'చంద్రా రెండోసారి కూడా తప్పించుకున్నావు... అయినా పట్టువదలను' అనుకున్నాను. వైజూ ఆనందం చూస్తూ నా నిరుత్సాహాన్ని పారద్రోలాను.

 

    లిల్లీవాళ్ళ ఆఫీసుకి ఫోన్ చేసి "ఈ శనివారం నేను నిజామాబాదు వెళుతున్నాను. ఈసారికి మనం కర్నూలు వెళ్ళలేము. చిత్ర పెళ్ళికి మరో ఫ్రెండుని పిలవడానికి వెళుతున్నాం" అన్నాను.

 

    "అరెరె...మళ్ళీ ఆటంకమా?" ఆమె గొంతులో కూడా డిజప్పాయింట్ మెంట్ కనిపించింది.

 

    "పరిపకారార్థం..." అని నేను ఆపేస్తే...

 

    "వెధవ శరీరం...కానీ!" అని పూర్తిచేసింది లిల్లీ.

 

    నేను నవ్వి పెట్టేశాను.

 

    ఆదివారం ఇంట్లో ఉండకపోవడం మంచిదే! లేకపోతే మళ్ళీ పెద్దక్క వచ్చి తన బీరకాయపీచు చుట్టం పెళ్ళికొడుకు గురించి చెపుతుంది.

 

    నేను పెళ్ళిచూపుల్లో ముక్కూ మొహం తెలీనివాడి ముందు కూర్చుని అతని ప్రశ్నలకి జవాబులివ్వగలనా? ఆ తర్వాత ఆ ఆగంతకుడితో కలిసి జీవితాంతం కాపురం చెయ్యగలనా? తలుచుకుంటేనే భయం వేస్తోంది! ఒళ్ళంతా చెమట్లు పడుతున్నాయి.

 

    అమ్మకీ, నాన్నకీ చిన్నక్క డైరీలో రాసినదంతా చెప్పి, నేను 'చంద్ర' ఆచూకీ పట్టుకునే దాకా ఆగమంటేనో... అప్పుడు వచ్చింది నాకు ఆ డేంజరస్ ఊహ! ఒకవేళ ఆ చంద్రకి ఆపాటికి పెళ్ళయిపోయి ఉంటేనో? నేను ఎటు పయనిస్తున్నాను. నా గమ్యం ఏది?

 

    అలా జరగదు. చంద్ర పెళ్ళి అయివుండదు. అతన్ని నేను కలుసుకుంటాను. నా నిర్ణయం చెప్పి అతన్ని పెళ్ళికి ఒప్పిస్తాను' చిన్నక్కకి ప్రాణం కన్నా ఎక్కువైనా వ్యక్తి నాకూ అంతే! రోజులా భగవంతుడ్ని చంద్ర ఆచూకీ కనిపెట్టడంలో హెల్ప్ చేయమని వేడుకుని పడుకున్నాను.

 

    ప్రతాప్ కి మేము వస్తున్నామని ముందే ఉత్తరం రాయడం వలన స్టేషన్ కొచ్చాడు. నన్నూ, చిత్రనీ "బావున్నారా?" అని వైజయంతి నెత్తిమీద కొట్టాడు.

 

    వైజూ మొహంలో వంద మతాబుల వెలుగు! అంతకన్నా పలకరింపు ఏం కావాలి? స్పర్శని మించిన భాష ఆప్యాయత చూపడానికి లేనే లేదు!

 

    వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి బండి తీసుకొచ్చాడు. ఎద్దులబండి ఎక్కుతుంటే చాలా సరదాగా అనిపించింది. "సేటు...ఓరంత ముందుకి కూసోమను... దొరసానులని..." అన్న బండి అబ్బాయి మాటలకి.

 

    "వైజూ...వెనకాల బరువెయ్యమంటున్నాడు. వెనక్కి కూర్చో అని ఆటపట్టించాడు ప్రతాప్.

