అప్పుడు సమయం ఏడు గంటలైంది. నైట్ డ్రెస్ లో వున్నాడు రాఘవేంద్రనాయుడు. అప్పుడే భార్య బెడ్ కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టింది.

 

    "ఇప్పుడే వస్తాను..." గబుక్కున లేచాడు రాఘవేంద్రనాయుడు. గబగబా మేడ మేడమెట్లు దిగి పోర్టికోలోకొచ్చి కారులో ఎక్కి కూర్చున్నాడు.

 

                             *    *    *    *    *

 

    "నీకెప్పుడయినా ఓవర్ డ్యూటీ చెయ్యాలనిపించిందనుకో... ముందుగా నాతో చెప్పక్కర్లేదు... ఇక్కడకొచ్చేయ్... ఓపెన్ ఆఫర్ నీకిస్తున్నాను... ఎందుకో తెల్సా... నీలా కష్టపడాలనుకునేవాళ్ళంటే నాకిష్టం..." జేబులోంచి డబ్బు తీసిస్తూ అన్నాడు ఓనర్.

 

    అవి ముప్ఫై రూపాయలు- తనకు కావల్సింది మూడొందలు.

 

    "కంటిన్యూగా పదిరోజులు వర్క్ చేస్తాను సార్- కొంచెం అవసరం..." మధుకర్ మాటల్ని మింగేసాడు. ఓనర్ మరేం మాట్లాడలేదు. జేబులోంచి మూడువందలు తీసిచ్చి-

 

    "ఇబ్బందులు ఎవరికయినా వుంటాయ్" అని మాత్రం అన్నాడు.

 

    మూడువందలు...

 

    తన కష్టార్జితం ఆ మూడు వందలు-

 

    పదిరాత్రుల నిద్రలేమి ఖరీదు మూడు వందలు.

 

    "థాంక్యూ సర్..." ఓనరుతో చెప్పి, బస్టాపులోకొచ్చి నిల్చున్నాడు మధుకర్.

 

    అప్పుడతను-

 

    అనుకున్న పదివేలు, బ్యాంక్ లో వెయ్యగలుగుతున్నాననే ఆనందంతో వున్నాడు.

 

                        *    *    *    *    *

 

    మధుకర్ వెళ్ళిపోయిన పదినిమిషాలకు-

 

    రాఘవేంద్రనాయుడి కారు అక్కడకొచ్చి ఆగింది. రాఘవేంద్రనాయుడిని చూసి, ఓనరు నిర్ఘాంతపోయాడు.

 

    పరుగు పరుగున వెళ్ళాడతను.

 

 

    "ఏం కావాలి సర్..."

 

    "ఇక్కడ... మధుకర్..."

 

    "మధు... మధుకర్... మధుకర్ గారా సర్... వెళ్ళిపోయారు సర్" ఓనర్ ఉద్వేగాన్ని అణుచుకుంటూ అన్నాడు.    

 

    "మధుకర్... ఇక్కడ పనిచేస్తుంటాడా ...?"

 

    "ప్రస్తుతం చెయ్యడం లేదు సర్... ఇదివరలో..." చెప్పాడు ఓనరు.

 

    "మళ్ళీ వస్తాడా...."

 

    "నైట్ డ్యూటీ చెయ్యడానికి వస్తానని చెప్పారు సర్..."

 

    "ఓ పని చెయ్యండి..." అంటూ జేబులోంచి కొత్త కరెన్సీ నోట్ల కట్టను తీసి, ఓనరు చేతిలో పెడుతూ-

 

    "అతను ఈసారి మీ దగ్గరకు ఏ అవసరం కోసమొచ్చినా నువ్విచ్చినట్టుగా ఈ డబ్బు ఇవ్వు" అన్నాడు నాయుడు.

    "అలాగే సర్!"

 

    రాఘవేంద్రనాయుడు కారెక్కాడు. కారు సర్రున ముందుకు దూసుకుపోయింది. కారులోంచి రోడ్డు మలుపులోనున్న బస్టాపువేపు రాఘవేంద్రనాయుడు చూస్తే-

 

    మధుకర్ కనిపించి వుండేవాడు.

 

    అప్పుడే వచ్చి ఆగిన సిటీబస్సులోకి ఎక్కాడు మధుకర్.

 

                        *    *    *    *    *

 

    మెహిదీపట్నం-

 

    స్టేట్ బ్యాంక్ లో-

 

    బ్రాంచ్ మేనేజర్ కెదురుగా కూర్చుంది మహతి.

