హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే...

 

హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే....

 

 

ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది.


మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే  చాలు, ఎలాంటి సమస్య ఉండదు.


రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో  కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం  మంచిది  కదా.


ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి. నువ్వులు,బార్లి, బాదం పప్పు  తినటం కూడా మంచిది. మాంసాహారులు ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.

 


అదేగనక ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివి పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా  ఇలాంటివి ఎక్కువగా తినాలి.


బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి. బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని మందు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ , 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా రక్తాన్ని వృద్ధి చేస్తాయి.


మనం తీసుకునే ఆహారంలో ఇవన్ని ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన పని ఉండదు.

 

..కళ్యాణి