"ఏంటండీ దిగిపోవడం..... ఇది బోటుకాదు. పవర్ ఫుల్ సీటు......రాజకీయాలన్నాక, లక్షా తొంభై వుంటాయ్. ప్రతిదానికీ బెదిరిపోతే ఎలాగండీ. హైద్రాబాద్ లో భూములన్నీ నేనే ఆక్రమిస్తున్నానా? భూకబ్జాలు నాతోనే మొదలయ్యాయి?
    
    రాష్ట్రం మొత్తంమీదే - ఆ మాటకొస్తే దేశం మొత్తంమీదే భూకబ్జాలు ఎక్కువగా జరుగుతున్నది హైదరాబాదులోనే.
    
    దక్షిణ భారతదేశంలోనే అతిఖరీదయిన, అతి పెద్దదయిన జుబిలీ హిల్స్ కోపరేటివ్ సొసైటీ హైదరాబాద్ లో ఉంది.
    
    ఆ సొసైటీకి 1167 ఎకరాలు కేటాయించింది ప్రభుత్వం... ఎందుకంత స్థలం కేటాయించింది? అర్భన్ లాండ్ సీలింగ్ ప్రకారం ఒక వ్యక్తికి నగరాల్లో పన్నెండొందల గజాలకు మించి ఖాళీస్థలం ఉండకూడదు ఆ చట్టం చేసిందెవరు? ప్రభుత్వమే!
    
    మరా ప్రభుత్వాలే ఆ సొసైటీలో పదిహేడొందలు, పద్దెనిమిది వందల గజాల ప్లాట్స్ చేసి ఆ సొసైటీ మెంబర్స్ కి ఎలాట్ చేస్తే, అర్బన్ లాండ్ సీలింగ్ చట్టం ఏం చేస్తోంది? గత ప్రభుత్వాలు ఏం చేశాయి?
    
    జూబ్లీహిల్స్ సొసైటీకి కేటాయించిన 1167 ఎకరాల్లో రోడ్లకు, స్కూల్ కి పార్క్ లకి, గ్రీన్ బెల్ట్ ఏరియాక్రింద 474.06 ఎకరాలు కేటాయించారు.
    
    లే అవుట్ నియమావళి ప్రకారం ఏ సొసైటీ అయినా 40 శాతం స్థలం హరిత ప్రాంతానికి కేటాయించాలి.
    
    జూబ్లీహిల్స్ సొసైటీకి లేఅవుట్ పర్మిషన్ సంపాదించటానికి హరిత ప్రాంతానికి 40.61 శాతం కేటాయించింది అంతవరకు బాగానేఉంది.
    
    ఇప్పుడెళ్ళి ఆ సొసైటీని చూడండి - ఎన్ని పార్కులున్నాయో-గ్రీన్ బెల్ట్ ఏరియాకి ఎంత స్థలం కేటాయించారో మీకే అర్ధమవుతుంది. ఇక్కడకూడా సింగిల్ పార్క్ లేదు. లేఅవుట్ అప్రూవల్ అయ్యేవరకూ 40 శాతం కేటాయించటం - ఆ తరువాత ఆ 40 శాతం స్థలాన్ని కూడా ప్లాట్స్ చేసి అమ్ముకోవటం ఇది మీకు తెలీదా? అది గ్రాబింగ్ కాదా? అది తప్పుకాదా?
    
    జూబ్లీహిల్స్ సొసైటీ ఫస్ట్ అప్రువల్ లో లేఅవుట్ ని దగ్గర పెట్టుకొని ఇప్పుడు మీరే ప్రత్యక్షంగా వెళ్ళి చూడండి-
    
    కొందరు పై అధికార్లు తప్పుపట్టినా పురపాలక శాఖవారు లేఅవుట్ ను ఎలా అప్రువల్ చేశారు? అలా చేసింది నేనా? నా మనుషులా?
    
    ఆ సొసైటీలో లబ్ది పొందినవారిలో ఎవరున్నారో తెలుసా? పెద్ద పెద్ద అధికార్లు, ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. అధికార్లు, మాజీమంత్రులు, మాజీ ఎమ్.ఎల్.ఏలు - రాజకీయ నాయకులూ - అంగబలం - అర్ధబలం ఉన్న ఘరానా మనుష్యులు-
    
    ఆ సొసైటీ అనేముందు - హైదరాబాద్ లోని మిగతా కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలకు నిజాయితీ పరులైన రెవెన్యూ అధికారుల్ని పంపి చూడండి- చట్టప్రకారం పార్కులున్నాయేమో? రోడ్లున్నాయేమో? గ్రీన్ బెల్ట్ ఏరియా ఉందేమో?
    
    మున్సిపల్ అధికారులకు సదరు సొసైటీలలో ఫ్రీగా ఒక ఫ్లాటు ఇస్తే-అంతకుమునుపు పార్కుకింద నిర్దారించి, ఆమోదముద్ర వేసిన స్థలాల్నే ఫ్లాట్స్ క్రింద మార్చుకోటానికి దొంగచాటుగా అంగీకరిస్తున్నారు.
    
    వీటినేమంటారు? భూకబ్జా ఆసరా?
    
