"ప్రాక్టీస్ లేకుండానే!" ఆమె ఆశ్చర్యంగా అడిగింది.
"ఆ.... ఇంకోసారి అలా చెయ్యబోయి కిందపడి కాలు ఫ్రాక్చర్ చేసుకున్నాను. ఇప్పటికీ కాస్త ఒంకరగా వుంటుంది చూడండి" కాలివైపు చూపిస్తూ అన్నాడు.
ఈసారి ఆమె జాలిగా చూస్తూ "మీకు అమ్మా నాన్నా లేరా?" అంది.
"వాళ్ళు లేకుండా నేనెలా పుడ్తాను? కుండలోంచీ, చేపలోంచీ పుట్టాననుకుంటున్నారా?" అంటూ పెద్దగా నవ్వేశాడు.
శక్తి అలా అడిగినందుకు సిగ్గుపడి తలవంచుకుంది.
"మీరిలా అడగగానే విచారంగా మొహంపెట్టి, వెనుకనుంచి విషాదగీతం వినిపిస్తుండగా అదో పెద్దకథ...! నేను పడ్డకష్టాలు అన్నీ ఇన్నీ కావు అని మొదలుపెట్టాలి. కానీ నాకు అలా చెప్పడం అలవాటు లేదు. ఎదుటివాళ్ళ సమస్యలు విని సలహాలివ్వడం మాత్రమే అలవాటు" అన్నాడు.
"మీలాంటివారు చాలా తక్కువమంది వుంటారు" అంది.
"అంటే ప్రపంచంలో మీకు ఎక్కువమంది తెలియరన్నమాట" అన్నాడు.
నర్స్ వచ్చి టెంపరేచర్, బీపీ చెక్ చేసింది.
"ఈ రాత్రికి ఆయనకీ డైట్ ఏం ఇవ్వకండి. నిద్రపోకుండా చూడండి" అని నర్స్ వెళ్ళిపోయింది.
అతను శక్తివైపు చూసి "మీరింక యింటికి వెళ్ళండి. యింట్లోవాళ్ళు కంగారుపడవచ్చు" అన్నాడు.
ఆమె నవ్వుతూ "ఇంకా అపరిచితుల్లా వుండటం నాకు యిష్టం లేదు.  నా పేరు శక్తిమతి" అంది.
అతను ఆశ్చర్యం దాచుకోకుండా "శక్తిమతి...!" అన్నాడు.
ఆమె కాళ్ళు బెంచీమీద పెట్టుకొని సర్దుకు కూర్చుంటూ "మీకూ... నాకూ కాలక్షేపం కావడానికి మా కుటుంబం గురించి చెప్పాలనుకుంటున్నాను వినే ఓపికుందా?" అని అడిగింది.
అతను చెప్పమన్నట్లు తల ఆడించాడు.
"మా నాన్న ప్రభుత్వోద్యోగిగా ఓమాత్రం మంచి కేడర్ లోనే రిటైర్ అయ్యారు. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. నాన్న ముగ్గురు ఆడపిల్లలకీ ఏ లోటూ రాకుండా పెంచారు. అక్కలిద్దరికీ అరుంధతీ, సుమతీ అన్న పురాణ కాలంలో పతివ్రతల పేర్లుపెట్టి నాకుమాత్రం కాస్త తెలివితెచ్చుకుని శక్తిమతి అని పేరుపెట్టినట్లున్నారు.
మా పెద్దక్క చిన్న వయసులోనే చాలా పెద్దతనం మీదేసుకుని ఆరిందాలా అన్నిపనులూ చేస్తూ చదువుసంగతి మర్చిపోయింది. దాంతో ఎస్.ఎస్.సి. తర్వాత బండి ముందుకెళ్ళలేదు. లంగా, ఓణీలేసుకునే సరికి ఆడపిల్ల చాలా అమాయకంగా ఆలోచిస్తుంది. అందుకేనేమో ఇప్పటి ఆడపిల్లలెవరూ వాటి జోలికే పోవడం లేదు.
చదువు ఆగిపోవడంతో దానికి నవల్స్ చదవడానికీ, ఊహల్లో బతకడానికీ బోలెడు తీరిక చిక్కింది. వాటివల్ల అందిన పరిజ్ఞానమూ, తీరికలతో ఎదురింట్లో అద్దెకు దిగిన ఓ బెంగాలీ కుర్రాడికి మనసిచ్చేసింది. ఆ సంగతి ఆ కుర్రాడికి తెలీదు. ఇదిమాత్రం నెత్తిమీంచి కొంగేసుకుని కొంగుచివర తాళం చెవులగుత్తి కట్టుకోవటంవరకూ ప్రాక్టీసు చేసింది. ఎప్పుడూ చేతిలో 'బడదీదీ'నో, 'దేవదాసో' పట్టుకుని చదువుతుండేది. అతను కాలేజీకి వెళ్ళే టైమూ, వచ్చే టైమూ దీనికి తెలుసు. ఠంచనుగా తయారయ్యి గేట్లో నిల్చుని వుండేది. ఓ సారి నూటమూడు డిగ్రీల జ్వరం వచ్చింది. అయినా అంత నీరసంలోనూ జడేసుకుని, పౌడర్ రాసుకుని గేటులో నిల్చుంది. దాంతో మా చిన్నక్కకి అనుమానం వచ్చింది. వాళ్ళిద్దరూ నన్ను దూరంగా నెట్టి....మంచంమీద పడుకుని గుసగుస లాడుకునేవారు వాళ్ళ మాటల్లో నాకు "ప్రేమ నిజాయితీనే కోరుకుంది. కులమత భాషా బేధాలు లేవు..." లాంటి మాటలు వినిపిస్తుండేవి.
