ముసలి బ్రహ్మ

    స్పెషల్ రూమ్ లోకి నడిచింది నర్స్.

    "హల్లో, గుడ్ మార్నింగ్!" అన్నాడు ప్రకాశం.

    "గుడ్ మార్నింగ్!" అంది శకుంతల ధర్మామీటర్ విదిలిస్తూ.

    "ఏవమ్మోయ్! 'గుడ్ మార్నింగ్' మీ ఇద్దరికేగాని, నాకు లేదేంటి" గట్టిగా అన్నాడు పక్క బెడ్ మీద ముసలాయన.

    "అదికాదు, తాతగారూ! మీ కళ్ళు కొంచెం మసగ్గదా! తెల్లారిందీ, లేందీ మీకెలా తెలుస్తుందిలే అనుకొన్నా రీవిడ!" ప్రకాశం నవ్వుతూ అన్నాడు.

    "చూడబ్బాయ్! నా చూపు సంగతి నీకు తెలీదు"

    "నాకు తెలుసు, సార్! ఆవిడకి చెప్పండి"

    "చూడమ్మాయ్! బీఏ ఫైనల్ ఇయర్ చదివేప్పుడు అనుకొంటా మా కాలేజీ వార్షికోత్సవాల్లో మేము ఓ రోజు డ్రామా వేశాం."

    "అబ్బ! ప్రొద్దున్నే కథ మొదలెట్టేరూ?" విసుగ్గా అంది శాకుంతల.

    "అడ్డురాకు మధ్యలో! నువ్వు గాకపోతే ఆ కుర్రాడు వింటాడు. ఏమోయ్, స్టూడెంటూ, డ్రామాకి కొన్ని వందలమంది ఆడాళ్ళు వచ్చారు. అంచేత మేము చాలా హుషారుగా నటించేస్తున్నాం. అంతమందిలోనూ ఓ చిన్నది నేనేం జోక్ వేసినా పగలబడి నవ్వేస్తోంది. ఒకటి రెండు సార్లు ఆ అమ్మాయి వంక పరీక్షగా చూశాను. అంతే! వారం రోజుల్లో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. దీన్ని బట్టి చూసుకో నా చూపు ఎంత శక్తి కలదో!"

    "మరి, ఆ అమ్మాయి ఒప్పుకుందా, తాతగారూ?"

    "చచ్చినట్లు! చూస్తూనే ఉన్నావుగా. నేనంటే ఎంత లవ్వో దానికి . నాకోసం చచ్చీ చెడీ రోజుకీ నలభైసార్లు ఇంటికీ, హాస్పిటల్ కీ తిరుగుతూంది"

    "ఏమోనండీ! మీకేస్ వేరు. మా స్నేహితుడొకడు వాళ్ళ క్లాసమ్మాయిని ప్రేమించేసి "పద! పెళ్ళి చేసుకొందామన్నా" డండి. ఆ అమ్మాయి ఇలా నవ్వేసి లాగి చెంపమీద కొట్టిందండీ!"

    ముసలాయన ఘోల్లున నవ్వేడు.

    "దీని అర్థం ఆ పిల్ల రాక్షస జాతికి చెందిందన్నమాట! అన్నట్లు నీకు తెలీదనుకుంటా! ఆడాళ్ళలో రెండు రకాలున్నాయి. రాక్షసులు, దేవతలు. ఇప్పుడీ శకుంతల ఉందనుకో! దేవతల తాలూకు పిల్ల. నువ్వేమయినా అను! కోపం రాదు" శకుంతల నవ్వేసింది.

    "కోసెయ్యకండి, తాతాజీ! పొగడ్తలకి పొంగిపోయేదాన్ని కాదు నేను-"   

    "నమ్మకండి తాతగారూ! పొగడ్తలకి లొంగని ఆడాళ్ళు ఇండియాలో లేరని మొన్నే డైరీలో రాసుకొన్నాను. ఆఫ్ కోర్స్! ఫారిన్ లో ఆడాళ్ళ సంగతి నాకంతగా తెలీదనుకోండి!"

    "కరెక్ట్! అనుభవం లేకపోయినా కత్తిలాంటి మాట వాడావోయ్!"

    "ఇదిగో ధర్మామీటర్! టెంపరేచర్ చూడండి" తాతగారికి ధర్మామీటరిచ్చింది శకుంతల.

    "ఇంకా టెంపరేచరెందుకమ్మాయ్! ఎప్పుడు హరీమంటావో నాకే తెలీదు. ఏమోయ్, ప్రకాశం?"

    "అవునండీ! ఎప్పుడో హరీ అనే టైపే మీరు! ఒకవేళ మీకు హరీ అనడానికి నోరు రాకపోయినా శకుంతల గారి మందులు అనిపించేస్తాయి- అన్నీ డూప్లికేట్ మందులు కదా!"

    "అబ్బబ్బ! మీ ఇద్దరినీ చెరో రూమ్ లో పడెయ్యమని డాక్టర్ గారికి చెప్తాను" చిరుకోపంతో అంది శకుంతల.

    "అంత కోపంగా ఉంటే ఆ ముసలాయన్నే ఇంకో వార్డులో పడెయ్యండి. నేనిక్కడే ఉంటాను" అన్నాడు ప్రకాశం.

    "ఒరేయ్, స్టూడెంటూ! ముసలాడి కెంత ద్రోహం తలపెట్టేవురా! శకుంతలమ్మా ప్రక్క వార్డులో రాక్షసజాతి నర్స్ ఉంది. నేనంటే పీకలదాకా కోపం ఆ పిల్లకి- తన మీద ఓసారి డాక్టర్ కి కంప్లెయింట్ ఇచ్చానని. అక్కడ పడేసేవో నిమిషాలో వైకుంఠం చేర్చేస్తుంది నన్ను"

    శకుంతల నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోబోయింది.

