"ఈ విషయం జోహ్రాకి తెలిస్తే?"
    
    "ఏ విషయం?"
    
    "ఫస్టు ఎటెంమ్ట్ లోనే మాస్టర్ ని చంపటం అంత తేలికకాదని నాకెందుకు చెప్పలేదని జోహ్రా నిలదీస్తే?"
    
    "అది జోహ్రా అసమర్ధతనే ఎత్తి చూపిస్తుంది. నువ్వేదో ఇంటర్నేషనల్ రేంజ్ హిట్ మెన్ వని కోట్లు ఇవ్వటానికి సిద్దపడి నిన్ను పిలిస్తే, ఎందుకు చెప్పలేదనే విషయాలతో నిన్ను నువ్వే ఎందుకు కించపర్చుకుంటున్నావని ప్రశ్నిస్తాను. అయినా జోహ్రకి అహం ఎక్కువ. ఆత్మాభిమానం మరీ ఎక్కువ. అలా కారణాలని వెతుక్కోలేడు. అర్ధమయిందా?"
    
    ఒక మేధావిని చూస్తున్న భావానికి గురయి లిండాహాన్ ఒళ్ళు జలదరించింది.
    
    మరికొద్ది నిమిషాల్లో లిండాహాన్ సింగపూర్ పోలీసు కమీషనర్ ఆఫీసుకి చేరుకున్నాడు.
    
                                                    *    *    *    *    *
    
    "అది నాకు తెలుసు. ఆ నెట్ వర్క్ నాకుంది. వాళ్ళే నన్ను చంపమని ఒక హిట్ మెన్ ని నియమించారు. ఇప్పుడతను బొంబాయిలోనే ఉన్నాడు. అతనే మొన్నీ మధ్య నామీద జుహ్రూ ఏరియాలో ఎటాక్ చేసింది. అతను గ్రేట్ హిట్ మెన్ అమానుల్లా ఖాన్ ని కూడా నాకు తెలుసు. మొదటి ప్రయత్నంలో అతను దెబ్బతిన్నాడు. తిరిగి రెండో ప్రయత్నం చేయకుండా తిరిగి వెళ్ళడు. అతని మనస్తత్వం నాకు తెలుసు. అందుకే హాన్ బ్రదర్స్ కంప్లయింట్ లాడ్జ్ చేసారు. వాళ్ళ స్ట్రాటజీ నాకు తెలియంది కాదు. నిజానికి జోహ్రా సెకండ్ టైమ్ నామీద ఎటాక్ చేయాలని నన్ను చంపే ప్రయత్నం చేయాలనే నేను ఆశిస్తున్నాను."
    
    మాస్టర్ ఒక ఆగంతకుడితో తన ఛాంబర్ లో మాట్లాడుతూ అన్నాడు.
    
    "మరి..... హాన్ సోదరుల్ని ఇక పోలీసులు అనుమానించలేరుగా?" ఆ ఆగంతకుడు ప్రశ్నించాడు.
    
    "అనుమానించరు. ఆ విధంగా వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవచ్చు. కాని నానుంచి కాదు" పట్టుదలగా అన్నాడు మాస్టర్.
    
    "ఈలోపల ఆ అమానుల్లా నిన్ను ఏదయినా చేస్తే."
    
    "ఏం చేస్తాడు?"
    
    "చంపితే?"
    
    "చంపాలనే కోరుకుంటున్నాను" అన్నాడు మాస్టర్ నర్మగర్భంగా.
    
    ఆగంతకుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు ఎగిరిపడ్డాడు సీటులోంచి.
    
    చావుగురించి ఎంతో తేలిగ్గా మాట్లాడుతున్న మాస్టర్ ని చూసిన ఆ ఆగంతకుడు ఓ క్షణం భయంతో వణికిపోయాడు.
    
    "హాన్ సోదరులు మీ కుటుంబాన్నే ఆధారాలు లేకుండా మట్టుబెట్టిన నరహంతకులు ఆపైన జోహ్రా-వీరినుంచి తప్పించుకోవటం అంత తేలికయిన విషయం కాదు..." షాక్ నుంచి తేరుకుంటూ అన్నాడా ఆగంతకుడు.
    
    మాస్టర్ నవ్వాడు. నవ్వుతూనే అన్నాడు.
    
