వస్తూనే కేష్ కౌంటర్ కేసి చూస్తూ చిరునవ్వుతో చేయి ఊపాడు. కౌంటర్ లోని వ్యక్తి తిరిగి ఖలీల్ ని విష్ చేసాడు.
    
    ఇప్పుడెలాగైనా ఖలీల్ ని మాట్లాడించాలి.
    
    ఆ మాటల్ని జాగ్రత్తగా రికార్డ్ చేయాలి.
    
    ఎలా సాధ్యమవుతుంది.... అని ఆలోచిస్తుండగానే బీరు బాటిల్ వచ్చింది.
    
    నిమిషాల్లో దాన్ని పూర్తిచేసి మరో బాటిల్ కి ఆర్డరిచ్చాడు.
    
    అది సగం పూర్తవుతుండగా ఖలీల్ ఎస్.ఐ కూర్చున్న టేబుల్ కి ప్రక్కనే వున్న టేబుల్ ముందు తన ఫ్రెండ్ తో పాటు కూర్చున్నాడు.
    
    గంటలో ఎస్.ఐ. అరడజను బీరుబాటిల్స్ ఖాళీ చేశాడు.
    
    కావాలనే మరో బాటిల్ కి ఆర్డరిచ్చాడు.
    
    స్టేవార్డు జాలిగా సర్ధార్జీ వేషంలో వున్న ఎస్.ఐ.కేసి చూస్తూ "ఇంకొద్దు సార్.... ఎక్కువయి పోతోంది" అన్నాడు వినయంగా.
    
    దానికోసమే ఎదురుచూస్తున్న ఎస్.ఐ. కోపంగా లేచి స్టేవార్డ్ ని కేకలేసి ఖలీల్ దగ్గరకు వెళ్ళాడు. కావాలనే పెద్ద తాగుబోతూగా నటిస్తూ స్టేవార్డు మీద కంప్లయింట్ ఇచ్చాడు.
    
    బార్స్ లో అది సహజం కనుక ఖలీల్ ఎస్.ఐ.కి సర్ది చెప్పటం మొదలెట్టాడు. సరీగ్గా అదే టైముకి ఎస్.ఐ. జేబులో వున్న మైక్రో రికార్డర్ ఆన్ అయింది. అడిగిందే అడుగుతూ ఖలీల్ ని బాగా మాట్లాడించాడు ఎస్.ఐ.
    
    మరో పదినిమిషాలయ్యాక ఎస్.ఐ నాలుగువంద నోట్లను అక్కడ విసిరేసి బయటపడ్డాడు. అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలు.
    
    రెండు ఆటోలు మరి ఎస్.ఐ కమీషనర్ ఇంటికి చేరుకున్నాడు.
    
    ఎస్.ఐ. కోసమే ఎదురుచూస్తున్న ఓబరాయ్, ఐనాందార్, వాయిస్ ప్రింట్ ఎక్స్ పర్ట్ పనయిందా అన్నట్లు ఆతృతగా చూశారు.
    
    "పని పూర్తయింది సార్.... కాకపోతే పని జరగటం కోసం డ్యూటీలో చేయకూడని పనిచేసాను. డ్రింక్ చేసి తాగుబోతులా నటించాను. పాడన్ మీ సార్" అంటూ జేబులోని మైక్రో రికార్డర్ ని తీసి వారి ముందుంచాడు.
    
    "శభాష్..." అన్నాడు ఓబరాయ్ ఆనందంగా రికార్డర్ ని ఎక్స్ పర్ట్ అందుకొని రివైండ్ చేసి ఆన్ చేశాడు. ఖలీల్ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎక్స్ పర్ట్ సంతృప్తి వ్యక్తం చేసి దాన్ని తిరిగి రివైండ్ చేసి వాయిస్ ప్రింట్ ని కనెక్ట్ చేసి రెంటిని ఆన్ చేసాడు.
    
    క్షణాలు నిమిషాలు కరిగిపోతున్నాయి.
    
    రికార్డర్ లోంచి వస్తున్న ఖలీల్ మాటల్ని వాయిస్ ప్రింట్ గ్రాఫిక్ పేపర్ మీద రకరకాల గీతల క్రింద మార్చివేస్తోంది.
    
    సరిగ్గా ఐదు నిమిషాలకు ఆ పని పూర్తయిపోయింది. జుహు పోలీస్ స్టేషన్ ఫోన్ ద్వారా వాయిస్ ప్రింట్ సృష్టించిన పేపర్ ని, ఈ పేపర్ ని ఐడెంటికలా కాదా అన్నదే ఫ్రూవ్ చేయాలి.
    
    మిగతా ముగ్గురూ టెన్షన్ గా ఎదురుచూస్తుండగా, వాయిస్ ప్రింట్ ఎక్స్ పార్టు రెండు పేపర్స్ ని దగ్గర పెట్టుకొని మేగ్నిఫ్లైయింగ్ గ్లాస్ ద్వారా చూడసాగాడు.
    
