"మైడియర్ ఫ్రెండ్స్....నేనే అంటే అది చేసే మనిషిని-మిమ్మల్ని సంతృప్తి పరచడం నా ప్రధమ లక్ష్యం -మీ అందరి దగ్గరకు ఒక్కో సూట్కేసు వస్తుంది...ఆ సూట్కేసులో ఏవుందో చూసుకొని నాతో మాట్లాడండి" ఆయన చెప్పి కూర్చున్నాక-
    
    లోన్నించి మనుషులు అక్కడ కూర్చున్న ప్రజాప్రతినిధులందరికీ ఒక్కొక్క సూట్ కేసును అందజేశారు. ఆ సూట్ కేసులు వెంటనే ఓపెన్ అయ్యాయి. అందులో పది లక్షల కాష్... వరసగా అయిదు వందల నోట్లు పేర్చబడి ఉన్నాయి. ఆ పైన ఆ డాక్యుమెంట్ ఉంది. అది జూబ్లీహిల్స్ లోని ఓ లాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్...
    
    ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి ఒక్కొక్క ఎకరం- ఎకరం ఖరీదు అక్షరాలా కోటి రూపాయలు...
    
    తన దగ్గర ఆ లాండ్ ను కొనుక్కున్నట్లుగా ధృవీకరణ పత్రంలో ఆ లాండ్ స్వంతదారుడి సంతకం ఉంది.
    
    సి.ఎమ్ గా ఒక వ్యక్తికి కేవలం మద్దతు తెలపడానికి, పాత సి.ఎం.ని సీట్లోంచి లాగెయ్యడానికి రాజకీయం కట్టిన ప్రస్తుత విలువ కోటీ పదిలక్షలు......
    
    అందరి ముఖాలూ అఖండ జ్యోతుల్లా వెలిగిపోయాయి....
    
    సరిగ్గా అదే సమయంలో-
    
    హైద్రాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఓ ముస్లిం ప్రజాప్రతినిధి లేచి నిలబడి "అయ్యా జనార్ధన్ ఠాగూర్ గారూ-మీరు మమ్మల్ని పూర్తిగా సంతృప్తి పరిచారు.....షుక్రియా.... సి.ఎం. అయ్యాక కూడా మీరు మమ్మల్ని సంతృప్తి పరుస్తారన్న నమ్మకం మాకు ఏర్పడింది.... కేష్ విషయంలో మాకు డౌటు లేదు.... కానీ ఆ లాండ్ విషయంలో మాకు సందేహం ఉంది....
    
    మరిప్పుడు, ఏ లాండ్ అయితేమాకు ఇస్తున్నారో ఆ లాండ్ నిజాం వంశీకులది-వందేళ్ళ క్రితం మొత్తం వెయ్యి ఎకరాల ఆ లాండ్ లో ఒక రాజప్రసాదం ఉండేది- అది కాలగర్భంలో కలిసి పోయింది - ఇప్పుడు పుట్టలు, గుట్టల్కుగా మిగిలినా, ఆ వంశీకులు మాత్రం దుబాయ్ లో ఉన్నారని మా తండ్రుల ద్వారా మాకు తెలుసు-ఆ లాండ్ ను గవర్నమెంట్  కూడా స్వాధీనం చేసుకోలేక పోయింది. అలాంటి లాండ్ ను ఫ్లాట్స్ గా మీరు మాకివ్వడం చాలా సంతోషం.....కాని ఆ ల్యాండ్ మీ స్వంతం ఎప్పుడైందో మాకు తెలియాలి..."
    
    జనార్ధన్ ఠాగూర్ భూకబ్జాల వ్యవహారం గురించి, పూర్తిగా తెల్సిన ఆ ప్రజా ప్రతినిధి అలా అడుగుతాడని, అలాంటి కీలకమైన ప్రశ్న వేస్తాడని జనార్ధన్ ఠాగూర్ ఊహించలేదు. ఏ ప్రశ్న అయితే, తలెత్తకూడదని అనుకున్నాడో, ఆ ప్రశ్న తలెత్తింది!
    
    కంగారుగా రమేష్ చంద్ర వేపు చూసాడు! తొట్రుపాటు నుంచి బయటపడి జవాబు చెప్పడం ప్రారంభించాడు.
    
    "డియర్ ఫ్రెండ్.... మీరు విన్నదీ, అన్నదీ నిజమే.... నిజమే ఒకప్పుడు వెయ్యి ఎకరాల లాండ్..... ఇప్పుడు నాలుగువందల ఎకరాలకు మిగిలింది.....ఆ లాండ్ కు చెందిన నిజాం వారసులు, స్వాతంత్ర్యానికి పూర్వమే దుబాయ్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం దాని వారసులెవరూ లేరు ఒక్కరంటే ఒక్కరు తప్ప..."
    
    "ఆ విషయం మీకెలా తెల్సు..." వెంటనే ఒకాయన ప్రశ్నించాడు.
    
    "తెల్సుకున్నాను కాబట్టి.... తెల్సింది.... ఆ లాండ్ ప్రస్తుతం మహమ్మద్ పాషా అనేవ్యక్తి అధీనంలో ఉంది. ఆ లాండ్ కి సంబంధించి మిగిలిన వారసుడు పాషా ఒక్కరే. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ నే కాదు, ఆ వ్యక్తిని కూడా మీరు చూడొచ్చు.... కానీ ఆయనతో మీరు మాట్లాడటం మాత్రం కుదరదు....."
    
