"మాట" అని పిలిచింది అందులో ఒకడ్ని చేత్తో పిలుస్తూ కొంచెం బెదిరినా దర్పం నటిస్తూ వెనక్కి తిరిగివచ్చాడు.
    
    "అతనెవరో తెలుసునా? నాకాబోయే మొగుడు" అని విసురుగా నడిచి ముందుకు వెళ్ళిపోయింది.
    
    తనకీ సుందరం బావకూ జరిగిన సంభాషణ ఆషామాషీగా జరగలేదనీ, పరిస్థితి తనతో నిమిత్తం లేకుండానే చాలాముందుకు వచ్చేసిందనీ మరునాడు గానీ గ్రహించలేకపోయింది. లక్ష్మీపతి మామయ్య ఊరినుంచి దిగటం, ఆ మధ్యాహ్నమే తాంబూలాల తంతు జరిగే సూచనలు పొడగట్టటం- గిరిజ నివ్వెరపోయింది.
    
    "బేబీ! నువ్వీవేళ కాలేజీకి వెళ్ళకు" అంది అనసూయమ్మగారు కూతురు గదిలో కూర్చుని తల దువ్వుకుంటూంటే దగ్గరకు వచ్చి.
    
    "ఏమ్మా?"
    
    "ఇంట్లో నిన్నటినుంచీ అనుకుంటుంటే ఏమమ్మా అని యింకా తెలియనట్లడుగుతావేమిటే? ఇవేళ మధ్యాహ్నం తాంబూలాలు."
    
    ఆ ఇంట్లో జరిగే గోల గిరిజకు కొంత తెలుసు, కొంత తెలియదు. పరిస్థితి పీకలమీదికి వస్తేగాని ప్రాముఖ్యం యివ్వని స్వభావం ఆమెది. మొదట్నుంఛీ అట్లా అలవాటయింది.
    
    "ఎవరికోసం యీ తాంబూలాలు?"
    
    "బాగుందే ఈ ధోరణి? గడుసుతనమనుకోనా? అమాయకత్వమనుకోనా? ప్రొద్దుటే మీ లక్ష్మిపతి మామయ్య వచ్చింది. దేనికనుకున్నావు? నీకూ సుందరం బావకూ పెళ్ళి తెలిసిందా?"
    
    గిరిజ జడ వేసుకోవటం పూర్తిచేసి "అని ఎవరన్నారు?" అంది కాళ్ళు మెల్లగా ఊగిస్తూ.
    
    అనసూయమ్మ కళ్ళు పెద్దవిచేసి కూతురికేసి చూసింది. "ఏమిటే నీ ధోరణి? ఎక్కడ్నుంచో దిగివచ్చినట్లు మాట్లాడుతున్నావేమిటి?" అంది ఆమెకెందుకో కూతురిముఖం, మాటలు కొత్తగా అనిపించాయి.
    
    "అవునమ్మా నాకూ, సుందరం బావకూ పెళ్ళని నాకు తెలీకుండా ముందు మీ అందరకూ ఎలా తెలిసింది?"
    
    అనసూయమ్మగారి అహం దెబ్బతిన్నట్లయింది. "పెద్దవాళ్ళం కాబట్టి, ఇలాంటి విషయాలు ముందుగా మాకు తెలియటమేకాదు, మా దగ్గర్నుంచే వస్తాయసలు" అంది గట్టిగా.
    
    "కాని చేసుకునేది మేముగా."
    
    "చేసేది మేము. ఈ పిచ్చి పిచ్చి వేషాలు కట్టిపెట్టి నోరుమూసుకుని చెప్పినట్లు చెయ్యి" అని అక్కడ్నుంచి వెళ్ళిపోతూ" అందుకే ఆడపిల్లలకు కాలేజీ చదువు వద్దంటే విన్నారు కాదు. మాటకుమాట చెప్పటం, అతితెలివిగా మాట్లాడటం, పెద్దవాళ్ళని ప్రశ్నించటం, బాగుంది వరస" అంటూ తనలోతాను గొణుక్కోవటం గిరిజకు వినిపించింది.
    