    "ఎవరు ఎవర్ని చంపుతారో అప్పుడే చెప్పుకుంటే ఎలా? మరికొన్ని రోజులాగితే నా చుట్టూ అల్లుకున్న మిస్టరీ తేలిగ్గా విడిపోతుంది. కథ కంచికి....అంటే క్లయిమాక్స్ కి చేరుతుంది. మరిక ఉండనా?"
    
    మాస్టర్ ఉద్దేశాన్ని గ్రహించిన ఆగంతకుడు వెళ్ళిపోయేందుకు ఉద్యుక్తుడవుతుండగా మాస్టర్ మెరుపువేగంతో లేచి చిరుతపులిలా తనకు ఎడంవేపునున్న డోర్ కేసి దూకాడు.
    
    ఆగంతకుడు విస్తుపోయి చూస్తుండగా మాస్టర్ ఆ రూమ్ లోంచి కనుమరుగయ్యాడు.
    
    ఆగంతకుడు అలాగే రెప్పవాల్చకుండా అటుకేసి చూస్తుండగా మాస్టర్ తన బంగ్లాలోనే పనిచేసే ఒక గార్డుని జుట్టుపట్టుకొని బరబరా అక్కడకు లాక్కువచ్చాడు.
    
    "వీడెవడో తెలుసా?" ఆగంతకుడికేసి చూస్తూ ప్రశ్నించాడు మాస్టర్.
    
    అతను తెలీదన్నట్లు తలూపాడు.
    
    "అనవసర విషయాల్లో ఆసక్తి చూపించే నా బంగ్లా మెసెంజర్. నాకుండే కొద్దిపాటి ప్రయివసీని కూడా పాడుచేసే రాస్కెల్. అది తప్పు కదా? మనం మాట్లాడుకోవతాన్ని వీడు విన్నాడు. అలా వినకూడదు కదా? విన్నాక బ్రతక్కూడదు కదా? అందుకే వీడ్ని ఇప్పుడే చంపేస్తున్నాను" అంటూ ఆ మెసెంజర్ జుట్టు వదిలేసి చటుక్కున ప్రక్కనే ఉన్న బీరువాలోంచి చిన్న బాటిల్ ని బయటకు తీసి మెసెంజర్ కి అందించాడు.
    
    అతని కళ్ళలో ప్రేతకళ కనిపించింది. భయంతో వళ్ళంతా తడిసిపోయింది.
    
    తప్పు చేసిన భావం అతని కళ్ళ లోతుల్లో స్పష్టంగా కనిపించింది.
    
    "తీసుకో...." అన్నాడు గంభీరంగా మాస్టర్.
    
    మెసెంజర్ వణుకుతున చేతులతో ఆ బాటిల్ ని అందుకున్నాడు. మాస్టర్ కళ్ళల్లో రాక్షసత్వం ఒక్కక్షణం కదలాడి అదృశ్యమై పోయింది.
    
    మెసెంజర్ బాటిల్ ని ఓపెన్ చేసి ఒక్క క్షణమాగి, కళ్ళు మూసుకొని అందులోని ద్రవాన్ని గుటుక్కున మింగేశాడు.
    
    ఇప్పుడే చంపేస్తున్నానని చెప్పిన మాస్టర్ తనని చంపకుండా ఏదో ద్రవమిచ్చి తాగమన్నాడు. అతను తాగేసాడు.... ఏమిటిదంతా? అది విషమా? ఆగంతకుడికి ఏం అర్ధం కాక పిచ్చెక్కిపోయి చూస్తున్నాడు.
    
    కొద్దిక్షణాలాగి మాస్టర్ మరో సీసాను అందుకుని తిరిగి మెసెంజర్ కి అందించాడు.
    
    ఎలాంటి వ్యతిరేకత చూపకుండా మెసెంజర్ దాన్ని కూడా అందుకొని గటగటా తాగేశాడు.
    
    "ఇక ఇప్పుడు తను మాట్లాడలేడు- వ్రాయలేడు నేను అందించే మృత్యువు ఇలాగే వుంటుంది. ఆరునెలల వరకు అతని కంఠంలోని ఓకల్ కార్ద్సు పనిచేయవు - అంటే తెలుసా? స్వరపేటిక విశ్రాంతి తీసుకుంటుంది తాత్కాలికంగా..."
    
    ఆగంతకుడి వెన్ను జలదరించింది భయంతో.