    అని ఆ పక్కనే ఉన్న డోర్ వేపు చూసాడు జనార్ధన్ ఠాగూర్.
    
    వీల్ చైర్లో కూర్చున్న ఓ వ్యక్తిని తోసుకుంటూ ఒక వ్యక్తి వచ్చాడు.
    
    వీల్ చైర్లో కూర్చున్న వ్యక్తికి దాదాపు 90 ఏళ్ళుంటాయి.
    
    తెల్లగా జుత్తు-మెరిసిపోతున్న శరీరం - ఆ శరీరాన్ని చూడగానే, అనారోగ్యంతో తీవ్రంగా ఆయన బాధపడుతున్నాడని తెలిసిపోతుంది ఎవరికైనా, షోకేస్ లో బొమ్మని చూసినట్టుగా అందరూ ఆశ్చర్యంగా ఆయన వేపు చూసారు.
    
    అదే సమయంలో, రమేష్ చంద్ర ఓ ఫైలుని జనార్ధన్ కు అందించాడు.
    
    జనార్ధన్ ఆ ఫైలుని ఓపెన్ చేసి, అందరికీ ఆ డాక్యుమెంట్ ను చూపిస్తూ-    

    "ఇదే ఒరిజినల్ డాక్యుమెంట్.....మీకేమాత్రం సందేహం అక్కర్లేదు.....ఈ విషయం పాషా చేతకూడా నేను ధృవీకరిస్తాను" అని చెప్పి-
    
    "పాషాజీ.... నిజాం నవాబు వారసుల దగ్గర, మీ పూర్వులు సలహా దారులుగా పనిచేసే వారు కదూ...." ఉర్దూలో అడిగాడు జనార్ధన్ ఠాగూర్. నెమ్మదిగా పెదవి విప్పాడు పాషా.
    
    "జీ..."
    
    "ప్రస్తుతం ఈ ల్యాండ్ మీకు అలాగే వచ్చింది కదూ....."
    
    "జీ సాబ్..."
    
    "ఈ ల్యాండ్ ను మీరు నాకు అమ్మేసారు కదూ...."
    
    "జీ సాబ్...."
    
    "ఈ ల్యాండ్ మీద ఇకపై అన్ని హక్కులూ నావే కదూ...."
    
    "జీ సాబ్...."
    
    "షుక్రియా పాషాజీ... షుక్రియా" జనార్ధన్ ఠాగూర్ నోటివెంట ఆ మాతరాగానే ఆ వీల్ చైర్ ని లోపలికి తీసుకుపోయారు.
    
    ప్రజాప్రతినిధుల కళ్ళల్లో నమ్మకం ప్రస్ఫుటంగా కనిపించింది. అది కోటిరూపాయల పదిలక్షల ఆనందం!
    
    అసెంబ్లీలో సి.ఎం పదవికి ఖరీదు కట్టిన రాజకీయ విశృంఖల రూపం మరో అరగంటలో అవిశ్వాస తీర్మానం ఎప్పుడు పెట్టాలో, ఎప్పుడు స్పీకర్ కు నోటీసు అందజేయాలో నిర్ణయమైపోయింది. అందరూ ఆనందంతో జనార్ధన్ ఠాగూర్ ఇంటి నుంచి తిరుగుముఖం పట్టారు.... అప్పుడు-
    
    అక్కడ జనార్ధన్ ఠాగూర్ గబగబా వెనక రూమ్ లో కెళ్ళాడు.
    
    ఆ రూమ్ లో-
    
    మహమ్మద్ పాషా.... జనార్ధన్ ని చూడగానే పాషాలేచి నిలబడ్డాడు నెమ్మదిగా. పక్కనే ఉన్న రమేష్ చంద్ర వేపు చూసాడు జనార్ధన్-రమేష్ చంద్ర సూట్ కేస్ లోంచి పదివేల రూపాయల నోట్ల కట్టని తీసి పాషా చేతిలో పెట్టాడు.
    
    "చూడు పాషా... ఆ లాండ్ స్వంతదారుడిగా నటించినందుకు, ఇన్నాళ్ళూ నీకేం కావాలో అన్నీ ఇచ్చాను - ఇవాల్టితో నీ అవసరం నాకు తీరిపోయినా నీ రుణం నేనుంచుకోను.... తీసుకో.... నీ కెప్పుడు ఏ అవసరం కావాలన్నా నా దగ్గరకు రా..... యధావిధిగా నీకు ప్రతిరోజూ నీ మందూ, విందూ నీ ఇంటి కొచ్చేస్తాయి..... నువ్వు ఎన్నాళ్ళో బ్రతకవు..... నీ శవాన్ని పాదుషా శవంలా అలంకరించి ఖననం చేస్తాను...." ఒకప్పుడు బాగా బతికిన ఆ పూర్ ముస్లిమ్ ని ఇన్నాళ్ళూ ఆ లాండ్ ఒనరుగా చిత్రించి, అతని పేరున దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, ఆఖరికి తన పనిని నెరవేర్చుకున్నాడు జనార్ధన్. అందుకే ఇలాంటి వాటిలో ఆరితేరినవాడు కాబట్టే అతను భూకబ్జా జనార్ధన్ ఠాగూర్.
    
    మరో పావుగంట తర్వాత.....