ఒక్కసారి ఊహించుకో అలా వుండాలని నీలో తపన, పోనీ చిన్నకోరిక కలగటం లేదా? సమాజంలో ఎంతో వున్నతస్థానంలో వున్న కొందరిని చూస్తుంటే నీలో స్పందన కలగటంలేదా?
    
    నీలో తెలియని అహంకారముంది. కానీ ఆ అహంకారాన్ని ఒప్పుకోలేకపోతున్నావు. కొంచెం... కొంచెం... ఆ అహంకారపు పొరలు తొలగించుకుని, "నేను ఇంతే, నేను కరెక్ట్ అబ్బో! న ఆవిషయం వేరు నేను చెబుతాను. మీరువినాలి. ఎవరైతే నాది మూర్ఖత్వమనుకుంటున్నారో, అది నా వ్యక్తిత్వం. నేను... నా భావాలూ, నా పద్దతీ, నా శైలీ విన్యాసం, నా హిపోక్రసీతో నిండివున్న నవ్వూ, ఇతరులను అర్ధం చేసుకోనివ్వకుండా బిగుసుకుపోయి వున్న స్వభావమూ, ఈ మొండితనం, ఈ షెల్.... కొంచెం విడనాడి, కొంచెం తప్పించుకుని బయటికొస్తే.... ఆ కొత్తదనం ఇన్నాళ్ళూ నేను పోగొట్టుకుని తిరిగి పొందగలుగుతానేమో, జీవితానికి కొత్త వన్నెలూ, వెన్నెలలూ వరిస్తాయేమో!"
    
    ఏ రాత్రయినా నిద్రపట్టక అవస్థ పడుతున్నప్పుడు, అస్వస్థతతో అల్లాడుతూ తప్పనిసరి విశ్రాంతిలో వున్నప్పుడు...కనీసం అప్పుడైనా ఇంకోపని లేదు కాబట్టి....వీటిల్లో కొన్నిప్రశ్నలైనా వేసుకోండి.
    
    వాటి సమాధానాలు మీ జెవెఇథమ్లొ మార్పు తీసుకురావచ్చు.
    
    ఇంకొకటి చెప్పనా? మీ బిహేవియర్ మీదికాదు. ఎందుకనో, ఎప్పుడో అరువు తెచ్చుకున్నారు. దానికి బానిసైపోయారు. అది ఒక నిషాద్రవ్యంలా దాని వ్యసనంలో పడిపోయారు. చిన్నపిల్లలు చూడండి. స్కూల్ కు వెళ్ళటం మొదలుపెట్టినప్పుడు కొత్త స్నేహితులను కలిసినప్పుడో...వున్నట్టుండి వాళ్ళమాటల్లో, ప్రవర్తనలో మార్పువస్తుంది. కొత్తరకంగా బిహేవ్ చెయ్యటం మొదలుపెడతారు. ఒకరకమైన నెగెటివ్ ధోరణి వాళ్ళలో కనిపిస్తూ వుంటుంది. అటువంటి ధోరణిని మీరు అరువు తెచ్చుకున్నారు. అందులోంచి బయటపడలేకుండా వున్నారు. ఎందుకంటే బయటపడే ప్రయత్నం మీరు చెయ్యటంలేదు కనుక!
    
    ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు అరవై ఏళ్లవారైనా సరే, డెబ్బయ్ ఏళ్లవారైనా సరే, డెబ్బయ్ ఏళ్లవారైనా సరే... ఇంకా కొంత జీవితం, బహుశా చాలాజీవితం మిగిలివుంది. మీ బిహేవియర్ లో తెచ్చుకున్న మార్పు, ఆ ప్రకాశం కొత్త మెరుపులు మెరిపించవచ్చు. వచ్చు కాదు, మెరిపిస్తుంది!
    
    ఇన్నాళ్ళబట్టీ అరువు తెచ్చుకున్న ఆ బరువును వదిలివెయ్యండి. ఆ ఋణభారం నుంచి విముక్తులు కండి!
    
    మీ ప్రవర్తనే మీ జీవిత పరిమళం!
    
    దాన్ని ఆఘ్రాణించే అమృతక్షణం ఇప్పుడే మొదలవుతోంది.

 

సంబంధ బాంధవ్యాలు
    
    బహుశా యీ గ్రంథంలో ఇది చివరి అధ్యాయమనుకుంటాను. ఈ అధ్యాయాన్ని చివరివరకూ పదిలపర్చుకున్నాను. యీ సబ్జెక్ట్ కున్న ప్రాముఖ్యతను బట్టి.
    
    నేను అనుకున్న స్థాయిలో రాయగలనా? గుండెల లోతుల్నుంచి ప్రయత్నిస్తాను.
    
    ఈ గ్రంథం నా బృహత్తర బాధ్యతగా స్వీకరించి వినయంతో, వినమ్రతతో, చిత్తశుద్దితో మీముందు వుంచటానికి తపిస్తున్నాను.
    
    నేను మీలో ఒకడ్ని మీరుకూడా మీ చుట్టూ నిర్మించుకున్న పొరలు తొలగించుకుని నాలోకి రండి.
    
    రండి ముందుకు వెడదాం.
    
                                                          * * *
    
    ఒకప్పుడు ఉమ్మడి కుటుంబవ్యవస్థ ఎంత బలంగా వుండేది!
    
    పూర్వంకన్నా మనం ఎంతో ఎదిగామనుకుంటున్నాం.
    
    ఎందులో ఎదిగాం! నాగరికతలో ఎదిగామా, నీతిలో ఎదిగామా? కులాల, మతాల సత్సంబంధాలలో ఎదిగామా?
    