    "ఏమండోయ్! ధర్మామీటర్ నా కివ్వరేం?" అరిచాడు ప్రకాశం.

    "ఏమఖ్ఖర్లేదు! మీ ముఖం చూస్తేనే తెలుస్తోంది- మీకే జబ్బూ లేదని. హాయిగా కాలేజీలో చదువుకోక ఇక్కడికొస్తాను- మా ప్రాణాలు తియ్యడానికి."

    "ఇక్కడ మాత్రం చదవటం లేదని ఎవరన్నారండీ! కావాలంటే చూడండి! ఇదిగో, నా ఇంగ్లీష్ టెక్ట్స్" తలగడ క్రింద నించి పుస్తకం బైటికి లాగాడతను.

    "మీతో మాట్లాడ్డం మొదలెడితే నా డ్యూటీ ఇక్కడే అయిపోతుంది. అయ్యబాబాయ్! డీ ఏమ్వో వచ్చే వేళయింది" అంటూ పరుగుతో వెళ్ళిపోయింది శకుంతల.

    "చాలామంచి పిల్లోయ్! కిందటి జన్మలో దేవతల తాలూకు ఫామిలీ గాళ్ అయుంటుంది" అన్నాడు ముసలాయన .

    "ఏమో, తాతా! నాకీ జన్మలోనే దేవతలా అనిపిస్తోంది."

    "ఊరుకొన్నకొద్దీ నెత్తి కెక్కేస్తున్నావే! తాతాగారూ అల్లా కాస్త చనువుగా ఉండేసరికి తాతా అని పిల్చేస్తున్నావ్!"

    ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.

    మధ్యాహ్నం ఏవో టాబ్ లెట్స్ తీసుకొని మళ్ళీ, గదిలోకి వచ్చింది శకుంతల. ముసలాయన కాలేజీలో జరిగిన ఓ ప్రేమ కథని ప్రకాశానికి వినిపిస్తున్నాడు. శకుంతలని చూడగానే ఇద్దరూ గప్ చిప్ అయిపోయారు.

    "ఇవిగో! ఈ టాబ్ లెట్స్ వేసుకోండి! పాతవి ఏమయినా ఉంటే ఇటిచ్చెయ్యండి. అవి వేసుకోడానికి వీల్లేదు..."

    ప్రకాశం పర్స్ లోంచి టాబ్ లెట్స్ పొట్లం తీసిచ్చాడు.

    "అంత భద్రంగా దాచుకున్నా రెందుకూ! అంత బావున్నాయా?

    "మరేనండి! జీవితం మీద విసుగుపుడితే పనికొస్తాయని...."

    "ఇంకోసారి ఇలాంటి పాడు విట్లు వేశారంటే-" కోపంగా అంది శకుంతల.

    "వేశారంటే?" ముసలాయన, ప్రకాశం గట్టిగా అరిచాడు.

    "ఏం చేస్తారు?"

    "ఇద్దరి చెవులూ కోసేస్తాను"

    "ముందు ఆ ముసలాడివి కోసేయండి" అన్నాడు ప్రకాశం.

    "ఒరే! స్టూడెంటూ! అమ్మమ్మమ్మ! ఎంత ద్రోహం-"'

    శకుంతల నవ్వుకొంటూనే బయటికి వెళ్ళిపోయింది.

    ఆ రాత్రి ఆమెకి చాలాసేపటి వరకూ నిద్రపట్టలేదు. కొంచెం సేపు ప్రకాశాన్ని గురించి ఆలోచించింది. చాలా సరదాగా, ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉంటాడతను. అలాంటి మనుషుల్నే తను లైక్ చేస్తుంది. అందరూ అలాంటి పేషెంట్లే ఉంటే తమకి డ్యూటీ చేసినట్లే ఉండదు. ముసలాయన కూడా అంతే! ఆ వయసులో అంత చురుకుగా చాలా తక్కువమంది ఉంటారు. ఆ తరువాత ఆమె ఆలోచనలు తన  చిన్ననాటి కలల మీదకు పోయినాయి. అమ్మంటే విపరీతమయిన ప్రేమ తనకి. ఎందుచేతో ఇంటి దగ్గిరున్నంత సేపూ ఆమె కొంగు పట్టుకొనే తిరుగుతూండేది. తండ్రితో తనకి మొదటినుంచీ అంత చనువు లేదు. ఆయన్ని చూస్తూంటే భయంగా కూడా ఉండేది. పొద్దున్నే వెళ్ళిపోయి రాత్రి ఎప్పటికో వచ్చేవాడు. తన క్లాసు అమ్మాయి భాగ్యలక్ష్మి ఎస్సెల్సీ చదువు తూండగా వివాహమయింది. తను పెళ్ళికి వెళ్ళింది. అప్పటినుంచి తనలోను కొన్ని ఊహలు కలిగాయ్. తను కూడా భాగ్యలక్ష్మిలా పెళ్ళిచేసుకోవాలి. ఓ చిన్న ఇల్లూ, ఇంటిముందు చిన్న పూలతోటా ఉండాలి. భర్త ఆఫీసు కెళ్లగానే తమ ఇల్లంతా సర్ధి శుభ్రంగా ఉంచుతుంది. అతను సాయంత్రం వచ్చేసరికల్లా తను చిరునవ్వుతో ఆహ్వానిస్తుంది. ప్లాస్కులో నుంచి కప్పులోకి కాఫీ వంచి ఆయనకిస్తుంది. ఆయన స్నానానికి నీళ్లుతోడి సిద్ధంగా ఉంచుతుంది. తరువాత ఇద్దరూ ఎటువైపేనా షికారు వెళతారు.