ఆ సానుభూతితో సుదర్శన్ రావు ఉపప్రధాని స్థాయికి చేరాక తన చిరకాల మిత్రుడయిన సవ్యసాచి విషయం మరిచిపోలేదు. పాలస్తీనాకి చెందిన తీవ్రవాదులు సవ్యసాచికి ఏ క్షణంలోనైయినా ముప్పుతెచ్చేట్టున్నారని చట్టాన్ని ఒప్పించి వంద మందిదాకా బాడీగార్డ్సుని అతడు కాపలాగా నియమించుకునే అవకాశం కలుగజేసాడు.

 

    నేరాలు చేయడంలో చాలా తర్ఫీదుపొందిన బాడీగార్డ్సు ఎంత సమర్ధులూ అంటే సవ్యసాచిలాంటి పారిశ్రామికవేత్త కలతచెందడం ఇష్టంలేక తరచుగా హత్యలు చేస్తుంటారు.

 

    సవ్యసాచికి చెందిన ఓ ఫ్యాక్టరీ కార్మికనాయకుడు చర్చలకివచ్చి అతడి ఛాంబర్ లోనే రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకోవడం వారి సిన్సియారిటీకి పరాకాష్ట. కొన్ని వేలమందిని లీడ్ చేసే ఆ వ్యక్తి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సివచ్చిందీ ఇప్పటికీ కార్మికులకి అర్థంకాని విషయమైనా చట్టానికి మాత్రం బోధపడిపోయింది ఆ కార్మిక నాయకుడు విదేశాలలో రహస్యంగా తర్ఫీదు పొందివచ్చిన టెర్రరిస్టు (ట).

 

    తను వచ్చింది అలాంటి ప్రముఖుడి దగ్గరకని తెలీని శ్రీహర్ష అతడి కెదురుగావున్న చెస్టర్ ఫీల్డుసోఫాలో కూచున్నాడు పరిసరాలను గమనిస్తూ.

 

    "నా పేరు సవ్యసాచి."

 

    "ఐసీ" ఎదురుగా టీపాయ్ మీదవున్న డన్ హిల్స్ పాకెట్ లోనుండి సిగరెట్ తీసి "లైటర్" అన్నాడు మరింత నిర్లక్ష్యంగా.

 

    ముందుకురాబోయిన తన అనుచరుల్ని వారించిన సవ్యసాచి అప్రతిభుడై చూసాడు శ్రీహర్షవైపు.

 

    తనగురించి తెలియనివాడయినా అయ్యుండాలి, లేదా పిచ్చివాడైనా కావాలి. లైటర్ అందించిన సవ్యసాచి "ఇక్కడివాడివి కాదనుకుంటాను" అన్నాడు నెమ్మదిగా.

 

    "ఇక్కడివాడిని అయినా కాకపోయినా ఒక విషయం అర్థమయింది."

 

    "ఏమిటది?"

 

    "ఎదుటివ్యక్తిని గౌరవించే సంస్కారం ఈదేశంలో డబ్బున్నవాళ్ళకి వుందని."

 

    అదోలా నవ్వాడు సవ్యసాచి కోపాన్ని నిభాయించుకుంటూ "ఇది గౌరవించడం కాదు."

 

    "మరి."

 

    "ఉరిశిక్ష అమలు చేసేముందు చిన్నచిన్న చివరికోరికలు తీరుస్తుంటారు."

 

    శ్రీహర్షలో చలనంలేదు. శమంత్ విషయంలో తనుచేసిన సాయానికి కక్షబూని ఇలా తీసుకొచ్చారనిపించడంతో తనూ కాస్త మొండిగా అన్నాడు. "నువ్వు చెబుతున్నది చట్టం గురించి అనుకుంటాను."

 

    "ఈ దేశంలో నేనూ ఓ చట్టాన్నే" శ్రీహర్ష సాహసం భరింపశక్యం కాని ఉద్రేకానికి గురిచేస్తోంది.

 

    "చెప్పు. నన్నెందుకు రప్పించినట్టు."

 

    అరనిముషం నిశ్శబ్దం.

 

    వెనువెంటనే వెనుకద్వారం మూసుకున్న చప్పుడు.

 

    సవ్యసాచి ఏకాగ్రతగా చూసాడు. అప్పటికే చాలా నిశ్చింతగా కనిపించాడు శ్రీహర్ష. రెండు దశాబ్దాల చరిత్రగల సవ్యసాచికి ఇలాంటి వ్యక్తిని చూడటం తొలిసారి.

 

    "చెప్పు మిష్టర్ చట్టం... నీ స్థాయి మనిషి నాకోసం ఎందుకింత శ్రమ తీసుకున్నట్టు."

 

    అతడివాక్యం ఇంకా పూర్తికానేలేదు... అప్పుడు చూసాడు శ్రీహర్ష.