    సభా సంఘం సిఫార్సు చేసినా నిజాం ఆస్తుల రక్షణలో మన ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ద తీసుకుంటున్నాయి?
    
    సామాన్యుల గోడుని ప్రభుత్వాలు ఎలాగూ పట్టించుకోవు - కనీసం ఎంతో గౌరవప్రదమైన సభాసంఘం సిఫార్సుల్నయినా పట్టించుకుంటున్నారా?
    
    ప్రభుత్వం అధీనంలో ఉన్న నిజాం ఆస్తులు అక్రమ నిర్మాణాలపై ఏర్పాటయిన సభాసంఘం మద్యంతర నివేదిక సమర్పించి పది నెలలు కావస్తున్నా మీరెందుకు చర్య తీసుకోలేదు....?
    
    హైదరాబాద్ ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించటం గురించి ప్రగల్భాలు పలికే మనం వేలకు వేల గజాలు అసాంఘిక శక్తుల పరమవుతుంటే మనమేం చేయగలుగుతున్నాం....?
    
    ప్రభుత్వాలు - రాజకీయ రంగంలో ఉన్న పెద్దల ఆశీర్వాదాలతో ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి.
    
    రౌడీలను, గూండాలను ఉపయోగించి ఎందరో ఎమ్.ఎల్.ఏ.లు, మంత్రులు, అధికారులు భూకబ్జా చేయిస్తూనే ఉన్నారు. అయినా ఏం చేయగలుగుతున్నాం?

    ఒక మంత్రి అధ్యక్షతన ఏర్పడిన శాసనసభా సంఘంకూడా తన మధ్యంతర నివేదికలో నగరంలో జరుగుతున్న భూకుంభకోణాలపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
    
    అయినా ఏం చేశాం మనం?
    
    కోట్లు ఖరీదుచేసే కింగ్ కోఠి ప్యాలెస్ స్థలం కబ్జాపాలు కాలేదా? అదీ నేనే చేశానా?
    
    జీబాబాగ్ తో ఉన్న 55,968 చదరపు మీటర్ల మిగులు భూమి మిరాజో సహకార సంఘం ఆక్రమణలో ఉందని మనందరికీ తెలుసు-అయినా ఏం చేశాం?
    
    ఫలక్ నూమా ప్యాలస్ స్థలంలో 1,48,404 చదరపుమీటర్లు స్థలం ఆక్రమణకు గురయిందని కూడా మనకు తెలుసు-అయినా ఏం చేయగలిగాం?
    
    ప్రజల సౌకర్యార్ధం నగరంలో పలుప్రాంతాల్లో నగర పాలకసంస్థ నిర్మించిన మూత్రశాలలు కబ్జాలకు గురయిపోతున్నాయి-వాటి స్థానాల్లో షాపులు-ఇళ్ళు పుట్టుకొస్తున్నాయి-అది తెలిసినా మున్సిపల్ కార్పోరేషన్ సిబ్బంది చర్య తీసుకుంటోందా? లేదు.
    
    అలా చర్యతీసుకోని మున్సిపల్ సిబ్బందిమీద మన మంత్రివర్గం చర్య తీసుకుంటోందా? లేదు ఎందుకని? నగర సరిహద్దుల్లో ఉన్న కోహెడ్ గ్రామంలో 589 సర్వే నెంబర్ లు పేద ప్రజలకు ప్రభుత్వం స్థలాలు కేటాయిస్తే - ఆ స్థలాల్ని సంఘీ ఇండస్ట్రీవాళ్ళు అక్రమంగా ఆక్రమించుకుంటే మనమేం చేయలేకపోయాం.
    
    ప్రతిపక్ష నాయకుడొకరు సంఘీ యాజమాన్యంతో పోరాటానికి దిగితే తప్ప-ఆ స్థలాలు పేద ప్రజల స్వంతం కాలేదు.
    
    మల్లేపల్లి సమీపాన ఉన్న శ్రీగ్రౌండ్ ఆటస్థలం భూకబ్జా దారుల పాలయిపోతుంటే ప్రముఖ దినపత్రిక ఈనాడు దానిమీద న్యూస్ స్టోరీ రాయటంతో అధికారుల్లో చలనంవచ్చి ఏదో కొద్దిగా చర్య తీసుకున్నారు.
    
    ప్రజల అదృష్టం బావుండి జూబిలీహిల్స్ లోని మూడువందల యాభయ్ ఎకరాల చిరాన్ ప్యాలస్ మాత్రం భూకబ్జాకి గురికాకుండా జాతీయ పార్కుగా మార్చబడింది. అదీ భూకబ్జాకి గురయ్యేదే - మన రాజకీయ నాయకులే దాన్నికూడా నమిలిమింగేసేవారే! ప్రజలు చెప్పులు తెచ్చుకొని కొడతారని ఆగిపోయారు. నగర శివార్లు, ఖాళీస్థలాల్లో భారీ ఎత్తున మొక్కల పెంపకంకోసం నెదర్లాండ్ దేశం అందివ్వబోయే కోట్లాదిరూపాయలు నిజంగానే సదరు పనికి ఉపయోగించ బడతాయా? ఆ గ్యారంటీ మీరివ్వగలరా?