బాస్ దిగివచ్చి నా మనసు నీకు తెలియదా? నీ మనసు గ్రహించడానికి నాటకం ఆడాను అంటాడు జ్యోతిని దగ్గరకు లాక్కుని.
    "నన్నెప్పుడూ ఇలా బాధించకు. నీవు దూరమైతే సహించను" అంటూ బేలగా కన్నీళ్ళతో అతని గుండెలకి హత్తుకుపోతుంది.
    "సిల్లీ డార్లింగ్! నీవుండగా మరొకరెందుకు నాకు?" అని ఆమెని మరింత హత్తుకుంటాడు.
    ఆఖరిసీను పెళ్ళి -సుఖాంతం. అలా కాకపోతే మరోటి. కాలేజీలో చదువుకుంటున్న పెద్ద బిజినెస్ మాగ్నెట్ కొడుకు తనని ఆరాధిస్తూ వుంటాడు. ముందు అతని వెకిలిచేష్టలకి ఆమె అసహ్యించుకుంటుంది. జ్యోతికోసం అన్నీ మానేసి బుద్ధిమంతుడయి నీవుతప్ప నాకెవరూ లేరు. నన్ను అనుగ్రహించు లేకపోతే పిచ్చివాడినయిపోతాను" అంటూ ఉత్తరాలు గుప్పిస్తాడు.
    జ్యోతి కరగదు.
    అతను మజ్నులా పిచ్చివాడిలా గడ్డం, గట్రా పెంచి ఏదో లోకంలో వున్నట్టు దీనమైన చూపులతో తిరుగుతూంటాడు. ఆఖరికి అన్నం నీళ్ళుమాని చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్తాడు.
    అతని ఫ్రెండ్స్, జ్యోతి ఫ్రెండ్స్ జ్యోతినితిట్టి, "నీవు మనిషివి కావు. నీకోసం చస్తున్నాడు, అతని ప్రేమని ఇప్పటికైనా గుర్తించు...." అంటారు.
    జ్యోతి ఆఖరికి గుర్తిస్తుంది. పరుగున వెళ్ళి చావబోతున్న అతని గుండెలమీద వాలి క్షమించమంటుంది.
    అంటించుకున్న గడ్డాలు, మీసాలు లాగేసి "నీకోసం జ్యోతి ఇదంతా చేశాను" అంటూ గుండెలకి హత్తుకుంటాడు. తను కోపం నటించి అంతలో అతను గిలిగింతలుపెడితే నవ్వేసి, కౌగిలిలో సిగ్గుగా వదిగిపోతుంది. పెళ్ళి గురించి జ్యోతి ఇలాంటి కలలు చాలా కనేది.
    ఎవరో రాజేష్ ఖన్నాలా అందగాడు, నాలుగంకెల జీతగాడు, బంగళాకలవాడు, కారున్నవాడు తనని వెదుక్కుంటూ వస్తాడు అనుకుంది. పెళ్ళి గురించే కాదు, పెళ్ళి తర్వాత కాపురం గురించి కూడా మృధుమధుమైన కలలు కంది.
    తనని అనుక్షణం ఆరాధించి, అనురాగ డోలికల్లో ఊగించే భర్త, ముచ్చటైన చక్కని చిన్న ఆధునికమైన సినిమా నెట్టింగుల్లాంటి ఇల్లు భర్త నడుంచుట్టూ చేతులు బిగించి, స్కూటర్ మీద షికార్లు. సత్యభామలా అడుగడుగునా అలక సాధించే తాను, బ్రతిమాలి, బుజ్జగించి లాలించే భర్తా.
    వంట చేస్తుంటే చిన్నపిల్లాడిలా కొంగుపట్టుకు తిరుగుతూ "వంట వండద్దు. నీవు పొయ్యిమీద కూర్చోవటం భరించలేనని" అల్లరిపెడుతూ కూర తరుగుతా, పచ్చడి రుబ్బుతా" అంటూ తను శ్రమపడితే చూడలేని భర్తా, వెన్నెలలో చెట్టాపట్టాలేసుకు షికార్లు....
    కన్నెగా, కాలేజీపిల్లగా వుండగా ఇవన్నీ జ్యోతి కలలు. ఏ సినిమా చూస్తున్నా, ఏ పుస్తకం చదువుతున్నా అక్షరాల ఊహలు కళ్ళఎదుట నిలిచి ఎటో తేలిపోయేది. క్లాసుపుస్తకం పట్టుకు ఓమూల కూర్చుంటే ఈ కలలే.
