కాని మ్యాచ్ మొదలయిన మరుక్షణంనుంచీ అతను ఇదంతా మరిచిపోయాడు. ఆట రంధిలో పడ్డాడు. అతనికి ఉద్రేకం వచ్చింది. ఆవేశంతో ఆడాడు.

 

    ఆనాడు ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాడు సుందరమే.

 

    మిత్రులంతా వచ్చి అతన్ని అభినందించారు. ఆ సందడిలో గేమ్ స్పిరిట్ లో అతనికి తన ఆయాసం తెలియలేదు. బలహీనత స్ఫురించలేదు.

 

    కాని గదికి వచ్చిన మరుక్షణంలో అతడ్ని ఇవన్నీ ఉక్కిరిబిక్కిరి చేశాయి. నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు. వళ్ళంతా చెమటలు క్రమ్మివేశాయి. మనసంతా గందరగోళంగా వుంది. ఓ పావుగంట విశ్రాంతి తీసుకుని మెల్లిగా లేచి ధర్మామీటర్ తీసి టెంపరేచర్ చూసుకున్నాడు. అతని వళ్ళు ఝల్లుమంది. నిలువునా వొణికాడు. టెంపరేచర్ రెండుడిగ్రీలు ఎగబ్రాకింది.

 

    అతనికి ఏడుపు వచ్చింది. చికాకు వేసింది. తనమీద కోపం జనించింది. అసహ్యం కల్గింది.

 

    "ఛీ! ఏం పనిచేశాను?" అని కృంగిపోయాడు.

 

    ఇన్నాళ్లు అతనెంతో జాగరూకతతో కూడబెట్టింది పనికిరాని ఆటకోసం ఖర్చుపెట్టేశాడు. తనదేహం నుండి అయిదారు పౌన్ల బరువు ఒక్కసారిగా తగ్గి పోయినట్లు. యిన్నాళ్ళ అభివృద్ధి అంతా వృధా అయిపోయినట్లూ బాధపడ్డాడు.

 

    కాబట్టి దీనికి ప్రతిగా మళ్ళీ కొంతకాలం మరింత దీక్షతో వ్యవహరించాలి. అయిదారు రోజులు కాలేజీకి సెలవు పెట్టేశాడు. గది నుండి కాలు బయటకు పెట్టలేదు.

 

    తిరిగి టెంపరేచర్ తగ్గిపోయింది.


                                         *  *  *


    కొన్నాళ్ళకు ఎంతో అభివృద్ధి కనిపించింది. కాని ఏ పని చేస్తున్నా, కదిలినా, మెదిలినా తాను టి.బి. పేషెంటునన్న స్మృతి విడిచిపోవటంలేదు.

 

    ఓసారి అతడు అద్దెకుంటున్న ఇంటి యజమాని అతన్ని లోపలకు పిలిచి పనివాడు రానందువలన అక్కడున్న పెట్టె ఒకటి ప్రక్కగదిలో పెట్టటానికి తనకు కాస్తా సాయం పట్టుమని కోరాడు. సుందరానికి తప్పనిసరి అయింది.

 

    సాయం పట్టివచ్చి ఉసూరుమంటూ మంచంమీద వాలిపోయాడు. ఇహ రోజంతా దాన్ని గురించే మనసులో ఆవేదన.

 

    కొన్నిరోజులు గడిచాక ఒకనాడు అతని హాస్టల్ రూంమేటు అతని దగ్గరకొచ్చి తన పెళ్ళి శుభలేఖ ఇచ్చి ఆ వేళకి మూడోరోజున అక్కడినుండి మిత్రబృందమంతా కలసి బయలుదేరుతున్నారనీ, తనూ అప్పుడే రావాలనీ అన్నాడు.

 

    సుందరం నెత్తిమీద పిడుగుపడినట్లయింది. "పోనీ... నన్ను వదిలెయ్యకూడదూ?" అన్నాడు ప్రాధేయపూర్వకంగా.

 

    స్నేహితుడు ఎదురుచూడని మాట ఆలకించినట్లుగా "అదేమిటలా అంటున్నావ్?" అన్నాడు ఆశ్చర్యంగా.

 

    సుందరం అతనికి అలాంటిభావం కలిగించినందుకు సిగ్గుపడి "అది కాదు... పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి..." అంటూ నసిగాడు.

 

    "మాకు దగ్గరకు రావటంలేదా?"

