"నన్ను వదిలి వుండలేనన్నావుగా! పద నేనూ కంపెనీ ఇస్తాను. రాచపీనుగ తోడులేకుండా వెళ్ళదుట! కనీసం చావులోనైనా రాచరికం చూపెడుదువుగాని! కలసి బ్రతకలేనివాళ్ళందరూ కలసి చావడం చరిత్రకి కొత్తకాదు" విరక్తిగా అన్నాడతను.
    
    "నో....కిరణ్.....బ్రేకు వెయ్యి.....నాకు బ్రతకాలనుంది......చావాలని లేదు......మనం కలసి బ్రతుకుదాం....నీ ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటాను" ఏడుస్తూ బ్రతిమాలింది.
    
    "నీకులానే మిగతావాళ్ళకీ బ్రతుకుమీద ఇంతే తీపి వుంటుంది చాయా! సారీ! నేనేం చెయ్యలేను.....ఎందుకంటే ఈ బండికి బ్రేకులు ఫెయిలయ్యాయి.....నువ్వు చెప్పిన ప్లానే అమలుచేసాను. ఈ ఫూర్ క్రీచర్స్ జీవితాలకి ముగింపు ఇదే!" తాపీగా చెప్పాడు కిరణ్.
    
    ఎదుటినించి లారీ వేగంగా దూసుకొచ్చేస్తోంది.
    
    "కిరణ్!" భయంతో అతన్ని కరుచుకుపోతూ కళ్ళు మూసుకుంది చాయ.
    
    కిరణ్ ఆమెను పొదివిపట్టుకుని "ఐలవ్ యూ డార్లింగ్.....ఇదే మన హనీమూన్....మన ఖజురహో! శృంగార పట్టాభిషేకానికి రసరాజ్యం ఎదురు చూస్తోంది....పద" అన్నాడు.
    
    చాయ హిస్టీరిక్ గా అరుస్తోంది. "నాకు బ్రతకాలనుంది.....ప్లీజ్..... డూ సమ్ థింగ్!"
    
    ఆఖరి నిమిషంలో అతను కారును కంట్రోల్ చెయ్యడానికి శాయశక్తులా ప్రయత్నించి ఓడిపోయాడు. "సారీ డియర్" అన్నాడు కళ్ళనిండా నీళ్ళతో.
    
    లారీ దూసుకువచ్చేసింది.
    
    "పెద్ద విస్ఫోటం....అనంతరం అనంతమైన ప్రశాంతత అలుముకుంది.
    
    ఇఫ్ మేన్ ఎన్ జాయ్స్ లైఫ్ ఇట్ ఈజ్ కామెడీ!
    
    ఇఫ్ లైఫ్ ఎన్ జాయ్స్ మేన్, ఇట్ ఈజ్ ట్రాజెడీ!
    
                                                              * * *
    
    "ఏమిటి డాడీ మీరు అనేది?" సంధ్య నమ్మలేనట్లుగా తండ్రిని అడిగింది.
    
    "నిజం! నువ్వు అనుకున్నట్లుగా చాయకీ, నాకూ మధ్యన ఏమీ జరగలేదు. నీ ఉత్తరంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. చాయ లేనప్పుడు ఆమె బెడ్ రూం వెదికితే నీ లాకెట్ బయటపడింది. జూలీ మరణానికి ఆమే కారణం అని రత్నం అప్పుడు చెప్పినా నేను నమ్మలేదు. కానీ రత్నం పని మానెయ్యడానికీ, అమ్మ మరణానికీ ఆమె కారణం అయి వుంటుందని ఇప్పుడు నమ్ముతున్నాను. ఆమె వేలితో ఆమె కన్నే పొడవాలని పెళ్ళి నాటకం మొదలెట్టాను. లూసీ ద్వారా కిరణ్ చాయల ప్రేమ సంగతి తెలిసి అతన్ని కలిసాను. అతను ఎంత ప్రాణప్రదంగా ఆమెను ప్రేమిస్తున్నాడో తెలిసి, కిరణ్ నిన్ను పెళ్ళి చేసుకోబోతున్నట్లుగా చెప్పి ఆమెను రెచ్చగొట్టాను. నా అంచనా ప్రకారం ఆమె ఇప్పుడు కిరణ్ దగ్గరికే వెళ్ళింది. ఇప్పటికైనా ఆమె తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటే, కిరణ్ తో ఆమె పెళ్ళి జరిపిస్తాను" అన్నాడు.
    
    సంధ్య కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి. ఆమెకి ఆశ్చర్యం, భయం, బాధా, దుఃఖం, తండ్రి విషయంలో తన అభిప్రాయం సరైనదైనందుకు ఆనందం అన్నీ.....ఒక్కసారిగా కలిగాయి. పగలూ, రాత్రీ చెట్లు నిలబడే వుంటాయని జాలిపడేటంత అమాయకపు ఆడపిల్లకి ఇలాంటి అమ్మాయిలు వుంటారని తెలియడం పెద్ద షాకే!
    
