"అబ్బే....ఏం లేదు.....కంగారుపడ...." మాట పూర్తిచేయలేకపోయింది కాంచన.
    
    "అమ్మా.....!" సంధ్య తల్లిని పొదివి పట్టుకుంటూ ఆదుర్దాగా పిలిచింది.
    
    "కాంచన మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ సంధ్యతో మాట్లాడటానికి ప్రయత్నించింది.
    
    సంధ్య కంగారుగా తల్లిని వదిలి ఫోన్ దగ్గరికి పరిగెత్తింది.
    
    "త్వరగా రండి అంకుల్! అమ్మకి మళ్ళీ నొప్పిచ్చింది. నాన్నగారు లేరు. నాకు భయంగా వుంది" అంటూ వుంటేనే ఆ అమ్మాయి గొంతు వణికి కళ్ళల్లోంచి జలజలా నీళ్ళు కారిపోతున్నాయి.
    
    కాంచన అంత బాధలోనూ కూతుర్నే గమనిస్తోంది. డాక్టర్ గారు వచ్చేదాకా సంధ్య ఒక నిముషం స్థిమితంగా ఒకచోట నిలవలేకపోయింది. "కంగారులేదు. తగ్గిపోతుంది" అని తల్లికి ధైర్యం చెబుతూ తను ఏడ్చేసింది. దేవుడి దగ్గర్నుంచి కుంకుమ తెచ్చి తల్లి నుదుట అద్దింది. తల్లి గుండెలమీద చేయివేసి నిమురుతూ 'ఈ బాధని తీసివేసే శక్తి ఏ దేవుడైనా నా చేతికి ప్రసాదిస్తే ఎంత బావుండును' అనుకుంది.
    
    డాక్టర్ గారొచ్చి కాంచనకి ఇంజెక్షన్ ఇచ్చాక ఈమె కాస్త స్థిమితపడి నిద్రలోకి జారుకుంది. డాక్టర్ సంధ్యకి ధైర్యం చెప్పి వెళ్లిపోయాడు. నిద్రపోతున్న తల్లినే చూస్తూ కూర్చుంది సంధ్య. చిరుగాలికి అటూ ఇటూ ఊగే రేకులా అతి సున్నితంగా ఆమె గుండె ఎగసి పడుతోంది. ఆ కదలిక ఆగిపోతే? అమ్మో! ఆ వూహే సంధ్య కాళ్ళల్లో వణుకు తెప్పించింది. కళ్ళు విప్పార్చుకుని తల్లి ఉచ్వాస నిశ్వాసాలనీ లయబద్దంగా కదులుతున్న ఆమె ఎదనీ చూస్తూ కూర్చుంది. తనచూపు మరలితే ఆ కదలిక ఆగిపోతుందేమోనన్నంత భయంగా అనిపించింది.
    
    "డాడీ వచ్చేస్తే బావుండ్ను" అని వందసార్లు అనిపించింది. తండ్రి వుంటే తల్లికి ఏమీ ఫర్వాలేదని ఆ అమ్మాయి నమ్మకం. తన గుండెలోని మమకారపు పోగులతో ఓ గూడు అల్లి అందులో తల్లిని దాచేయాలన్పించింది. ముఖంలో ప్రశాంతత అలుముకునేదాకా ఆమె కదలకుండా అక్కడే కూర్చుండిపోయింది.
    
                                           * * *
    
    "గణ.....గణ.....గణ" ఆ గంట చప్పుడు చాయకు పరమ అసహ్యం. దుప్పటి మొహంమీద వరకూ లాక్కుని చెవులు గట్టిగా చేతులతో మూసుకుంది.
    
    "కొంపలంటుకుంటే ఫైరింజన్ వాళ్ళు మోగిస్తున్నట్లు ప్రతిరోజూ ఈ గంటలొకటి?" అని విసుక్కుంది. నిద్ర లేచాక కాసేపు అలాగే పడుకుని కమ్మని వూహల్లో విహరించడానికి కూడా సందుదొరకని వెధవ సంత అని తిట్టుకుంది. అందరూ లేచినట్లున్నారు. వరండామీద అలికిడి వినిపిస్తోంది. గుసగుసలూ, నవ్వులూ, వార్డెన్ అరుపులూ, చీపురు చప్పుళ్ళు, నీళ్ళ శబ్దం! ప్రశాంతత అనేది భూతద్దం పెట్టి వెతికినా కనపడదు.
    
    "చాయమ్మా లేమ్మా.....మళ్ళీ బాత్ రూంకాడ ఆలస్యం అయిపోతే విస్కుంటావు" అన్న కాంతమమ గొంతు వినిపించింది.
    
    చాయ కళ్ళు గట్టిగా మూసుకుంది. లేవగానే ఎదురుగా కనిపించే ఆ దరిద్రపు అవతారం చూడాలంటే ఆమెకు పరమరోత.
    
    "నేను లేస్తాలే. ముందు నువ్వు అవతలికిపో" అని కసురుకుంది.
    