 

    సుందరం ఏమి జవాబు చెప్పాలో తెలియక ఊరుకునేసరికి "ఇంతకూ ఇష్టంలేదని చెప్పకూడదా నా పెళ్లికి రావటం? అవును మరి మేము బీదవాళ్లమయ్యె. నాలాంటివాడి పెళ్ళికి రావటం నీ డిగ్నిటికీ భంగం" అన్నాడు స్నేహితుడు నిష్ఠూరంగా.

 

    సుందరం గాద్గాదిక కంఠంతో "నన్నపార్థం చేసుకోకు..."

 

    "ఛ ఛ లేదు. నిన్ను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. వస్తాను, గుడ్ బై" అని అతను సీరియస్ గా వెళ్లిపోతూంటే సుందరం చప్పున మిత్రుడ్ని చేయి పట్టుకొని ఆపాడు. "పెళ్ళికి వస్తున్నాను శంకరం" అన్నాడు డగ్గుత్తికతతో.

 

    పెళ్ళివారి వూరు బరంపురం దగ్గర పల్లెటూరు. బరంపురంలో రైలు దిగి, అక్కడ్నుంచి బస్సులో ఇరవైమైళ్ళు పోవాలి. బస్సు ప్రయాణం ముగిసినా ఎడ్లబళ్ళలో రెండుమైళ్ళ ప్రయాణం.

 

    యువకులం మాకు ఎద్దుబండి ప్రయాణమేమిటని విద్యార్ధులంతా నడిచే రాసాగారు. చల్లని సాయంత్రం. చలిగాలి విపరీతంగా వీస్తోంది. సుందరం స్వెట్టర్ వేసుకుని, తలకి మఫ్లర్ చుట్టుకుని వాళ్ళతో నడుస్తున్నాడు. వాళ్లు గబగబ అడుగులు వేస్తూంటే తనూ వేస్తున్నాడు.

 

    పెళ్లి అయినాక దగ్గర్లో వున్న అడవి చూడ్డానికి రమ్యంగా వుంటుందని విని మిత్రబృందమంతా వాహ్యాళికి బయలుదేరారు. అది కొండమీద అరణ్యం. ఒక్కొక్కడూ యీలలు వేసుకుంటూ, కేరింతలు కొడుతూ కొండ ఎక్కుతున్నారు. వాళ్ళతోపాటు సుందరం ఎక్కుతున్నాడు. వాళ్లు పరుగెత్తితే తనూ పరుగెత్తుతున్నాడు. వాళ్ళు దూకితే తనూ దూకుతున్నాడు.

 

    అట్లా కొంతదూరం పోయాక మేఘావృతమై అనుమానాస్పదంగా వున్న ఆకాశం వున్నట్లుండి వర్షించనారంభించింది. తలదాచుకునేందుకు ఎక్కడా చోటులేదు. అందుకని అలాగే వర్షంలో తడుస్తూ పరిగెత్తసాగారు. సుందరం కూడా చప్పగా తడిసిపోయాడు. యుద్దయిపోయాడు. గజగజ వణుకుతున్నాడు. అయినా వాళ్ళతో పోతున్నాడు.

 

    అలా తిరిగి ఏ అర్థరాత్రికో తిరిగి వచ్చారు.

 

    ఆ రాత్రి సుందరం కనుమూయలేదు.

 

    మిగతా స్నేహితులంతా వెచ్చగా దుప్పట్లు కప్పుకుని నిద్రపోతున్నారు. వాళ్ళంతా ఎంత అదృష్టవంతులు! అతనికిప్పుడు దిగులు పడటానికి కూడా ఓపికలేదు. ఒక్కోసారి దుఃఖపడటంకూడా చాతకానిస్థితికి వస్తుంది. ఇది అలాంటిది.

 

    ఆ దెబ్బనుంచి అతను కోలుకునేసరికి నెలరోజులకు పైగా పట్టింది.

 

    అప్పటికిగాని అతను మామూలు మనిషి కాలేకపోయాడు.

 

    అవతల పరీక్షలు సమీపిస్తున్నాయి. ఇంకా కష్టపడి చదవాలి. తనలో వ్యాధి పెరుగుతోందో, అలాగే వుందో ఏమీ తెలీదు. డాక్టరు దగ్గరకు పోదామంటే అతను పరీక్షచేసి ఏమంటాడోనని చచ్చేభయం. జబ్బు బాగా ముదిరిపోయింది. నీ లంగ్స్ చెడిపోయాయి. ఇహ తగ్గే ఆశలేదు. అంటే? అప్పుడప్పుడు దగ్గు వస్తూండేది. అలా దగ్గుతోంటే రక్తం పడదుగదా అన్న భయోత్పాతం పీడిస్తూ వుండేది.