ఆమె మాట్లాడలేదు.

 

    "నువ్వు నాస్తికురాలివా?"

 

    "ఆ ప్రశ్నలన్నీ అనవసరం. నా అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. దీనికి తిరుగులేదు" అంటూ వేదిత ఇహ ఉపేక్షించకుండా కారులో ఎక్కి కూర్చుని పోనియ్యి డ్రైవర్" అంది.

 

    కారు కదిలి వెళ్ళిపోయింది. రవివర్మ నిరుత్తరుడై నిలబడిపోయాడు.

 

    ఆ రాత్రి అతనామె దగ్గరకు వెళ్ళి చాలాసేపు నచ్చజెప్పటానికి ప్రయత్నించాడు. చిత్రం సగం వరకూ పూర్తయాక ఇప్పుడు ఇతివృత్తం మార్చటం ఎలా, ఇంత పట్టింపు వుందని మొదటే ఎందుకు చెప్పలేదూ? నా కల్పనల ప్రవాహానికి ఇంత నిర్దయగా అడ్డు తగిలితే నా సృష్టి తునాతునకలై పోతుంది - అని ఇట్లా ఎన్నో విధాల బ్రతిమాలాడు.

 

    ఆమె చలించలేదు. బెల్లంకొట్టిన రాయిలా అలానే మెదలకుండా కూర్చుంది.

 

    చివరకు చేసేదిలేక నిస్పృహతో అతనక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. నాలుగురోజులు రాత్రింబవళ్లు నిద్రాహారాలు లేకుండా ఆలోచించి తన చిత్రం ఇతివృత్తాన్ని పూర్తిగా మార్చుకుని తన భావాలకు మరో రూప కల్పన చేసుకున్నాడు.

 

                                            * * *

 

    మరో సంవత్సరకాలం గడిచిపోయింది. చిత్రనిర్మాణదశలో ఈ కాలపరిధిలో రవివర్మ అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు అతను పగవాడికి కూడా కోరుకోడు. వ్యయం అనుకున్న అంచనాకు ఎన్నోరెట్లు పైకి వెళ్ళిపోయింది. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్కోసారి అప్పు పుట్టటం కూడా కష్టమైపోతుంది. అతనికి మనోవ్యధలు యెక్కువయినాయి. కుటుంబ బాధలుకూడా అధికమై ఇంట్లో వుండలేక యెక్కువకాలం స్టూడియోలోనో ఆఫీసులోనో గడుపుతూ వచ్చాడు. ఆరోగ్యం కూడా బాగా దెబ్బతిని మనిషి కృశించిపోసాగాడు.

 

    చిత్రం చాలా భాగం పూర్తయింది. లక్షల ఖర్చుమీద వేసే ఓ భారీసెట్టు పని మాత్రం మిగిలిపోయింది. ఆ సెట్ వెయ్యటానికి అతను అవుట్ డోర్ స్పాట్ నిర్ణయించుకున్నాడు. మైసూరు వెళ్ళి మొదట బృందావన్ గార్డెన్స్ , లలితామహల్ దగ్గర కొన్ని దృశ్యాలు పూర్తిచేసుకుని, అక్కడినుంచి బెంగుళూరు మీదగా నందీహిల్సు వెళ్లి అక్కడ తన సిబ్బందితో మకాం పెట్టాడు.

 

    నందీహిల్స్ ఎత్తయిన కొండమీద, దట్టమైన అడవుల్లా పెరిగిన వృక్ష సమూహాలతో, రంగు రంగుల తోటలతో వొత్తయిన కర్పూర వృక్షాలతో, ప్రకృతి దృశ్యాలతో విశాలమైన పరిధిలో కనుల పండువుగా ఉంటుంది.

 

    ఆ కొండలమీద, టిప్పూడ్రాప్ దగ్గర వారంరోజులు వ్యయప్రయాసల కోర్చి బ్రహ్మాండమైన కోట నిర్మించాడు రవివర్మ. ఏనుగులు, గుర్రాలు, సైనిక సిబ్బంది మహాసందడిగా మారిపోయింది ప్రదేశం. టిప్పుసుల్తాన్ నిఠారుగా ఎన్నోవేల అడుగుల ఎత్తుగావున్న ఆ పర్వతశిఖరం నుండి ఆంగ్లేయుల్ని క్రింద అగాధంలోకి త్రోయించి చంపించేవారట. అందుకే ఆ ప్రదేశానికి టిప్పూడ్రాప్ అని పేరు వచ్చింది.

 

    ఈసారి డబ్బు పుట్టటం చాలా కష్టమైపోయింది రవివర్మకు. అనేక విధాల ప్రయత్నించి హెచ్చు వడ్డీకి తీసుకువచ్చాడు.