    సైన్స్ లో ఎదిగాం. ఆయుధ నిర్మాణంలో ఎదిగాం. అప్పుడింత శాస్త్రీయ పరిజ్ఞానం విస్తరించకపోయినా కొన్ని శతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా నిలబడగల కట్టడాలు నిర్మించగలిగాము. ఆనాటి చక్రవర్తుల కోటలు చూడండి. అలనాడు నిర్మించబడిన అద్భుతమైన దేవాలయాలు చూడండి.
    
    కుతుబ్ మీనార్, చార్ మినార్, తాజ్ మహల్, ఆగ్రాఫోర్ట్, అక్బర్స్ టోంబ్, ఢిల్లీ రెడ్ ఫోర్ట్, గ్వాలియర్ కోట, గోల్కొండ ఫోర్ట్, ఫలక్ నామా, మైసూర్ లో నిర్మాణాలు.
    
    మధుర, చిదంబరం, తంజాపూర్, మన వూహకైనా అందుతుందా?
    
    ప్రజలు అలనాటి వైభవాలని చూడటానికి యిష్టపడుతున్నారే గాని, వాటిల్లో లీనమవటానికి యిష్టపడుతున్నారేగాని, యిప్పటి కట్టడాలను చూసి వొదిలేస్తున్నారు. అవి అనుభవించటానికే గానీ, లీనమైపోవటానికి ఏమీ లేదు.
    
    అలాగే.... అలనాటి కుటుంబవ్యవస్థ అంత నిర్మాణాత్మకంగానూ, బలంగానూ వుండేది. కుటుంబ యజమాని అంటే ఎంత గౌరవం! ఎంత భయం!
    
    ఆ భయంలో ఎంతో నిజాయితీ, సహృదయుత వుండేది!
    
    ఆ గౌరవంలో ఎంత సొగసుండేది!
    
    ఆ పెద్దరికంలో ఎంత హుందాతనం వుండేది!
    
    అమ్మమ్మగా, బామ్మగా, భార్యగా, వదినగా, కోడలిగా స్త్రీలో ఎంత సహనం వుండేది!
    
    సాంఘికపరమైన అన్యాయాలూ, స్వేచ్చ లేకపోవటాలూ... నేను తోటివారిజోలికి పోవటంలేదు. అది వేరే విభాగం. అందులోనూ నిజం వుంది. కాని మనిషి ఏదిపొంది, ఏదో పోగొట్టుకుంటున్నాడో తెలియజేయటానికి, కుటుంబవ్యవస్థ వరకే పరిమితం చేసుకుంటున్నాను.
    
    ప్రపంచ ప్రగతి అంతా కుటుంబ రూపురేఖలమీదే ఆధారపడి వుంది. అది అత్యంత సుందరమైనది. మహోన్నతమైన విలువలు గలది.
    
    ఇదివరకటి రోజులతో పోలిస్తే యిప్పుడే ఎంతో సంతోషంగా వుండే పరిస్థితులు అనుకూలంగా వున్నాయి. పిల్లలమీద పెద్దవాళ్ళ ఆంక్షలు ఏవిధంగా ఇబ్బంది పెట్టే స్థాయిలో లేవు. వాళ్ళు కోరిన చదువు చదివిస్తున్నారు. పిల్లల అవసరాలకు డబ్బు యివ్వటంలో, వాళ్ళకు కావల్సిన డ్రెస్ లు కుట్టించటంలో మనసుపడిన పిక్నిక్ లకూ, పార్టీలకూ పంపించటంలో ఎంతో లిబరల్ గా వుంటున్నారు. ఆఖరికి ఎక్కడోతప్ప యిష్టపడి, ప్రేమించినవారినే యిచ్చి పెళ్ళి చేస్తున్నారు. అప్పటిలా కఠినంగా వుండే అత్తలు లేరు. చాలా కుటుంబాలలో పిల్లలతో తల్లితండ్రులు స్నేహితుల్లా మెలుగుతున్నారు.
    
    ఈతరంవాళ్ళు కావలసిన దానికంటే ఎక్కువే స్వేచ్చ పొందుతున్నారు.
    
    బహుశా అదే కొన్ని అనర్ధాలకు దారితీస్తున్నదేమో.
    
    స్వేచ్చ మిస్ యూజ్ చెయ్యబడుతున్నదేమో.
    
    ఇంతకాలం సరళంగా వుండి అవసరమొచ్చినప్పుడు ఆ పరిస్థితులనుబట్టి కఠినంగా వ్యవహరించవలసి వచ్చినప్పుడు అదో అపరాధంలా మారిపోతున్నాది.
    
    మనసు స్వేచ్చగా ఏ పరిధిలో ఆకళింపు చేసుకోగలుగుతున్నది?
    
    స్వేచ్చ పెరుగుతున్నకొద్ది అసంతృప్తి, అందులోంచి సెగలుచిమ్మే అశాంతి.
    
    ఆ అశాంతిలోనుండి....ఒకరంటే ఒకరికి వైముఖ్యం, అది యింకా స్థాయిపెరిగి ద్వేషం, మానసికంగా కృంగిపోవటాలు, ఒకర్నొకరు హింసించుకోవటాలు, ఒకచోట వుండలేకపోవటాలు, ఒకరితో ఒకరు యిమడలేకపోవటాలు, విడిపోవటాలు.
    
    వెదికితే బలమైన కారణమేమన్నా కనబడుతుందా?
    
    గంటలకొద్దీ వర్ణించినా అర్ధమయ్యేటట్లు చెప్పలేని కారణాలు.
    
    అహంకారం.
    
    గయ్యాళితనం,