మృత్యువుతో మొరాయించి మరికొన్ని నిముషాలు బ్రతుకు పొడిగించుకున్నట్టు కళ్ళు తెరిచింది.

 

    "నాన్నా, నా వరాలకొండా... నా బంగారుతండ్రీ..." ఆమె పెదవులు అదురుతున్నాయి ఉద్వేగంగా. కాని గొంతు పెగలడంలేదు.

 

    "వెయ్యినోముల ఫలంగా నా బ్రతుకువాకిట నిలిచిన నా చిన్నతండ్రీ... అయిపోయిందమ్మా... ఆ కల పూర్తికాకముందే కాలం చెల్లిపోయింది. కాని ఏం చేయను? బ్రతకాలనుంది . ఈ చిన్నికొండ ఎన్నెన్ని శిఖరాలు ఎక్కుతాడో తాతనుమించిన మనవడై ఎంతెంత కీర్తిని సంపాదిస్తాడో చూడాలనుంది కాని... ఏదీ... చీకటిలోనైనా సాగిపోతే చాలనుకున్న నా బ్రతుకిలా తెల్లారిపోయిందే..." మంటల్లో ఆవిరిలాగా మిగిలిన నీరు కన్నీరై వరదై వెల్లువై ఆమె గాజుకళ్ళలో నుంచి రాలిపడే వైతరిణియై నానీచేతుల్ని తడిపేస్తూంది.   

 

    ఎంతెంతో చెప్పాలనుంది ఆమెకు.

 

    లేని అమ్మను తలచుకుని కుమిలిపోతూ కన్ను మూయద్దని, కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తూ కలకాలం బ్రతకాలని చెప్పాలని వుంది.

 

    ఏంటీ...?

 

    నోరు పెగలడంలేదు.

 

    శక్తి ఉడిగిపోతుందేమిటి?

 

    "అ...మ్మా..." పెదవులతో తల్లి కళ్ళనద్దుకున్నాడు. అప్పుడెప్పుడో ఏటిఒడ్డున చూసిన కాలుతున్న శవం గుర్తుకురాగా అమ్మని సందిట బంధించేసి ఎవరొచ్చినా ఇవ్వకూడదన్నట్టు చేతుల్తో మెడని సుతిమెత్తగా చుట్టేశాడు. "ఎందుకమ్మా'సత్యంవధ'న్నావు. టీచరు నన్ను కొట్టినా నిజమే చెప్పాలన్నావ్. నువ్వెందుకు అబద్ధం చెప్పావు? యిన్ని చెప్పిన నువ్వే మాటెందుకు తప్పావు?"

 

    మరణంకన్నా నానీ మాటలు ఆమెను మరింత భయపెట్టాయి. ఇప్పుడిక బదులివ్వకపోతే నానీ తను కోరని గమ్యంవేపు మరలిపోతాడని భయపడింది.

 

    దేవుళ్ళకే మొక్కుకుందో మృత్యువునే చివరగా అర్థించిందో "నాన్నా... నా నానీ" అంది రొప్పుతూనే. "అన్నీ నేను చెప్పలేను నాన్నా. కొన్ని నువ్వే తెలు...సు...కోవాలి."

 

    నానీ విస్మయంగా వింటున్నాడు వెక్కిళ్ళతో.

 

    తలూపేడు.

 

    "అమ్మ ఏంచెబితే అది చేస్తావుకదూ!"

 

    "ఆఁ..."

 

    "అయితే" ప్రతిరోజూ తన తలపులతో నానీ చిక్కి శల్యమయిపోకుండా అమ్మని తలచుకుని నిద్రలేని రాత్రులు గడపకుండా సమస్యనుంచి దృష్టి మరల్చాలని నిర్ణయించుకుంటూ ఆ స్థితిలో సైతం ఓ లిప్తపాటు ఆలోచించి "నా...న్నా... నేనెందుకు అబద్ధం చెప్పానని అడుగుతున్నావుకదూ. దానికి... నీకు జవాబు... తెలియాలంటే... నేనిచ్చే ఓ లెక్కకి జవాబు తెలుసుకోవాలి. అది... తాతయ్యనడిగి కాదు. నీ అంతట నువ్వు... తెలివితో... తెలుసుకుని... తాతయ్యకి చెప్పి... తెలివిలో తాతయ్య అంతటివాడివి కావాలి..." బాధతో మెలితిరిగిపోతోంది.

