ఆ అనుభవమే ఎదురయినప్పుడు, ఎదురవ బోతోందని తెలిసినప్పుడు, నవయవ్వనంలో ఉరకలు వేసే యువహృదయాలు రెండూ స్వీయ అనుభూతికి సాక్షిభూతాలై ఉద్వేగపడతాయి... తడారే పెదాలు అదురుతుంటాయి. కోర్కెని తీర్చుకోబోయే శరీరాలు చిరుచెమటతో చంచలిస్తుంటాయి.

 

    కుడిచేత్తో స్టీరింగ్ ని కంట్రోలు చేస్తూ, ఎడం చేతిని స్టీరింగ్ మీద నుంచి తీసి తనకు, ఆమెకు మధ్యనున్న సీట్ పై వేశాడు.

 

    ఆమె ఆ చర్యను క్రీగంట చూసి భవిష్యత్ చర్యను తన కోణంలో యోచించుకొని మరింత ఉద్వేగానికి లోనయింది. మరికొద్ది క్షణాలు అతనిలో గాని, ఆమెలోగాని ఏ చలనమూ లేదు.

 

    ఆ ఇద్దరికీ తెలుసు... తమకేమీ కావాలో, ఏ అనుభవాన్ని పంచుకోవాలో... ఏ ఆనందానికి కర్తలు కావాలో... అయినా ఏదో బెరుకు... బేలతనం... భయం.

 

    ఏమనుకుంటుందో... అని మగాడు.

 

    ఏమనుకుంటాడో... అని స్త్రీ.

 

    ఈ ప్రపంచంలో చాలాచోట్ల ఎన్నో జంటల మధ్య ఎంతో విలువైన కాలం వృథా అయిపోతుంటుంది.

 

    ఒక్కోసారి వియోగం కూడా సంభవిస్తుంటుంది.

 

    ఎడబాటు కూడా తారసపడుతుంది. ఎవరో ఒకరు చొరవతీసుకుంటే రెండవవారు సహకరిస్తారని తెలీకకాదు...