ఓ గంటలో కోమలనీ రాజునీ పట్టుకున్నారు.
    
    పోలీసులొచ్చి రాజుని కొడుతూ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కి పట్టుకెళ్ళారు.
    
    కోమలని దయామణి చెంపలు వాచేటట్లు కొట్టి- "దీనికి మూడు రోజులు అన్నం పెట్టకండి. గదిలో పడేసి గొళ్ళెం పెట్టండి" అని అరిచింది. అప్పటికే ఆవిడకి హై బి.పి. వచ్చేసింది.
    
    "చాయా! నా బంగారుతల్లీ! నువ్వు నా ఉద్యోగం, పరువూ రెండూ కాపాడావమ్మా" అని చాయ బుట్టలు పుణికి ముద్దుపెట్టుకుంది.
    
    అందరూ చాయ వంక ఈర్ష్యగా చూశారు.
    
    కిందపడి ఏడుస్తున్న కోమలని జుట్టుపట్టి లేవదీసి రాంసింగ్ గదిలోకి ఈడ్చుకుంటూ వెళుతూ వుండగా, కోమల చాయ వైపు ఓ చూపు చూసింది.
    
    ఆ చూపులు కోపంకన్నా బాధా..... వేదనకన్నా నిస్సహాయతా....నమ్మకద్రోహం చేస్తావా? అన్న నిందకన్నా సాటిదాన్నని కరుణైనాలేదా- నా కలల పుస్తకం చింపేసే హక్కు నీకెక్కడిది? అనే దుఃఖం అన్నీ కలగలిపి ఆ కళ్ళల్లోంచి ధారగా కారిపోతూ కనిపించాయి.
    
    కోమలని గదిలోపెట్టి గొళ్ళెం పెట్టాక చాయ కిటికీ దగ్గరకెళ్ళింది. ఓసారి గొంతు సవరించుకుని అంది- "నీ మొదటి బిడ్డకు నా పేరు పెట్టుకుంటానన్నాఉ.....అదే నువ్వు చేసిన తప్పు! నా పేరు కలవాళ్ళు కూడా అలాంటి దరిద్రపు కొంపల్లో పుట్టటానికి వీల్లేదు.
    
                                         * * *
    
    "తరుణి చూపులు నెలత్రావడంబులబ్రోచు" అన్నాడో కవి.
    
    నెలత్రావడాలు అంటే చకోరాలు! కాంచన కన్నులు నిజంగానే చంద్రకాంతికై ఎదురుచూసే చకోరాల్లా.....జయచంద్రకై ఎదురుచూస్తున్నాయి. తన భేదాన్ని మోదంగా మార్చగలిగే శక్తికల ఆ వ్యక్తికోసం, అతని అడుగుల సవ్వడికోసం......పలుకు తీయదనం కోసం.....అతనులేచి ప్రతిక్షణం ఆమె అణువణువూ ఎదురుచూస్తాయి. ముఖ్యంగా ఆ స్పర్శలోని ఆప్యాయతకోసం!
    
    అద్దంలో చూసుకున్నప్పుడల్లా నీ జ్ఞాపకాలూ, నా రహస్యాలన్నీ తెలుసుకున్న తర్వాత నా డైరీలోని అక్షరాలూ నన్ను ఆటపట్టిస్థాయి చిరు అలుకలుగా అనుకుంది. ప్రతి పేజీలోంచి ఓ వేడి నిట్టూర్పు, వాక్యం చివర భాష్ప బిందువూ తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి ఆమె డైరీలో.
    
    అద్దాల బీరువాలో అందంగా అమర్చుకున్న డైరీల్లోంచి అతని తలపులు తలలు బైటికిపెట్టి ఆమెకు కన్పిస్తున్నాయి. 'పద్దెనిమిది సంవత్సరాలు ఎంత త్వరగా గడిచిపోయాయి? ఇంకా అతని చిటికెనవేలు పట్టుకుని కొత్త పెళ్ళికూతుర్లా ఈ ఇంట్లోకి అడుగుపెట్టడం నిన్నో.....మొన్నో అన్నట్లుంది అనుకుంది. అదే....అతని గొప్పదనం! తన సాహచర్యంలో అంతటి అనుభూతిని ఇవ్వగలదు. తన లాలనలో కాలాన్ని తెలియనివ్వడు.
    
    ఎయిర్ కండిషనర్ వీలైనంత నిశ్శబ్దంగా తనపని చేసుకుపోతోంది.
    
    గాలికి అటూ ఇటూ ఊగుతున్న కిటికీ పరదాలు వలపు జావళికి తిల్లానా నృత్యం అభినయిస్తున్నాయి.
    
    ఆర్చీమీద కూర్చున్న ఒంటరి పిచ్చుక ఒకటి గుండెలు అలిసిపోయేలా అరుస్తోంది. కాలాన్ని కబళిస్తున్న గడియారపు ముళ్ళు యాంత్రికంగా తిరిగి పోతున్నాయి.
    
    కలత నిదురలో ఒక కలలో పుష్పించీ.....వికసించేలోగానే వడలిరాలిపోతున్న ఆనంద పారిజాతాలు కాంచన కన్నుల కింద నల్లని చారికలై వెలిసాయి!
    
    కరిగిన జీవనసంధ్యలో తళుకుమనే కిరణపు స్మృతిలా.....కురిసిన స్వప్నాల మధ్యలో మెళుకువనే విరిసిన విదిలా.... అతని తాలూకూ ఆలోచనలు ఆమెని ప్రతిక్షణం కన్నుమూయనీయకుండా కాపాడతాయి!
    
    'ఓ అతిథి..... పిలువని పేరంటంగా రాకు....ఇంటి యజమాని లేనివేళ తలుపు తోసుకుని లోనికిరాకు.....అమర్చిన విందు భోజనాన్ని దొంగలా ఎత్తుకెళ్ళకు!' అని ప్రతిరాత్రి మృత్యువుని ఆమె వేడుకుంటుంది. ఆమెకు మృత్యువంటే భయంలేదు. కానీ తన ప్రాణ విభున్ని చూడకుండానే పోతానేమోనని భయం!
    
    తన తలగడమీద పది ఇంకిపోతున్న ప్రతి కన్నీటి బిందువూ తన తలపులుగా మారి అతడ్ని గుచ్చుతాయని ఆమెకు తెలుసు! ఆనందంలో యుద్ధంచేసి గెలుచుకున్న విషాదాన్ని ఆమె గొంతులో గరళంగా దాచిపెట్టి అనునిత్యం పెదవిమీద చిరునవ్వు పువ్వులు పూయిస్తుంది.
    
    ఆమె భారంగా కళ్ళు మూసుకుని ప్రక్కకి ఒత్తిగిల్లింది. మెడకిందకి వెచ్చగా వచ్చి చేరాయి కన్నీటిబొట్లు.....అంతా నిశ్శబ్దం! భయంకరమైన భరించలేని నిశ్శబ్దం!
    
    శబ్దాలు దూరని, చప్పుళ్ళ కొసల్లో నన్ను దాచిపెట్టు కానీ చిరుగాలి సవ్వడీ....సెలయేరు గలగలా..... పూలబాలల గుసగుసలూ, తుమ్మెదల ఝంకారాలూ పక్షుల కువకువలూ మాత్రం వినపడుతూనే వుండాలి. ఎందుకంటే అవి వినపడనిచోటు సమాధే కదా!