"ఆ పని నువ్వు చెయ్యాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... నువ్వు ఎక్కడ ఏ క్షణంలో బయటపడినా... ఆ ఎఫెక్టు ఎవరి కెరీర్ మీద పడుతుందో నీకు తెలుసు...." హెచ్చరించాడాయన.
    
    "డోన్ట్ వర్రీ.... ఎబౌట్ మీ... అయామ్ ఎ ఇంటెలిజెంట్ ప్లానర్... నో వన్ కెన్ స్టాప్ మీ..." కాన్ఫిడెంట్ గా అన్నాడు బబ్లూ.
    
    "బట్... ఎనీ క్రిమినల్.... తను చేసే నేరం విషయంలోనే కాదు.... తన విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి...
    
    "అంటే..." ప్రతి క్షణం ఎన్నో జాగ్రత్తలు తీసుకునే బబ్లూ ఆశ్చర్యంగా అడిగాడు.
    
    "నీ పళ్ళు... ఆ పళ్ళ మధ్యలోనున్న స్టీల్ రాడ్.... నిన్ను ఎప్పుడైనా ఎవరైనా గుర్తుపట్టే పాయింట్.... నీ స్టీల్ రాడ్ క్రిమినల్స్ కి స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్స్ ఉండకూడదు. ఉన్నా వాటిని తొలగించేసుకోవాలి. క్రిమినల్ ఎప్పుడూ అతి సాదాగా - సీదాగా - సాధారణంగానే కనిపించాలి. అలాగే నీ రూపురేఖలు..." లైటర్ తో రోత్ మేన్స్ సిగరెట్ వెలిగించి మెల్లగా నవ్వాడు.
    
    "ఈ పాయింట్ నేనూ ఆలోచించాను కాని అంత అవసరమా?"
    
    "చాలా అవసరం... నీకున్న ఐ.క్యూ. 185 అనుకో... నీ మీద కన్నేసేవాడు ఐ.క్యూ. 195 అనుకో... ఎప్పుడో ఒకప్పుడు నువ్వు దొరికిపోతావ్... ఏ పనైనా చెయ్యాలంటే - ముఖ్యంగా క్రైమ్స్-అవతలివాడి ఐ.క్యూ.ని అంచనా వేసుకుని చెయ్యాలి-" క్లుప్తంగా చెప్పాడు యాభై అయిదేళ్ళ వ్యక్తి.
    
    "నన్నిపుడేం చెయ్యమంటావ్..." అడిగాడు బబ్లూ.
    
    "నేనప్పగించిన పనిని నువ్వు చెయ్యాలంటే... బిఫోర్ దట్... యూ గోటు బెంగుళూర్ - ఐవిల్ గివ్ ఏన్ ఎడ్రస్... డెంటిస్ట్ పర్ణేష్... హి కెన్ హెల్ప్ యూ... విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో జరగాలి...." ప్రమాదాన్ని పసిగట్టి, హెచ్చరిస్తున్న వాడిలా అన్నారాయన.
    
    "నా క్రిమినల్ కెరీర్ లో ఎప్పుడు డేంజర్ నా దగ్గరకు రాదు... ఐలైక్....క్రైమ్స్... ఐలవ్ రేప్స్... ఐలైక్.... కిడ్నాపింగ్స్.... ఐఫీల్ హేపీ ఇన్ దట్..." ఆ మాటలంటున్నపుడు, బబ్లూ ముఖంలో ఎంతో గర్వం చోటు చేసుకుంది.
    
    "ఇంటలిజెంట్ క్రిమినల్ ఎప్పుడూ తననితాను పొగుడుకోడు-టైమ్ వేస్ట్ చెయ్యడు..." పక్కన టేబిల్ మీదున్న మినీ సూట్ కేసును తీసి బబ్లూ చేతికి అందిచ్చాడా వ్యక్తి.
    
    బబ్లూ ఆ సూట్ కేస్ ని అందుకొని వెంటనే ఓపెన్ చేసాడు.
    
    ఆ సూట్ కేస్ లో ఏమీలేదు ఒక్క చెక్ తప్ప.
    
    ఆ చెక్ విలువ యాభై లక్షలరూపాయలు. ఆ చెక్ బబ్లూ పేరుమీద మాత్రం లేదు.
    
    బెంగుళూరులో డాక్టర్ని ఎలా కలవాలో చెప్పాడు ఆ యాభైఅయిదేళ్ళ వ్యక్తి.
    
    మరో మూడు నిమిషాల తర్వాత-
    
    బబ్లూ ఆ బిల్డింగ్ లోంచి బయటికెళ్ళాడు.
    
    అతని వెనక చీకట్లో విశాలమైన నాలుగువందల ఎకరాల ఖాళీ స్థలం....!
    
                                                  *    *    *    *    *
    
    "మనకు తెలిసినా, తెలియకపోయినా వ్యక్తుల గురించి తెల్సుకోవాలంటే వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి.
    
    ఆంధ్రాలో క్రిమినల్స్ గురించి తెల్సుకోవాలంటే క్రిమినల్ ఇండివిడ్యువాలిటీ గురించి తెల్సుకోవాలి.
    
    ఏ వ్యక్తి అయినా జీవితంలో తెలిసో, తెలియకో నేరాలు చేస్తాడు. ఆయా నేరాలు చాలా స్వల్పం కావచ్చు....
    
