పెరుగుతో హెయిర్ పెరుగుద్ది!

ఈమధ్య హెయిర్ లాస్ ఎక్కువైంది... నా జుత్తు ఇంత ఉండేది, ఇంతైపోయింది... ఇలాంటి మాటలు తరచూ వినబడుతూనే ఉంటాయి. అమ్మాయిలకు కురులు ఎంతో అందం. అందుకే అవి రాలుతుంటే దిగులుగా ఉంటుంది. ఆ దిగులుతోనే చాలామంది తలకు ఏవేవో పూసేస్తుంటారు. హెయిర్ ట్రీట్మెంట్లంటూ వేలకు వేలు పోసేస్తుంటారు. వాళ్ల కోసమే ఇది. కాసింత పెరుగు ఉంటే మీ హెయిర్ అద్భుతంగా పెరుగుందని మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకోండి. 

 

- ఒక కోడిగుడ్డు సొనలో రెండు చెంచాల పెరుగు కలిపి మాడుకు పట్టించండి. అరగంట తర్వాత తలంటుకోండి. వారానికోసారి ఇలా చేస్తే జుత్తు రాలదు సరికదా ఇంకా ఒత్తుగా అవుతుంది.

 

- బాగా పండిన అరటిపండు గుజ్జులో చెంచాడు పెరుగు, మూడు చెంచాల తేనె, ఓ చెంచాడు నిమ్మరసం కలిపి తలకు ప్యాక్ వేసుకోండి. మూడు నెలల పాటు వారానికోసారి ఇలా చేస్తే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఆ తర్వాత రెండు వారాలకోసారి వేసుకుంటే చాలు. మళ్లీ సమస్య రాకుండా ఉంటుంది.

 

- ఓ కప్పు పెరుగులో రెండు కప్పుల నీళ్లు వేసి బాగా చిలకండి. ఇందులో చెంచాడు ఆలివ్ ఆయిల్, చెంచాడు నిమ్మరసం వేసి కలిపి మాడుకు, జుత్తుకు బాగా పట్టించండి. ఇరవై నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకుని తలంటుకోండి. తరచుగా ఇలా చేస్తూ ఉంటే మీ హెయిర్ ఎంత బలంగా అవుతుందో మీకే తెలుస్తుంది.

 

- అరకప్పు పెరుగులో చెంచాడు తేనె, చెంచాడు వెనిగర్ కలిపి జుత్తుకు పట్టించండి. అరగంట తర్వాత ఎగ్ షాంపూతో తలంటుకోండి. వారానికోసారి ఇలా చేసినా కూడా జుత్తు రాలడం తగ్గి బలపడుతుంది. మెరుస్తుంది.

 

- పెరుగులో అలొవెరా జిగురు, ఆలివ్ ఆయిల్, తేనె కలిపి ప్యాక్ వేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

 

- గుప్పెడు కరివేపాకుల్ని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ఓ కప్పు పెరుగులో కలిపి తలకు రాసుకోవాలి. దీనివల్ల జుత్తు బాగా పెరుగుతుంది.

 

- మెంతుల్ని పెరుగులో నానబెట్టి, రుబ్బి తలకు రాసుకున్నా... పెరుగులో కొబ్బరి పాలు కలిపి దానితో జుత్తు కడుక్కున్నా కూడా మంచిదే. వీటివల్ల హెయిర్ గ్రోత్ బాగా ఉండటమే కాదు... తళుకులీనుతుంది కూడా.

చూశారు కదా! హెయిర్ పెరగడానికి పెరుగు ఇంత ఉపయోగపడుతుంది. వెంటనే ట్రై చేయండి మరి!
 

- Sameera