వెచ్చని ఆ పెదవుల తడి..... జీవితంలో మొదటి ముద్దు! పాపిడి తడిమి చూసుకున్నాను. తిన్నగా ఏ వంకరా లేకుండా అమ్మ తీసిన పాపిడి నా జీవితం కూడా అంత తీరువగా వుంటుందా?
    
    "నువ్వు అంగీకరించడానికి నాకేం అర్హతలు లేవు కేవలం.... నిన్ను గాఢంగా ప్రేమించే గుణం తప్ప" అన్నాడు.
    
    అసలంతకన్నా ఏం అర్హత ఆశిస్తుంది స్త్రీ? అదివ్వడానికే మగవాడు తెగ బాధపడిపోతుంటాడు.
    
    నేను అతన్ని సున్నితంగా విడిపించుకుని ఇవతలికి వచ్చేస్తుంటే "సే ఎస్ ఆర్ నో" అన్నాడు.
    
    నేను బదులివ్వలేదు వచ్చేశాను.
    
                                                               * * *
    
    అమ్మని తీసుకుని నాన్నగారు మెడ్రాసు వచ్చారు. అమ్మకి కేన్సరట. ఎగ్ మోర్ హాస్పిటల్లో చేర్పించాం. నాన్నగార్ని రోజూ కారులో హాస్పిటల్ కి పంపించేదాన్ని ఆయన శుష్కించిపోతున్న అమ్మతో "నీ కూతురి వైభవం అనుభవించకుండానే పోతున్నావా లక్ష్మీ?" అని ఏడ్చేవారు.
    
    అమ్మకి మాట పడిపోయింది. కళ్ళతోనే నా ఒళ్ళంతా స్ప్రుశించేది. మూగగా కన్నీళ్ళు పెట్టుకుని 'పెళ్ళెప్పుడు చేసుకుంటావు?' అని కళ్ళతోనే ప్రశ్నించేది.
    
    నాకు అమ్మ ఆఖరి రోజుల్లో ఆవిడతో ఎక్కువసేపు గడపాలనీ, చిన్నప్పుడు ఆవిడ నేర్పించిన పాటలు పాడి వినిపించాలనీ ఎన్నో కోర్కెలుండేవి. కానీ తీరేవికావు. బిజీ....బిజీ....బిజీ...!
    
    నేను హాస్పిటల్లో ఎంటర్ అయిన వార్త తెలియగానే జనం గోలగా చుట్టుముట్టేవారు.
    
    ఆ అభిమానం తట్టుకోవడం కూడా చాలా కష్టంగా వుండేది. చివరికి తల్లితో గడిపే ప్రైవసీ కూడా లభ్యమయేది కాదు.
    
    అమ్మకి అది తృప్తిగానే వుండేది.
    
    నా కేసెట్లు పెట్టుకుని వింటూ బాధని ఓదార్చుకునేది.
    
    నేను ఆవిడ బాధతో మెలికలు తిరగడం చూసినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా భగవంతున్ని ప్రార్ధించేదాన్ని.... అమ్మలకి ఇటువంటి బాధలు కలిగించకు స్వామీ! వారి ఋణాలు బిడ్డలు తీర్చుకోవాలంటే వేరే విధంగా సుఖపెట్టి తీర్చుకోనీ- అని.
    
    నాన్నగారు ఎప్పుడూ మా ఎదుట కూడా అమ్మతో మాట్లాడడం మేం చూసి వుండలేదు. అలాంటిది అమ్మకి సేవలన్నీ తనే చేస్తూ ఆమె పక్కనే వుంటున్నారు. దాసమ్మగారు రాత్రిళ్ళు వుంటానన్న ఆయన ఒప్పుకోవడంలేదు.
    
    కాస్త టైం దొరికితే చాలు నేను అమ్మ దగ్గరకెళుతున్నాను.
    
    రఘు నన్ను కష్టపడి పట్టుకుని "నా సంగతేం ఆలోచించావు?" అని గుర్తు చేశాడు.
    
    నేను జవాబివ్వలేదు. అతని కోసం నేను చేసిన అప్పు ఇంకా పదిలక్షలుంది కనీసం అరవై, డెబ్బై పాటలు పాడాలి. అంతవరకూ ఏ విషయము నేను కమిట్ కాదలచుకోలేదు.
    
    పెద్దన్నయ్య భార్యా ఇద్దరు పిల్లలతో అమ్మని చూడటానికొచ్చాడు. వచ్చినవాడు మా ఇంట్లోనే రెండు నెలలుగా వుండిపోయాడు. దాసుగారు విషయం కనుక్కుని అతనికి ఉద్యోగం పోయిందని నాతో చెప్పారు.
    
    నేను నాకు బాగా తెలిసిన స్టూడియోలో మేనేజర్ గా పెట్టించాను.
    
    కొత్త ఇల్లు పూర్తి అయింది. అమ్మ వుండగానే గృహప్రవేశం చెయ్యడం నాకు సంతోషం కలిగించింది.
    
