పేషెంట్ల బంధువులు మాత్రమేకాక యిప్పుడక్కడ రాజకీయనాయకులూ ప్రవేశించి నినాదాలు చేస్తున్న విద్యార్థినీ విద్యార్థుల్ని చల్లబరచాలని ప్రయత్నిస్తున్నారు.

 

    సంధ్యకి న్యాయం జరిగేదాకా మేం విశ్రమించం"

 

    అవకాశం తీసుకుంటున్న ప్రతిపక్షనాయకుడ్ని చూస్తూ విద్యార్థులు చప్పట్లు కొట్టారు.

 

    దూరంగా మసకచీకటిలో నిలబడి గమనిస్తున్నాడు శ్రీహర్ష.

 

    ఒక అంతర్జాతీయ నేరస్థుడిగా రూపాన్ని గుర్తుపట్టకుండా జాగ్రత్త పడటం అతనికి కొత్తకాదు.

 

    సంధ్య జీవితంలో మళ్ళీ ఉషోదయం అయ్యేట్టు చేస్తానని నేను హామీ ఇస్తున్నాను."

 

    మరో వాగ్ధానం.

 

    జోలపాటలా అనిపించిందేమో ఆ మాటకే సంధ్య జీవితం చక్కబడి పోయినట్టు మరోసారి కరతాళ ధ్వనులు.

 

    "సంధ్య జీవితం యిలా కావటానికి కారణమైన వ్యక్తుల్ని చట్టానికి అప్పచెప్పేదాకా నేను విశ్రమించను."

 

    "అవసరం లేదు" అరిచారెవరో. "నిన్న రాత్రే అఘాయిత్యం చేసిన అయిదుగురూ శవాలైపోయారు... పేపరు చదవలేదనుకుంటాను."

 

    కంగారుపడిన సదరు రాజకీయనాయకుడు "అలా అని నేను విశ్రాంతి తీసుకోలేను. మరోసారి యిలా ట్రయిన్స్ లో మానభంగం జరిగితే కేంద్ర రైల్వేమంత్రిని రాజీనామా చేయాలని ఉద్యమం నడుపుతాను"

 

    నిర్లిప్తంగా నవ్వుకున్నారు.

 

    ఈ దేశంలో పేదవాడికి అన్నంలాగే రాజకీయనాయకుడికి అరాచకాలూ కావాలి. ముఖ్యంగా ప్రతిపక్షాలకి.

 

    "సర్"

 

    ఉలిక్కిపడ్డాడు శ్రీహర్ష.

 

    రాణా వెంటనే అతడ్ని దూరంగా లాక్కుపోయాడు "మరికొన్ని నిముషాలలో ఇక్కడ గొడవ మొదలు కాబోతుంది. పోలీసులు రంగంలోకి దిగుతున్నారు."

 

    అర్థంకాలేదు షాకి.

 

    "అవును శ్రీహర్షా! చాలారోజులనుంచీ పనిలేని ఈ ప్రతిపక్షనాయకుడు యిప్పుడు హాస్టల్ మీద అటాక్ చేయటానికి కొందరు విద్యార్థి నాయకులతో ప్లాన్ చేశాడు. వాళ్ళతోబాటు తనూ అరెస్టు కావాలనుకుంటున్నాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్."

 

    ఆ విషయంపై ఆసక్తిలేదు. నడుస్తూనే అన్నాడు "సంధ్య యెలా వుంది."

 

    "ఇంకా స్పృహలోకి రాలేదు"

 

    వారి చర్చ కొనసాగుతుండగానే దూరంగా హోరు వినిపించింది.

 

    విద్యార్థులు రాళ్ళు విసురుతుంటే వేన్స్ లోనుంచి దిగిన పోలీసులు బాష్ప వాయువు ప్రయోగిస్తున్నారు. ఓ మూల లాఠీఛార్జి జరుగుతుంటే స్వాతంత్ర్య సమరయోధుడిలా రాజకీయ నాయకుడు చొక్కా చించుకుని గుండె చూపిస్తున్నాడు.

 

    పోలీసులు అందిన విద్యార్థులందర్నీ వేన్ లోకి యెక్కిస్తున్నారు.

 

    ఓ ప్రణాళికలా అంతా జరిగిపోతోంది.

 

    కారిడార్స్ లో నిలబడ్డ వ్యక్తుల్నీ ఉపేక్షించి విడిచిపెట్టడం లేదు.

 

    రేడియోలజీ డిపార్టుమెంటు దాటి పిల్లలవార్డుని క్రాస్ చేస్తుండగా ఓ దృశ్యం వారికంట పడింది.

 

    సన్నని కాలిబాటపైనుంచి ఓ వృద్ధురాలు పరుగెత్తుకొస్తూంది ఎవరో తరుముతున్నట్టుగా.

 

    వస్తూనే శ్రీహర్షని ఢీకొని నీరసంగా నేలమీద పడిపోయింది.

