జలపాతం కింద తడుస్తున్నప్పుడు ఎంత ఉక్కిరి బిక్కిరవుతామో అట్లా వుంటోంది. జగదీష్ ఎప్పుడూ అలా మాట్లాడడు. తను కొత్త చీర కట్టుకున్నా హెయిర్ స్టెయిల్ మార్చినా, ఏమీ కామెంట్ చేయడు. అప్పటికి కానీ తను వసంత్ ముందు మాట్లాడటం లేదు- ఎందుకు? భయమా? భయమెందుకు? తనూ మాట్లాడాలి. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అతను టైమ్ అడగడం.
    
    వాచ్ చూసుకుని చెప్పింది "పన్నెండు"
    
    "అంతే అయి వుంటుందని అనుకున్నాను. ఇంత రాత్రి, పలచటి దీపపు వెలుగులో, ట్రాన్స్ పరెంట్ నైటీ వేసుకున్న మిమ్మల్ని చూస్తుంటే గతజన్మపు ప్రేయసిని ఈ జన్మలో మొదటిసారి చూస్తున్నట్లుంది"
    
    ఇక లాభంలేదు- అతన్ని పంపించేయాలి.
    
    జగదీష్ కి మెలకువచ్చి ఇక్కడికి వస్తే ఏం చెప్పాలి? తను చచ్చినా అబద్దం చెప్పదు. నిజం చెబితే ఏమంటాడు? వసంత్ ని గన్ తో కాల్చేస్తాడా?
    
    ఏమో? ఏది ఏమైనా ఇక్కడి నుంచి అతన్ని త్వరగా పంపేయాలి.
    
    "ఇంతకీ ఇప్పుడు ఏం కావాలి?" ఆమె తడబడుతూ అడిగింది.
    
    "మీ చిన్నప్పటి ఫోటో"
    
    అది ఇవ్వందే ఇతను కదలడు. కాబట్టి ఇచ్చెయ్యాలి. ఇంతకీ చిన్నప్పటి ఫోటో వుందా? సూట్కేసులో వెదకాలి. ఆమె ఏమీ చెప్పకుండా మౌన్మగా అక్కడినుంచి కదిలింది. తన పర్సనల్ గదిలోకి వెళ్ళింది. బీరువా పైనుంది సూట్కేసు మంచం మీద ఎక్కి దాన్ని దించింది.
    
    ఎవరో పిలుస్తున్నట్లు అనిపించింది జగదీషా? ఆమె పట్టించుకోకుండా ఫోటో వెదుకుతోంది.
    
    కాలేజీలో ఫ్యాషన్ పెరేడ్ కోసం వేసుకున్న డ్రస్ లో తీసిన ఫోటో కనిపించింది దీన్ని వసంత్ కి ఇవ్వాలనిపించింది. కానీ మరుక్షణంలో మనసు మార్చుకుంది. దాన్ని పక్కనబెట్టి మరో ఫోటో కోసం చూస్తోంది.
    
    ఎక్కడో అడుగునున్న ఫోటోల బంచ్ ని లాగింది. అవి విడిపోకుండా వేసిన రబ్బర్ ని తెంపింది. ఫోటోలన్నిటినీ మంచం మీద పరిచింది.
    
    ఠక్కున ఆమె ముఖం ఆనందంతో విప్పారింది. సిక్స్త్ క్లాసులో బెంగుళూరు టూర్ వెళ్ళినప్పుడు నలుగురు స్నేహితురాళ్ళతో తీయించుకున్న ఫోటో అది.
    
    గబగబా దాన్ని తీసుకుని కిందకు దిగింది. ఒకడుగు ముందుకు గానీ ఒకడుగు వెనక్కిగానీ వేయకుండా స్టిల్ చిత్రంలా వసంత్ అక్కడే వున్నాడు.
    
    "ఇదిగోండి, ఇక వెళతారా?"
    
    అతను ఆ ఫోటోని చేతుల్లోకి తీసుకుని ఓసారి దాని పరికించి చూసి మెరుస్తున్న కళ్ళతో చెప్పాడు "ప్రపంచశాంతి"
    
    "ఇప్పుడు మీరెళ్ళకాపోతే 'కుటుంబ అశాంతి' అయిపోతుంది. దయచేసి వెళ్ళండి"
    
    "ప్రపంచశాంతి" అని వెళ్ళిపోయాడతను.
    
    మెల్లగా మెట్లెక్కి గదికి చేరుకుంది.
    
    జగదీష్ నిద్రపోతూనే వున్నాడు. హమ్మయ్య అనుకుంటూ పడకమీద వాలిపోయింది.
    
    ఇదంతా ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలీయడం లేదు. మొదలైంది ప్రతీదీ ఎక్కడో ఒక దగ్గర ఆగి తీరాల్సిందే దీని ముగింపు ఎలా వుంటుందో ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు.
    
