ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా!

ఆడవాళ్లు ఏం చేసినా తప్పేనా!

 

 

స్త్రీ పట్ల సమాజం ధోరణ ఎప్పుడూ చిత్రంగానే ఉంటుంది. వారిని ఓ పక్క దేవతగా పొగుడుతూనే... ఆటవస్తువుగానే చూస్తుంటుంది. స్త్రీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూనే సంకెళ్లు వేస్తుంది. ఆడవారి పట్ల ఈ ద్వంద్వ వైఖరికి సాక్ష్యంగా ఇప్పుడు ఏకంగా ఓ పరిశోధనే వెలుగులోకి వచ్చింది.

ఈ మధ్యకాలం అంతా మెటర్నటీ లీవ్ గురించే మాట్లాడుతున్నారు. ఆడవాళ్లు పిల్లల్ని కన్న తరువాత ఎంతకాలం మెటర్నిటీ లీవ్ ఉంటే మంచిది? దాని కోసం ప్రభుత్వాలు ఏం చేయాలి? అంటూ తెగ ఉపన్యాసాలు వినిపిస్తున్నాయి. కానీ మెటర్నటీ లీవ్ తీసుకునే ఆడవారి గురించి సమాజం ఏమనుకుంటుంది? అన్న ఆలోచన వచ్చింది ఇంగ్లండులోని కొందరు పరిశోధకులకి. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ 137 ఆడవారినీ, 157 మగవారినీ తమ ప్రయోగం కోసం ఎన్నుకొన్నారు.

ప్రయోగంలో భాగంగా అభ్యర్థులందరికీ ఈమధ్యనే బిడ్డను కన్న ఒక స్త్రీ గురించి చెప్పారు. కాకపోతే ఆమె తన పిల్లవాడిని చూసుకునేందుకు మెటర్నటీ లీవ్ తీసుకుందని కొందరితో చెబితే, మెటర్నటీ లీవ్ పూర్తిగా వాడుకోకుండా ఆఫీసుకి వెళ్తోందని మరికొందరితో చెప్పారు. ఆ తర్వాత ఆ మహిళ గురించి తమ అభిప్రాయం ఏమిటంటూ వారిని ప్రశ్నించారు. అనూహ్యంగా రెండు సందర్భాలలోనూ సదరు వ్యక్తి చేసిన పనిని అభ్యర్థులు తప్పుపట్టారు.

మెటర్నటీ లీవ్ని ఉపయోగించుకున్న సందర్భంలోనేమో ఆ వ్యక్తికి ఉద్యోగం పట్ల అంతగా నిబద్ధత లేదన్న అభిప్రాయం వ్యక్తమైది. మెటర్నటీ లీవ్ను వద్దనుకుని ఉద్యోగంలో చేరిన సందర్భంలోనేమో... తల్లిగా తన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏతావాతా రెండు సందర్భాలలోనూ స్త్రీ నింద పడాల్సి వచ్చింది! ఈ అభిప్రాయాలను వ్యక్తం చేసినవారంతా కూడా 33 ఏళ్ల సగటు వయసున్న యువతే కావడం గమనార్హం. వారిలో దాదాపు సగం మంది స్త్రీలు ఉండటం మరో వైపరీత్యం! పైగా వీరంతా అభివృద్ధి చెందాయని చెప్పే ఇంగ్లండ్, అమెరికా దేశవాసులు కావడం మరో విచిత్రం.

మెటర్నటీ లీవ్ పట్ల సమాజపు ధోరణ తెలుసుకునేందుకు ఈ పరిశోధన జరిగి ఉండవచ్చు. కానీ బిడ్డను కనేందుకు, తన జీవితాన్ని పణంగా పెట్టే సందర్భంలోనే ఆడవారి పట్ల ఇలాంటి వివక్ష ఉంటే... ఇక రోజువారీ సందర్భాలలో వారి పట్ల సమాజ ధోరణి ఎలా ఉంటుందో ఇక చెప్పేదేముంది!

- నిర్జర.