సరిగ్గా అప్పుడే కనకారావు ఎయిర్ పోర్ట్ సింహద్వారం ముందు ఆటో దిగాడు.

 

    ఆటోని పంపించేసి పాస్ కొనుక్కొని ఎయిర్ పోర్టు లాంజ్ లోకి వెళ్ళి పీటర్ కోసం చుట్టూ పరికించి చూశాడు.

 

    పీటర్ కెఫెటేరియా ముందు నుంచుని వుండడం గమనించి అటుకేసి వెళ్ళి ఓ కవరు అందించాడు.

 

    పీటర్ కనకారావు కేసి ప్రశంసగా చూసి మంద్రస్వరాన "అన్నీ వున్నాయా?" అని అడిగాడు.

 

    తలూపాడు కనకారావు వినయంగా.

 

    "నేను మళ్ళీ రెండు రోజుల్లో వచ్చేస్తాను. జాగ్రత్తగా వుండు..." అంటూ పీటర్ మరికొన్ని జాగ్రత్తలు చెప్పాడు కనకారావుకి.

 

    మరో అరగంటకి పీటర్ ఫ్లయిట్ లో వున్నాడు.

 

    కనకారావు ఎయిర్ పోర్ట్ నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కేసాడు.


                                                         *    *    *    *


    "నా కెందుకో భయంగా వుంది సార్" సెక్రటరీ భయపడుతూ అన్నాడు.

 

    "అన్నింటికీ నేనున్నాను. సరీగ్గా అయిదవ రోజు సామంత్ ఫైల్ నాగమ్మగారి ముందుంచాలి. అప్పటికి అన్నీ సిద్దమయిపోతాయి. అన్నీ సవ్యంగా జరిగి నేను చెప్పే వ్యక్తితో నాయకి పెళ్ళి జరిగితే నీ వాటా రెండు లక్షలు, పెళ్ళి రోజే ఇక్కడ జాబ్ కి రిజైన్ చేసి దూరంగా వెళ్ళిపో. తరువాత ఏమైనా గొడవలు జరిగినా నువ్వు సీన్ లో వుండవు. ఇప్పుడు కాదన్నావనుకో- నా పథకం తెలిసిన నువ్వు మిగలవు. ఆ ఏర్పాట్లు కూడా చేశాను. సాయంత్రం మా ఇంటికొచ్చి యాభైవేలు అడ్వాన్స్ పట్టుకెళ్ళు"

 

    సెక్రటరీ భయంతో వణికిపోయాడు.    


                                                          *    *    *    *


    ఉద్వేగం నరసింహం నరనరాన నర్తిస్తోంది... ఉద్వేగం అతన్ని ఆ క్షణాన ఊపివేస్తోంది... ఉద్రేకం అతన్ని పిచ్చివాణ్ణి చేసి వేసింది. అతని కళ్ళిప్పుడు మెర్క్యురీ లైట్లలా మెరుస్తూ బాత్ రూమ్ కేసే చూస్తున్నాయి.

 

    అసలు తను అంతసేపు కళ్ళు ఆర్పకుండా చూడగలనని అతనికే తెలీదు.

 

    పొగడ్తకు ఎంతో కొంతైనా లొంగని మనిషి వుండడు. అందునా పురుషాధిక్యతతో మిడిసిపడే ఈ వ్యవస్థకి ప్రతినిధి అయిన పురుషుడు ఒక యువతి ప్రశంసకు లొంగకుండా వుండగలడా?

 

    అందునా అతని మగతనాన్ని పొగిడినప్పుడు...! మగవాడికి మగతనం వుండడం గొప్ప విషయమేం కాదని, మానవ నిర్మాణంలోనే ఆ మరిక వుందని తెలిసినా, మగవాడికి మగతనం వున్నట్లే స్త్రీకి స్త్రీత్వమూ వుంటుందని తెలిసినా, అంతకంటే తనకున్నదేం గొప్పకాదని తెలిసినా, అదేం కష్టపడి సాధించుకున్నది కాదని తెలిసినా, ఒక స్త్రీని సెక్స్ పరంగా సంతృప్తిపర్చగలగడం విశ్వమానవ కళ్యాణమేమీ కాదని తెలిసినా, లోకహితం కాదని తెలిసినా- మగవాడు గర్వపడతాడు, పొంగిపోతాడు. అదేదో గొప్పని ఆత్మవంచనకు లోనవుతాడు. సమాజపు కట్టుబాట్లను సయితం ధిక్కరించి తను ప్రేమించిన వ్యక్తి దరిచేరి 'నా సర్వస్వాన్నీ అర్పిస్తాను- నిన్ను ఆనందపు అంచులకు తీసుకువెళతాను- ఆ సందర్భంలో దేనికీ భయపడను- ఎవర్నీ లెక్క చేయను. రా! అందుకో నా ప్రేమామృతాన్ని! అందుకో... ఆస్వాదించు- ప్రేమకు పట్టం కట్టు' అని ఓ యువతి కోరితే అప్పుడు సయితం ఆ పురుషుడికి ఆమెలోని ఔన్నత్యం, ప్రేమ గుర్తుకురావు. ఆమెలోని ఆరాధనను, అభిమానాన్ని గుర్తించడు, గౌరవించడు. అదేదో తన మగతనానికి గొప్ప గుర్తింపు అనే భావిస్తాడు.

 

    కష్టపడైనా ఆమెకు మరపురాని, మర్చిపోలేని రాక్షస లైంగికానందాన్ని మొదటిసారి రుచి చూపిస్తే తననిక జీవితాంతం మర్చిపోలేదని భావిస్తాడు.

 

    పురుషుడు ఎంత దౌర్భాగ్యపు స్థితిలో వున్నాడు? ఎప్పుడు స్త్రీని పురుషుడు పూర్తిగా అర్థం చేసుకుంటాడు?

