మరో ఇరవై నిమిషాల తర్వాత రెడ్ కలర్ మారుతీ హోటల్ అశోకా కాంపౌండులో ప్రవేశించింది.
    
    కారు దిగి అటూఇటూ చూసి, ఆ షాపువేపు నడిచాడు బబ్లూ.
    
    షాపులో సేల్స్ మేన్ ఉన్నాడు.
    
    "జపాన్ లైటర్ విత్ నైఫ్.....ఉందా?"
    
    "నో స్టాక్ సార్.....రెండురోజుల క్రితం మీరే అది కొన్నారు కదా సర్...." గతుక్కుమన్నాడు బబ్లూ సేల్స్ మేన్ మాటలకు-జ్ఞాపకశక్తికి.
    
    "సడన్ గా రిపేర్ వచ్చింది. రిపేర్ కోసం ఓ ఫ్రెండ్ కిచ్చి మీ దగ్గరకు పంపాను....."
    
    "ఇక్కడ రిపేర్ సర్వీస్ లేదు..... జపాన్ లైటర్సు రిపేరు చేసినా పనిచెయ్యవు సార్..... అందుకే నైఫ్ ని యాడ్ చేసింది - నైఫ్ అయినా ఉపయోగపడుతుంది కదా....?" చాలా క్యాజువల్ గా అన్నాడు ఆ సేల్స్ మేన్.
    
    "అలాంటివి ఇంకెక్కడైనా దొరుకుతాయా...." దొరకాలని కోరుకుంటూ అడిగాడు బబ్లూ.
    
    "నో.....సర్....."ఓల్డ్ మోడల్ అది...." ఆ జవాబు విని, ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు.
    
    అప్పుడే అతని దృష్టి మిర్రర్ మీద పడింది....
    
    ఆ మిర్రర్ లో అశోకా మెయిన్ గేట్ పక్కన, రోడ్ మీద హేండ్ స్టిక్ పట్టుకుని నడిచెల్తున్న వ్యక్తి మిర్రర్ లో అస్పష్టంగా చూసి తల తిప్పాడు బబ్లూ.
    
    అప్పటికే ఆ వ్యక్తి గేటుదాటి ముందు కెళ్ళిపోయాడు.
    
    బబ్లూ-
    
    గబగబా వెనక్కి పరుగెత్తుకొని రోడ్డుమీదకొచ్చాడు.....
    
    అప్పుడే సెంట్రల్ కోర్ట్ హోటల్లోకి అడుగుపెట్టాడతను- హోటల్ గేటువరకూ గబగబా నడిచాడు బబ్లూ.
    
    నెమ్మదిగా మెట్లెక్కి లోనికి అడుగుపెట్టాడు ఆ వ్యక్తి.
    
    ఆ వ్యక్తి నిరంజనరావు.....
    
    "మిస్టర్ నిరంజనరావు దొరికిపోయావ్....." కసిగా అనుకున్నాడు బబ్లూ.
    
    చేతి వాచీ వేపు చూసుకున్నాడు.
    
    సరిగ్గా సాయంత్రం ఆరుగంటలైంది.
    
    సరిగ్గా ఏడు గంటలకు హోటల్ సెంట్రల్ కోర్ట్ లో థర్డ్ ఫ్లోర్లో.....మొదటి రూమ్ లో మారుపేరుతో ఉన్నాడు బబ్లూ.
    
    అదే వరసలో ఆఖరి రూమ్ లో ఉన్నాడు నిరంజనరావు.
    
                                                       *    *    *    *    *
    
    ప్రెస్ విజిటర్స్ రూమ్....
    
    "గోవా ఎందుకెళ్ళావ్....?" అడిగింది ఊహ.
    
    ఆమె అడుగుతున్న మాటల్ని వినడంలేదు సూర్యవంశీ-ఆమె అందంవేపు ఆరాధనగా చూస్తున్నాడు.
    
    "ఒక రెస్పాన్స్ బులిటీని టేకప్ చేశాను- నీకు రెండు, మూడు సార్లు బెంగుళూరుకు ఫోన్ చేసాను...." అన్నాడతను ఒకింత సేపటికి.
    
    "నేన్నమ్మను...." వెంటనే అలకగా అంది ఊహ.
    
    "ఇది చదువు...."
    
    ఊహకు బబ్లూ చేసిన హెచ్చరిక అది. ఒక్కొక్కలైనూ చదువుతున్నకొద్దీ సూర్యవంశీ కళ్ళు ఎరుపెక్కుతున్నాయి.
    
