"పెళ్ళి కాకుండా ఒక అందమయిన ఆడపిల్ల- ఒక అందమయిన మగాడితో అపార్టుమెంట్ లో వుండడం... కొత్త కల్చర్ అనుకుంటాను" ముందుకు వస్తూ అంది జయారెడ్డి. మగాళ్ళకి కిర్రెక్కించడం ఆమెకిసరదా. ముఖ్యంగా శ్రీధర్ అంటే ఆమెకు చాలా ఇష్టం.

 

    ఒకటి రెండుసార్లు అపర్ణతోపాటు కనిపించినప్పుడు కూడా శ్రీధర్ ని టచ్ చేయడం మానలేదామె. "నీలాంటి కుర్రాళ్ళు, నాలాంటి అన్నీ తెలిసిన వాళ్ళతో తిరగాలి తప్ప... ఏమీ తెలియని అపర్ణలాంటి వాళ్ళతో కాదు. ఆ పిల్లకు అన్నీ నేర్పితేనే గాని తెలీవు... నన్ను నమ్ముకున్నావనుకో...నీకేం కావాలో నాకు తెలుసు. రాత్రికి నా ఫ్లాట్ కి వస్తావా?" ఇలా రొమాంటిక్ గా కొంటెగా అడిగిన సందర్భాలు చాలా వున్నాయి.

 

    ఒకటి రెండుసార్లు దూరంగా నుంచుని జయారెడ్డి శ్రీధర్ తో మాట్లాడుతున్న పద్ధతిని కనిపెట్టిన అపర్ణ-

 

    "ఏం మాట్లాడుతుందది" చిరాగ్గా అడిగింది.

 

    "మామూలేగా...చిన్న స్క్రూ లూజు తప్ప, మిగతాదంతా మామూలే..." ఏ వ్యక్తిని తొందరపాటుతో చెడుగా కామెంట్ చేయడం శ్రీధర్ పద్ధతి కాదు.

 

    "స్క్రూలూజు లేదు, గాడిద గుడ్డులేదు. మెన్ ఈటర్...ఆవిడకి మగాళ్ళు కావాలి! ఎర్రగా, బుర్రగా వుంటావు కదా! అందుకే నీ వెంట పడుతుంది. ఎప్పుడయినా ఆమె మాటల్లోపడిపోయావంటే... అంతే...నాతో ఫ్రెండ్ షిప్ కట్" ఒకసారి కోపంగా అంది అపర్ణ.

 

    "ఆవిడతో నాకేం పని...నేనేం మాట్లాడానా! ఆవిడే నాతో మాట్లాడుతుంది" అమాయకంగా అన్నాడతను.

 

    "బీకేర్ ఫుల్...అలాంటి వాళ్ళతో తిరిగేవో, ఏ మర్డర్ కేసులోనో ఇరుక్కుపోతావ్...జాగ్రత్త!" అందామె.

 

    ఆ మాటకు పెద్దగా నవ్వేశాడు శ్రీధర్.

 

    "మర్డర్ కేసులో నేను ఇరుక్కోవడమేమిటి ? ఆవిడ మర్డరర్ అనుకున్నావా? ఊహించడానికైనా ఓ హద్దుండాలి" పెద్దగా నవ్వుతూ అన్నాడు శ్రీధర్.

 

    "ఏమో... ఆవిడ్ని చూస్తుంటే, రహస్యపు మర్డర్లు, ఖూనీలే గుర్తు కొస్తాయి..." అంటూ విసవిస లోపలికి వెళ్ళిపోయింది అపర్ణ ఓరోజు.


                                                  *    *    *    *


    "గుడ్ నైట్ వస్తా-" గతం నుంచి తేరుకుంటూ గబగబా ముందుకు నడిచాడు శ్రీధర్.

 

    "ఆగవయ్యా శ్రీధర్, ఎందుకంత తొందర... ఫ్లాట్ లోకి గర్ల్ ఫ్రెండ్ ని తెచ్చుకున్నావా ఏమిటి?" మరీ ముందుకొస్తూ అంది కవ్వింపుగా. ఆమె వంటికి రాసుకున్న 'స్ప్రే' వాసన గాఢంగా వుంది. బొచ్చుకుక్కపిల్ల సీరియస్ గా తోకాడిస్తూ శ్రీధర్ వైపు చూస్తోంది.

 

    "నిద్ర వస్తోందండీ...బాగా అలసిపోయాను" అన్నాడు ఆవలిస్తూ శ్రీధర్ అసహనాన్ని కప్పిపుచ్చుకుంటూ.

