కోరకుండా ప్రారంభించినా, లేక కోరి ప్రేమ కథకి ఓ అందమైన ముగింపు ఇవ్వాలనుకున్నా గాని, తను చిత్రించిన అధ్యాయాల చిత్రాలు రక్తపు కుంచె అద్దిన విషకాసారాలై ఓ అమాయకుడ్ని బలి చేయబోతున్నాయి!
    
    వ్యవధిలేదు ఏదో చేయాలి!
    
    వాసుదేవరావు ఉద్విగ్నంగా తన పర్సనల్ ఛాంబర్ లోకి వెళ్ళడాన్ని గమనించిన సౌదామిని ఆలస్యం చేయలేదు.
    
    భాగ్యనగరానికి ఫోన్ చేసింది వెంటనే పద్మనాభంతో మాట్లాడాలని. లైన్ లోకి వచ్చాడు అర నిముషంలో.
    
    "కాబోయే ముఖ్యమంత్రిగా నువ్వు సహకరించాలి పద్మనాభం....! ఆదిత్యని కడతేర్చాలని ప్రయత్నిస్తున్న వాసుదేవరావు ప్రయత్నాన్ని నిరోధించి పోలీసు కస్టడీనుండి ఆదిత్యను బయటికి రప్పించాలి."

    "ఫర్ గెటిట్!" టక్కున అన్నాడు పద్మనాభం "నిజానికి నేను విడిపించగలను సౌదామిని! కాని ఆదిత్య మరణం నాకూ అవసరమే!
    
    అవాక్కయింది సౌదామిని.
    
    "అవును సౌదామినీ! ఆదిత్య చావాలి! అలా అయితే విద్యార్ధిలోకం ఒక్కుమ్మడిగా తిరుగుబాటు చేయడమే గాక, వాసుదేవరావు రాజకీయ జీవితానికి శాశ్వతంగా తెరపడేట్టు చేస్తారు. అది మనకి లాభమేగా?"
    
    "పద్మనాభం...!" ఈ కథ ఇలాంటి మలుపు తిరగడం ఇష్టం లేనట్టు అసహనంగా అంది. "నువ్వు కోరింది సాధించావు. దానికింకా అమాయకులమయిన ఇద్దరు పిల్లల్ని బలి చేయడంలో అర్ధంలేదు."
    
    "ఏ యజ్ఞానికైనా బలపశువులు అవసరం సౌదామినీ! అయినా నీ కిలాంటి సెంటిమెంట్సేమిటి? వెంటనే హైదరాబాదు వచ్చేసెయ్."
    
    "దేనికి?"
    
    "ఎందుకో నీకు తెలుసు."
    
    "నిన్నటిదాకా నేను అలాంటి స్థానంకోసం ఆలోచించిన మాట నిజమే. అయినా ఇప్పుడా ఆసక్తి చచ్చిపోయింది పద్మనాభం! ఈ వయసులో ఇంకా ఏదో సుఖాన్ని మూటగట్టుకోవాలన్న కోరిక లేదు నాకు"
    
    "చాలా మారిపోయావు!"
    
    "మారాల్సి వచ్చింది"
    
    "అంటే ఆ ప్రేమకథలో నీ పాత్రనింకా నిర్వహించాలను కుంటున్నావన్నమాట!"
    
    "అవును! ఆ ప్రేమను బ్రతికించి కొంత పుణ్యాన్నన్నా దక్కించుకోవాలను కుంటున్నాను."
    
    క్షణం విరామం తర్వాత అన్నాడు "మరి ఇప్పుడు అనితనేం చేయబోతున్నారు?"
    
    "విడిచిపెట్టేయాలనుకుంటున్నాను. ఎందుకంటే అనితని నిర్బంధించి నడిపించాల్సిన ప్రేమకథలో ఇప్పుడు ఆదిత్య నేనూహించని సమస్యలో ఇరుక్కున్నాడు కాబట్టి."
    
    "నా మాట విను సౌదామినీ! నువ్వు పక్కకి జరిగిపొ లేదూ అంటే నీ ప్రాణాలకీ ప్రమాదమే!"
    
    "అలసిపోయాను పద్మనాభం! అందుకే అణువంత ఆత్మసంతృప్తిని దక్కించుకోటానికి అవసరమైతే ప్రాణాలనీ ఖర్చు చేయాలనుకుంటున్నాను" ఫోన్ క్రెడిల్ చేసిన సౌదామిని అవాక్కయిపోయింది.
        
