ఫిట్ నెస్ అవసరమే... కానీ...


 

ఫిట్ నెస్ అవసరమే... కానీ...

 

 

ఫిట్ నెస్ అవసరమే. ఫిట్ గా ఉండటం కోసం డైటింగ్ చేయడమూ అవసరమే. కానీ డైటింగ్ పేరుతో చేయకూడనివి చేయడం ప్రమాదం. సన్నగా అవ్వాలన్న తాపత్రయంతో కొన్ని పొరపాట్లు చేసి, చిక్కులు కొని తెచ్చుకుంటోన్న అమ్మాయిల సంఖ్య ఈ మధ్య పెరుగుతోందని ఓ తాజా నివేదికలో వెల్లడయ్యింది. దీనికి కారణం డైటింగ్ పట్ల సరైన అవగాహన లేకపోవడమే అంటున్నారు నిపుణులు. మరేం చేయాలి?

డైటింగ్ చేయాలనుకుంటే కనుక ముందుగా ఓసారి డాక్టర్ ని తప్పక సంప్రదించాలి. ఎంత బరువు ఉన్నారు, ఎంత తగ్గాలి, ఏయే వ్యాయామాలు చేయాలి, ఏమేం తినాలి... ఇలా ప్రతి ఒక్కటీ డాక్టర్ ని అడిగి తీరాలి. ఎందుకంటే కొందరి శరీరం కొన్ని రకాల వ్యాయామాలను తట్టుకోలేకపోవచ్చు. కొన్ని రకాల ఆహారం కొందరికి మేలు చేయకపోవచ్చు. అందుకే మీ శరరీ తత్వాన్ని బట్టి మీరేం చేయాలనేది డాక్టర్ ని అడిగాకే డైటింగ్ మొదలు పెట్టండి.

కొంతమందికి త్వరగా తగ్గిపోవాలన్న ఆతృత ఉంటుంది. దాంతో ఒకేసారి ఎక్కువ డైటింగ్ చేసేస్తుంటారు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఏదైనా మెల్లగా మొదలుపెట్టి పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారిగా ఆహారపు అలవాట్లు మార్చేస్తే నీరసం వచ్చేస్తుంది.  డైటింగ్ అంటే మరీ కడుపు మాడ్చేసుకోనక్కర్లేదు. బలవర్ధకమైన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడమే డైటింగ్. ఘనాహారాన్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ద్రవాహారాన్ని మెల్లమెల్లగా పెంచుకుంటూ పోవాలి. అలాగే కొన్ని రకాల ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచిది. వాటిని చెడు చేసే ఫ్యాట్స్ అనుకుని పొరబడి తినకుండా ఉండకండి. ఏది తినాలో ఏది తినకూడదో ముందు క్లారిటీ తెచ్చుకోండి.

 

 

కొన్నిసార్లు ఎంత డైటింగ్ చేసినా బరువు తగ్గరు. అలాంటప్పుడు డైట్ ప్లాన్ చేంజ్ చేసుకోవాలి తప్ప వాటినే తింటూ ఉండిపోకూడదు. ఎప్పటికప్పుడు బరువు చెక్ చేసుకుంటూ ఉంటే ప్లాన్ చేంజ్ చేయాలా లేదా అన్నది తెలుస్తుంది. కొందరైతే ఆహారం తగ్గించేసి ప్రొటీన్ షేకులూ, విటమిన్ ట్యాబ్లెట్లూ వేసేసుకుంటూ ఉంటారు. ఆ పొరపాటు ఎప్పుడూ చేయవద్దు. ఆహారాన్ని ఏదీ రీప్లేస్ చేయలేదన్న విషయాన్ని మర్చిపోకండి.

చాలామంది చేసే తప్పేంటంటే... డైటింగ్ పేరుతో అన్నీ కంట్రోల్ చేసేస్తారు. ఆ తర్వాత దేనికో టెంప్ట్ అయ్యి తినేస్తుంటారు. ఇలాంటప్పుడు ఎక్కువ చెడు జరుగుతుంది. తినకూడదు అనుకున్నవాటి జోలికి అస్సలు వెళ్లకండి. లేదంటే డైట్ కంట్రోల్ చేసి ఉపయోగం ఉండదు. ఫ్రెండ్స్ బలవంత పెట్టారనో, ఇంట్లో పార్టీ ఉందనో కాంప్రమైజ్ అయిపోతే ఇక అంతే. నిజానికి ఎంత మెల్లగా తగ్గుతారో అంత వేగంగా బరువు పెరుగుతారు. అది ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి.

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది విశ్రాంతి, నిద్ర. డైటింగ్ చేసేవాళ్లకు కచ్చితంగా విశ్రాంతి ఉండాలి. నీరసంగా ఉందని ఒళ్లు మొరాయిస్తున్నా వ్యాయామం చేసేయడం, తిండి తినకుండా పని చేసేయడం వంటివి చేయకండి. అంతేకాదు... కంటికి సరిపడా నిద్రపోవాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది.

నిజంగా ఫిట్ గా ఉండాలంటే ఈ తప్పులేవీ చేయకండి. డైటింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. చక్కని ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. లేదంటే ఏదో అనుకుంటే ఏదో అవుతుంది. తర్వాత బాధపడాల్సి వస్తుంది.

- Sameera