    కాంతమమ సణుక్కుంటూ వెళ్లిపోవడం తెలిసాక, నెమ్మదిగా దుప్పటి ముసుగు తీసింది. తెల్లవారుజామున వచ్చిన కలలో తనని హెలికాఫ్టర్ లో ఎక్కించుకుని మబ్బులలో విహరింపజేసినా యువకుడి రూపం గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ముఖం గుర్తులేదు. కానీ చాలా హేండ్సమ్ గా వున్నాడు. ఇద్దరూ ఒకరిచేతుల్లో ఒకరు ఒదిగిపోయి ఏదో ఇంద్రభవనం లాంటి హోటల్ కి వెళ్లారు. ఫౌంటెన్లు, గుండ్రంగా తిరిగిపోయే బల్లలు, కుర్చీలు, పెద్ద ఆఫీసర్లలా సూట్లు, బూట్లు వేసుకున్న హోటల్ బాయ్స్, ఖరీదైన కార్పెట్స్, మంద్రమైన సంగీతం ఎటుచూసినా అందం అంతటా అంధకారం. తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు కూడాను.
    
    చాయ నెమ్మదిగా కళ్ళు విప్పింది. కిటికీలోంచి దూరొచ్చిన ఎండ చురుక్కుమనిపించి మళ్ళీ కళ్ళు మూసుకుంది.
    
    "మిస్ యూనివర్స్ పోటీకి ఎందుకు వెళ్ళలేదు చాయా?" కలలోని యువకుడి ప్రశ్నను మననం చేసుకుంది. "నువ్వొస్తే నీకు పోటీగా నిలబడటానికి కూడా ఎవరు ముందుకొచ్చే వాళ్ళుకారు" అంటూ అతను తన చేతిని ముద్దుపెట్టుకోవడం గుర్తొచ్చింది. నెమ్మదిగా ఎడమ అరచేతిని కళ్ళమీదికి చేర్చుకుని కళ్ళు విప్పింది. ఆ తర్వాత అరచేతిని ముద్దుపెట్టుకుంది.
    
    నిద్ర లేవగానే అందరూ దేవుడి పటంవైపు చూసి దండం పెట్టుకుంటారు. కానీ చాయకి మాత్రం ఎడమ అరచేతిని మించినది ఏమీలేదు. అందులో అదృష్టరేఖ దాగున్నదని అది ఏనాటికైనా ఆమెను మహారాణిని చేసేస్తుందని ఆమె మనస్ఫూర్తిగా నమ్ముతుంది.
    
    ఆ అరచేతిని కళ్ళమీదనుండి తొలగించి చుట్టూ చూసింది. వెల్లవేసి చాలా రోజులయి జేగురు రంగుకి తిరిగి పెచ్చులూడిపోయిన గోడా, ఆ గోడమీద తోక తెగిన బల్లీ కనిపించాయి. యుద్దంలో శత్రువును వెన్నుపోటు పొడవడానికి వెళ్ళే సైనికుడిలాగా అతినెమ్మదిగా కదులుతోంది దీపం మీద వాలిన పురుగు వైపుకు ఆ బల్లి, ఆ పురుగు అసహ్యంగా వుంది. కానీ అమాయకంగా వుంది. ఎగిరి మళ్ళీ  దీపం మీదే వాల్తొంది. బల్లి అతి సమీపంగా వచ్చేసింది. చాయ ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఎవరో ఠక్కున లైటు స్విచ్ ఆఫ్ చేసారు. దీపం ఆరిపోయింది. బల్లి నోరు తెరిచి సన్నని నాలుక జాపేలోగా పురుగు ఎగిరిపోయింది. బల్లికన్నా ఎక్కువగా చాయ నిరుత్సాహపడింది. 'ఛ! ఆ పురుగు చావాల్సింది. ఎంత అసహ్యంగా వుందో' అనుకుంది.
    
    చాయ లేచి పక్క ఎత్తిపెట్టి వరండాలోకి వెళ్ళేసరికి అప్పటికే బాత్ రూమ్ ల దగ్గర క్యూ పొడవు పెరిగిపోయింది. స్తంభానికి అనుకుని నిలబడిన చాయ ఆలోచించింది. ఎప్పటికైనా ఈ క్యూలో నిలబడడం అనే శిక్ష తను తప్పించుకోగలుగుతుందా? బాత్రూం దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే దాకా అన్నింటికి వరుసలో వెళ్ళడమే? ఈ వరుసని ఓవర్ టేక్ చేసి ముందుకు వెళ్ళిపోయే విధానం ఏదీలేదా?
    
    "ఏయ్ మాయా! మాకంటే వెనుకవచ్చి నువ్వెలా దూరుదామనే?" ఓ లావుపాటి అమ్మాయిని పట్టి లాగుతూ మిగతా అమ్మాయిలు అరుస్తున్నారు.
    
    "నేను వెళ్ళాలి అర్జెంట్" అని ఆ అమ్మాయి వాళ్ళని విదిలించుకుంటూ నిర్లక్ష్యంగా అంది.
    
    "అలా కుదరదు ఆ మేరీ, ఆశా వాళ్ళంతా ఆరింటినుంచి నిలబడ్డారు తెలుసా?" ఓ అమ్మాయి లీడర్ గా అంది.
    
    "ఓపిక వుంది కాబట్టి నిలబడ్డారు. నన్ను పోనీ" మాయ విదిలించుకోబోయింది.
    
    "మేం వెళ్ళనివ్వం" చుట్టూ వున్నవాళ్ళు మాయని వెనక్కి లాగిపడవేశారు.
    
    మాయ చటుక్కున లేచి తనని ఆపిన అమ్మాయి జడపట్టుకుని వీపు మీద ధబీ-ధబీమని బాదింది. మిగతావాళ్ళు అడ్డుపడేసరికి వాళ్ళనీ అందిన వాళ్ళని అందినట్లుగా చితకబాదింది.