తల్లిపాల కోసం ప్రాణాలు తీయవద్దు!

 

తల్లిపాల కోసం ప్రాణాలు తీయవద్దు!

 

 

బిడ్డకి తల్లిపాలే శ్రేష్టం! తల్లిపాలకి మించిన ప్రత్యామ్నాయం లేదు!... ఇలాంటి నినాదాలు చాలానే వింటూ ఉంటాము. అప్పుడే పుట్టిన పిల్లవాడికి తల్లిపాలు కాకుండా డబ్బాపాలు పట్టించడం మంచిది కాదు అని పెద్దలు, నిపుణులు అంతా చెవిలో పోరుతూ ఉంటారు. ఇవన్నీ నిజమే! కానీ ఈ నిజం వెనుక ఓ ప్రమాదం దాగి ఉందంటే నమ్మగలరా!

జిలియన్ జాన్సన్ అనే మహిళ ఈ మధ్య తన అనుభవాన్ని Fedisbest అనే వెబ్సైటులో పంచుకున్నారు. ఆ వెబ్సైటు ద్వారా జాన్సన్ రాసిన లేఖ ఒక సంచలనంగా మారింది. తల్లిపాల మీద మోజుతో తన బిడ్డను చేజేతులారా చంపుకున్నాను అన్నదే ఆ లేఖలోని సారాంశం!!!

కృత్రిమమైన పాలని formula milk అంటారు. ఈ డబ్బా పాలని మరీ అత్యవసరం అయితే తప్ప పట్టించవద్దని వైద్యులు సూచిస్తుంటారు. తల్లికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటే తప్ప, ఆమె పాలు ఇచ్చితీరాల్సిందే అన్న ధోరణిలోకి చాలా ప్రసూతి ఆసుపత్రులు కూడా ఉంటున్నాయి. కొన్ని దేశాలలో అయితే పిల్లవాడికి పాలు సరిపోవడం లేదని పిల్లల వైద్యులు సిఫారసు చేస్తే తప్ప, డబ్బా పాలు కొనుగోలు చేసే అవకాశం ఉండదు.

తల్లిపాల కోసం ఇంతటి ప్రాముఖ్యతని ఇవ్వడం అర్థం చేసుకోదగ్గదే! ఎందుకంటే తల్లిపాలలో లభించే పోషకాలు, కృత్రిమపాలలో ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకవు. పైగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి రోజులలో స్రవించే తల్లిపాలలో పిల్లవాడికి రోగనిరోధక శక్తిని అందించే యాంటీబాడీస్ ఉంటాయి. వీటని ‘colostrum’ అంటారు. అయితే ఈ colostrums లభించని పిల్లవాడి జీవితం వృధా అనీ, ఎలాగొలా బిడ్డకు తల్లిపాలే పట్టించాలనీ నూరిపోయడమే కొన్ని సమస్యలకి కారణం అవుతోంది.

బిడ్డకు జన్మనిచ్చిన తరువాత... మరీ ముఖ్యంగా తొలి చూలు తరువాత, పిల్లవాడికి తల్లిపాలని తగినంతగా అందించలేకపోవచ్చు. తల్లి నీరసంగా ఉండటం, పాలు రాకపోవడం, వచ్చినా సరిపోకపోవడం, పిల్లవాడు పాలు తాగే అలవాటు చేసుకోలేకపోవడం, చనుమొనలు లోపలకి ఉండిపోవడం... వంటి అనేక సమస్యలు తలెత్తవచ్చు. ఇవన్నీ తీరేలోగా పిల్లవాడికి ప్రత్యామ్నాయం చూడటం చాలా అవసరం. ‘ఇప్పుడే డబ్బా పాలు పట్టించేస్తే ఎలాగా? ఓ నాలుగైదు రోజులు ఓపిక పట్టాలి కదా!’ అని అశ్రద్ధ చేస్తే పిల్లవాడు డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. జాన్సన్ కథ కూడా ఇలాగే సాగింది. పిల్లవాడికి ఎలాగొలా తన పాలే పట్టించాలని ప్రయత్నించింది జాన్సన్. ఈలోగా అతను డీహైడ్రేషన్కు లోనయ్యాడు. 19 రోజుల పసికందు గుండెపోటుతో మరణించాడు!!!

జాన్సన్ విషాదం సమాజానికి చాలా విలువైన పాఠాలు చెబుతోంది. తల్లిపాలు శ్రేష్టమే! కానీ అన్నింటికంటే ముందు పిల్లవాడి కడుపు నిండటం ముఖ్యం. అందుకే పిల్లవాడు బరువు తగ్గిపోతున్నా, మూత్ర విసర్జన చేయకున్నా, అదేపనిగా ఏడుస్తున్నా... అతనికి తగినంత ఆహారం అందడం లేదన్న సూచనని గ్రహించాలి. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డబ్బా పాలతో అతని శరీరం బలహీనపడిపోతుందేమో అన్న భయాన్ని వీడి... పసి ప్రాణాలకే తొలి ప్రాధాన్యత అని గ్రహించాలి.

- నిర్జర.