 

    "నేనేం నీలా గల్లా పెట్టె దగ్గర కూర్చుని బొజ్జ పెంచలేదు సేటూ!" అని వెక్కిరించింది.

 

    బండిలో అటూ ఇటూ తూలుతూ కాలేజీ కబుర్లు చెప్పుకుంటూ గలగలా నవ్వుకున్నాం.

 

    "పాటలు పాడుతున్నావా? మానేశావా?" చిత్ర అడిగింది.

 

    "దినాం పాటే అయిపోయే తీ...జిందగీ!" అన్నాడు.

 

    "భాష కూడా మారిపోయిందే?" వైజూ కోప్పడింది.

 

    "జర... సబర్ జెయ్యి బస్తీ దొరసానీ... బాంచన్ నీకాల్మొక్తా..." అని వంగి సలాం చేశాడు.

 

    వైజయంతి పకపకా నవ్వేసింది.

 

    ప్రతాప్ నాయనమ్మ మాకోసం స్నానాలకి వేడినీళ్ళుపెట్టి ఎదురుచూస్తోంది.

 

    "అచ్చింరా! తానాలు చేసి పలారాలు తిందుపాండి."

 

    భాషా...యాసా ఏదైనా అతిధుల్ని ఆదరించే మమకారం తీరు ఒక్కటే. వేడి వేడి పూరీలూ, ఘుమఘుమలాడే బంగాళదుంపల కూరా వడ్డించింది.

 

    ప్రతాప్ తల్లి మంచంలోంచే మాట్లాడింది. "మాటికి వస్తరా... బిడ్డా...పెద్దింటోల్లు! అంది.

 

    "జాతర టయానికి అచ్చింరు...కొంటబోయి సూపించరా ప్రతాపా..." అంది వాళ్ళ నాయనమ్మ.

 

    ఫలహారాలు అయ్యాకా కార్డ్స్ ఆడుతూ కూర్చున్నాం.

 

    "కాసేపు పడుకోండి... అమ్మవారి జాతర కెళదాం సాయంత్రం" అన్నాడు ప్రతాప్.

 

    "మేం ఎందుకులే... వైజూని తీసుకెళ్ళు!" అన్నాను.

 

    ప్రతాప్ సిగ్గుపడ్డాడు. నల్లని ఆ మొహానికి సిగ్గుపడడం వల్ల నిగారింపు వచ్చింది!

 

    "నువ్వు లైఫ్ లో స్థిరపడినట్లేగా ప్రతాప్! మరి వైజూని పెళ్ళిచేసుకోవచ్చుగా!" అడిగేసింది చిత్ర.

 

    "పెళ్ళా?" అదిరిపడ్డాడు ప్రతాప్.

 

    "అదేంటి...పెళ్ళి చేసుకోవా?" వైజూ పోట్లాడుతున్నట్లు మీదకెళుతూ అడిగింది.

 

    "ఈ పెంకుటిల్లూ... ఆకొట్టూ, డిగ్రీ కూడా లేని మొగుడూ నీకెందుకు వైజూ?" నవ్వుతూ అడిగాడు.

 

    "అలా మాట్లాడకు...నేను నిన్ను..." అని చెప్పలేక ఆగిపోయింది వైజూ.

 

    "మేం అలా బయటికి వెళ్ళొస్తాం. మీరు మాట్లాడుకోండి" అంది చిత్ర.

 

    "అక్కర్లేదు... మీ దగ్గర నాకేం సీక్రెట్లు లేవు!" అంది.

 

    ప్రతాప్ గంభీరంగా మారి "నాకు టైం పడుతుంది వైజూ. అందాకా నిన్ను ఆగమనడం అన్యాయం. నువ్వు ఆగినా, మీ ఇంట్లోవాళ్ళు ఇంతోటీ పెళ్ళికొడుకు కోసం ఎన్నేళ్ళు ఆగాలి? అని విసుగుపడవచ్చు!" అన్నాడు.