    చాలా సమీపంగా నిలబడి వున్నాడు వాసుదేవరావు శౌరితో సహా. "సో..." క్రోధారుణ నేత్రాలతో చూస్తున్నాడు వాసుదేవరావు "ఇదన్నమాట కథ!"
    
    "అవును" నిశ్చలంగా అంది సౌదామిని "నేను నడిపిన ప్రేమ కథ!"
    
    "లం..." సౌదామిని అలా భీతి లేకుండా నిలబడటం వాసుదేవరావుకి భరింపశక్యంగా లేదు అమాంతం ఆమె జుట్టు పట్టుకుని గదిలోకి ఈడ్చుకుపోయాడు. "ఇంత ద్రోహం చేసింది నువ్వా?"
    
    బాధతో నరాలు మెలితిరిగిపోతున్నా ప్రసంనంగానే చూసింది సౌదామిని. "నువ్వు నాకు చేసింది అదేగా వాసుదేవరావ్?"
    
    "అంటే ఇంతకాలం నీకు పాలుపోసి పెంచానన్నమాట!"
    
    "పెంచలేదు వాసుదేవరావ్! నీపాపనికి బలయిన నన్ను ఆ పాపకూపంలోనే మగ్గిపొమ్మన్నట్టు వుంచుకున్నావు."
    
    "కాటేశావు."    
    
    'వేద్దామనే ప్రబంధని నీకు ప్రతికూలంగా మార్చింది. కాని ఎందుకో జాలేసింది వాసుదేవరావ్! నువ్వు నాకు చేసిన గాయాలకి మరో అమాయకురాల్ని బలిచేయడం దారుణమనిపించింది. ఏ జన్మలో ఏ పాడునోములు నోచినందుకో నీకు ఉంపుడుగత్తెగానే మిగిలిన నేను ఓ పుణ్యకార్యంతో మరో జన్మలో అయినా మగనారిగా బ్రతికే అదృష్టాన్ని సంపాదించుకుందామనుకున్నాను."
    
    ఆమె తల గోడకి గుద్దుకుంది. చిట్లిన ఫాలభాగంనుంచి రక్తం జివ్వుమని చిమ్ముతుమ్తే ఇంకా జుట్టుని బలంగా పట్టుకుని, ఉక్రోషంగా అడిగాడు వాసుదేవరావు బ్రతకాలనే ఇదంతా చేశావటే?"
    
    "అవసరమైతే చావాలని!"
    
    వాసుదేవరావు మోకాలు ఆమె పొట్టని తాకింది.
    
    కుప్పకూలిపోతూ సైతం ఆమె బలాన్ని కూడగట్టుకుంది "అభ్యంతరం లేదు వాసుదేవరావ్! చంపేయ్ నన్ను కాని ఆదిత్యని చంపకు నీ బిడ్డ ప్రబంధని మరో గాయపడ్డ సౌదామినిగా మార్చకు"
    
    ఆమె చెబుతున్న ప్రతి వాక్యమూ అతన్ని మరింత రెచ్చగొడుతుంటే గొడ్డుని బాదినట్టు బాదేశాడు.
    
    "డాడ్! మీరింత శ్రమపడటం దేనికి? చంపి సముద్రంలో విసిరేస్తే బెటరుగా!" శౌరి జోక్యం చేసుకున్నాడు. అంతే కాదు, ఇప్పుడు తండ్రి బాధ్యత తను తీసుకుంటున్నట్టు ఆమె కంఠాన్ని పట్టుకున్నాడు శౌరి "ఏమేవ్!"
    
    "తప్పు శౌరీ!" బడలికగా నవ్వింది. "తల్లిలాంటిదాన్ని అలా పిలవకూడదు."
    
    "బిచ్, నువ్వు నా తల్లివెలా అవుతావు?"
    
    "మీ నాన్న నాతో జీవితాన్ని పంచుకోకపోయినా, ఇంతకాలం భార్య స్థానంలో వుంచుకున్నారు శౌరీ."
    
    "అందుకే కదే ఇంత ద్రోహం చేశావు"
    
    "నీ తల్లి బ్రతికి వున్నా ప్రబంధ ప్రేమ కోసం నాలాగే ప్రవర్తించేది."