    పిల్లల్ని కొట్టడం, భార్యల్ని కొట్టడం, అసాంఘికంగా భార్యతో ప్రవర్తించడం ఇవ్వన్నీ నేరాలే. కానీ ఈ నేరాలు హెచ్చుస్థాయిలో ఉన్నపుడే నేరాలుగా పరిగణింపబడతాయి బయటకు వచ్చినపుడే నేరాలుగా మారతాయి.
    
    ప్రతిభను ఎవరూ దాచలేరు. అలాగే నేరాన్ని కూడా.
    
    నేరస్తుడు ఎంత ఇంటెలిజెంట్ అయినా కోర్ట్ ఆఫ్ లా ముందు నిలబడాల్సిందే. అతి గొప్ప మేధావులైన నేరస్థులు... తాము దొరికిపోయే చివరి క్షణంలో.... పోలీసుల్నించీ, శిక్ష నుంచి తప్పించుకోడానికి చేసే ఆఖరు పని....సూసైడ్.... న్యాయశాస్త్రం వేసే శిక్షకన్నా, సూసైడ్ చాలా భయంకరమైన శిక్ష ఆ విషయం వాళ్ళకు తెలీదు.... ఎందుకంటే.... అప్పటికే వాళ్ళు శవాలుగా మారిపోతారు కాబట్టి..."
    
    నేరశాస్త్రానికి సంబంధించిన పుస్తకం చదువుతున్న సూర్యవంశీ ప్రతి వాక్యాన్నీ జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నాడు.
    
    పక్కనున్న ఓల్డ్ మాంక్ రమ్.... ఒక్కొక్క పెగ్ ఖాళీ అవుతోంది.
    
    అయిదువందల పేజీల ఆ పుస్తకాన్ని ఆ రోజు రాత్రి చదవడం పూర్తి చేయడానికి నిర్ణయించుకున్నాడు సూర్యవంశీ.
    
    ప్రపంచంలో ఏ హంతకుడు, ఏ నేరస్థుడైనా గుర్తుపట్టడానికి ప్రధానమైన ఆధారం అతనిచేతి వేలిముద్రలు.
    
    ఫోరెన్సిక్ సైన్స్ లో ఫింగర్ ప్రింట్స్ అనగానే గుర్తుకు వచ్చేది జాన్ వ్యూస్ టిచ్. జాన్ వ్యూస్ టిచ్ 1958లో ఆస్ట్రో-హంగేరియాలోని స్వలాటా ప్రాంతానికి చెందినవాడు - జాన్ వ్యూస్ టిచ్ వృత్తిరీత్యా ఒక సాధారణమైన పోలీస్. ప్రవృత్తిరీత్యా పండితుడు, ఎనలిస్టు.
    
    1991లో వ్యూస్ టిచ్ పోలీస్ స్టాటిస్టికల్ బ్యూరోకి చీఫ్ గా నియమితుడయ్యాడు. అప్పుడే అతను బ్రిటన్ లో గొప్ప సంచలనం సృష్టించిన సెక్స్ మర్డరర్ జాక్ ది రిప్పర్ కేసు ప్రొసీడింగ్స్ చదవడం జరిగింది.
    
    జాక్ ది రిప్పర్ ని పట్టుకోడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఎందుకు విఫలమవుతున్నాయో అతనికి అర్ధం కాలేదు.
    
    నేరస్తుడు దొరక్కపోవడానికి నేరస్తుడి మేధస్సా కారణం? లేక పోలీసుల తెలివితక్కువ తనమా?
    
    ఈ విషయమ్మీద జాన్ వ్యూస్ టిచ్ కొన్ని నెలలపాటు ఆలోచించాడు.
    
    అంతకు పూర్వం, నేరస్తుల్ని పట్టుకోడానికి, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ చేపట్టిన పధకాల్నీ, వ్యూహాల్నీ అధ్యయనం చేసాడు.
    
    నేరస్తుడ్ని పట్టుకోడానికి టైమ్, ప్లేస్ ఎంత ఇంపార్టెంటో,  ఆ సమయానికి, ఆ ప్రదేశానికి పోలీసులు వెళ్ళడం కూడా అంత ఇంపార్టెంట్....
    
    క్షణాల్లో మాయమైపోతున్న జాక్ ది రిప్పర్ ని పోలీసులు ఎందుకు పట్టుకోలేక పోతున్నారు?
    
    జాక్ ది రిప్పర్ ఎలా ఉంటాడో పోలీసులు ఎందుకు ఊహించలేక పోతున్నారు...?
    
    ఎక్కడుంది లోపం!
    
    నిరంతరం జాన్ వ్యూస్ టిచ్ ఆలోచన అది.
    
    అలాంటి సమయంలో వ్యూస్ టిచ్ కి వచ్చిన ఆలోచన - ఎలాంటి నేరానికైనా ప్రధాన కారణం వ్యూమన్ బ్రెయిన్....
    
    బ్రెయిన్ నుంచి వచ్చిన ఆదేశాల్ని అమలుచేసే ఏకైక పరికరం.....చేతులు... మనిషి చేతులు....
    
    నేరం జరిగేది మనిషి చేతుల ద్వారా కాబట్టి... ఆ చేతుల గురించి విశ్లేషిస్తే... ఆ ఆలోచన వచ్చిన తడవుగా....బతికున్న చనిపోయిన చాలా చేతుల్ని చూడడం, ఒక చేతికి, ఇంకో చేతికి మధ్యనున్న భేదం గురించి నోట్స్ రాసుకోవడం.....