 

    " 'అలసిపోయాను - ఇక వద్దండి అని ఆడపిల్లంటే' బాగుంటుంది కానీ, మగాడంటే బాగోదయ్యా" అందామె నవ్వుతూ.

 

    ఎందుకు బాగోదో శ్రీధర్ కేం అర్థం కాలేదు.

 

    "అవును మర్చిపోయాను- నీ ఫోన్ నెంబరెంత? ఒకసారి చెప్పు ఒకసారి ఎవరో నీ గురించి వస్తే, ఆ టైమ్ లో నీవు లేవు. నీ ఫోన్ నెంబరిద్దామంటే నాకు తెలీదు."

 

    జయారెడ్డికి నిజంగా తన ఫోన్ నెంబరు తెలియదా? నమ్మలేని అబద్ధం...

 

    బహుశా తనకొచ్చిన రాంగ్ కాల్ జయారెడ్డి నుంచేనేమో...?

 

    "నన్ను నమ్మటంలేదా? నీ నెంబర్ కోసం వచ్చింది ఒకమ్మాయి. ఆ అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు. ఆ అమ్మాయి ఎలా వుందో తెలుసా? 1996 మిస్ వరల్డ్ ఐర్నేస్కివాలలా వుంది. తెలుగు బాగా వచ్చినట్టులేదు. భాష తెలీని అమ్మాయితో నువ్వెలా ఏగుతావ్? అందుకే ముందు నాతో అంటున్నాను.

 

    ప్రపంచంలో దేనికైనా అనుభవం వుందా అని అడుగుతారు. లేకపోయినా వుందనే చెప్పాలి. ఒక విషయంలో మాత్రం అనుభవముండాలి. ఉన్నా అది లేదనే చెప్పాలి మగవాళ్ళు. ఏమిటది?" తమాషాగా కళ్ళు ఎగురవేస్తూ అడిగింది జయారెడ్డి.

 

    రెండో పజిల్ ...ఫోన్ చేసింది ఈమేనేమో?

 

    "బొచ్చు కుక్కపిల్ల...కొత్తదా...చాలా బాగుంది" అన్నాడు శ్రీధర్ కావాలనే మాట మారుస్తూ.

 

    "ఎంత మృదువుగా వుందో చూడు నా శరీరంలా" అంటూ కుక్క పిల్లను శ్రీధర్ చేతిలో పెట్టింది.

 

    ఒకపక్క ఆకలి...మరోపక్క అపర్ణ ఫోన్ రాకపోవడం... ఇంకోపక్క 12155 అంటే ఏమిటంటూ పజిల్ విసిరినా అపరిచితురాలు?

 

    ఒక విషయంలో అనుభవం వుండాలి మగాళ్ళకి. ఉన్నా అది లేదనే చెప్పాలి... అంటూ మరో పజిల్... చిరాకెత్తిపోయింది శ్రీధర్ కి. ఆ చిరాకులో కుక్కపిల్లని వదిలేశాడు.

 

    అదిచూసి జయారెడ్డి దానికోసం పరుగు. దాన్ని వదిలేసింది తానే గనుక తన బాధ్యత కూడా వుందని తను లేని ఓపిక తెచ్చుకుని దానికోసం పరుగు.

 

    ఎలాగయినా దాన్ని పట్టుకోవాలని జయారెడ్డి ముందుకెళుతుండగా, అదే ప్రయత్నంలో వున్న శ్రీధర్ వెనుకనుంచి రావటంతో యిద్దరూ ఢీ కొన్నారు.

 

    గబుక్కున తలతిప్పి చూసింది జయారెడ్డి.

 

    ఆ స్పర్శ ఆమెకు చాలా బాగుంది.

 

    కావాలనే ముందుకొచ్చి అతని భుజాలకు తన భుజాన్ని తగిలించి కళ్ళలోకి సూటిగా చూస్తూ "గట్టి శరీరమే... ఐ లైక్ యువర్ ఫిజిక్" అందామె ముద్దుగా చూస్తూ.

 

    "సారీ..." అంటూ ఇంకో క్షణం అక్కడుండలేక వేగంగా మెట్లకేసి నడిచాడు.

 

    వెళుతున్న శ్రీధర్ ని నిట్టూరుస్తూ చూసింది జయారెడ్డి.

 

    వాళ్ళిద్దరికీ ఆ సమయంలో తెలీని విషయం ఒకటుంది.

 

    ఓ రెండు కళ్ళు చాలాసేపటినుంచి ఆ యిద్దరినే చూస్తున్నాయి.


                                                    *    *    *    *