    "పీటల మీద ఎవరు కూర్చుంటారూ? మేమేగా వున్నదీ!" అంది వదిన.
    
    "అవునమ్మా" అన్నారు దాసుగారు.
    
    బ్రాహ్మడు ముహూర్తం నిర్ణయించబోతుండగా నేను చెప్పాను. "నన్ను కన్న తల్లిదండ్రులకి వీలవకపోయినా ....నన్ను పెంచిన తల్లి దండ్రులున్నారు."
    
    దాసుగారూ, దాసమ్మగారూ ఆశ్చర్యంగా చూశారు.
    
    "అవునమ్మా....మీరు నా తల్లిదండ్రులేకాదు. గురువులు...దైవ సమానులు!" అన్నాను.
    
    "బిడ్డలు లేరన్న బాధలేకుండా చేశావమ్మా!" దాసుగారు కంటతడి పెట్టారు. దాసమ్మగారైతే కౌగిలించుకుని ఏడ్చేసింది.
    
    గృహప్రవేశం హడావిడంతా రఘు చేతులమీదే జరిగింది. ఎందరో సినీ పరిశ్రమకి సంబంధించిన ప్రముఖులు వచ్చారు. చిన్నన్నయ్యా వదినా కూడా వచ్చారు. అమ్మని ఆరోజు ఇంటికి తీసుకొచ్చాం. కంటినిండా ఇంటిని చూసింది. ఆ రాత్రే బాధ చాలా ఎక్కువైంది. మర్నాటికల్లా ప్రశాంతంగా కన్నుమూసింది.
    
                                                                   * * *
    
    గృహప్రవేశానికొచ్చిన అన్నయ్యలూ, వదినలూ వుండిపోయారు. నా పాటలూ, రికార్డింగులుతో నేను బిజీగా వున్నాను. ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో నేను పట్టించుకోవడంలేదు.
    
    పాట పాడి రాగానే చెక్ ఇవ్వడం చాలా ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు ఎప్పటిలాగే నేను బయటికి రాగానే అందరూ నా చుట్టూ మూగి అభినందించారు కానీ చెక్ ఇవ్వలేదు. చాలా నమ్మకమైన బ్యానర్. అందుకే నేను ఇంటికి వచ్చేశాను. పెద్దగా ఆలోచించలేదు. ఇంకో రెండుసార్లు అలా జరిగాక నాకు అనుమానం వచ్చి మేనేజర్ ని పిలిచి ఆరాదీశాను. ఆయన చెప్పింది విని నాకు మతిపోయింది.
    
    ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా చిన్నన్నయ్యని అడిగాను.
    
    "నువ్వు ఆర్.వీ.మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అవసరం అని చెప్పి డబ్బు తీసుకున్నావా?"
    
    అతను చాలా కంగారుపడతాడనుకున్నాను. కానీ అలాంటిదేం జరగలేదు.
    
    "ఔను! ఇకనుండీ డబ్బు సంగతి నేనే చూస్తాను. ఇంతకాలం నుండీ సంపాదిస్తున్నావు బ్యాంక్ లో కనీసం రెండు లక్షలు లేవు. స్వంతవాళ్ళని నమ్మినట్లుగా పరాయి వాళ్ళని నమ్మకూడదు" అన్నాడు దాసుగారిని అదోలా చూస్తూ.
    
    నా తల తిరిగిపోయింది. దాసుగారివైపు భయంగా చూశాను.
    
    ఆయనకీ, దాసమ్మకీ తెలుసు నేనంత డబ్బు ఏం చేశానో అయినా వాళ్ళు నోరు మెదపలేదు. ఆ అభియోగాన్ని మౌనంగా మోస్తూ నిలబడ్డారు.
    
    "కన్నావాళ్ళకన్నా ఎక్కువ హక్కులిచ్చిందిగా మరి" అన్నాడు పెద్దన్నయ్య.
    
    గృహప్రవేశం పీటలమీద దాసుగారి దంపతులని కూర్చోపెట్టినప్పటినుండీ వాడలాగే మండిపడుతున్నాడు. పెద్ద వదిన దాసమ్మగారి వంటలకి వంకపెట్టడం. సూటీపోటీ మాటలనడం నేను ఒకటి రెండుసార్లు గమనించాను.
    
    "షటప్! వాళ్ళే లేకపోతే ఈ రోజున మీ కంచాల్లో అన్నమే వుండేది కాదు" అన్నాను.
    
    "ఇంకా ఎందుకండీ ఇక్కడ? మన వూరెళ్ళి ఏదో ఒకటి చేసుకు బతుకుదాం" అంది కొంగుతో కళ్ళు అద్దుకుంటూ చిన్న వదిన.
    
    "అది కాదన్నా చెల్లెలు కాకపోదు. రక్తం పంచుకుపుట్టింది దాని సొమ్మలా వ్యర్ధంగా ఖర్చయిపోతుంటే ఎలా చూస్తూ వూర్కుంటాం?" అన్నాడు చిన్నన్నయ్య మూర్తిగాడు.