ప్రస్తుతం వాళ్ళు ముగ్గురు కూడా అదే స్థితిలో వున్నారు. అందుకే అంత దుర్వాసనను కూడా వాళ్ళు గమనించడం లేదు.

 

    టైము లెక్క వేయడానికి తిలక్ తన టెక్నిక్ ఉపయోగించాడు. అతని పెదవులు మెల్లగా కదుల్తున్నాయి.

 

    స్వేచ్ఛ అనే అమృతకలశం కోసం యజ్ఞం చేస్తున్న మహాఋషిలా అనిపించాడు అతను మిగిలిన ఇద్దరికీ.

 

    మరో ఇరవై నిముషాలకు అతను తలుపు కొద్దిగా తెరిచి తల బైటపెట్టాడు. వాళ్ళనూ రమ్మని చేయి వూపాడు.

 

    ముగ్గురూ నడుచుకుంటూ న్యూజైల్ మెట్ల దగ్గరికి వచ్చి మెట్లు ఎక్కుతున్నారు.

 

    అప్పటికి వార్డరు నారాయణ, వెంకూ అక్కడే వుంటే ఏం చేయాలో తోచడం లేదు తిలక్ కి. నాలుగు గంటల నుంచే తాము కనిపించటం లేదని ఖైదీలు వార్డర్లకు చెప్పాలనే అతని తాపత్రయమంతా లేకుంటే ఆరుగంటలలోలోపు టెర్రస్. చేరుకోవచ్చు. ఆరుగంటలకుగానీ వార్డర్లు న్యూజైల్లోకిరారు.

 

    ఇంతకు ముందు ఆగిపోయిన దగ్గరికి వచ్చి నిలబడ్డారు ముగ్గురూ. ఏవైనా మాటలు విన్పిస్తాయేమోనని చెవులు రిక్కించారు.

 

    అంతా నిశ్శబ్దంగా వుంది.

 

    ముగ్గురూ ఒక్కసారి గుండెల్నిండా గాలిని పీల్చుకుని వదిలారు. ఆ గండం గడిచిందన్న ఆనందంతో త్వరత్వరగా మెట్లెక్కటం ప్రారంభించారు.

 

    ముగ్గురూ డాబా మీదకు చేరుకున్నారు.

 

    అక్కడ ఓ మూల వాటర్ ట్యాంక్ వుంది. పెద్ద తొట్టిలా వున్న దాని పొడవు పదిహేను అడుగులు. ఎత్తు అయిదు అడుగులదాకా వుంది. కొంతభాగం మినహా మిగిలిన భాగమంతా మూత వుంది. మనిషి దూకడానికి ఆ భాగంలో మూత వేయకుండా వదిలిపెట్టారు. ఒక మనిషి అందులోంచి సులభంగా దిగవచ్చు.

 

    అందులో దూరితే ఇక ఎవరికీ కనపడే అవకాశం లేదు. మరీ పర్టికులర్ గా ఎవరయినా అనుమానించి కంత ద్వారా కిందకి దిగి టార్చిలైట్ తో నలుమూలలా వెదికితే తప్ప కనపడరు.

 

    "ఇదే మన హైడింగ్ ప్లేస్. రాత్రి ఒంటిగంట వరకూ ఇక్కడే వుండాలి" అని కంత ద్వారా ట్యాంక్ లోపలికి దిగాడు తిలక్.

 

    చల్లటినీళ్ళు జివ్వున కాళ్ళను లాగాయి. ఎత్తు అయిదడుగులే వుండడం వల్ల బాగా వంగి లోపలికంటా వెళ్ళి ఓ మూలగా కూర్చున్నాడు. నడుంపైదాకా నీళ్ళున్నాయి.

 

    అతని తరువాత ఉత్తరుడు దిగాడు. లోపలంతా మసగ్గా వుంది. కళ్ళు బాగా చిటకరించి చూశాడు. ఓ మూల కూర్చున్న తిలక్ కనిపించగానే వెళ్ళి అతని పక్కన కూర్చున్నాడు. మరి కాసేపటికి బుద్ధుడు వాళ్ళను చేరుకున్నాడు.

 

    మరో ఏడుగంటలపాటు అలా నీళ్ళలో కూర్చోవదాన్ని వూహించుకుంటూనే ఉత్తరుడికి ఏడుపొస్తోంది. ఆ కాసేపటికే శరీరం అంతా బిగుసుకుపోయిన భావన కలుగుతోంది. భోజనం లేకుండా రాత్రి ఒంటిగంట వరకు కూర్చోవడం నరకంలా అనిపించింది. కానీ తప్పదని తనకు తనే సర్ది చెప్పుకున్నాడు.

