భార్యా-భర్తలిద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు పారవశ్యంగా చూసుకుంటూ అతి దగ్గరగా వున్నారు.
    
    చాయ చేతులు వణకసాగాయి.
    
    ఆ రాత్రి అతనితో తన ప్రవర్తన గుర్తొచ్చింది.
    
    ఫోటోలో కాంచన ఒంటిమీద నగలు ఏదో బంగారం కొట్టు ఎడ్వర్టయిజ్ మెంట్ లోలా వున్నాయి.
    
    అతను ఆమెను పట్టుకున్న విధానం ఇంకా అపురూపంగా వుంది.
    
    "అమ్మ చాలా అందంగా వుంది కదూ?" గుసగుసగా అంది సంధ్య.
    
    కాంచన ఆ మాటలకి నవ్వేస్తూ-వెళ్ళి ఫలహారాలు చెయ్యండి. డాడీకూడా వస్తారు" అంది.
    
    "హాయ్! డాడీ కూడా ఇంకా టిఫిన్ చెయ్యలేదా?" సంధ్య సంతోషంగా అంది.
    
    చాయ చేతుల్లోని శక్తి అంతా ఎవరో లాగేసినట్లు మళ్ళీ వణికాయి.
    
    నెమ్మదిగా చేతిలోని ఫోటోని టేబుల్ మీద పెడుతుండగా వేళ్ళు పట్టు తప్పిపోయాయి.
    
    "అ....య్యో" అంటూ వుండగానే అది క్రిందపడి ఘళ్ళున శబ్దం చేసింది.
    
    "అరే" అంటూ సంధ్య చప్పున వంగితీసింది.
    
    ఆమె వేలికి విరిగిన అద్దంముక్క గుచ్చుకుని ఎర్రని రక్తం చివ్వున బయటికొచ్చింది.
    
    "అయ్యో.....రక్తం" అని కాంచన కంగారుగా సంధ్య చేతిని పట్టుకుంది.
    
    ఆ ఫోటోలోని నవ్వుతున్న కాంచన ముఖంమీద అద్దం బీటవారింది.
    
    కాంచనకి కూతురి రక్తం చూడగానే ముఖం పాలిపోయింది.
    
    అద్దం పగలడం అపశకునంగా అనిపించింది.
    
    ఆమెకి గుండెల్లో సన్నగా నొప్పి మొదలయింది.
    
    సంధ్య వేలినుండి కారుతున్న రక్తంబొట్లు ఫోటోలోని కాంచనమీద పడ్డాయి.
    
    "అయ్యయ్యో.....సారీ" అంది చాయ.
    
    కాంచన మాట్లాడలేకపోయింది.
    
    ఆమెకి నొప్పి ఎక్కువైనట్లుగా చేతితో గుండెలమీద రాసుకుంది.
    
    సంధ్య ఫోటో టేబుల్ మీద పెట్టి- "క్రిందికి వెళదాం రా చాయా!" అని దారితీసింది.
    
    వెళుతూ, వెళుతూ చాయ వెనుతిరిగి చూసింది.
    
    కాంచన కళ్ళల్లోని బాధ ఆమెకి ఉపశమనంగా అనిపించింది.
    
    డైనింగ్ టేబుల్ మీద వేడి-వేడి టొమేటో బాత్ ఆవిర్లు కక్కుతోంది.
    
    సంధ్య తనే వడ్డిస్తూ- "రత్నం! డాడీ వస్తున్నారేమో చూడు!" అంది.
    
    చాయ వూపిరి బిగబట్టి అతని రాకకోసం ఎదురుచూస్తోంది.
    
    తనని ఇక్కడ, ఇలా చూడగానే అతని ముఖంలో ఫీలింగ్స్ ఎలా వుంటాయో ఆమె వూహించుకోసాగింది.
    
                                         * * *
    
    జయచంద్రకి తను చూస్తున్నది ఏమిటో అతనికే అర్ధంకానంత వింతగా అన్పించింది.
    
    వైట్ డ్రస్ కోసం అల్మారా తీస్తే ఎదురుగా వేళ్ళాడుతున్న కోటుకి పై గుండీకి రెండు రింగులు తగిలించి వున్నాయి.
    
    ఇవి రెండూ పకపకలాడుతున్నట్లు వూగుతున్నాయి.
    