ఆబెమ్గాలీ కుర్రాడి పేరు కమల్ అనుకుంటా వాళ్ళ అమ్మ 'కొమల్' అని నోటినిండా తాంబూలం వేసుకుని పిలుస్తుండేది. క్రమం తప్పకుండా చేపలు బేరంచేసి కొనేది. ఆరోజు ఆవిడ మార్కెట్నుండి వస్తూవుంటే మా పెద్దక్క ఎదురుపడిందట. ఆవిడ్ని పరిచయం చేసుకుని ఆవిడ చేతిలోని బరువైన బుట్ట ఇంటిదాకా మోసుకొచ్చింది. ఆరోజు రాత్రి చిన్నక్క చెవిలో ఆవిడ తనపేరు 'అరుంధతి' అని  తెలుసుకుని ఎంత మెచ్చుకున్నదీ, తన జడవైపు ఎంతసేపు చూసిందీ తెగ చెప్పి మురిసిపోయింది.
ఇంకోరోజు పక్కింటికి మేం పేరంటానికి వెళితే కమల్ వాళ్ళ అమ్మకూడా వచ్చింది. పెద్దక్క ఆవిడ్ని చూడగానే లేచి నిలబడింది. అందరూ ఎంత కూర్చోమన్నా వినలేదు. నాకు అప్పట్లోనే దాని ఫూలిష్ నెస్ అర్ధమై నవ్వొస్తుండేది.
ఇంటికొచ్చాక చిన్నక్కతో "నేను మానసికంగా ఆవిడ్ని అత్తగారిగా అంగీకరించాననడానికి ఇంతకన్నా నిదర్శనమేమిటి" అంది.
చిన్నక్క అది చెప్పేవన్నీ ఓపిగ్గా వినేది. ఇద్దరూ తెల్లారుఝామునే లేచి బాయిలర్ అంటించే నెపంతో అక్కడ ఓ గంట గుసగుసలాడేవారు.
ఉగాది పండగరోజున ఇది పులిహోర తీసుకెళ్ళి వాళ్ళకి యిచ్చింది. "ఖట్టా ఖానా బహుత్ అచ్చాహై" అన్నాడు మా కమల్ అని ఆవిడ చెప్పగానే ఆరోజు ఇది ఆనందం పట్టలేక గుడికెళ్ళి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసింది.
పులిహోర పంపించిన డిష్ లో ఆవిడ ఏదో వంటకం పెట్టి పంపించింది. దానివాసన చూసి నేనూ, చిన్నక్కా దూరంగా నెట్టేశాము పెద్దక్కమాత్రం "జన్మంతా ఆ వంటలు తినాల్సిన దాన్నేగా!" అంటూ మొత్తం తిని మర్నాడంతా వాంతులు చేసుకుంది.
అందం సంగతొస్తే కమల్ అందం, తెలివితేటలు సంగతొస్తే అతని తెలివీ.... ఇలా మా చెవుల్ని అది అదరగొట్టి చంపుకుతినేది. ఇది ఇంతగా పొగిడే ఆ కమల్ ఇంటర్ లో ఓ సబ్జెక్ట్ ఫెయిలయ్యాడు. ఆరోజు వాళ్ళ నాన్నగారు షటిల్ బ్యాట్ తో కొడితే అతని అరుపులు మా యింటివరకూ వినిపించాయి. మర్నాడు అతని నుదుటిమీద పట్టీ కనిపించింది.
ఓ గంటకల్లా మా పెద్దక్క బావి దగ్గర జారిపడింది. బాగా రక్తం కారింది. నాన్నగారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. దాని నుదుటికి కూడా పట్టీ వచ్చింది.
దాన్ని చూస్తే జాలికన్నా కోపం ఎక్కువగా వచ్చిన నేను "నీకేమైనా పిచ్చెక్కిందా?" అని అరిచాను. నల్లని చీర కట్టుకుని తులసికోటకి ఆనుకుని కూర్చుని విరక్తిగా "ప్రేమా, పిచ్చీ ఒకటే.... నీకిప్పుడు అర్ధంకాదులే!" అంది.