    ఆమె కలలకి, వాస్తవానికీ పొత్తు కుదరడంలేదన్న సత్యం మొట్ట మొదటిసారిగా పెళ్ళిచూపులనాడు గుర్తించింది.
    ఎదుట కూర్చున్న పెళ్ళికొడుకు ఆరడుగులవాడుకాడు. అందగాడుకాడు. పొట్టిగా, సన్నగా, పీలగా, నల్లగా వున్నాడు.  
    అతన్ని చూస్తూనే ఉలిక్కిపడింది జ్యోతి. 'ఇతనా పెళ్ళికొడుకు? ఛీ!' అనుకుంది. పోనీ అందం ఎలావున్న గొప్ప ఉద్యోగస్థుడు, ఏ బిజినెస్ మాగ్నటో అయితే సరిపెట్టుకునేది.
    హడావిడిగా పెళ్ళికొడుకు చదువేమితో, ఉద్యోగమేమిటో కూడా చెప్పకుండానే పెళ్ళిచూపులకి కూర్చోపెట్టారేమో జ్యోతికి ఏదీ తేల్చుకునే అవకాశం లేకపోయింది. పెళ్ళికొడుకుని చూడగానే సగం నీరు కారిపోయిన జ్యోతి వాళ్ళు వెళ్ళాక పెళ్ళికొడుకు బి.ఏ. ప్యాసయి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నాడని, ఆరువందల జీతం అని వినగానే ఆమెకి కోపం ముంచెత్తింది.
    "ఛీ - ఇంతోటి పెళ్ళికొడుకుకోసమా అంత హడావిడిగా కాలేజీలకి కబురెట్టించారు?" ఈసడింపుగా అంది తల్లి దగ్గర
    కూతురు అసంతృప్తి గమనించిన జానకి -
    "ఏం చెయ్యమంటావు? వాళ్ళు అనుకోకుండా హఠాత్తుగా వచ్చారు. వాళ్ళు ఇంకో సంబంధం చూసుకోడానికి వచ్చారట ఈ వూరు. ఆ పిల్ల నచ్చలేదట. మన రామ్మూర్తిగారికి బాగా తెల్సినవాడట. పిల్లని చూపిస్తరండి" అని మరీ వెంటబెట్టుకు తీసుకొచ్చాడు.
    "ఆ.... మా గొప్ప సంబంధం తెచ్చాడులే."
    "ఏం! ఇంతకంటే గొప్ప సంబంధం మనకి దొరుకుతుందేమిటి? ఏదో ఆరువందల తెచ్చుకుంటున్నాడు. బ్యాంక్ ఉద్యోగం. ముందు ముందు ఇంకా పైకి వస్తాడు. కుర్రాడు బుద్ధిమంతుడట, ఇతనే ఆఖరివాడట. ఆడపిల్లల పెళ్ళిళ్ళయ్యాయి. ఇంకో అన్నగారుగారుపాటికి అతనున్నాడు. ఇతను పెట్టి పోషించాల్సింది ఎవరూ లేరు...." జానకి వల్లిస్తూంది.
    జ్యోతికి గొంతుదాకా కోపం, ఉక్రోషం వచ్చాయి. 'ఆరువందల జీతమంట- పైగా మంచి సంబంధంట ' హేళనగా ఆనుకుంది.
    "ఇది కుదిరితే మంచి సంబంధమే" అంది జానకి.
    "ఛా! కోతిలా వున్నాడు. నేను చేసుకోను" అంది జ్యోతి మూతి తిప్పి.
    జానకి కూతుర్ని ఒక్కక్షణం వింతగా చూసింది. "ఆ.... నీవు మహా బాగున్నావులే. ఏం కలొంకరా, కన్నొంకరా? అయినా మొగాడికి అందమేమిటి? బుద్ధిమంతుడయి, నాల్గు రాళ్ళు తెచ్చుకుంటే చాలు" అంది తేలిగ్గా నవ్వేస్తూ.
    జ్యోతికి ఉక్రోషం వచ్చింది.
    వీళ్ళకి ఎలా చెప్పడం?ఛీ. వీళ్ళది యింత చీఫ్ టేస్ట్ ఏమిటి? ఈ ఆడవాళ్ళందరూ ఇంతే. మొగుడంటూ దొరికితే  చాలనుకుంటారు అమ్మమ్మ కబుర్లు చెబుతారు. వీళ్ళతో ఎలా?