ఆమె చిరునవ్వు నవ్వి "వంట బోరంటే ఎలా కుదురుతుంది? కొత్తగా వచ్చారు. అదే అలవాటవుతుంది. నా పేరు సుశీల. మీకేం కావాలన్నా, యేం తెలీకపోయినా నన్ను అడగండి. మీవారు చాలా మంచివాడు సుమండీ. బాగా సరదాగా, కలుపుగోలుగా వుంటారు. సెలవు వచ్చిందంటే మా ఆయన, మీవారు కబుర్లేసుకుని కూర్చుంటారు" అంది.
    జ్యోతి సుశీలని పరకాయించి చూసింది. పొట్టిగా, పీలగా, చామన చాయగా వుంది. మొహం మాత్రం కళగా, తెలివితేటలు కనిపిస్తున్నాయి.
    వెంకటగిరి నేతచీరలో చాలా సామాన్యంగా వున్న ఆమె జ్యోతిని ఆకర్షించలేదు. జ్యోతి టేస్టు చాలా గొప్పది. ఇలాంటివాటిని అంగీకరించటానికి ఆమె మనస్సు వప్పదు.
    అట్టే చదువుకున్నదానిలా లేదు. ఆ విషయంలో తన ఆధిక్యత నిరూపించుకోవాలని.
    "ఏమిటో బి.ఏ. ఇంకా పూర్తికాకుండానే మావాళ్ళు కొంప మునిగిపోయినట్టు, యీ మాత్రం సంబంధం దొరకదన్నట్టు చేసేశారు పెళ్ళి" అంది. తను బి.ఏ. అని చెప్పక చెప్పినట్లు.
    "నాకూ అలాగే అయింది. ప్రైవేటుగా కట్టాను. మీరూ అలా కట్టవచ్చు. మరి మంచిసంబంధం దొరికినపుడు అది తప్పిపోతుందని పెద్దవాళ్ళ భయం" అంది సుశీల.
    ఆమెకూడా బి.ఏ. చదివింది అనగానే తన అంచనా పొరపాటయినందుకు మనసులో నొచ్చుకుంది. మరుక్షణంలో కోస్తూంది అనుకుంది అపనమ్మకంగా.
    "మంచి సంబంధమా? భలేవారే. గుమస్తా ఉద్యోగం మంచి సంబంధం అంటారా?" వేళాకోళంగా అంది జ్యోతి.
    ఆ మాటకి సుశీల అదోలా అయిపోయింది. ఆమెవంక ఏదో వెతుకుతున్నట్లు చూసింది. "మంచి అంటే అంతెక్కడ? మన తాహతు చూసుకోవాలిగా. ఇంతకీ మంచి అంటే భర్త ఉద్యోగమొక్కటే అనుకోను నేను.
    కావాల్సింది డబ్బొక్కటేనా. ఏమో! మీరు ఏం అనుకున్నారోగాని, మనకంటె తక్కువవాళ్ళతో పోల్చుకుని మనకున్నదాంతో తృప్తిపడాలి మనం" అంది నెమ్మదిగా. జ్యోతికి ఒళ్ళు మండింది.
    పెద్ద నీతికబుర్లు చెపుతూంది పైకి. మనసులో ఆవిడకు మాత్రం ఆఫీసరు మొగుడు రావాలని, దర్జాగా వుండాలని వుండదూ? అంతా గొప్ప కబుర్లు. హేళనగా అనుకుంది జ్యోతి.
    జ్యోతి మొహంమీదే ఆ భావం కనపడింది. సుశీల అది గుర్తించనూ గుర్తించింది.
    "అంటే నేనుమాత్రం గొప్ప ఉద్యోగస్థుడు, కారు, బంగళా ఇవన్నీ వస్తే వద్దంటాననిగాదు అర్థం. అవి మనసు లేనపుడు అందనివాటికోసం అర్రులుచాచి, లేదన్న అసంతృప్తితో కృంగిపోను."
    అంది సుశీల నిబ్బరంగా.
    "ఆహా...." అంది జ్యోతి వ్యంగ్యంగా- "అందరూ మీలాగే వుండరుగా. సరే పోనీలెండి ఎవరిష్టం వారిది."
    "మీ పుట్టిల్లు ఎక్కడ? మీ నాన్నగారు ఏం చేసేవారు?" సుశీల ప్రశ్నలకి యిష్టంలేకపోయినా జవాబిచ్చింది జ్యోతి.