    నిజానికి సీరియస్ గా రావద్దంటే అతనిక రాడని తెలుసు ఆమెకి. కానీ అంత సీరియస్ గా చెప్పలేక పోతోంది. ఈ గందరగోళం అంతా పోతే వెనకటికి మల్లే జీవితం నిస్తేజంగా తయారవుతుంది. తను బతికున్నానన్న భావన కూడా కలగదు. అంతా రొటీన్ గా, ఏమీ థ్రిల్లింగ్ లేకుండా జరుగుతుంటుంది. తన ఉనికి కూడా తనకు తెలియదు.
    
    కానీ ఇప్పుడల్లా కాదు. ఈ ఆలోచనలతో తన అస్తిత్వాన్ని తను ఫీల్ కాగలుగుతోంది. బతకడం వ్యర్ధం అన్న భావన పోయింది. జీవితం మీద మమకారం ఎక్కువైంది. అందుకే ఇంతకు ముందున్న నిర్లక్ష్యం పోయింది. జాగ్రత్త అలవడింది. వసంత్ పరిచయమైనప్పట్నుంచీ తను ఎంతో చైతన్యవంతంగా వుంది.
    
    జగదీష్ కి ఆమె శరీరం తగిలి డిస్టర్బ్ అయ్యాడు. అటూ ఇటూ కదిలి తిరిగి సర్దుకున్నాడు. సన్నటి గురక మొదలై అంతలోనే ఆగిపోయింది.

    ఈ సమయంలో అతను కప్పుకున్న బ్లాంకెట్ కొద్దిగా క్రిందకు జారింది.

    ఇప్పుడు అతని వీపు ఆమెకి కన్పిస్తోంది. ఎక్కడో ఆలోచిస్తున్న  ఆమె కళ్ళు పైకెత్తి అటుకేసి చూసి కెవ్వున అరవబోయింది గాని కేక మాత్రం బయటికి రాలేదు అతని వీపంతా బొల్లిమచ్చలు.
    
    ఎర్రెర్రగా రవుండ్ గా ఏదో ఇనుపచువ్వతో కాల్చినట్లు మచ్చలు, పొదల పాములాగా అతని వీపు చూడడానికి భయంకరంగా వుంది.
    
    మొదట్లో ఆమె చూసినప్పుడు ఒక మచ్చే కనిపించింది. ఆ తరువాత ఆమెకు దాని గురించిన ధ్యాసే లేకపోయింది. ఇప్పుడు బొల్లి వీపంతా పూర్తిగా పాకింది.
    
    మల్లెపొదను ఆకుపురుగు కొట్టేసినట్లు వికారంగా కనిపిస్తోంది.    

    అతనికి మొదట్లో కొమ్ములు మొలవడం గుర్తొచ్చింది. అని ఇప్పుడు పోయాయోలేదో తెలియదు. ఆమె కొమ్ములు మొలుస్తున్నాయని చెప్పినప్పట్నుంచి అతను క్రికెట్ క్యాప్ పెట్టుకుంటున్నాడు. అందువల్ల ఆమె దానిని గుర్తించలేకపోయింది.
    
    అవి వున్నాయో లేవో చూడాలనిపించి మెల్లగా పైకెగబాకి అతని తలకున్న దుప్పటిని తొలగించింది.
    
    గెచ్చకాయ రంగులో, బొటనవేలు సైజులో కొమ్ములు వెంట్రుకల లోంచి పొడుచుకొచ్చాయి.
    
    రాజాధిరాజు సినిమాలో నూతన్ ప్రసాద్ గుర్తొచ్చాడు ఆమెకి. జగదీష్ కూడా సైతాన్ గా మారిపోతున్నాడా? లేక సైతాన్ ఇతనిలో దూరాడా? అన్న అనుమానం రాగానే భయం చుట్టుకుంది. ఇదంతా తన భ్రమ. కండరాలు కాస్తంత పెరిగుంటాయి.
    
    జగదీష్ డాక్టర్ కి చూపించాడా? డాక్టర్ ఏం చెప్పాడు? ఏదో అర్ధం కాని జబ్బు పేరు చెప్పి వుంటాడు.
    
    జగదీష్ కొమ్ములు కనిపించకుండా టోపీ పెట్టుకుంటున్నాడు. లేకుంటే జనం తనలాగే జడుసుకునేవారు. కొమ్ములకు తోడు తోక, తోకకు తోడు బొల్లి మచ్చలు. అగ్గులు మీద పడి చర్మం గుండ్రంగా లేచిపోయినట్లు కనిపిస్తున్నాయి.
    
    మరోమారు చూసిందామె అక్కడ.
    
    ఇక అక్కడ వుండడం ఇబ్బందిగా అనిపించింది. లేచి తన గదిలోకి వచ్చి పడుకుంది.
    
    ఆమె ఓ పుస్తకాన్ని గుండెలకు ఆనించుకుని పైకప్పుకేసి చూస్తోంది. వసంత్ అంతకు ముందు రావడం, అతని మాటలు, తను ఫోటో ఇవ్వడం అన్నీ మెదులుతున్నాయి. వెనక వరండాలో కట్టేసిన అల్షేషియన్ కుక్క అరవడంతో ఆమె ఉలిక్కిపడింది. ఆ సమయంలో కుక్క అరవడం అరుదు, ఎవరైనా వస్తున్నారా?