    "కాంచనా.....కాంచనా-" అని అంతలోనే ఆగిపోయాడు.
    
    అతనికి కారులో తనని ఆనుకుని కూర్చుని తన చెంపకి చెంప ఆన్చిన అమ్మాయి గుర్తొచ్చింది.
    
    ఆమె చెవులకి కొట్టొచ్చినట్లుగా కనపడే రింగులు పెట్టుకున్న సంగతీ తలపుకొచ్చింది.
    
    "ఇది ఆ అమ్మాయి పనే అనుకున్నాడు. కానీ ఆ మొదటి రింగు ఇంటిలోకి ఎలా వచ్చిందో అతనికి అర్ధంకాలేదు. కాంచనకి తెలుసేమో కానీ అడగాలంటే గిల్టీగా అనిపించి వూరుకున్నాడు.
    
    రెండు రింగులూ అక్కడినుండి తీసేసి తన లాల్చీ జేబులో వేసుకున్నాడు.
    
    "చిన్నమ్మగారూ.....వారి ఫ్రెండూ మీకోసం ఎదురుచూస్తున్నారు బాబూ!" అంటూ రత్నం వచ్చింది.
    
    "ఆ....వస్తున్నా" అంటూ క్రిందికి నడిచాడు జయచంద్ర.
    
    "డాడీ.....మీట్ మై ఫ్రెండ్ చాయ.....నా లాకెట్ వెతికి నాకిచ్చిన అమ్మాయి అని ఇందాక చెప్పలేదూ....ఈ అమ్మాయే" గొప్పగా చెప్పింది సంధ్య.
    
    జయచంద్ర పరిస్థితి మరీ అనూహ్యంగా మారింది.
    
    అసలే ఆశ్చర్యంలో వుంటే మరో అద్భుతం జరిగినట్లుగా ఆ అమ్మాయి ఇంట్లోనే ప్రత్యక్షం అయింది.
    
    ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదేమోలే అనుకుందామంటే.....అదే కొంటెచూపూ, సన్నని పెదవులు, అరవిచ్చీ, విచ్ఛనట్లున్న మధురమయిన దరహాసం! ముఖ్యంగా ఆ కళ్ళలోని మెరుపూ, శిల్పంలాంటి శరీర భంగిమా ఆమేనని నొక్కి చెపుతున్నాయి.
    
    చాయకి అతని ముఖంలోని తబ్బిబ్బు చూస్తుంటే చాలా తమాషాగా అనిపిస్తోంది.
    
    "నమస్తే" అంది.
    
    సంధ్య ఎక్సయిట్ అయిపోతూ లాకెట్ పోవడం, తిరిగి చయకి దొరకడం గురించి వర్ణించి, వర్ణించి చెప్పేస్తోంది.
    
    జయచంద్ర తలవంచుకుని- "థాంక్యూ! తమక్యూ' మిస్ చాయా!"
    
    చాయ నవ్వింది.
    
    ఆ నవ్వు చూస్తుంటే అతనికి ఎందుకో కలవరంగా అనిపించింది. జేబులోని రింగుల్ని ఆమె గమనించిందేమో అని కూడా అనిపించింది.
    
    "టిఫిన్ చెయ్యండి డాడీ.....చల్లారిపోతోంది" చెప్పింది సంధ్య.
    
    జయచంద్ర స్పూన్ నోటి దగ్గరగా పెట్టుకోబోతూ వుండగా-
    
    "అయ్యగారూ....అమ్మగారికి మళ్ళీ నొప్పొచ్చింది. డాక్టరుగారికి ఫోన్ చెయ్యండి" రత్నం కంగారుగా వచ్చి చెప్పింది.
    
    జయచంద్ర వెంటనే లేచి పరిగెత్తాడు. సంధ్య కూడా గాభరాగా లేచి "సారీ చాయ, ఇప్పుడే వస్తాను.....నువ్వు కానియ్యి" అని తండ్రి వెనకాలే వెళ్ళిపోయింది.
    
    "ఇలా ఎప్పుడైనా అయిందా ఆవిడకి?" రత్నాన్ని అడిగింది చాయ.
    
    "రోజుకి ఒక్కసారైనా ఆ మహమ్మారి రోగం మాలక్ష్మిలాంటి అమ్మగార్ని పట్టి పీడిస్తూనే వుంటది" బాధగా అంది రత్నం.