    "ఎనిమీ...." పళ్ళు పట పట కొరికాడు సూర్యవంశీ.
    
    "ఉస్మానియా హాస్పిటల్లో బాంబ్ బ్లాస్ట్.... విన్నావా..... రబ్ జానీ దారుణంగా చనిపోయాడు...." జాలిగా అంది ఊహ.
    
    "లేదు....చంపబడ్డాడు.....అంబులెన్స్ కూడా మాడి మసైపోయింది......మర్డరర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు...." కాసేపు కళ్ళు మూసుకుని, "నిరంజనరావు వైజాగ్ లో లేరు..... ఇక్కడికే వచ్చారని నా అనుమానం,...." ఆ మాటకు ఆశ్చర్యపడింది ఊహ...
    
    "నాకు ఆయన గోవాకి ఫోన్ చేసి, షీలా గురించి అడిగాడు..... మర్నాడే షీలా చచ్చిపోయింది.... ఆ తర్వాత ఓల్డ్ సిటీలోని ఓ ముస్లిం హత్యకు గురయ్యాడు.....సిటీలో ఈ మర్డర్స్, యాదృచ్చికంగా జరిగినవా లేదా మోటివ్ ఏదైనా ఉందో తేల్చుకోవాలి....ఇందుకు ముందుగా నిరంజనరావు ఎక్కడున్నాడో కనుక్కోవాలి...."
    
    అతను చెప్తున్న మాటల్ని విస్మయంగా వింటోంది ఊహ.
    
    "రేపొకసారి మనం రబ్ జానీ ఇంటికెళ్ళాలి. అతని భార్యను ఓదార్చాలి."
    
    "కొన్నాళ్ళపాటు రబ్ జానీ భార్య గౌసియా మాఇంట్లో పని చేసింది...." చెప్పింది ఊహ.
    
    ప్రెస్ లోంచి ఇద్దరూ బయటకు వచ్చారు- హీరో హోండా స్టార్ట్ చేసాడు సూర్యవంశీ.
    
    ఊహను రూమ్ దగ్గర డ్రాప్ చేసి-
    
    "ఎప్పుడు అవసరమొచ్చినా నాకు ఫోన్ చెయ్యి.....టెన్నోక్లాక్ కి లకడీకాపూల్ ద్వారకాలో కలుద్దాం...."
    
    "అవసరమైతే నేను నీ రూమ్ కి షిఫ్టయిపోతాను...." అంది ఊహ.
    
    వెంటనే బదులివ్వలేదు సూర్యవంశీ.
    
    ప్రస్తుతం తన రూమ్ లో అర్పణ ఉంటోంది!
    
    "ఏం జవాబు చెప్పవ్....." అడిగింది ఊహ.
    
    "నువ్వు పిరికిదానివని నేననుకోలేదు....."
    
    ఆ మాటలకు విస్తుపోయింది ఊహ.
    
    "గుడ్ నైట్...." చటుక్కున చెప్పి వెనక్కి తిరిగిందామె.
    
                                                      *    *    *    *    *
    
    రాత్రి ఒంటిగంట దాటింది.
    
    మెయిన్ రోడ్ మీద సందడి తగ్గింది.....సెంట్రల్ కోర్ట్ హోటల్లో.....ఒక్కొక్క రూమ్ లోనూ పూర్తిగా చీకటి పరుచుకుంటోంది.
    
    అప్పటికే రెండుసార్లు అతని రూమ్ లోంచి బయటికొచ్చి, కారిడార్లో తచ్చాడాడు.
    
    ఎవరూ లేరు.....ఎక్కడా ఏ మనిషి అలికిడీ లేదు.
    
    ముందు జాగ్రత్త చర్యగా, కారిడార్లోని లైట్లన్నిటినీ ఆర్పేసాడు.....
    
    థర్డ్ ఫ్లోరంతా....చీకటి.....గాడాంధకారం....
    
    చప్పున ఆ టైమ్ లోనే ఆ చివర రూమ్ లో ఉన్న నిరంజనరావుకి మెలుకువ వచ్చింది.
    
    బబ్లూ ఒక్కొక్కలైట్ స్విచ్ ను ప్రెస్ చేస్తున్నపుదు, ఆ సున్నిత శబ్దాన్ని అతని శ్రవణేంద్రియాలు గ్రహిస్తున్నాయి.