    జయచంద్ర కూతురి తలమీద చెయ్యివేసి "చాయది మానసిక రుగ్మత! మంచి సైక్రియాట్రిస్ట్ కి చూపిస్తే నయమవుతుంది. తనకి ఎవరూ లేరనీ, తను ఎవరికీ అక్కర్లేదనీ అనే భావనవల్ల ఇలా సమాజంమీద కసి పెంచుకుని వుంటుంది. కిరణ్ తన ప్రేమతో ఆమెను మార్చగలడని నా అభిప్రాయం" అన్నాడు.
    
    "కిరణ్!" సంధ్య మనసులోనే ఆ పేరు ఉచ్చరించి 'పూవుకన్నా సుకుమారమైన హృదయం గల కిరణ్ కి చాయమీద ప్రేమ! మనోఫలకం మీదున్న ఆ రూపాన్ని తుడిపెయ్యాడం అయ్యే పనా?' అనుకుంది.
    
    ఫోన్ మ్రోగింది జే.సీ అందుకున్నాడు.
    
    లూసీ అవతలనుండి గాభరాగా చెప్తోంది. "చాయా, కిరణ్ వెళుతున్న కారుకి ఏక్సిడెంట్ అయింది. అపోలోలో వున్నారు. మీరొచ్చేసరికి వాళ్ళు వుండకపోవచ్చు."
    
    "వాట్?!" జే.సీ అరిచాడు.
    
    "ఏమైంది నాన్నా?" అంటూ కంగారుగా అడుగుతున్న సంధ్య చెయ్యి ఆసరా కోసం అన్నట్లుగా పట్టుకుని "పద....ఆ విధివంచితులను చూద్దాం" అంటూ స్పీడుగా నడిచాడు జయచంద్ర.
    
                                                           * * *
    
    సాధుశీలత గొప్పగుణం. సాధువైన ఒక నది కొండలను కోసుకుంటూ ప్రవహిస్తుంది. సాధువైన ఓ తాడు రాతిని రాపిడితో కోస్తుంది. సాధు స్వరూపమైన ప్రేమ.....కఠిన హృదయాన్ని కరిగిస్తుంది.
    
    ఓ ప్రేమ బీజాన్ని నాటితే దాని ఫలాలనీ, చల్లని నీడనీ అనుభవించవచ్చు.
    
    సంధ్య చెట్టుక్రింద కూర్చుని పుస్తకం చదువుకుంటోంది.
    
    "సంధ్యా రెడీనా....బేబీ ఏదీ?" కిరణ్ లోపల్నుండి వస్తూ అడిగాడు. గతంలో జరిగిన భయానక సంఘటన తాలూకు ఆనవాలుగా అతను కుంటుతున్నాడు. చేతిలో హేండ్ స్టిక్ వుంది.
    
    సంధ్య నవ్వుతూ "వాళ్ళ తాతగారితో కలిసి అల్లరిచేస్తూ వుండివుంటుంది. మీరే పిలవండి" అంది.
    
    "చాయా.....చాయా!" కిరణ్ పిలిచాడు. ఎంతో అపురూపమైన పేరు పలుకుతున్నట్లుగా వున్నాయి అతని పెదవులు.
    
    తెల్లని కుచ్చుల కుచ్చుల ఫ్రాక్ లో వున్న బంగారు బొమ్మలాంటి పాపను ఎత్తుకుని జయచంద్ర బయటికి వచ్చాడు. పాప పేరు కాంచన చాయ.
    
    "డాడీ!" అంది పాప.
    
    సంధ్య లేచి నిలబడుతూ "వెళ్ళొస్తాం నాన్న!" అంది.
    
    జయచంద్ర పాపను ముద్దుపెట్టుకుని క్రిందకి దింపుతూ "కాంచన నా ప్రాణం. ఎక్కువరోజులు దూరంగా వుండలేను. త్వరగా వచ్చేయండమ్మా" అన్నాడు.
    
    సంధ్య నవ్వుతూ- "పోనీ మీరూ మాతోబాటు రాకూడదూ!" అంది.
    
    జయచంద్ర కాంచన్ బాగ్ వైపు ఆప్యాయంగా చూస్తూ "రాలేను" అన్నాడు. అతనికి అక్కడ ఇంకా కాంచన కనిపిస్తూనే వుంటుంది.
    
    కిరణ్ కారు స్టార్ట్ చేస్తుండగా "అయ్యో డాడీ.....పాపం అటు చూడు" అంది పాప.
    
    కిరణ్ తోపాటు అందరూ అటు చూశారు. గేటు దగ్గర ఓ వృద్దుడు బిచ్చం అడుగుతూ వుంటే గూర్ఖా అడిలిస్తున్నాడు.
    
    "వన్ మినిట్!" పాప అటు పరిగెత్తి, తన చేతిలోని క్యాడ్ బరీస్ ఆ వ్యక్తికి అందిస్తూ, "గూర్ఖా అంకుల్..... తాతగార్ని అడిగి పది రూపాయలు పట్రావా?" అంది.