సన్నబడాలా... ఈ థియరీ ఫాలో అవ్వండి!

సన్నబడాలా... ఈ థియరీ ఫాలో అవ్వండి!

 

సన్నబడాలి. కానీ కష్టపడకూడదు. బద్దకమేసి కాదు. టైమ్ లేక. ఇప్పుడు ఇదే చాలామందికి ఉన్న సమస్య. బరువు పెరుగుతున్నామని తెలిసినా తగ్గడానికి సమయం వెచ్చించలేని పరిస్థితి. అలాంటివారి కోసమే ఇది. సన్నబడటానికి ఒక సింపుల్ పద్ధతి... ఫుడ్ రీప్లేస్ మెంట్. అవును. మీరు సహజంగా తినే కొన్ని రకాల ఆహార పదార్థాలను వేరే వాటితో రీప్లేస్ చేస్తే చాలు... పనైపోతుంది.

- రోజూ ఉదయం కాఫీ, టీలలో వేసుకునే పాల నుంచి డెబ్భైకి పైగా క్యాలరీలు వస్తాయి. కాబట్టి పాలు కలిపిన కాఫీ, టీల బదులు లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి తాగండి.

- గారెలు, మైసూర్ బజ్జీలకు ఫుల్ స్టాప్ పెట్టి ఇడ్లీ, దోశలు బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోండి. దోశలు నూనె లేకుండా కాల్చాలి సుమా!

- పాలతో ఏదైనా పదార్థం చేస్తుంటే కనుక మామూలు పాలను స్కిమ్డ్ మిల్క్ తో రీప్లేస్ చేయండి. దానివల్ల ఓ కప్పుకు దాదాపు డెబ్భై రెండు క్యాలరీల చొప్పున తగ్గుతాయి.

- చికెన్, ఫిష్ లాంటి వాటిని ఫ్రై చేసే బదులు గ్రిల్ చేయండి. కూరలు కూడా వండొద్దు. ఎందుకంటే ఓ కప్పు చికెన్ కరీలో 250  క్యాలరీలు ఉంటే... గ్రిల్డ్ చికెన్ లో 114 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. మరి ఎంత మేలు!

- మామూలు రైస్ ని బ్రౌన్ రైస్ తో రీప్లేస్ చేయండి.

- సమోసాలు, పకోడీలు, చిప్స్ లాంటి స్నాక్స్ కి బదులు ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్ చాట్, ఫ్రూట్ సలాడ్స్ లాంటివి తినడం వల్ల కడుపూ నిండుతుంది, బరువూ పెరగరు.

- ఫ్రైడ్ ఎగ్ కంటే ఉడికించిన ఎగ్ ఎంతో మంచిది. బాయిల్డ్ ఎగ్ లో 78 క్యాలరీలు ఉంటే ఫ్రై చేసిన దానిలో 100
క్యాలరీలు ఉంటాయి. మరి ఏది బెస్ట్!

- కూల్ డ్రింక్స్ ని మంచినీటితో రీప్లేస్ చేయండి. మంచినీరు చేసినంత సాయం ఏ పానీయమూ చేయదు. నీటి వల్ల క్యాలరీలు పెరగవు కానీ ఒక్క డ్రింక్ తాగినా నూట యాభైకి పైగా క్యాలరీలు పెరుగుతాయి. అందుకే దాహం వేసినప్పుడల్లా దాన్నే ఆశ్రయించండి తప్ప కూల్ డ్రింక్స్ వైపు చూడకండి.

    ఈ రీప్లేస్ మెంట్ థియరీ ఫాలో అయితే బరువు పెరగరు. ఆల్రెడీ ఉన్న బరువు తగ్గుతారు. ఎప్పుడూ తినే వాటిలో మార్పులు చేయడమే కాబట్టి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.

- Sameera