 

    ఎదురుగా వున్న మెట్లపైనుంచి క్రిందికి దిగుతూంది దృశ్య.

 

    అదికాదు... కలల సాగరాల అలల్ని గుర్తుచేసే కొమోనో నైట్ వేర్ లాంటి గౌన్ లో చాలా కసిగా నడుచుకువచ్చింది.

 

    మెడకింది అందాన్ని సర్జరీ చేస్తున్నట్టు లోపలి బ్రా తాలూక షోల్డర్ స్ట్రేప్ స్పష్టంగా కనిపిస్తూంది భుజంపైనుంచి.

 

    "రిచ్జెడ్ క్రీచర్" ఉక్రోషంగా అంది అభిముఖంగా నిలబడి. "నేనేమిటో ఇప్పటికయినా అర్థమయిందా."

 

    తనను రప్పించింది ఎందుకో ఇప్పటికి అర్థంకావడంతో ఆమె అహంకారానికి లయబద్ధంగా కదులుతున్న పోనీ టెయిల్ ని చూస్తున్నాడు జవాబు చెప్పకుండా.

 

    "బాస్టర్డ్" కూతురు ఆవేశానికి నేపధ్యంలా అన్నాడు సవ్యసాచి. "ఒకనాడు నువ్వు నా కూతురి విషయంలో చేసిన అవమానానికి నీ ప్రాణాలు మరెక్కడో తీయించేవాడ్ని."

 

    "మరెందుకు ఇక్కడికి రప్పించినట్టు." యథాలాపంగా అడిగాడు శ్రీహర్ష.  

 

    "ఒకటి... దృశ్యని అవమానించింది నువ్వే అని కన్ ఫాం చేసుకోడానికి. రెండు... పోయేముందు నువ్వు పశ్చాత్తాపపడే అవకాశం కల్పించడానికి."

 

    "మూడు... నీ రాజసాన్ని నీ కూతురిముందు ప్రదర్శించటానికి. అవునా..."

 

    "ఎస్... కరెక్టుగా అంచనా వేసావ్"

 

    "కాని నన్ను నువ్వు సవ్యంగా అంచనావేయలేకపోయావ్."

 

    ఆవేశంగా రెండడుగులు ముందుకేసిన సవ్యసాచి టక్కున ఆగిపోయాడు.

 

    రెప్పపాటులో దృశ్య భుజంపై కనిపిస్తున్న 'షోల్డర్ స్ట్రాప్' వేళ్ళతో పట్టుకుని ఏ క్షణంలో అయినా తెంపివేసేట్టున్నాడు శ్రీహర్ష.

 

    అది తెగిపోయిన మరుక్షణం మొత్తం నైటీతోసహా నేలకిజారి దృశ్య నగ్నంగా నిలబడాల్సి వస్తుంది.

 

    ఆ గదిలో వున్నట్టుండి నిశ్శబ్దం ఆవరించింది.

 

    "య్యూ..." వేళ్ళను మరింత బిగించిన శ్రీహర్షను చూస్తూ కెవ్వుమంది దృశ్య.

 

    "డ్రాప్ దిగన్స్" వెనక్కి మరలకుండానే ఆవేశంతో అన్నాడు శ్రీహర్ష.

 

    ద్వారం దాటివచ్చిన సవ్యసాచి అనుచరులు అవాక్కయ్యారు.

 

    "మిస్టర్ సవ్యసాచీ...నీ కూతురి అసాధారణమైన అందాన్ని నీ అనుచరులంతా చూడకూడదూ అనుకుంటే వాళ్ళని దూరంగా జరగమను" ఆవేశంతో అన్న శ్రీహర్ష ఆమెను ఒడిసిపట్టుకోలేదు. వేళ్ళతో ముందుకు లాగాడు.

 

    ఆందోళనగా కదిలిన దృశ్య యిప్పుడు శ్రీహర్షని తాకుతున్నట్టుగా నిలబడింది.

 

    "హర్రియప్"

 

    తిరుగులేని ఓ నియంతలా బ్రతుకుతున్న సవ్యసాచి డెలికేట్ గా కలవరపడుతున్నాడు. ఆ దృశ్యాన్ని తనేకాక తన అనుచరులు సైతం చూడకూడదన్నట్టు ఉద్విగ్నంగా సంజ్ఞచేసాడు.

 

    అంతా పక్కకి జరిగిపోయారు.

 

    నెమ్మదిగా శ్రీహర్షతోబాటు నడుస్తోంది దృశ్య. మొన్నటి పెదవుల స్పర్శని యింకా మరిచిపోకముందే అతడివేళ్ళు ఇప్పుడింకా సున్నితమైన భాగాల్ని స్పృశిస్తుంటే చప్పుడుచేయని చిరుగాలి అలలా పోర్టికోదాకా నడిచింది. కారు శ్రీహర్ష నడిపించాడు.

 

    ఆయుధాలు లేవు... రక్తపాతం లేదు.