 

    అర్థం చేసుకుని తనకు తనెప్పుడు విలువ ఇచ్చుకుంటాడు?

 

    "చూశావా? ఆ అమ్మాయి నేనంటే పడి చస్తుంది- గమనించారా ఆ అమ్మాయి నేనంటే పిచ్చెక్కిపోతోంది- తెలుసా మీకు! నేను కాదంటే ఫలానా అమ్మాయి చచ్చిపోతుంది- గుర్తించారా నన్ను, ఫలానా అమ్మాయిని ట్రాప్ చేశాను- ఇప్పటికైనా గుర్తించారా నా గొప్పతనాన్ని, నా మగతనాన్ని, నాలోని సామర్థ్యాన్ని!" అని ప్రశ్నించే మగాడిని చూసి జాలిపడడం తప్ప ఎవడైనా ఏం చేయగలరు?

 

    ప్రేమకు విలువ లేకుండా చేసింది ఖచ్చితంగా ఆత్మవంచన నీడలో బ్రతికే మగాడే- ప్రేమ సమాధికి తాపీ మేస్త్రీ పురుషుడే-

 

    ప్రేమయినా, స్నేహమయినా ఇరువైపుల స్పందనతోనే మొలకెత్తుతుంది.

 

    ఒక అరచేయి ప్రేమదీపం ఆరిపోకుండా ఆపగలదా? లేదు.

 

    కాని ఆ తరువాత రెండవ అరచేయి తప్పుకు మొదటి అరచేయి కూడా బలియై అంధకారంలోకి జారిపోతుంది. అసలీ ప్రపంచంలో ప్రేమను కాపాడుకుందామని గాని, పెంచి పోషించుకుందామనిగాని చాలామందికి లేదు.

 

    దాని స్థానంలో పురుషాధిక్యత, ఆత్మవంచన, స్వార్థం, అల్పత్వం, లేకితనం చోటుచేసుకున్నాయి. అప్పుడిక అనుకోవలసింది "పాపం స్త్రీమూర్తి" అని కాదు- "పాపం పురుషుడు" అని.

 

    మధుమతి డ్రామా ఆర్టిస్ట్...

 

    మధుమతి చేసేది వ్యభిచారం కాదు.

 

    పడుపు వృత్తి- ఈ వ్యవస్థ స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం ఇవ్వలేదు గనుక పరిమిత వ్యక్తులతో తాత్కాలిక ప్రణయాన్ని సాగిస్తుంది. కానీ అందుకు ఎప్పుడూ సిగ్గుపడలేదు, సిగ్గుపడదు. ఎందుకంటే నాగరికత శాలువను మనస్సు మీద కప్పేసి మనిషి బలహీనతల్ని సొమ్ము చేసుకొనే పెద్ద మనుష్యులెందరో ఈ సమాజంలో తిరుగుతున్నారు. చట్టం వార్ని సర్టిఫై చేసింది. సభ్యసమాజం భయపడి, భ్రమపడి, ప్రలోభపడి వారి చర్యల్ని ఆమోదిస్తోంది. స్త్రీకి ఆస్తిలో సమాన హక్కివ్వడానికి భయపడే పురుషాధిక్య ప్రభుత్వాలు సిగ్గుపడాలంటుంది మధుమతి.

 

    ఒక తండ్రి కొడుకును కనేందుకు ఏం చేస్తాడో, కూతుర్ని కనేందుకూ అదే చేస్తాడు. ఒక తల్లీ అదే చేస్తుంది. అవే రక్తమాంసాల్ని పంచుతుంది.

 

    అవే జీవకణాల్ని అందించడం జరుగుతుంది.

 

    తన సెక్స్ ని నిర్ణయించుకునే శక్తి పుట్టే ప్రాణి చేతుల్లో వుండదుగా...?

 

    మరి స్త్రీగా పుట్టే ప్రాణికి ఆస్తిలో సమాన హక్కెందుకు రాదు? ఎందుకు ఇవ్వరు? అంటే కొడుకుల్నే సక్రమంగా కన్నారా? కూతుళ్ళను కనలేదా?

 

    కూతురు ఎదిగి, తండ్రి ఎదుట నిలిచి "నా అన్నను కన్నావు. ఆస్తిలో వాటా ఇచ్చావు. మరి నన్నూ కన్నావు- నాకెందుకు ఇవ్వడం లేదు? అంటే... నా జన్మకు కారణం నువ్వు కాదా?" అని ఒక్క ప్రశ్న ఒకే ఒక్క ప్రశ్న వేస్తే ఏ తండ్రయినా ఏం సమాధానం చెబుతాడు? ఏం సమాధానం వుంది చెప్పడానికి- సిగ్గుతో తలవంచుకోవడం తప్ప!

 

    "అమ్మా... తమ్ముడ్ని కన్నట్టే నన్నూ కన్నావ్... నన్నెందుకమ్మా రెండవ స్థాయికి నెట్టేశావ్? నాకెందుకమ్మా ఆర్ధిక స్వేచ్చ లేదు- నాకెందుకమ్మా నాన్న వాటా ఇవ్వడు? నా జన్మకు కారకుల్ని చూపిస్తే అక్కడికెళ్ళి ఆయన్నే నాకు వాటా ఇవ్వమని అడుగుతాను. ఆయన్నే ఆర్ధిక స్వేచ్చను ప్రసాదించమని అడుగుతాను. చెప్పమ్మా... ఎవరసలు నా జన్మకు కారకులు?" అని ఏ ఆడపిల్లయినా అడిగితే ఈ ప్రపంచంలో ఏ తల్లి అయినా ఏ సమాధానం చెప్పి తన నిజాయితీని రుజువు చేసుకుంటుంది?