"ఆదినుండీ అది నీ కేరెక్టరేగా!"
    
    వెళ్ళాలన్నట్టు లేచాడు.
    
    మనససంతా అదోలా అయిపోతుంటే ఏ విషయం అడగాలని ఇంత దూరం వచ్చిందో అది అడక్కుండా ఉండలేకపోయింది.
    
    "బావా!"
    
    ఆ పిలుపుని ఊహించని రోహిత్ నిశ్చేష్టుడిలా చూశాడు.
    
    "ఆదిత్యని ఎందుకు గెలిపించావు?"
    
    షాక్ తిన్నట్టుగా చూశాడు.
    
    "నేను పొరపాటుపడలేదని నాకు తెలుసు బావా!"
    
    "నువ్వు అహంకారివేమో కాని అబద్దం చెప్పలేవు."
    
    "గెలిపించానని ఎందుకనుకుంటున్నావు?"
    
    "సత్యేంద్రని ఓడించాలనే ధ్యేయంతో నువ్వడిగిన ప్రశ్నలు నాకు గుర్తున్నాయి కాబట్టి."
    
    "ప్రణయా!" రోహిత్ గొంతు పూడుకుపోయింది చిత్రంగా.
    
    "నిజమే నేను అహంకారినే తప్ప దుర్మార్గుడిని కాను. కాబట్టే ఒకనాటి ఓటమితో జరిగిపోయిన నష్టాన్ని తెలుసుకున్నాను. వ్యక్తిగా ఓడినా నైతికంగా గెలవాలని ఈరోజు సత్యేంద్రని కంగారుపెట్టే ప్రశ్నలే అడిగాను. ఎస్ ప్రణయా! నిజానికి నేను వేదికపైకి అడుగుపెడుతూ కోరుకున్నది ఆదిత్య ఓటమిని! కాని మధ్యలోనే గ్రహించాను వాసుదేవరావు ఫౌల్ ప్లేతో ఆదిత్య ఓటమికి సిద్దపడుతున్నాడని!" క్షణం ఆగాడు రోహిత్ "ప్రణయా! ప్రపంచం గురించి చాలా తెలుసునని గర్వపడే నాకు, ప్రేమ గురించి తెలిసింది చాలా తక్కువని ఈ మధ్యనే మనసు నేర్పిన సత్యాన్ని గుర్తు చేసుకున్నాను. నేను కోల్పోయింది ఆదిత్య కూడా పోగొట్టుకోకూడదని మరోలా విజ్రుంభించాను. నాకు తెలుసు వాసుదేవరావు దృష్టిలో నేను దుర్మార్గుడిగా మారానని. మారితేనేం? మీ అందరి ఆలోచనల్లో అణువంత ఎదిగిపోయాను అది చాలుగా! బై!"
    
    వెళ్ళిపోతున్న రోహిత్ కాదు, అతడి కళ్ళలో అస్పష్టంగా కనిపించిన తడిని గుర్తుచేసుకుంటూ నిర్లిప్తంగా నిలబడిపోయింది.
    
    వారించేదే! కాని అప్పటికే సెక్యూరిటీ చెక్ దాటి వెళ్ళిపోయాడు.
    
    సోఫాలో కూర్చున్నాడు బోర్డింగ్ కాల్ కోసం ఎదురుచూస్తూ గ్లాసు డోర్ లో నుంచి ఆగి వున్న విమానాన్ని, నిర్మానుష్యంగా వున్న రన్ వేని చూస్తూ చాలా అసహనంగా గడుపుతున్నాడు.
    
    ఇట్స్ లైఫ్ తప్పదు! దక్కించే జీవితం తప్ప, జీవితానికి అర్ధం కోరిందల్లా దక్కించుకోవటం కాదు.
    
    అది ధ్యానం కాదు. ఉవ్వెత్తున లేస్తున్న ఆలోచనాతరంగాల్ని అదిమిపెట్టే విఫల ప్రయత్నంలా కళ్ళు మూసుకున్నాడు.
    
    అదిగో, సరిగ్గా అప్పుడు వినిపించింది మైక్ లో.
    
    "బాంబే విమానంలో ప్రయాణించే పాసింజర్ మిష్టర్ రోహిత్ కు ప్రత్యేక సూచన! బైపాస్ సర్జరీ పూర్తయిన మీ పాప 'ప్రేమ' మీ కోసం ఆత్రంగా ఎదురుచూస్తుందట."
    
    రోహిత్ భ్రుకుటి ముడిపడింది.
    
    "ప్రేమని బ్రతికించుకోవాలీ అంటే మీ అవసరం చాలా ఉందని చెప్పటానికి మీ శ్రీమతి ప్రణయ ఇక్కడ ఎదురుచూస్తుంది. మిమ్మల్ని ప్రయాణం రద్దు చేసుకోమని తన మాటగా..."
    
    అర్ధమైపోయింది రోహిత్ కి. ప్రణయ తనను క్షమించింది. క్షమించడమే కాదు, తనను జీవితంలోకి ఆహ్వానిస్తూంది.
    
    అంతే! ఆ తరువాత బోర్డింగ్ కాల్ వినిపించలేదు.
    
    మరో కొత్త ప్రయాణానికి సిద్దపడుతూ బయటికి వచ్చిన రోహిత్ అప్రతిభుడయ్యాడు.
    
    అక్కడ ప్రణయతోబాటు ప్రబంధ, ఆదిత్య కూడా నిలబడిఉన్నారు చిరుమందహాసాలతో.
    
    
    
                                  --సమాప్తం--