మరో పదినిమిషాలు అవి ఇవి మాట్లాడుకున్నారు. ఆ తరువాత ఆమె కారులో పంపిస్తానన్నా వినకుండా పూజారి ఆటోలోనే ఇంటికి వెళ్ళేందుకు నిశ్చయించుకున్నాడు.


                                                   *    *    *    *


    క్రీస్టినీ, రాబర్టు క్రీస్టినీ, మాంటే నాయకి పెళ్ళి జరిగిన మరుసటి రోజు ఉదయానికి పానమ్ లో వచ్చి ఇందిరాగాంధి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగారు.


                              *    *    *    *


    పెళ్ళిలో అందరూ సామంత్ ని మెచ్చుకోవడం, ఆ అందరి మధ్య మహారాజులా వెలిగిపోవడం, తాళికట్టగానే భార్య అయిపోయినట్లు నాయకిని ముద్దెట్టుకోవడం, తమను చూపి పోజ్ కొట్టడం లాంటివి ఆ నలుగురిలో అసూయ ద్వేషాల్ని రగులు కొల్పాయి.

 

    ఏదో ఒకటి చేసి సామంత్ ని తమ ముందు తల వంచుకొనేలా చేయందే నిద్రపట్టని స్థాయికి వాళ్ళు చేరుకున్నారు.

 

    సామంత్ కి గట్టిగా రిటార్టు ఇవ్వాలన్న పీటర్ ప్రపోజల్ ని మిగిలిన ఇద్దరితో పాటు అర్జున్ రావు కూడా సమర్ధించడంతో పీటర్ రెచ్చిపోయాడు.

 

    మరో అరగంటకి ఎలాంటి వారినైనా ఏకీలుకాకీలు విరవగల ఇద్దరు వీధి రౌడీల్ని పిలిపించాడు పీటర్. వాళ్ళ ఆకారాల్ని చూసి కనకారావు, సెక్రటరీ కంగారుపడిపోయారు.

 

    మరో ఐదు నిమిషాలకి వాళ్ళు ఎక్కిన కారు ఓబెరాయ్ హోటల్ కేసి దూసుకుపోయింది.

 

    అప్పుడు సమయం రాత్రి పదకొండున్నర గంటలు. కారులో తన వెంట తీసుకు వెళుతున్న ఇద్దరు రౌడీలకు సామంత్ ని ఏం చేయాలన్న విషయంలో సూచనలిచ్చాడు పీటర్.

 

    సరీగ్గా పావుగంటకు కారు ఓబెరాయ్ ముందాగింది. ఐదుగురు కారు దిగి, సెవెంత్ ఫ్లోర్ కి చేరుకొని 712 రూమ్ డోర్ ని నాక్ చేశారు.

 

    పీటర్ ఆ ఇద్దరు వ్యక్తులను సిద్ధం కమ్మన్నట్లు సంజ్ఞ చేశాడు.

 

    తలుపులు తెరుచుకున్నాయి.

 

    ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి పీటర్ షాక్ తిన్నాడు. ఆ వ్యక్తిని ఎప్పుడూ చూసినట్లు అనిపించలేదు. అతని వయసు సుమారు యాభై దాకా వుండవచ్చు. గుబురు మీసాలతో గంభీరంగా వున్నాడు. శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా వున్నాడు. కళ్ళు ఎర్రగా, నెత్తురు చిమ్ముతున్నట్లుగా వున్నాయి.

 

    ఒక్క క్షణం ఏం జరిగిందో అర్థం కాలేదు.

 

    ఇతనెవరు...? సామంత్ కి ఏమవుతాడు...?

 

    సామంత్ కి రక్షణగా వున్నాడా?

 

    క్షణాల్లో ఎన్నో అనుమానాలు చుట్టుముట్టాయి పీటర్ ని. కనకారావు పరిస్థితిని గమనించిన పీటర్ చెవిలో ఏదో చెప్పబోతుండగా ఆ రూమ్ గెస్ట్ ప్రశ్నించాడు-

 

    "ఎవరు కావాలి మీకు? ఎవరు మీరు?" అంటూ.

 

    "మేమెవరమో తరువాత చెబుతాం. ముందు వాడ్ని ఎక్కడ దాచావో చెప్పు. లేదంటే నీకీళ్ళు విరిచేయాల్సి వుంటుంది" పీటర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అన్నాడు.

 

    పీటర్ ఏం అన్నాడో ముందా వ్యక్తికి అర్థం కాలేదు.

 

    అర్థమయిన వెంటనే "మర్యాదగా మాట్లాడడం నీ ఒంటికి మంచిది ఎవరేమిటో... తెలుసుకొని మాట్లాడు. అర్థరాత్రి హోటల్ కొచ్చి గలభా సృష్టిస్తున్నావు. పెద్ద దాదాననుకున్నావా?" కోపంగా అన్నాడా వ్యక్తి.