 

    అప్పటికే హాస్పటల్ వార్డుబోయ్స్ కొందరు ఆమెను సమీపించి ముట్టుకోకూడదని వస్తువులా లాఠీలతో నెడుతూంటే "నన్ను రక్షించండయ్యా" అంటూ బలంగా శ్రీహర్ష పాదాల్ని చుట్టేసింది.

 

    ముందు అర్థంకాలేదు జరుగుతున్న దేమిటో...

 

    చిక్కి శల్యమయిన ఆ స్త్రీని చూస్తూ రాణా కూడా కంగారుపడిపోయాడు. "శ్రీహర్ష... ప్లీజ్. డోంట్ టచ్ హర్"

 

    అతడు నిర్విణ్నుడై చూస్తుండగానే లాఠీలతో నెట్టుకుంటూ తీసుకుపోయారు.

 

    "ఏమిటిది ఎవరామె" అర్థంకానట్టుగా అడిగాడు శ్రీహర్ష... మీకు తెలుసా"

 

    "పోలీసులకన్నా ప్రమాదకరమైన వ్యక్తి"

 

    "అంటే"

 

    "సంఘంలో సానుభూతి చూపించకూడని వ్యక్తులు కొందరుంటారు శ్రీహర్షా. ఈమె కూడా అలాంటిదే. ఆ మధ్య నేను ఇంటర్వ్యూచేసిన యీ వృద్ధురాలు ఈ రాష్ట్రంలో నమోదయిన తొలి ఎయిడ్స్ పేషెంట్" క్లుప్తంగా చెప్పాడు రాణా.

 

    రాణా ఎందుకు తనను విదిలించుకొమ్మన్నదీ అర్థమైపోయింది. వార్డ్ బోయ్స్ లాఠీలతో నెట్టడానికి గానీ, రాణా సైతం అసహ్యభావాన్ని ప్రకటించటానికి గాని కారణం ఎయిడ్స్ సునాయాసంగా వ్యాపించే అంటువ్యాధి. అయినా ఆమె శ్రీహర్షకింకా గుర్తుకొస్తూంది. చిక్కిశల్యమైపోయిన ఆమెకు నలభై అయిదేళ్ళ వయసుంటుందేమో.

 

    "ఇప్పుడేం చేయాలని ఆమెను నిర్భందించి వుంచినట్టు" అడిగాడు శ్రీహర్ష.

 

    "ట్రీట్ మెంటులేని అతి ప్రమాదకరమైన జబ్బుని సొంతంచేసుకున్న ఈమె మహా అయితే యిక బ్రతికేది రెండుమూడు నెలలే అంటున్నారు డాక్టర్లు. అంతవరకూ యీమెని నిర్భంధించే వుంచుతారు జబ్బు స్ప్రెడ్ కాకుండా. నిజానికి ఒకప్పుడు విదేశాలకే పరిమితమయిన ఈ జబ్బు యిప్పుడు భారతదేశానికి విస్తరించిపోయింది. ఎప్పుడో ఆరునెలల క్రితం యీవిడ కెబిహెచ్ కి వచ్చింది. ముందు వ్యాధిని గుర్తించలేకపోయినా డాక్టర్లు ఆ తర్వాత ELISA పరీక్ష ద్వారా ఆమె HIV పోజిటివ్ గా గుర్తించి ఎయిడ్స్ జబ్బుగా నిర్ధారించారు. మూడేళ్ళ క్రితం బాంబే రెడ్ లైట్ ఏరియాలో వేశ్యల్ని పరీక్షించినపుడు ఒక్క శాతం కన్నా తక్కువ వున్న ఎయిడ్స్ కేరియర్స్ ఇప్పుడు ఈ దేశంలో మూడు లక్షలదాకా విస్తరించారని అంచనా. అయితే ఈవిడమీద సానుభూతి చూపించాల్సిన విషయం ఏమిటంటే ఈమె వేశ్యకాదు."

 

    మనసు ద్రవించినట్టయింది శ్రీహర్షకి "ఈ జబ్బు వ్యాపించేది ఒక్క సెక్సియన్ కే కాదు రాణా... ...ఆ జబ్బున్న వ్యక్తులు రక్తం ఇచ్చినా చాలు."

 

    ఆ తర్వాత వారి చర్చ అర్ధంతరంగా ముగిసిపోయింది.

 

    కారణం ఏదన్నా కాని ఒక వృద్ధురాలు చావుకి సైతం స్వేచ్చ లేని మార్గంలో చిక్కుకుని తనవాళ్ళకోసం తపించిపోతూంది.

 

    తల్లికోసం బిడ్డ పడే తాపత్రయం కాదు, బిడ్డకోసం తండ్రిపడే తపన తెలిసినవాడిగా అర్థరాత్రిదాకా ఆలోచించిన శ్రీహర్ష పదేపదే ఆమెరూపం గుర్తుకొస్తుంటే అపరాత్రి దాటేక హాస్పటల్ కి వెళ్ళాడు రహస్యంగా ఆమెను కలుసుకోవాలని...

 

    విధివశాత్తూ జరిగే చాలా సంఘటనలు మనిషిని ఎంత ఆశ్చర్యపరిచేదీ మరోసారి తెలుసుకున్నాడు.