"నేను గోరంతలు కొండంతలు చెసుకుంటున్నాననేగా నీ ఉద్దేశం?" అడిగింది శక్తి.
తార సానుభూతిగా చూసి "ఏమో! నీ స్థానంలో వుంటే నేనూ ఇలాగే ఆలోచించి మనసు పాడుచేసుకునేదాన్నే అనుకుంటా మనిషికీ, సమస్యకీ అనాదిగా వస్తున్న ఈ అవినాభావసంబంధం ఎవరూ విడదీయలేనిది" అంది.
"నేను అనవసరంగా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా నేమో తారా!" తనకి తను నచ్చచెప్పుకుంటున్నట్లుగా అంది శక్తి.
తార మాట్లాడలేదు. ఎవరి సమస్యలు వారికి పెద్దవే అని ఆమెకి తెలుసు. లేకపోతే భర్తలు గురకపెట్టడం, భార్యలు మోడ్రన్ డ్రస్ లు వేసుకోవడంలాంటి విషయాలమీద విడాకులు ఎందుకు తీసుకుంటారూ? లాయర్లకి ఇవ్వడానికి డబ్బు లెక్కువయ్యా లేక తిన్నది అరక్కనా? ఏదైనా భరించలేకపోవడం సమస్యేగా అందులో కొంచెం భరించడం, ఎక్కువ భరించడం అన్న తూనికలూ, కొలతలూ ఏం వుంటాయి?
మరునాడు ఇంద్రనీల్ వెళుతూ శక్తికి మందులూ అవీ జాగ్రత్తగా వేసుకోమని మరీమరీ చెప్పాడు. అది చాలదన్నట్లు మీనాక్షిని పిలిచి వేళకి మందులు వేసుకుంటోందా, అన్నం తింటోందా అని కనిపెట్టి చూడమన్నాడు.
శక్తిమాత్రం చాలా దిగులుగా అన్నింటికీ తల ఊపింది.
"మధ్యలో ఫోన్ చెయ్యండి" అంది.
"వీలు కాదేమో... ట్రై చేస్తాలే" అన్నాడు.
"ఫోన్ అనేది ఇప్పుడు మానవసంచారం వున్న ప్రతిచోటా వుంటోంది" నిష్టూరంగా అంది.
"వస్తాను... ఆరోగ్యం జాగ్రత్త" ఆమె చెక్కిలి నిమిరి వెళ్ళిపోయాడు.
డాక్టర్ ఇచ్చిన డ్యూ డేట్స్ కి యింకా పదిహేను రోజులు టైం వుంది. శక్తి లీవ్ తీసేసుకోవడంతో ఇంట్లో వుండడంవల్ల అసలు తోచడం లేదు. అస్తమానం అతనిగురించే ఆలోచించసాగింది.
మామ్మగారి ఇంట్లోంచి గట్టిగా మాటలూ, సన్నగా ఏడుపూ వినపడ్డాయి.
శక్తి భారంగా అడుగులేస్తూ వాకిలిదాకా వెళ్ళి నిలబడింది.
మామ్మగారు వరండాలో చాపమీద కూర్చున్న ఓ అమ్మాయిని ఓదారుస్తూ "ఊర్కోమ్మా, ఊర్కో... మాయదారి వెధవ.... మనం ఇంతకాలం కనుక్కోలేకపోయాం... తప్పు మనది" అంటోంది.
పడక కుర్చీలో కూర్చున్న తాతగారు ముక్కునిండా నశ్యం పట్టించి "అయినా ఈ భాగోతం మూడేళ్ళుగా సాగుతుంటే నువ్వేం చేశావే? ఇల్లనే మండపానికి ఇల్లాలు మూలస్థంభంలాంటిది నీకు ఇంట్లో జరుగుతున్న విషయాలుకూడా పట్టవా? పోనీ అంటే చదువూ, సంధ్యాలేని మొద్దువు కూడా కాదు" అని మందలిస్తున్నాడు.