 

    "అవును. అయితే ఏమిటి? ఏం చేస్తావు? అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వకపోతే దాదాగిరి చేయాల్సి వస్తుంది" అన్నాడు కనకారావు మెప్పుకోసం మధ్యలో కల్పించుకుంటూ.

 

    లాబీలోని లైట్లు గుడ్డిదీపాల్లా వెలుగుతున్నాయి.

 

    ఎయిర్ కండిషనర్స్ మెత్తగా రొద చేస్తున్న శబ్దం తప్ప మరే అలికిడీ లేదు ఆ చుట్టుప్రక్కల.

 

    712 రూమ్ అతిథి ఎవరో తెలుసుంటే పీటర్ బృందం అంత సాహసం చేసేది కాదు.

 

    సామంత్ ని ఏదో ఒకటి చేసి తమ గ్రిప్ లోకి తెచ్చుకోవాలన్న ఆతృతతో వచ్చిన వారికి వేరే వ్యక్తి కనిపించడంతో చిరాకేసి వెనకా ముందు చూసుకోకుండా తొందరపడిపోయారు. కనీసం ఆ రూమ్ లోకి తొంగి చూసినా అంత తొందరపడే వారు కాదు.

 

    "దాదాగిరి చేయడానికి వచ్చారా...? మాకు చాలా రోజుల నుంచి చేతులకు పనిలేక పిచ్చెక్కిపోతోంది. రండి, మీరు కావాలనుకొనే వ్యక్తి లోపల వున్నాడు" అంటూ పక్కకి తొలగి దారిచ్చాడా వ్యక్తి.

 

    ఇద్దరు రౌడీలు మరో ఆలోచన లేకుండా దూకుడుగా లోపలకు వెళ్ళిపోయారు.

 

    ఆ వెనుకే పీటర్, సెక్రెటరీ, కనకారావు వెళ్ళిపోయారు.

 

    సరీగ్గా అప్పుడు ఎదురు రూమ్ లోంచి బయటకు వచ్చాడు సామంత్.

 

    పది నిమిషాలు గడిచాయి.

 

    712 గది తలుపు తెరుచుకున్నాయి.

 

    పిండి బస్తాలను విసిరేసినట్లు వెళ్ళిన అయిదుగురిని ఒక్కొక్కర్ని లాబీలోకి విసిరేశారు ఆ గదిలో వున్న మిలటరీ వాళ్ళు.

 

    జరిగిందేమిటో ఆ ఐదుగురికి అప్పటికీ అర్థంకాలేదు కాని ఒళ్లంతా హూనమయిపోయింది.

 

    మరో వారం రోజుల దాకా లేచేందుకు, తిరిగేందుకు కూడా వీలు లేకుండా ఆ గదిలో వున్న ఆరుగురు మిలటరీ వాళ్ళు ఈ ఐదుగురిని కుళ్లబొడి చేశారు.

 

    ఐదుగురి మొఖాలు వాచిపోయి ఎర్రబడ్డాయి.

 

    బట్టలు చినిగిపోయి భయంకరంగా తయారయ్యారు.

 

    712 గది తలుపులు దఢేలుమణి మూసుకుపోయాయి. మూలుగుతూ వూపిరి పీల్చడం కూడా కష్టంగా వున్నవాళ్ళు చిన్నగా లేచేందుకు ప్రయత్నిస్తుండగా వినిపించాయి మాటలు.

 

    "మీ ఎత్తులు నాకు ముందే తెలుసు. మీ అంతరంగాల్ని ఆ మాత్రం ఊహించలేకపోతే ఇన్నాళ్ళు మీతో ఎలా నెగ్గుకొస్తాను?"

 

    ఐదుగురూ గిరుక్కున తలలు తప్పి మాటలు వినిపించిన వేపు చూశారు.

 

    అక్కడ సామంత్ నిలుచుని వున్నాడు నవ్వుతూ.

 

    వాళ్ళ మొఖాలు కాంతిహీనమై పోయాయి.

 

    "నాకిచ్చిన పదిలక్షలు తిరిగి వెనక్కి తీసుకొనే ఆలోచనలతోనే నువ్వు వీళ్ళను వెంటేసుకొచ్చావు. అర్జునరావుకి తెలీకుండా ఆ పదిలక్షలు నువ్వే కొట్టేద్దామని ఆలోచించి వుంటావు. అలా అని నేను వూహించాను. అందుకే రూమ్ ని మార్చాను. ఎదురు రూమ్ లో ఎందుకు దిగానో తెలుసా? మీరెలా భంగపడతారో చూద్దామని! ఇదంతా భయపడి చేయలేదు నేను. గోటితో పోయే మీకు గొడ్డలిలాంటి నేనెందుకు శ్రమపడటం అని..."