వైజయంతి "అలా ఉన్నావేం? సందీప్ ని చూస్తే ఏవైనా బాధగా ఉందా?" అని సానుభూతి చూపించింది.

 

    పాత గాయం మానినా కొత్త దెబ్బ నెప్పిగా ఉందని ఎలా చెప్పనూ?

 

    ఇక అప్పుడంతా చాలా డల్ గా అన్యమనస్కంగా గడిపాను.

 

    వెంకట్ కి మా జూనియర్ ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది.

 

    ఆమెని ఇంప్రెస్ చెయ్యడానికి కిందా మీదా పడిపోతున్నాడు.

 

    రఫీ మాతో కూర్చుని "వెంకట్ గాడి పాకెట్ కి ఇక చిల్లే! చూడండి...ఐస్ క్రీమ్ తెప్పిస్తున్నాడు వెధవ... మనకి ఎప్పుడైనా టీ అయినా తెప్పించాడా? అంటూ రన్నింగ్ కామెంట్రీ ఇస్తున్నాడు.

 

    వెంకట్ మెయిన్ టైన్ చేస్తున్న స్టయిల్ చూస్తుంటే మాకు నవ్వొచ్చింది.

 

    "వెంకన్నా...ఓసారి ఇలారా" వైజూ గట్టిగా పిలిచింది.

 

    కోపంగా చూస్తూ వచ్చి "ఏవిటా పిలుపు?" అన్నాడు.

 

    "ఆ చేత్తోనే మాకు కూడా ఐస్ క్రీమ్ లిప్పించవచ్చుగా" అంది.

 

    "ముందు ఓ పాతిక రూపాయలు ఉంటే ఇటు పారెయ్!" అంటూ బల్లకింద చేతులు పెట్టి అడిగాడు.

 

    "అనవసరంగా పిలిచాను" అంటూ వైజూ రహస్యంగా ఆ అమ్మాయికి కనిపించకుండా డబ్బులు అతనికి అందించింది.

 

    ఈ ప్రహసనానికి రఫీ పెద్దగా నవ్వడం మొదలెట్టాడు.

 

    నేను కూడా కొద్దిగా మామూలు మూడ్ లోకి వచ్చాను.

 

    "కాలేజీ వదిలే సమయానికి గేట్ దగ్గర నిలబడ్డ వ్యక్తిని చూసి స్టన్ అయిపోయాను!

 

    సిద్దార్థ నిలబడి నావైపు చూస్తున్నాడు.

 

    వైజూ నాతో "ముక్తా...సిద్ధార్థ...ఎవరి కోసమో? అడుగుదాం పద" అంది.

 

    "నా కోసమేనేమో...నే పోతా" అన్నాను.

 

    "అదేంటే...ఆగు!" అంది. ఈలోగా అతను మా దగ్గర కొచ్చేసాడు.

 

    "హలో!" అంటూ ఆనందంగా అతణ్ణి విష్ చేసింది వైజూ.

 

    "హలో...ముక్తా...కమ్...మీ కోసమే వచ్చాను" అన్నాడు.

 

    "నేను బస్ లో వెళ్తాను. బై" అంటూ ముందుకి నడిచాను.

 

    మనసులో అతని మీద చాలా ఉక్రోషంగా ఉన్నా పైకి మాత్రం మామూలుగా ఉండటానికి ప్రయత్నించాను. ఇంత అయ్యాక కూడా నా కోసం అలా వచ్చిన అతని ధైర్యానికి వస్తుపోయాను.

 

    బస్ స్టాప్ కి నే చేరేసరికి అతని కారు అక్కడ రెడీగా ఉంది!

 

    నా దగ్గరకొచ్చి "ప్లీజ్...నే చెప్పేది విను. ఒక అవకాశం ఇవ్వు" అన్నాడు.

 

    నేను కోపంగా "ఒక్క అవకాశం ఇస్తే నేను చూసినదీ విన్నదీ, నీ భార్యా పిల్లాడూ అంతా కలని నిరూపిస్తావా?" అన్నాను.

 

    "కాదు...నే చెప్పేది విని ఆ తర్వాత నువ్వు ఏమన్నా భరిస్తాను."

 

    "పనిపిల్లనని మీ ఆవిడతో చెప్పావు...ఇప్పుడు బజార్లో నిలబెట్టి గొడవచేసి బజారుదాన్నంటావేమో?" రోషంగా అన్నాను.