    ఎంతసేపు తనెంత కల్పించుకుని మాట్లాడినా జ్యోతి సరదాగా, కలుపుగోలుతనంగా మాట్లాడకపోవడం గమనించింది సుశీల.
    "ఇంక వెడతానండీ. బాబు నిద్రలేచేవేళయింది. ఇరుగు పొరుగు వున్నాం. మీకు ఏం కావాల్సినా అడగండి. వీలయినప్పుడు వస్తుండండి" అంది సుశీల లేచి.
    "పైన వున్నవారు ఎవరండీ? వెడదాం వస్తారా? పరిచయం చేసుకుంటాను."అంది కుతూహలంగా.
    సుశీల ఒక్కక్షణం తటపటాయించింది. "మీరు వెళ్ళండి. నాకు కాస్త పనుంది యింట్లో. ఆవిడతో నాకంత పరిచయం లేదు" అంది.
    "ఇదేం, పైనేగా వుంటున్నారు. వెళ్ళరా మీరు అక్కడికి?"
    "పైన వున్నారుకనుకనే వెళ్ళడం నాకిష్టం వుండదు. అంది సుశీల గుంభనంగా.
    ఆమె మాటలు జ్యోతికి అర్థమవలేదు. చూస్తూ వూరుకుంది. మరోసారి వస్తానని చెప్పి తన వాటాలోకి వెళ్ళిపోయింది సుశీల.
    ఆమె వెళ్ళాక ఎలాగో నిద్రతేలిపోయింది. పై ఆవిడతో పరిచయం చేసుకోవాలని, వాళ్ళ యిల్లుగట్రా ఎలా వుందీ చూసిరావాలన్న కుతూహలం ఆమెని నిలవనీయలేదు.
    చీర మార్చుకుని, కాస్త పౌడర్ రుద్దుకుని యిల్లు తాళంపెట్టి పైకి వెళ్ళింది.
    పైభాగం కిందభాగంకంటె మోడరన్. మొజాయిక్ ప్లోరింగ్ తో చక్కగా వుంటుంది. అద్దె మూడువందలు.
    జ్యోతి బెల్ కొట్టేసరికి ఆమె తలుపుతీసింది. నిద్రలో వున్నట్టుంది నిద్రమొహంతో జ్యోతిని చూసి ఆవలిస్తూ, కాస్త నుదురు చిట్లించి-
    "మీరా-" అంది.
    "సారీ! నిద్రపోతున్నారా? లేపేసినట్టున్నాను" అంది జ్యోతి నొచ్చుకొంటూ.
    "ఆ పరవాలేదులెండి, రండి. మీరు కింద వుంటున్నారుకదూ?" అంది మరోసారి ఆవలించి.
    డ్రాయింగ్ రూమ్ లో ఓ సోఫా లో కూలబడింది జ్యోతికి మరో సోఫా చూపిస్తూ.
    డ్రాయింగ్ రూమ్ జ్యోతి కన్నకలలకి ప్రతిరూపంగా వుంది. మంచి సోఫా సెట్టు, రేడియోగ్రాం, బుక్ కేస్, షోకేస్ లో బొమ్మలు, మంచి కర్టన్లు.
    జ్యోతి ఆరాటంగా ఆశగా చూసింది అన్నింటిని. ఆమె మొహం ప్రసన్నంగా మారింది. యిల్లేకాదు. యింటావిడకూడా బాగుంది పాతికేళ్ళు వుంటాయి. మంచి రంగు, సన్నగా, నాజూగ్గా వుంది.
    ఇద్దరు చిన్నపిల్లలు, కారుంది. మొగుడికి రెండువేలు తెచ్చే ఉద్యోగం వుంది. ఎంత అదృష్టవంతురాలో అన్పించింది జ్యోతికి.
    జ్యోతి మోహంలో భావాలు గమనిస్తూ. "ఏం ఎండలో ఇలా వచ్చారు?" అంది.
    జ్యోతి తడబడి "అబ్బే! వూరికే. పైన వున్నారు, పరిచయం చేసుకుందామని. వారం రోజులనుంచి ఒకటే పని, సర్దుకోవడం. ఆయన వుండేవారు. అందుకు రాలేదు" సంజాయిషీ యిస్తున్నట్లు ఏమీ అనుకోకండేం అన్నట్టు అంది.