 

    "నీ మీదొట్టమ్మా... తాతయ్యకి చెప్పను. నేనే తెలుసుకుంటాను" హామీ ఇచ్చాడు దృఢంగా.

 

    పావని మొహంలో క్రమంగా ప్రేతకళ ఆవరిస్తోంది. "తనకు కాచిన కాయి రాలితే కొమ్మ బాధపడదుకాని అమ్మమాత్రం కంటతడిపెడుతుందట. అమ్మ కొమ్మ అయితే ఆ కొమ్మెందుకు కన్నీరు పెట్టుకోదు? ఆ జవాబు తెలుసుకోవాలి ఆఁ"

 

    ఏకాగ్రతంగా విన్ని నానీ మరోసారి మననం చేసుకున్నాడు ఏకసంథాగ్రహి అయినా...

 

    వెంటనే చెప్పేయాలని విశ్వప్రయత్నం చేశాడు కాని తోచలేదు అన్న అనుమానం అడ్డురాగా అడగాలని అమ్మకేసి చూశాడు.

 

    "అ...మ్మా..."

 

    నానీ ఆక్రందనతో ఆ గది ప్రతిధ్వనించిపోయింది. అంతా పరుగెత్తుకొచ్చారు.

 

    కాని అప్పటికే బ్రతికినంతకాలం చస్తూనే వున్న పావని చచ్చి బ్రతికిపోయింది.

 

    తల్లికోసం నానీ పడుతున్న తపన చూసిన డాక్టర్లుసైతం ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారు.

 

    "ఒక జీవితకాలం లేటు" గొణిగాడు అప్పుడే మేజిస్ట్రేట్ తో అక్కడ అడుగుపెట్టిన యశస్వి.

 

    ఒక పోలీసాఫీసరుగా కాదు.

 

    ఒక పసికందుగా మారి ఆ స్థితిని బేరీజు వేసుకుంటున్నాడు.

 

    అరక్షణం తర్వాతగాని యశస్వికి అర్థంకాలేదు తన కళ్ళు చెమ్మగిల్లాయని.

 

    "అయిపోయింది" మేజిస్ట్రేటు తిరిగి వెళుతుంటే నానీని చూస్తూ అనుకున్నాడు సబ్ ఇన్ స్పెక్టర్ యశస్వి. "లేదుసర్. మరణ వాంగ్మూలంతో ఆమెకథ ముగిసింది. ఇప్పుడు అసలు కథ ప్రారంభంకాబోతుంది."  

 

    కథ ఎక్కడనుంచి ప్రారంభించాల్సిందీ ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు యశస్వి పట్టుదలగా.

 

    పావని అంత్యక్రియలు ముగిసిన రెండోరోజు ఉదయం పదిగంటలవేళ...

 

    సర్కిల్ ఇన్ స్పెక్టర్ రఘునాథరావుని ఇంటిదగ్గరే కలుసుకున్న సబ్ ఇన్ స్పెక్టర్ యశస్వి సీరియస్ గా చెప్పుకుపోతున్నాడు.

 

    "ప్రైమాఫీసీ ప్రకారం కోర్టులో ఛార్జిషీటు ఫైల్ చేసి కేస్ ఫైల్ చేయొచ్చు సర్... కాని ఇది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదు. ఇట్స్ కేసాఫ్ మర్డర్..." రెండురోజులు కేంప్ ముగించుకుని ఆ ముందురాత్రే ఇంటికి వచ్చిన రఘునాథరావు యశస్వి మాటలకు విభ్రమంగా చూశాడు.

 

    "ఏంటి నీకా నమ్మకం" యశస్వి యస్సై గా ఆ టౌన్ లో అడుగుపెట్టి కేవలం ఆరునెలలే అయినా ఆ స్వల్పకాలంలో అతడెంత డైనమిక్ పోలీసాఫీసరుగా పేరు సంపాదించుకున్నదీ రఘునాథరావు అనుభవ పూర్వకంగా గ్రహించి ఉండడంతో "కెన్ యూ ఫ్రూవిట్" అన్నాడు సాలోచనగా.

 

    ఇండియన్ ఎవిడెన్స్ ఏక్ట్, సెక్షను 32 ప్రకారం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డైయింగ్ డిక్లరేషన్ తీసుకున్నా అది అనుమానాస్పదంగా తోచినప్పుడు కేసుని తిరగతోడొచ్చు. అంతవరకూ ఛార్జిషీటు ఫైలుచేయకుండా కోర్టులో గడువుకోరవచ్చు.