 

    మిత్రులవైపు చూశాడు. ఆ మసక వెలుతురులో నీళ్ళు చల్లిన అద్దంమీది ప్రతిబింబాల్లా కనిపించారు వాళ్ళు.

 

    ఏదో చెప్పాలని నోరు తెరవబోయిన ఉత్తరుడు శాపవశాత్తు ఠక్కున మూగవాడైపోయినట్టు అలాగే వుండిపోయాడు.

 

    ముగ్గురూ చెవులను రిక్కించారు.

 

    అతి దగ్గరగా బూట్ల చప్పుడు.

 

    శిలాప్రతిమల్లా ముగ్గురూ బిగుసుకుపోయారు.

 

    సరిగ్గా అప్పుడు టైమ్ ఆరుగంటలు.

 


                                     *    *    *    *

 

    సైరన్ మ్రోగటంతో న్యూజైల్ మొదటి బ్యారెక్కు అప్పుడే ప్రాణం పోసుకున్నట్టు కలకలం మొదలైంది.

 

    ఖైదీలు వరుసల్లో నిల్చున్నారు.

 

    వార్డరు ఆర్ముగం మరో వార్డరు శివలింగం ఖైదీలను లెక్క పెట్టడానికి వచ్చారు.

 

    "అందరూ వచ్చేశారా?" జనాంతికంగా అన్నాడు ఆర్ముగం.

 

    శివలింగం ఖైదీలను లెక్కబెడుతూ లోపలికి వదులుతున్నాడు. చివరి కొచ్చేసరికి అతని ముఖంలో లాఠీదెబ్బకు వాచిన వాపులా కంగారు వచ్చింది.

 

    ఆర్ముగం ఆందోళనతో ఒకడును ముందుకుతోసి "ఏమైంది?" అన్నాడు.

 

    "ముగ్గురు తక్కువ వున్నారు సార్"

 

    ఆర్ముగానికి ఒకసారి తల మొద్దుబారినట్లనిపించింది.

 

    "మరోసారి లెక్కపెట్టు"

 

    తిరిగి లెక్కవేశాడు శివలింగం. అతనిలో దుఃఖం పొంగుకొస్తోంది. అతను ఉద్యోగంలో కొత్తగా చేరాడు. తన ఉద్యోగం ఊడుతోందని అతనికి సిక్త్స్ సెన్స్ చెబుతోంది.

 

    "ముగ్గురు లేరు సార్" యేడుపును కంట్రోల్ చేసుకుని చెప్పాడు.

 

    తనపైన బాంబుపడి శరీరం శకలాలకింద విడిపోతున్నట్లు అనిపించింది అర్ముగానికి.

 

    "ఇంతకీ మిస్సయ్యింది ఎవరు?"

 

    "తిలక్ - అతని స్నేహితులు బుద్ధుడు, ఉత్తరుడు సార్"

 

    ఇక ఆలస్యం చేయలేదు ఆర్ముగం. శివలింగంవేపు తిరిగి "తలుపు వేసి తాళం పెట్టు" అని ముందుకు పరుగెత్తాడు.

 

    సుడిగాలిలా తోటంతా తిరిగాడు. గింతు పగిలేటట్లువాళ్ళు ముగ్గురినీ పేర్లతో పిలిచాడు. ఆయన అరుపులకి వార్డర్లంతా చేరారు.

 

    ప్రశాంతంగా వున్న సరస్సులో పెద్దరాయిని విసిరినట్టు జైలంతా ఒక్కసారిగా కదిలింది.

 

    ముగ్గురు ఖైదీలు పారిపోయారన్న వార్త జెయిలంతా తిరిగి శ్రీపతి దగ్గర ఆగింది.

 

    మరో అయిదు నిముషాలకు అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది.

 

    తుపాకులు ధరించిన గార్డులు జెయిల్లోకి వచ్చారు. వార్డర్లు జైల్లోని ప్రతి అంగుళాన్ని నిశితంగా పరిశీలిస్తూ ఖైదీల కోసం వెదుకుతున్నారు.

 

    శ్రీపతి, వామనరావు, రంగారావు తదితర అధికారులంతా తోటలో చేరి అప్పటికప్పుడు పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు.