త్రాగటం పూర్తి అయాక, అతను లేచి వొచ్చేలోపునే ఆమె లేచి గ్లాసు నేల మీద పెట్టింది. ప్రాణం కాస్త లేచివచ్చినట్లయింది.

 

    "మీరు కూర్చోండి, కూర్చోండి" అంటున్నాడతను సౌంజ్ఞ చేస్తూ.

 

    ఆమె మంచంమీద తిరిగి ఆసీనురాలవుతూ, తను వేసుకున్న బట్టలవైపూ, మంచం వైపూ పోలికగా చూసుకుంది. మాసి అసహ్యంగా ఉన్నాయి తన బట్టలు. ముట్టుకుంటే మాసిపోతాయేమోనన్నంత శుభ్రంగా తెల్లగా ఉన్నాయి పరుపూ, దాని మీది దుప్పటీ, తలగడా వగైరాలు,

 

    "ఇప్పుడే వస్తానుండండి" అంటూ అతను సౌంజ్ఞలు చేసి బయటకు వెళ్ళాడు.

 

    వేదిత అలానే కూర్చుని ఉంది. ఈ వ్యక్తి ఎవరు? తను యిక్కడ కెలా వచ్చిందీ? అతను తనకెందుకిలా ఉపచర్యలు చేస్తున్నాడు... ఈ ప్రశ్న లామెలో ఉదయించలేదు. తెలుసుకోవాలని ఆసక్తిలేదు. దేనిపైనాకూడా యిచ్ఛ నశించిపోయింది. ఆమెలోని వింత సువాసనలు, విలువలు గతంగా మారాయి. ఎటు గాలి వీస్తే అటు యెగిరి పోయే ఉలిపొర కాయతంలా తయారయింది ఆమె.

 

    ఓ పావుగంట గడిచాక ఆ వ్యక్తి ఓ పెద్ద ప్లేటునిండా రకరకాల పళ్ళు తీసుకువచ్చాడు. యాపిల్ పండ్లూ, చక్రకేళీ, ద్రాక్షా అన్నీ ఉన్నాయి అందులో. అవి ఒక బల్లమీద పెట్టి మళ్ళీ బయటకు వెళ్ళి ఓ గ్లాసునిండా పాలు తీసుకువచ్చాడు. ఆ బల్లను ఆమె దగ్గరగా జరిపి "తీసుకోండి" అని సౌంజ్ఞలు చేస్తున్నాడు.

 

    ఆమెకు నవ్వు వచ్చింది. తనకవన్నీ అక్కర్లేదనీ, తీసుకున్న పండ్లరసం చాలునని తెలిపింది సౌంజ్ఞలతో.

 

    అదేమీ లాభంలేదని, తినకపోతే తను వూరుకోనని బలవంతం చేస్తున్నాడు.

 

    అతడి మొండిపట్టుచూసి కొంతసేపు అయాక ప్రయత్నం చేసి చూస్తాననీ, ఇప్పటికి వదిలెయ్యమని తెలిపింది ఆమె.

 

    తర్వాత ఓ పదినిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఇద్దరూ చెరో ప్రక్కకూ చూస్తూ కూర్చున్నారు. అలా ఎక్కువసేపు ఆమెకెదురుగా కూర్చోవటం భావ్యంగా ఉండదని తోచి అతడు మెల్లగా నిలబడి "చూడండి, మిగతా విషయాలు రేపు మాట్లాడుకుందాం. మీరు చాలా అలసిపోయివున్నారు. బాగా విశ్రాంతి అవసరం, నేను అవతల హాల్లో సోఫాలో పడుకుని వుంటాను. మీకేం కావాల్సి వచ్చినా సంకోచపడకుండా లేపండి. అదిగో గోడకు స్విచ్ వుంది. మీరు పడుకునేముందు లైటు ఆర్పేసి పడుకోండి. ఆ పండ్లుమాత్రం తప్పకుండా స్వీకరించాలి సుమా. నేనిహ వెడుతున్నాను" అని ఆమెకి అర్థమయ్యేటట్లు సగం భాషలోనూ, సగం సౌంజ్ఞలతోనూ చెప్పటానికి ప్రయత్నించి, బయటకు వెళ్ళి అవతలనుండి తలుపులు తనే దగ్గరగా మూశాడు.  

 

    కొంచెం సేపు ఆమె అలాగే కూర్చునివుంది. తర్వాత ఆమె పెదవులపై చిరుహాసం ఒకటి ఉదయించింది.

 

    నిద్ర వస్తూన్నట్లుగా తోచింది. కనురెప్పలు బరువెక్కాయి. లేచి అతను చెప్పిన ప్రకారం గోడనున్న స్విచ్ నొక్కి లైటు ఆర్పేసి మంచం మీదకు వచ్చి పడుకుంది. తొందరగానే ఆమెకు గాఢనిద్ర పట్టేసింది.   

 

                                           * * *

 

    తూర్పున తొలిరేఖలు విచ్చుకుంటూండగా వేదితకు మెలకువ వచ్చింది. తెరిచివున్న కిటికీగుండా బాలభానుని లేతకిరణాలు ఆమె మృదువదనం పైబడి చురుక్కుమనిపిస్తున్నాయి. నెమ్మదిగా లేచి కూర్చుని మంచం దిగింది. అప్పుడు చూసింది విశాలమైన ఆ గదివైపు పరీక్షగా. చాలా శ్రీమంతుల యింటి గదిలాగా ఖరీదైన వస్తువులతో, కుర్చీలతో, బల్లలతో అలంకరించబడి వుంది. రెండు విలువైన బీరువాలున్నాయి. అక్కడక్కడ సుందరంగా చిత్రించబడిన తైలవర్ణ చిత్రాలూ, నగిషీపనులుచేసిన అందమైన వస్తువులూ తగిలించబడివున్నాయి. నేలను అంతటా రంగుల రంగుల తివాచీ పరిచివుంది. కిటికీ దగ్గరకు నడిచి బయటకు వీక్షించింది. బాప్ రే! ఎంత యెత్తులో వున్నది తాను! యిది ఏ మూడంతస్థుల భవంతో, నాలుగంతస్థుల సౌధమో అయివుంటుంది. అప్పుడే రోడ్లమీద మనుషులు రాకపోకలు ప్రారంభమయినాయి. కార్లూ, సైకిళ్ళూ, బళ్ళూ యధేచ్చగా విహరిస్తున్నాయి. ప్రక్కమేడల్లో కూడా సంచలనం మొదలయింది. క్రింద ఎవరో కుర్రాడు యింటికి వెళ్ళి పేపర్లు పంచి పెడుతున్నాడు. వేరే మనిషి సైకిలుబండిమీద తిరుగుతూ, ఒక్కొక్క యింటి దగ్గరా ఆగి సీసాలనిండా పాలుపోసి యిచ్చి చీట్లు తీసుకుంటున్నాడు. ఒక కిళ్ళీ దుకాణం దగ్గర జనం మూగి గట్టిగా ఏదో చర్చించుకుంటున్నారు.

 

    ఆకుపచ్చని కిటికీ తెరలను దగ్గరకు లాగేసి వెనక్కి మరలింది వేదిత. మూసివున్న తలుపుల్ని తెరుచుకుని హాల్లోకి ప్రవేశించింది.

 

    ఆ హాలుకూడా విలాసంగానే అలంకరించబడి వుంది. మధ్యలో పెద్ద పెద్ద సోఫాలు, టీపాయ్ లు, తలుపులకు రంగురంగుల తెరలు, నేల మీద మళ్ళీ తివాసీ... రాత్రి ఆమె చూసిన వ్యక్తి సోఫాలో పడుకుని ఇంకా నిద్రపోతున్నాడు. హాలు ప్రక్కగా రెండు చిన్న చిన్న గదులు వంటకూ వగైరాకు ఉపయోగించే రీతిలో వున్నాయి. కాని ఆ గదుల వాలకం చూస్తే వాటిని ప్రస్తుతం ఎవరూ వాడుతున్నట్లు లేదు. హాలు బయట వసారా వుంది. అక్కడనుంచి క్రిందికి దిగటానికి మెట్లు. వసారాలో నిలబడి ఇరుప్రక్కల చూసి ఒక పెద్దభవనంలో యిది కేవలం ఒకభాగం అని గ్రహించింది వేదిత. అలాంటి భాగాలా భవనంలో చాలా వున్నట్లు కనిపించాయి.

 

    కాసేపు అక్కడ నిలబడి చూసి, మళ్లీ వెనక్కి తిరిగి హాల్లోకి వస్తూండేసరికి అడుగుల చప్పుడు విని సోఫాలో పడుకునివున్న వ్యక్తికి మెలకువవచ్చి, అతను ఉలికిపాటుతో లేచి కూర్చున్నాడు. ఆమెను చూసి తొట్రుపాటుతో లేచి "అప్పుడే లేచారా? బాత్ రూమూ, అవీ బెడ్ రూమ్ ప్రక్కనే వున్నాయి. రండి చూపెడతాను" అంటూ గబగబ లోపలకు నడిచాడు. అతను చెప్పేది అర్థంగాకపోయినా ఏదో వ్యక్తీకరించటానికి ప్రయత్నిస్తున్నాడనుకుని ఆమె అతన్ని అనుసరించింది. అతను ఓ ప్రక్కగా వున్న తలుపు తెరిచి స్నానాలగది చూపించి, పంపు త్రిప్పి నీళ్ళు వస్తున్నాయని నిర్థారణ చేసి, యివతలకు వచ్చి, "మీరు ముఖం కడుక్కుని స్నానం చేస్తూ వుండండి. ఓ అరగంటలో నేను వచ్చేస్తాను" అని సౌంజ్ఞల ద్వారా ప్రదర్శించి బయటకు వెళ్ళిపోయాడు.

 

    నిజమే! ఆమె వళ్ళు ఆమెకే జుగుప్స కలిగిస్తోంది. తన సంచీ గదిలో ఓ బల్లమీద పడివుంది. అందులోంచి ఓ చీరె తీసుకుని స్నానాలగదిలోకి వెళ్ళి చీరె వొంకెకు తగిలించి, తలుపులు గడియ వేసుకుని పంపు త్రిప్పింది. పైనుంచి తలమీద జలజలమని నీళ్ళు పడసాగాయి. ఓహ్! ఎంత బాగుంది! ఆమె మనసు ఉల్లాసమయమై సంతోషంతో ఉరకలు వేసింది. చల్లని నీరు అలా శరీరానికి తగులుతుంటే ప్రాణాలు లేచివస్తున్నాయి. చాలాసేపు.... తనివితీరేవరకూ,. అలిసిపోయేవరకూ ఆమె జలకమాడి, వళ్ళు తుడుచుకుని, చీరె కట్టుకుని తలుపులు తెరుచుకుని యివతలకు వచ్చేసరికి  కుర్చీలో ఆ వ్యక్తి కూర్చుని వున్నాడు. "రండి" అన్నాడు ఆమెను చూసి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లుగా.