 

    మహతి ఇచ్చిన డబ్బును లెక్కపెట్టి "టోటల్ ట్వెల్వ్ థౌజెండ్" అని పక్కనున్న క్లర్క్ కి ఫార్మాలిటీస్ పూర్తిచెయ్యమని ఇచ్చి-

 

    "వచ్చే నెల ట్వంటీ టూ థౌజెండ్ వేస్తారా ? నవ్వుతూ అడిగాడాయన.

 

    "ఎయిటీ ఎయిట్ థౌజండ్ కూడా వెయ్యొచ్చు... చెప్పలేను. లక్ కల్సి రావాలి. అంతే!"

 

    మహతి అలా సాదా సీదా యువతిలా లక్ కలిసిరావాలి అని మాట్లాడుతుంటే మేనేజర్ కేం అర్థంకాలేదు.

 

    "బై ది బై మేడమ్! బిజినెస్ మాగ్నెట్ రాఘవేంద్రనాయుడుగారి అబ్బాయి మధుకర్ గారి అకౌంట్ కూడా మా దగ్గరే వుంది" గర్వంగా చెప్పాడు బ్యాంక్ మేనేజర్.

 

    "ప్రతి నెలా ఆయనే స్వయంగా వస్తాడా?"

 

    "అవును మేడమ్! మీలాగే ఫస్టున వస్తాడాయన."

 

    "ఎంత వేసాడేమిటి?" కాజువల్ గా అడిగినట్టు అడిగింది మహతి.

 

    "సారీ మేడమ్! మీలాగే ఆయన కూడా తన ఎకౌంట్ లో ఎంత మనీ వుందో ఎవ్వరికీ లీక్ చేయొద్దని మరీమరీ చెప్పారు."

    "ఇట్సాల్ రైట్" లేచింది మహతి.

 

    "వెల్ కమ్" చిరునవ్వు చిందించాడు బ్రాంచ్ మేనేజర్. ఛాంబర్ లోంచి బయటికొచ్చి, కౌంటర్స్ అన్నీ దాటుకుంటూ వస్తున్న మహతి చూపు, అప్పుడే గ్లాస్ డోర్ తెరచుకుని లోనకొస్తున్న మధుకర్ మీద పడింది.

 

    పక్కకు తప్పుకుందామనుకుంది.

 

    కానీ వీలుపడలేదు.

 

    మహతిని చూడగానే మధుకర్ కళ్ళు విప్పారాయి. కళ్ళతోనే పలకరించాడు మధుకర్.

 

    ఒక్కక్షణం కాలేజీ కాంపౌండ్ లోకి యువరాజులా వచ్చే మధుకర్ తలపుకొచ్చాడు.

 

    "హలో... హౌ ఆర్యూ"మహతే పలకరించింది.

 

    "హలో" తర్వాత ఏమనాలో అర్థం కాలేదు. అంతవరకూ ఎప్పుడూ జ్ఞాపకం రాని సంఘటన-

 

    మహతిపట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన సంఘటన గుర్తుకొచ్చింది.

 

    ఆ సంఘటన గుర్తుకురావడంతో మరి మాట పెగల్లేదు.

 

    "ఒన్ మినిట్" గబగబా లోపలికెళ్ళి అయిదే అయిదు నిమిషాల్లో బయటికొచ్చాడు.

 

    ఇద్దరూ బయటికొచ్చారు.

 

    "ఎంతవరకొచ్చింది ప్రోగ్రెస్" మహతి అడిగింది.

 

    "గెలుపు నాదే. నీ ప్రోగ్రెస్ ఎంతవరకొచ్చింది..." మధుకర్ అడిగాడు.

 

    గెలుపు నాదే" తను మరింత ధీమాగా చెప్పింది మహతి.

 

    "మన గెలుపుకి బ్యాంక్ ఎకౌంట్ లో వేసిన మనీ ఒక్కటే ప్రైటీరియానా" మధుకర్ అడిగాడు.

 

    "కాదు. జస్ట్ ఇట్స్ ఏ సింబల్ ఓన్లీ."

 

    దగ్గర్లో వున్న 'కూల్ షాప్' లోకి అడుగేసాడు మధుకర్. అతన్ని మౌనంగా అనుసరించింది మహతి.

 

    ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు.

 

    "సింబల్ అని ఎందుకన్నానో తెల్సా? ఫర్ ఎగ్జాంపుల్. షైనీ అబ్రహాంని గానీ, లేకపోతే ఏ ప్లేయర్ నైనా తీసుకో. తాము లక్ష్యాన్ని అందుకోవడం కోసం పరిగెత్తడం ఒకెత్తయితే, అందుకు శారీరకంగా, మానసికంగా చేసే ప్రయత్నం ఒకెత్తు. ఆ ప్రయత్నం చిత్తశుద్దిగా జరిగినట్టు గుర్తింపు పొందితే చాలు. గెలిచినట్టే."