 

    "సారీ ముక్తా... ఆ సంఘటన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా స్థిమితంగా ఉండలేకపోయాను. చూడు నిద్రలేక నా కళ్ళెలా ఎర్రగా అయ్యాయో!"

 

    'నిద్రలేక కాదు, మందెక్కువై అయ్యుంటాయి!' అనుకున్నాను.

 

    "ఒక్కసారి కారెక్కు...జరిగినదానికి ఎక్స్ ప్లనేషన్ అయినా ఇవ్వనీ...ప్లీజ్... లేకపోతే నన్ను నేను క్షమించుకోలేను...చచ్చిపోతాను...చెప్పు...చచ్చిపోమంటావా?" అని నా భుజం గుచ్చి పట్టుకుని అడిగాడు.

 

    అప్పటికే చుట్టుప్రక్కలున్న కొంతమంది మా గుసగుసల్ని ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

    "నేను నిన్ను నమ్మి నీ కారు ఎక్కడమా? నయం. ఏం చెప్పినా ఇక్కడే చెప్పు" మొండిగా అన్నాను.

 

    "నేనేం చెయ్యనంటున్నాగా... మా బాబుమీద ఒట్టు! నన్ను నమ్ము" అన్నాడు.

 

    నేను దిగ్భ్రమగా చూశాను!

 

    "నువ్వు చెప్పేది విన్నా వినకపోయినా, నేను ఎలాగూ చచ్చిపోతాను. ఆ తర్వాత నిజం తెలుసుకుని నువ్వే బాధపడతావు!" అన్నాడు.

 

    "ఎందుకు చావడం?" విసుగ్గా అడిగాను.

 

    "అదే చెప్తాను...నువ్వు కారెక్కితే" అన్నాడు.

 

    నేను ఒక్క నిమిషం ఆలోచించి కారెక్కాను.

 

    సిద్దార్థ కారు స్టార్ట్ చేసి "నేను చెప్పేది నువ్వు నమ్మలేవు. కానీ చెప్పక తప్పదు. రేవతిని నేను అస్సలు ఇష్టపడలేదు. కానీ మేనరికం, ఆస్తి బైటకి పోకూడదని బలవంతంగా పెద్దవాళ్ళు నాకిచ్చి కట్టబెట్టారు. తనకి ఆస్తిపరురాలినని అహం! నాకూ తనకీ మనసులు కలవలేదు.

 

    పెళ్ళయినరోజు నుండీ మా మధ్యన గొడవలే! ఒక్కరోజు కూడా సుఖంలేదు. బాబీని డెలివరీ చేసేటప్పుడు తనకి ఏదో గైనీ ప్రాబ్లెమ్ వచ్చింది. దాంతో మా మధ్యన దాంపత్య సంబంధం లేకుండా పోయింది. అయినా నేను తనని ప్రేమగానే చూసుకుంటున్నాను.

 

    తనకి తృప్తిలేదు. ప్రతి చిన్నదానికి ఇరిటేట్ అయి అరుస్తుంది. నన్ను తీసి పారేసి మాట్లాడుతుంది. సంవత్సరానికి పది నెలలు పుట్టింట్లో ఉంటుంది. నేను ఇల్లరికం వెళ్ళనని కోపం. సాధించి చంపుతుంది.

 

    పోనీ విడాకులు తీసుకుందామా అంటే మా మావయ్య గుండె జబ్బు మనిషి. తట్టుకోలేడని చూస్తున్నాను. పైగా మా మధ్య పిల్లాడు కూడా ఉన్నాడు.

 

    "ఏం చెయ్యాలో తోచక బాగా డ్రింక్ అలవాటు చేసుకున్నాను. ఏ ధ్యాసా లేకుండా నా సమయం అంతా బిజినెస్ మీద కాన్ సన్ ట్రేట్ చేసి బ్రతుకుతుంటే, అనుకోకుండా నువ్వు కలిశావు! నిన్ను చూశాకే నేనేం కోల్పోయానో తెలిసింది ఆముక్తా!" అంటూ నా చెయ్యి పట్టుకుని "ఆ రాక్షసి ఏం తిడుతుందోనని నిన్ను పనిపిల్ల అని నోటికొచ్చినట్లు చెప్పాను."