    అనసూయమ్మగారిది చిత్రమైన ప్రవృత్తి ఆవిడకు సంప్రదాయంపట్లా, వంశప్రతిష్టపట్లా కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. వ్యక్తిత్వం, కొత్త ఆలోచనలు వీటిపట్ల ఆమెకేమాత్రం సదభిప్రాయం లేదు. ఆమెదృష్టిలో పెద్దలంటే పెద్దలే. పిల్లలంటే పిల్లలే. ఆమెలో నిష్కపటం, నిక్కచ్చితనం రెండూ పుష్కలంగా వున్నాయి. ఇంటికి దగ్గర బంధువులుగాని, దూరపుచుట్టాలు గాని ఎవరొచ్చినా ఆధారంగా అభిమానిస్తుంది. నచ్చని పనిచేస్తే దులిపేస్తుంది. అత్తగారుకదా అని కోడళ్ళమీద అజమాయిషీ చెయ్యదు. గారాబంచేసి నెత్తి కెక్కించుకోదు తనపనీ, యితరులపనీ అని భేదం పాటించకుండా చేసుకుంటూ పోవటం, నిత్యం జరిగే కార్యక్రమాలకు విఘ్నం కలగకుండా చూడటం ఆమె ధ్యేయం.
    
    కాసేపటికి గిరిజ క్రిందికి దిగి వచ్చేసరికి "యిదిగో కోడలుపిల్లా" అంటూ యశోదత్తయ్య ఏదో పరాచికాలాడటం ఒక్క చిన్నవదిన మినహాయించి మిగతావాళ్ళంతా తనకూ, సుందరంబావకూ పెళ్ళయినట్టే మాట్లాడటం చూసి తనెక్కడుందో, ఏంచెయ్యాలో తేల్చుకోలేకపోయింది. పెరట్లోకి వెడుతూంటే స్నానంచేసి వస్తూ సుందరం కనిపించాడు. అనుకోకుండా అతని ముఖంలోకి చూసేసరికి నాలిక బయటపెట్టి వెక్కిరించాడు.
    
    మధ్యాహ్నం గదిలో మంచంమీద బోర్లాపడుకుని తనతో నిమిత్తం లేకుండా, తన జీవితానికి సంబంధించిన సంఘటన ఎలా విరుచుకుపడిపోతున్నదో ఆలోచించుకుంటూంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కొంతమంది అసమర్ధులమని తెలుసుకోకుండానే అసమర్ధుల్లా గడిపేస్తారు. తన చేతుల్లో తను ఎంత లేదో, తను ఎంత ఏమి చెయ్యలేదో ఆమెకు తెలిసివచ్చింది.
    
    రానురాను దిగులెక్కువైపోతుంది. గుండెలో భరించలేనంత బరువుగా వుంది.
    
    తలగడలో ముఖం దాచుకుని వెక్కివెక్కి ఏడ్చేస్తుంది.
    
    చాలాసేపటికి పుండరీకాక్షయ్యగారు "బేబి" అంటూ లోపలకు వచ్చేసరికి ఉలిక్కిపడింది.
    
    "ఇంకా పడుకుని వున్నావేమ్మా" అంటూ దగ్గరకొచ్చారాయన.
    
    గిరిజ ముఖం కనిపించకుండా మరింత దాచుకుని అటువైపు జరిగి పడుకుంది.
    
    ఆయనకేదో అనుమానం కలిగింది. 'బేబి' అంటూ దగ్గరకొచ్చాడు.
    
    "ఛీ! ఏడుస్తున్నావా?"
    
    మంచంమీద కూర్చుని వీపుమీద చెయ్యివేసి ప్రేమగా నిమురుతున్నాడు.
    
    "బేబి! ఇటు చూడమ్మా ఎందుకా ఏడుపు?"
    
    బలవంతంగా ఆమెముఖం తనవైపు త్రిప్పుకున్నారు.
    
    "ఎలా అయిపోయావో చూడు ఏం జరిగింది? ఎవరైనా ఏమైనా అన్నారా?"
    
    గిరిజది చాలా సున్నితమైన మనస్తత్వమనీ, చాలామంది బాధపడని విషయాలకు ఆమె చాలా బాధపడిపోతుందని, చాలామందికి అనిపించనివి ఆమెకు అనిపిస్తాయని ఆయనకు తెలుసు.
    
    చాలాసేపు బుజ్జగించగా, బుజ్జగించగా చివరికామె గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని "నాన్నా ఈ పెళ్ళీ..." అనగలిగింది.