    సిద్దేశ్వర్ ఓబరాయ్, ఐనాందార్ ఫలితం కోసం ఆతృతతో ఎదురు చూస్తుండగా వాయిస్ ప్రింట్ మెషిన్ ఎక్స్ పర్ట్ తలెత్తి ఆ యిద్దరికేసి చిరునవ్వుతో చూస్తూ.
    
    "యు ఆర్ కరెక్ట్ సార్.... ఈ రెండు కంఠస్వరాలు ఐడెంటిఫై అయ్యాయి...." అన్నాడు సంతోషంగా ఆ ఇద్దరూ ఉద్వేగంతో అరవబోయి బలవంతంమీద నిగ్రహించుకున్నారు.
    
    "మీరాశించినట్లే అది ఖలీల్ అని రుజువయింది. బట్.... ఆ తఃరువాత మరి పరిశోధన ఎలా ముందుకెళుతుంది? మీ స్ట్రాటజీ ఏమిటి...?" ఐనాందార్ ఎగ్జయిట్ మెంట్ నుంచి తేరుకుంటూ అడిగాడు.
    
    "థాంక్యూ వెరీమచ్... మరలా అవసరమయినప్పుడు పిలుస్తాను" అన్నాడు సిద్దేశ్వర్ వాయిస్ ప్రింట్ టెక్నీషియన్ కేసి చూస్తూ.
    
    అతను ఐడెంటిఫై అయిన వాయిస్ ప్రింట్ గ్రాఫిక్ పేపర్స్ ని, ఆడియో కేసట్స్ ని అక్కడే వుంచి, ఆ ఇద్దరికీ సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోయాడు.
    
    "ఇప్పుడు... దీనిమూలంగా తెలిసేది నా స్ట్రాటజీగాడు- ఖలీల్ స్ట్రాటజీ.... ఖలీల్ ఆ 'జె'కి సహకరిస్తున్నాడన్నది నిజం. ఆ 'జె' మాస్టర్ ని అసాసినేట్ చేయాలనే ప్రయత్నంలో వున్నాడు. ఆలాంటప్పుడు ఖలీల్ కి మాస్టర్ మీద ప్రేమాభిమానాలు వుండవు కదా....?" వుండనప్పుడు ఎందుకు అలా ఫోన్ చేశాడు?"
    
    "అదే ఆశ్చర్యంగా వుంది" అన్నాడు ఐనాందార్.
    
    "ఆశ్చర్యమేమీ లేదు- ఖలీల్ ఫోన్ లో జుహు ఎస్.ఐ.ని రెండే అడిగాడు. ఒకటి- షరీఫ్ పార్టీకి మాస్టర్ రాకుండా చూడమని అది సాధ్యం కాకపోతే మాస్టర్ ని కంటికి రెప్పలా కాపాడమన్నాడు. కంటికి రెప్పలా కాపాడటమన్నది మిల్లర్ ఎలాగు చూసుకుంటాడు. ఆపైన మనమంటాం. అది ఖలీల్ కి తెలుసు. తెలిసినా రాకుండా చూడమన్నాడు. అంటే అతని స్ట్రాటజీ ప్రకారం మాస్టర్ పార్టీకి రాకుండా చేయాలంటే మనం మిల్లర్ కి ఫోన్ చేస్తాం. చేసి ఏమని చెబుతాం....? షరీఫ్ పార్టీలో ప్రమాదం పొంచి వుంది. కనుక ఆ పార్టీకి మాస్టర్ రాకుండా చూసుకోండి. అని చెబుతాం అప్పుడేమవుతుంది...? మిల్లర్ ఆత్మాభిమానం దెబ్బతింటుంది. దెబ్బతింటే ఏమవుతుంది....? పంతానికి మాస్టర్ ని షరీఫ్ పార్టీకి ఖచ్చితంగా పంపిస్తాడు. పంపిస్తే..." ఆ మాటలంటూనే సిద్దేశ్వర్ ఉలిక్కిపడ్డాడు.
    
    "దానివలన ఖలీల్ కి ప్రయోజనం...?" అసంకల్పితంగా ఆ ప్రశ్న వేశాడు ఐనాందార్.
    
    "ప్రయోజనం ఒక్కటే....అతన్ని అసాసినేట్ చేయటం."
    
    "అక్కడ.... ఆ పార్టీలోనా?"
    
    "ఎస్.... ఆ పార్టీలోనే.... ఖలీల్ 'జె'కి సహాయం చేస్తున్నాడు. మాస్టర్ ఆ పార్టీకి వచ్చేలా చేయమని 'జె' ఖలీల్ ని అడిగి వుంటాడు. మాస్టర్ ఫలానా చోటుకి రావటం, రాకపోవాటం అన్నది మిల్లర్ చేతుల్లో వుంది. మిల్లర్ అహాన్ని మనద్వారా రెచ్చగొట్టి మాస్టర్  ఆ పార్టీకి వచ్చేలా చూడమని 'జె' చెప్పి వుంటాడు."
    
    "దానివలన ప్రయోజనం!"