అవును, రవివర్మ తెలుసుగా మీకు? ఆయన తీస్తున్న సినిమాలో నటించమని నన్ను కోరాడు. నేనంగీకరించాను."

 

    "బాగా ఆలోచించే అంగీకరించారా మీరు?" సక్సేనా అప్రయత్నంగా అడిగాడు.

 

    "ఆలోచనా?" అంటూ వేదిత నవ్వింది. ఆమెకీ ప్రశ్న వింతగా కనబడింది. "ఆలోచించే వుంటాను" అన్నది కొంచం ఆగి.

 

    "ఆమె దారికి అడ్డురాకు. ఆమె కెవ్వరూ అడ్డు తగలలేరు" అన్న అర్థం వచ్చేటట్లు స్నేహితుడు శాయిచేసిన తుది బోధ గుర్తుకు వచ్చిందతనికి. ఇంకేమీ వాదించకుండా వూరుకున్నాడు.

 

    "నా గురించి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మీ కంపెనీకూడా దెబ్బ తిన్నట్లుంది. ప్రస్తుతం మీరుకూడా యిబ్బందుల్లో వున్నట్లున్నారు. ఇంక మీరు నాకు సాయపడనక్కర్లేదు.... మీకేమయినా పైకం అవసరమైతే చెప్పండి సర్దుబాటు చేస్తాను." అంది వేదిత.

 

    అతను అదిరిపడ్డాడు. ఆమె ఈ విధంగా లౌకిక వ్యవహారాలను గురించి మాట్లాడటం మున్నెన్నడూ చూడలేదు. విస్మయంగా ఆమె ముఖంలోకి చూశాడు. కాని ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు.

 

    "థాంక్స్, అంత అవసరం లేదండీ నాకు. బహుశా యిహ మీదట చాలా బిజీగా ఉంటారు. మీ దశకు తిరుగు ఉండదు. కాని ఎక్కడ ఉన్నా మీ పురోభివృద్ధినే కాంక్షిస్తూ ఉంటాను. మంచి స్నేహితునిగా నన్ను కలకాలం గుర్తుపెట్టుకోండి. ఎన్నడైనా అవసరం వస్తే నాకు కబురు చేయటానికి సందేహించవద్దు" అన్నాడు సక్సేనా.

 

    ఆమె తల వూపి ఎటో చూస్తూ కూర్చుంది. కొంతసేపు గడిచాక సక్సేనా సెలవు తీసుకుని వచ్చేశాడు.

 

    ఒకనాడు పైలాపచ్చీసుగా బొంబాయి వీధుల్లో కార్లలో విహరించిన అతనికీనాడు కారులేదు. కాలినడకనే బయల్దేరాడు, ఆలోచన్లతో సతమతమవుతూ.

 

    అతనికీరోజు వేదిత విచిత్రంగా కనబడింది. ఆమెలో అతనికి మున్నెన్నడూ చూడని మూడో వేదిత కనబడింది. ఈమె అంత అమాయకంగానూ లేదు, బొమ్మలానూ లేదు. ఆమె మాట్లాడితే కేవలం పెదవులే మాట్లాడినట్లుగా లేదు. మరేదో ప్రత్యేకత గోచరిస్తోంది.

 

    ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైన విషయం సుస్పష్టం. ఆనందపురంలో పుట్టి పెరిగిన వేదిత బొంబాయి వచ్చి సొసైటీ గరల్ గా తయారై, చివరకు సినిమా నటికూడా అయిందా? ఎక్కడకు పోయినా ఆమె ప్రతిభకు తిరుగు ఉండదనీ, ఇతరుల్ని విభ్రాంతిలో ముంచెత్తుతుందనీ అతనికి తెలుసు. కాని ఆమె జీవితంలో ఈ మలుపుకూడా శాశ్వతంకాదనీ, అనుకోని మార్పేదో మళ్ళీ సిద్ధిస్తుందనీ అతని మనసుకు స్ఫురిస్తున్నది.

 

    అయినా యిప్పటికికూడా మొదటిసారి ఏటి అవతల గంగరావిచెట్టు వెనకనుండి ఆమెను చూసినప్పుడు ఏ అభిప్రాయం కలిగిందో అదే అభిప్రాయం అతని మనస్సులో చెక్కుచెదరకుండా ఉంది . ఇదంతా ఓ బలీయమైన విశ్వాసం, ఓ భ్రమ అనీ, పీడకల అనీ , ఆ భ్రమా, పీడకలా ఎప్పటికైనా చెదిరిపోతాయనీ అతన్లో పెనవేసుకుపోయి వుంది.

 

    కాని అతని హృదయసీమనుండి ఓ దుర్భరవేదన మాత్రం తొలగిపోలేదు. కళ్యాణమూర్తి విషయమై ఆమెకు దారుణమైన అబద్ధం చెప్పాడు. ఆమె జీవితంలో ఏర్పడిన ఈ మార్పులకు, మలుపులకు ఈ అసత్యమే కారణమయిందేమో అతనికి స్పష్టంగా తెలియదుగానీ, దాని సంక్షోభఛాయలు మాత్రం అతన్ని వెన్నంటిపోవటంలేదు.    