 

    వేదిత ఓ మహారాణి. పరాక్రమవంతురాలు. ఆ కోటను ముట్టడిచేసి అందులోని సైనికులతో ఘోరసంగ్రామం జరిపి దుర్గాన్ని హస్తగతం చేసుకుని దుర్గాధిపతిని బంధించి కొండకొమ్ముకు తీసుకువెళ్ళి అక్కడి నుండి అగాధంలోకి పడద్రోయించి, అతను ఆర్తనాదం చేస్తూ క్రిందపడి పోతూంటే శిఖరాగ్రాన నిల్చుని నడుంమీద చేతులు వేసుకుని వినోదం చూస్తూ పకపకమని నవ్వుతూ ఉంటుంది. తర్వాత వెనక్కితిరిగి కోటకు వెళ్ళి చూసేసరికి ఏనుగులతో రక్తంతో తడిసిన భూమితో ఆత్మహత్యలు చేసుకున్న అంతఃపురకాంతల శవాల గుట్టలతో శ్మశాన వాటికలా భీభత్సంగా కనిపిస్తుంది. రుద్రభూమిలాంటి ఆ వాతావరణం చూసి ఆమె మతి చలిస్తుంది పిచ్చిదైపోతుంది. ఒక రధాన్ని అధిరోహించి బలంకొద్దీ అశ్వాలను కొరడాతో మోదుతుంది. కళ్ళేలు త్రెంచుకున్నట్లుగా, పట్టా పగ్గాలు లేకుండా, నురుగలు గ్రక్కుకుంటూ పరిగెడుతాయా తురంగ రాజాలు. ఆమె గట్టిగా అరుస్తూ 'యింకా పొండి, యింకా పొండి' అంటూ ఇష్టం వచ్చినట్లు కొరడాను విసిరేస్తూ ఉంటుంది. అడ్డూ అదుపు లేకుండా రథం పోయి పోయి విచ్చలవిడిగా ప్రయాణం చేసి చివరకు పర్వతాగ్రానికి చేరుకుని ఒక్క ఊపున గాలిలోకి ఎగిరి మహారాణితో కూడా అగాధంలో పడిపోతాయి.

 

    నందీహిల్స్ మీద రవివర్మ చిత్రించదలుచుకున్న ఘట్టాలివి. దాంతో చిత్రం కూడా సమాప్తి చెందుతుంది.

 

    సెట్టు నిర్మాణం పూర్తి అయాక ఒక ఉదయం ఒక దృశ్యం ఘాట్ చేద్దామని సకల సన్నాహాలూ పూర్తిచేసుకుని సిద్దమవుతూ వుండగా క్రమ క్రమంగా ఆకాశమంతా మేఘావృతమైపోయి ముసురు క్రమ్మివేసింది. రవివర్మ గుండెలు పీచు పీచుమని బిక్కుబిక్కుమంటూ గగన తలంవైపు చూశాడు. చూస్తూండగానే మేఘాలు నల్లగా, చక్కగా అలుముకుని ఉరుములూ, మెరుపులూ కూడా మొదలయినాయి.

 

    అందరూ రవివర్మకేసి ప్రశ్నార్ధకంగా చూశారు యేం చేయమంటారన్నట్లు.

 

    అతను మాత్రం ఏం చెబుతాడు! కళ్ళు మూసుకుని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాడు దయతల్చమని.

 

    సుడిగాలి కూడా ప్రారంభమైంది.

 

    "ఇదేదో గాలివానలా ఉంది. అదిగో అటువైపు చూడండి యెలా ముంచుకు వస్తున్నదో" అన్నారెవరో.

 

    అంతా తలెత్తి చూశారు. పడమటి వైపునుండి వాయుగుండం ప్రచండ వర్షంతో కలసి పిశాచంలా దూసుకువస్తుంది. సిబ్బందిలో కలకలం చెలరేగింది. కెమేరాలు, ఇతర విలువైన పరికరాలూ తీసుకుని తలో దిక్కుగా పరుగెత్తారు.

 

    రవివర్మ నిరుత్తరుడై చూస్తూ నిలబడ్డాడు.

 

    కొన్ని క్షణాలలో తుఫాన్ మొదలయింది. సమీపంలో సముద్రంలో గుండం ఏర్పడినట్లుంది. శపించినట్లుగా కసిగా, కక్షగా కురుస్తోంది. గాలివాన ఆకాశమంటుకునేలా పెరిగినచెట్లు పెద్దపెద్ద శబ్ధాలు చేస్తూ అటూ ఇటూ ఊగిసలాడుతున్నాయి. యుద్ద దృశ్యాలకోసం తీసుకువచ్చిన గుర్రాలు, ఏనుగులు సకిలిస్తూ, ఘీంకారాలు చేస్తూ గొలుసుల్ని త్రెంచుకుని పారిపోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. నలువైపులనుండి యేవేవో చప్పుళ్లు, ప్రళయ శబ్దాలు.