ప్రవాహంలా జనం రావడం, వెళ్లడం చూస్తున్న వనజాక్షి టెన్షన్ ఆపుకోలేక తన కాబిన్ లోంచి లేచొచ్చేసింది.

 

    "ఏమిటి మహతి... ఏమిటిది...?"

 

    "ఏం లేదు మేడమ్... మా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తుందంటే, ఒక డ్రెస్ మెటీరియల్ ని తెప్పించాను. నిన్న ఓ ఫ్రెండ్ మారేజ్ రిసెప్షన్ లో మిగతా ఫ్రెండ్స్ కి చూపించాను... ఆ అమెరికా మెటీరియల్ తెప్పించమని... ఆర్డర్స్... అంతే..." నవ్వుతూ చెప్పింది మహతి.

 

    "ఆ మెటీరియల్ నాకు చూపించకుండానే నువ్వు బిజినెస్ చేసేస్తున్నావ్..." అంది వనజాక్షి.

 

    "ఐ విల్ షో యూ విత్ ఇన్ టెన్ డేస్ మేడమ్... బిజినెస్ పనిమీద బయటకెళుతున్నాను... నాకోసం ఏమైనా ఫోన్ లు వస్తే... రేపు పదిగంటలకు ఫోన్ చెయ్యమని చెప్తారా?"

 

    "అలాగే... వైనాట్... వెళ్ళు... వెళ్ళు" ముచ్చటగా చూస్తూ అంది వనజాక్షి.

 

    అరవైవేల క్యాష్ ని హేండ్ బేగ్ లో పెట్టుకుని, రోడ్డుమీదకి వచ్చింది మహతి. ఆటో ఎక్కి, గౌలీగూడ బస్టాండ్ కొచ్చింది. ప్లాట్ ఫారం నెంబర్ త్రీలో ఆగిన భువనగిరి బస్సు ఎక్కి కూర్చుంది. ఆ బస్సు మరో పదినిమిషాలలో స్టేషన్ నుంచి బయలుదేరింది. ప్రస్తుతం తను అమ్మినది, అమ్మబోయేది మెటీరియల్ ని కాదు... మానసిక సంతృప్తిని... స్టేటస్ ని... ఒకసారి నవ్వుకుంది మహతి.

 

                                   *    *    *    *

 

    రాత్రి పదిగంటలు దాటింది.

 

    రద్దీగా వున్న పెట్రోల్ బంక్, అప్పుడే ఖాళీ అయింది. అంతవరకూ అశోక్ కుమార్ హస్క్ కొట్టి, అప్పుడే వెళ్లిపోయాడు. బాయిస్ ఇద్దరూ ఆయిల్ టాంక్ ప్లాట్ ఫారం మీద కూర్చుని కబుర్లాడుతున్నారు.

 

    అదే సమయంలో-

 

    ఏదో ఢీకొన్న శబ్ధం. ఎవరో గట్టిగా అరిచిన అరుపు వినబడడంతో ఆఫీసు రూంలోంచి బయటకొచ్చాడు మధుకర్. ఏదో కారు పెట్రోల్ బంక్ లోకి రాబోయి, మలుపులో వున్న ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొంది. ఆ దెబ్బతో, ఆ స్తంభానికున్న ట్యూబ్ లైట్ పగిలిపోయింది.

 

    రోడ్డుమీద వెళ్ళిపోతున్న ఇద్దరు ముగ్గురుతోపాటు, మధుకర్ కూడా గబగబా కారు దగ్గరకెళ్లాడు.

 

    "షారీ... బాష్... బ్రేక్ పెయళ్..." కారులోని వ్యక్తి నోట్లోంచి మగతగా వచ్చే మాటల కంటే ముందు, మందు వాసన ముక్కుపుటాలకు తగులుతోంది.

 

    అది బ్రేక్ ఫెయిల్ కాదు. ఓవర్ డ్రింకింగ్ వల్ల జరిగిందన్న విషయం అతన్ని చూడగానే తెలుస్తోంది. గేరు మార్చడానికే అతను చాలా బాధపడుతున్నాడు. మరికాస్సేపటికి అతను స్టీరింగ్ మీద మత్తుగా తల వాల్చేసాడు.

 

    "సర్... సర్" మధుకర్ పిలిచాడు. ఆ వ్యక్తి ఇప్పట్లో లేవడని అర్థమైపోయింది మధుకర్ కి. ఏం చెయ్యాలి? అటూ ఇటూ చూసాడు. మనిషిని కదిపి చూసాడు.

 

    "సర్... మీ రెసిడెన్స్ ఎక్కడ సర్..." స్పృహలేని స్థితిలో వున్న అతను జేబులోంచి విజిటింగ్ కార్డు తీసి, మధుకర్ చేతికి అందిచ్చి, పూర్తిగా సీటు మీద వాలిపోయాడు. గబుక్కున ఆ విజిటింగ్ కార్డు చూసాడు మధుకర్.

 

    సూట్ నెం. 401.

 

    హోటల్ కృష్ణా ఓబ్రాయ్.

 

    ఏం చెయ్యాలో తోచలేదు మధుకర్ కి. మరోసారి చుట్టూ చూసాడు. ఏం చేద్దామా అన్నట్లుగా పక్కన నిలుచున్న బాయిస్ వేపు చూసి-

 

    "ఎవరో పెద్దాయనలా ఉన్నాడు. కృష్ణా ఓబ్రాయ్ లో ఉంటున్నాడు. అక్కడ డ్రాప్ చేసి వస్తాను. ఒక అరగంటలో వస్తాను. బంక్ చూస్తూ వుండండి..." అన్నాడు మధుకర్ కారు డోర్ తెరుస్తూ.