"అది అసలే ఏడుస్తోంది. మీరు సాధించడం మాని జరగాల్సినధీ చూడండీ" అంది మామ్మగారు.
"ఇంకేం వుంది చూడటానికి? లాయర్ని కలిసి మాట్లాడతాను. బినామీ కేసు పెడితే కాళ్ళబేరానికికొస్తాడు" కోపంగా అన్నాడాయన.
"అంతకన్నా వేరే మార్గం లేదా తాతయ్యా" ఆ అమ్మాయి దుఃఖంవల్ల జీరపోయిన గొంతుతో అడిగింది.
మామ్మగారి దృష్టి వాకిట్లో ద్వారబంధానికి ఆనుకుని నిలబడ్డ శక్తిమీద పడింది.
"శక్తీ... ఇటు రామ్మా....చదువుకుని, ఉద్యోగం చేస్తున్నదానివీ, కాస్త సలహా చెప్పు" అంది.
పిలవకుండా వచ్చి కలుగజేసుకోవడం మర్యాద కాదని దూరంగా నిల్చున్న శక్తి వెంటనే వచ్చి "ఎవరీ అమ్మాయి మామ్మగారూ!" అని అడిగింది.
ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకుని శక్తివంక ఓ క్షణం చూసి తలదించుకుంది.
"నా మనవరాలమ్మా.... తల్లీదండ్రీలేని పిల్ల ఈ కడుపులో పెట్టుకుని పెంచాను. ఉన్నంతలో బాగా ఖర్చుపెట్టి మంచి సంబంధమే అనుకోని పెళ్ళిచేశాను. పెళ్ళయి మూడేళ్ళయింది. దీనికి ఏడాదిన్నర కూతురుకూడా వుంది. ఇప్పుడు తెలిసిందట దీని మొగుడికి ఇంకో పెళ్ళాం, అక్కడ ఇద్దరు పిల్లలూ వున్నారని నిలదీస్తే ఒప్పుకుని 'ఏం చేస్తావ్' అంటున్నాడట. మా ప్రారబ్ధం ఇలా తగలబడింది. ఏం చెయ్యమంటారో చెప్పు తల్లీ!" మామ్మగారు శోకాలు పెట్టింది.
"శోకాలు పెడితే దాని తలరాత మారుతుందా? దీనికితోడు ఓ పిల్లకూడా పుట్టింది. ఇంతకాలం ఇది కళ్ళు మూసుకుని వుండిపోయింది. మొద్దు.... మొద్దాని" తాతగారు బీపీ పెరగడంవల్లనేమో వుద్రేకంగా అరుస్తున్నారు.
శక్తి ఆయన దగ్గరికెళ్ళి "మీరు ఉద్రేకపడకండి. సమస్య వచ్చినప్పుడు కాస్త ఓర్పు పట్టి నిదానంగా ఆలోచిస్తే పరిష్కారం తట్టకపోదు" అంది.
"సమస్య నీదైతే నేనూ ఇదేమాట చెప్తానమ్మా" ఆయన కస్సుమన్నాడు.
"మీకు మతిపోయిందా? ఆ అమ్మాయిమీద విసుక్కుంటారేమిటి? ఏదో మాట సాయానికి వచ్చింది పాపం" అంది మామ్మగారు.
"శ్రీదేవి....పాప లేచినట్లుంది ముందు దానిసంగతి చూడు" అని ఆ అమ్మాయిని లోపలికి పంపించాడాయన.
ఆ అమ్మాయి ఎంతో సిగ్గుపడుతున్నట్లుగా, చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నదానిలా తలవంచుకు కూర్చున్నదల్లా తాతగారి మాటలకు లేచి లోపలికి వెళ్ళింది.
"మగవాడు లక్ష కారణాలను చెప్పి బయటికి వెళ్ళొస్తాడు. ఏం పనో అనుకుంటాం కానీ ఇలా ఇంకో సంసారం వుండివుంటుందనే వూహ వస్తుందా అమ్మా ఈయనదంతా విపరీతం కానీ" అంది పైటతో కళ్ళొత్తుకుంటూ మామ్మగారు.