ఒబెసిటీ ఉన్న పిల్లల్ని డీల్ చేయడమెలా..

 


ఒబెసిటీ ఉన్న పిల్లల్ని డీల్ చేయడమెలా?!

 

 

ఒబెసిటీ... పెద్దవాళ్లనే కాదు, పిల్లలనీ వేధిస్తోన్న సమస్య. భారీగా పెరిగిన శరీరం పెద్దలను ఎంత ఇబ్బంది పెడుతుందో పిల్లలను అంతకంటే ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అందరూ తమని అదోలా చూడటం, నవ్వడం చేస్తున్నారని పిల్లలు బాధపడే అవకాశం ఉంది. కుంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ల విషయంలో ఎక్కువ కేర్ తీసుకోవాలి. వాళ్లను డీల్ చేయడం తల్లులు నేర్చుకోవాలి.

- తల్లిదండ్రులు సాధారణంగా చేసే తప్పు పిల్లలను ఇతరులతో పోల్చడం. అది వాళ్ల మనసును ఎంతగా గాయపరుస్తుందో ఊహించలేం. ముఖ్యంగా తమలో లోపం ఉందని ఫీలయ్యే పిల్లలైతే కుంగిపోతారు. అందుకే ఆ బాబు చూడు ఎలా ఉన్నాడో, ఈ పాప చూడు ఎలా ఉందో, నువ్వూ అలానే ఉండాలి అన్నమాట నోటి నుంచి రానివ్వకండి.

- అక్కచెల్లెళ్లు, అన్నదమ్ములతో కూడా పోల్చకూడదు. పిల్లలు మామూలుగానే వాళ్లతో పోల్చుకుని ఫీలవుతుంటారు. మనమూ అదే పని చేస్తే వాళ్ల ఫీలింగ్ ఇంకా పెరుగుతుంది. ఇన్ ఫీరియర్ గా తయారవుతారు. అలాగే... నీ వయసులో నేనలా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటూ కూడా చెప్పకూడదు.

- తిండి విషయంలో రిస్ట్రిక్ట్ చేయకూడదు. ఇది తింటే ఇంకా లావైపోతావ్ అన్న మాట అస్సలు అనకూడదు. దానికి బదులు వాళ్లకి కూల్ గా ఎక్స్ ప్లెయిన్ చేయండి. ఇది ఆరోగ్యానికి ఇలా చేటు చేస్తుంది, భవిష్యత్తులో ఫలానా జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది, కాబట్టి దీని బదులు ఇది తింటే చాలా మంచిది అని చెప్పండి. అయినా వాళ్లు బాధపడుతున్నారు అనుకుంటే అలాంటి ఫుడ్ ని ఇంట్లోకి అసలు రానివ్వకండి. పిల్లల సంతోషం కంటే కావలసింది ఏముంది!

- ఒక దెబ్బ కొట్టినా మర్చిపోవచ్చు కానీ ఒక మాట అంటే పడలేం అంటారు కదా. పిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువ. వాళ్లు మాటల్నే ఎక్కువ గుర్తు పెట్టుకుని బాధపడతారు. కాబట్టి ఆరోగ్యం గురించి, శరీరం గురించి లెక్చర్లు ఇవ్వకండి. క్లాసులు పీకకండి.

 

 

- డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడొద్దు. ఈ డ్రెస్ నీకు బాగోదు, నీకు సూట్ కాదు, నీకంటే అక్కకి/అన్నకి బాగుంటుంది నువ్వు వేరేది తీసుకో.. ఇలాంటివి అనడం చాలా తప్పు.

- శరీరాన్ని బట్టి ముద్దుపేర్లు పెట్టొద్దు. మీరు ముద్దుగా లడ్డూ అని పిలిచినా వాళ్లను కామెంట్ చేస్తున్నారేమో అనుకునే ప్రమాదం ఉంది. బయట కూడా ఎవర్నీ నిక్ నేమ్స్ పెట్టి పిలవనివ్వకండి.

- వ్యాయామం విషయంలో ఒత్తిడి చేయవద్దు. ఇలా చేస్తే సన్నబడతావ్ అంటూ అదీ ఇదీ చేయమని విసిగించకండి. తాము అలా ఉండటం అమ్మానాన్నలకు నచ్చడం లేదు అన్న ఫీలింగ్ వచ్చి తమ మీద తమకే అయిష్టత ఏర్పడుతుంది.

- పొరపాటున వాళ్లు దిగులుగా కనిపిస్తే... ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. బయట ఎవరైనా కామెంట్ చేస్తున్నా, స్కూల్లో తోటి పిల్లలు ఏడిపిస్తున్నా వెంటనే వెళ్లి వాళ్లతో మాట్లాడండి. వాళ్లే సర్దుకుపోతారులే అనుకుంటే మీ పిల్లల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఒబెసిటీ అనేది ఓ సమస్య. అది లోపం కాదు. ఆ విషయం తెలియక బాధపడే చిన్నారుల్ని ఆ బాధ నుంచి బయట పడేయాలంటే ఈమాత్రం జాగ్రత్త తీసుకోక తప్పదు. తల్లిదండ్రులుగా అది మన బాధ్యత. కాదంటారా?!

- Sameera