 

    "అలాగే బాస్..." అన్నారు బాయిస్.

 

    మధుకర్ కారెక్కి స్టీరింగ్ ముందు కూర్చుని, ఇగ్నేషన్ కీ తిప్పాడు.

 

    చిన్న సంఘటన జీవితంలో పెద్ద మార్పులకు కారణం అవుతుంది ఒక్కోసారి.

 

    ఒక చౌరస్తాలో ఒంటరిగా నిలబడ్డ సాహసి మధుకర్ జీవితంలోకి, మరొక అధ్యాయం అదృష్టహస్తంలా ప్రవేశిస్తోందని కారుని డ్రైవ్ చేస్తున్న అతనికి తెలీదు.

 

    ఎన్నిసార్లు తనిలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నాడు! ఎంతమంది అపరిచిత వ్యక్తులు తనని డ్రాప్ చేసారు ...? గతం ఒక్కసారి జ్ఞాపకానికొచ్చింది .

 

    జాలిగా సీటుమీద పడుకుని నిద్రపోతున్న ఆ వ్యక్తివేపు చూశాడు మధుకర్ .

 

    మరో పావుగంటలో మధుకర్, హోటల్ కృష్ణా ఓబ్రాయ్ లో వున్నాడు. కారుని పార్క్ చేసి, కారులోని ఆ వ్యక్తిని భుజమ్మీద వేసుకుని, హోటల్లోకి తీసుకొచ్చి, కౌంటర్ లో ఆయన పేరుని కనుక్కొని, సూట్ నెంబర్ మరోసారి కన్ ఫర్మ్ చేసుకుని-

 

    లిఫ్ట్ లోంచి పైకి తీసుకెళ్లాడు.

 

    సూట్ లో, బెడ్ రూంలో పడుకోబెట్టాడు. ఒక్కసారి నిద్రపోతున్న అతని ముఖంవేపు చూసి, టేబుల్ మీదున్న విజిటింగ్ కార్డ్ తీశాడు.

 

    సుమదేవ్ M.D.,

 

    ADDS INDIA, BOMBAY.

 

    విజిటింగు కార్డును మళ్ళా టేబిల్ మీద పడేసి, కుర్చీలో కాసేపు కూర్చున్నాడు.అతి కాస్ట్ లీ గా వున్న సూట్లో, ఒకపక్క ఎడ్వర్ టైజ్ మెంట్ కి సంబంధించిన ఎన్నెన్నో బుక్స్ వున్నాయి. మరో పక్క ఏవో కొన్ని ఎల్.పి. రికార్డులు, మరోపక్క ఖాళీ బీర్ బాటిల్స్, ఏవో ఇంటర్నేషనల్ మాగజైన్స్.

 

    టేబిల్ మీద బెడ్ లైట్, ఆ పక్కన సగం తెరిచి ఓ.వి.ఐ.పి. సూట్ కేసు- మధుకర్ అటువేపు కదిలి, ఆ సూట్ కేస్ అప్పర్ భాగాన్ని పైకెత్తి, కనబడిన దృశ్యానికి అవాక్కయిపోయాడు. ఆ సూట్ కేస్ నిండా కొత్త కరెన్సీ నోట్ల కట్టలు, ఇంత నిర్లక్ష్యంగా ఎలా వున్నాడో ఈ మనిషి... సూట్ కేస్ ని క్లోజ్ చేసేసి , తల పక్కకు తిప్పి చూసాడు.

 

    ఏవో కంపెనీల ఎడ్వర్ టైజ్ మెంట్లకు సంబంధించిన స్కెచ్ డిజైన్ లు, కొన్ని ఆర్ట్ వర్క్స్ పూర్తి చేసుకుని, కేప్షన్స్ కోసం సిద్ధం చేయబడి వున్నాయి. ఒక్కొక్కటీ తీసి చూస్తున్నాడు మధుకర్.

 

    మినర్వా వాటర్ హీటర్స్ యాడ్ ఒకటి.

 

    Minerva saves and saves again.

 

    రెండోది ఏదో హెయిర్ టానిక్ యాడ్... మూడోది బ్యాంక్ యాడ్... కేరళలోని ఏదో మారుమూల పల్లె ఆ బ్యాంక్ ఆర్ధిక సహాయంతో ఒక మోడల్ టౌన్ షిప్ లా తయారైంది.

 

 

    ఆర్టిస్ట్ వర్క్ బాగున్నా, కస్టమర్ ని ఆకర్షించడానికి వాటికి రాసిన కేప్షన్స్ మాత్రం నచ్చేలేదు అతనికి.

 

    అందులో-

 

    అన్ని యాడ్స్ కన్నా ఫుల్ పేజీ! యాడ్ కోసం తయారుచేసిన డిజైన్ ని చూసాడు మధుకర్.

 

    అదొక కాటన్ మిల్స్ కోసం తయారుచేయబడిన యాడ్. ఆ మిల్స్ ఇంట్లో గృహిణులు రోజూవారీ ఉపయోగించుకోవడం కోసం అతి తక్కువ ధరకు కాటన్ శారీస్ ని తయారుచేసింది.

 

    చిత్రంలో-

 

    ఒక మధ్యతరగతి అమ్మాయి, ఇంటిముందు వరండాలో కూర్చుని జడ వేసుకుంటోంది. ఆమె ఎదురుగా చిన్న అద్దం. ఆ అమ్మాయి రంగు రంగుల కాటన్ చీర కట్టుకుని వుంది.