 

    వీలైతే ఏనాడైనా ఆమె ఎదుట అతని తప్పుని అంగీకరించి క్షమాపణ కోరుకోవాలని వుంది. వీలవుతుందో, సాధ్యపడుతుందో అతనికి తెలియదు. కాని ఆ క్షణంకోసం అతను ఎదురుచూస్తూనే వుంటాడు.

 

                                              * * *

 

    వేదిత యిప్పుడు మరో నూతన ప్రపంచంలో వుంది. రవివర్మ తన సినిమాలో ఆమెను బుక్ చేసుకుని, షూటింగ్ ప్రారంభించగానే, బొంబాయి సినిమా లోకంలో పెద్ద అలజడి చెలరేగింది. షూటింగ్ సమయంలో ఆమె సహజ సౌందర్యాన్ని, అభయ కౌశలాన్నీ చూసిన పత్రికా విలేఖరులు ఆమెను ఆకాశానికెత్తేస్తూ భారీ ఎత్తున తమ పత్రికల్లో రాయసాగారు. రవివర్మ మెదడు అతి చురుకైనది. అతని మేధస్సు సాటిలేనిది. ఇతరుల ఊహకందని నూతన ప్రయోగాలు చేస్తూ అతడెప్పుడూ వినూత్న పోకడలుపోతూ ఉంటాడు. పటిష్టమైన అతని ఊహలు, వాటి నిర్మాణానికి అతనవలంచించే పద్ధతులు ఇతరులను దిగ్భ్రాంతి కొలుపుతూ ఉంటాయి. తోటి నిర్మాతలు, దర్శకులు అతడు పరిచయం చెయ్యబోతూన్న ఈ నూతన తారని చూసి అసూయపడిన మాట అబద్ధంకాదు.

 

    అతడు మొదటి వేదితకు చాలా తర్ఫీదు యివ్వవలసిన అవసరం వుందని తలపోశాడు. కాని ఆమె అతి సులభంగా ఆ పాత్ర అంతర్యం గ్రహించి, అద్భుతంగా నటిస్తున్నప్పుడు, అతను సర్వంమరచి కళ్ళు పెద్దవి చేసి చేస్తూ ఉండిపోయేవాడు. ఆమెకు అన్నిరకాల నాట్యాలూ సులభంగా సుభోదకమైనాయి. కారు డ్రైవింగ్, సిమ్మింగ్ రానేవచ్చు. రవివర్మ కథకు అవసరమై ఆమెకు గుర్రపుస్వారీ నేర్పించాడు. స్టూడియోలో కృత్రిమంగా ఏర్పరచిన వనవాసమూ, హాల్లోంచి ఉత్తమాశ్వాన్ని అదలిస్తూ, ఆమె స్వారీ చేస్తూంటే ఓ రాకుమారి ఠీవిగా వనవిహారానికి కదలిపోతున్నట్లు కన్పట్టేది.

 

    కాని యిదే సమయంలో వేదిత గురితప్పిన శరంలాకూడా ప్రవర్తిస్తూ ఉండేది. ఆమెను అందుబాటులో వుంచుకోటం రవివర్మకు చాలా కష్టంగా పరిణమించింది. ఆమెను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోవటానికి అతడు ఎంత ప్రయత్నించినా అది వృధాప్రయాస అయిపోతూండేది. చాలాఖర్చు పెట్టి వేలకు వేలు తగలేసి భారి ఎత్తున ఓ సెట్టు నిర్మించేవాడు. అన్నీ సిద్ధమై అందరికీ మేకప్ పూర్తి అయి కధానాయిక పాత్రధారికోసం ఎదురుచూసే సరికి ఆమె అంతు ఉండేదికాదు. ఆమెకోసం ఆదరాబాదరాగా యింటికి పరిగెత్తేసరికి ఆమె అక్కడ తలుపులకి తాళంవేసి ఉండేది. ఆ సమయానికి ఆమె ఏ స్నేహితుడితోనో, పరిచయస్థుడితోనో ఏ జుహు బీచీలోనో లేకపోతే ఏ విక్టోరియా గార్డెన్సులోనో విహరిస్తూ ఉండేది. ఆరోజు షూటింగు ఉన్నదనీ, తనకోసం అందరూ అక్కడ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారన్న ధ్యాసే వుండేదికాదు. అలా తిరిగి తిరిగి అలిసిపోయి, ఏ రాత్రివేళకో ఇంటికి తిరిగి వచ్చిన ఆమెకు రవివర్మ వసారాలో అసహనంగా అటూ ఇటూ పచార్లుచేస్తూ కనిపించేవాడు. ఆమె రాగానే గట్టిగా కోపపడదామనీ, చివాట్లు పెడదామనీ రిహార్సల్సు వేసుకుంటూ వున్న అతను ఆమె కంటబడగానే నీళ్ళు కారిపోయి "చూడు వేదితా! ఇలాచేస్తే నువ్వు...." అంటూ నీళ్ళు నమిలేవాడు బిక్కమొహంతో. అతని తాపత్రయంలోని నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించినట్లు కనబడేదికాదు వేదిత అతి నిర్లక్ష్యంగా ఓ చిరునవ్వు నవ్వేసి లోపలకు వెళ్లిపోయేది.