నేనింకా షాక్ లో నుండి కోలుకోలేదు.
    
    "అహల్యా....! డూ యూ లవ్ మీ?"
    
    నా చెయ్యి పట్టుకుని కళ్ళలోకి చూస్తూ అడిగాడు.
    
    "ఎస్!" అన్నాను.
    
    "అయితే పద" ముందుకి నడిపిస్తూ అన్నాడు.
    
    "మరి నాన్నగారూ..." సందేహంగా ఆగిపోయాను.
    
    "అవన్నీ నేను చూసుకుంటా....దీపూ ఈవిడ మీ వదిన!" అన్నాడు.
    
    అప్పుడు చూసాను ఆ కుర్రాడివైపు. చాలా అందంగా, లేతగా వున్నాడు. నాకు నమస్కారం కూడా చెయ్యలేదు. తమాషాగా కళ్ళెగరేసి "హాయ్!" అన్నాడు. కనీసం చేతిలో సిగరెట్ కూడా అవతల పారెయ్యలేదు. సినిమాల్లో వదినా మరుదుల బంధం అతిగా చూపిస్తారు. కానీ దీపూ అలాంటి ప్రేమేమీ నామీద కురిపించలేదు.
    
    నాకూ రఘుకీ పురోహితుడు శాస్త్రోక్తంగా పెళ్ళి జరిపించాడు.
    
    నేను మిసెస్ రఘురాంగా హఠాత్తుగా మారిపోయాను. నా మెడలో మాంగల్యం, నా కాలివేళ్ళకున్న మట్టెలూ నాకింకా అలవాటు కాలేదు.
    
    "మా ఇంటికి వెళ్ళి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం!" అన్నాను.
    
    "కాదు.... ముందు ప్రెస్ మీట్, ఆ తర్వాత లంచ్!" అన్నాడు.
    
    ప్రెస్ వాళ్ళు రావడం, నన్నూ రఘూని ఫోటోలు తీయడం, రకరకాల ప్రశ్నలు వేయడం అంతా అనూహ్యంగా జరిగిపోయింది.
    
    ఈవెనింగ్ ఎడిషన్ లో మా పెళ్ళి ఫోటో వచ్చేసింది.
    
    సాయంత్రం రఘు ఇంటి మీదకి అన్నయ్యలు పోలీసుల్ని తీసుకువచ్చారు.
    
    "చిన్నపిల్లని మాయచేసి పట్టుకొచ్చి పెళ్ళిచేసుకున్నాడు సార్!" చిన్నన్నయ్య ఏడుస్తూ అన్నాడు. వాడిలో మంచి నటుడున్నాడు.
    
    పెద్ద వదిన చుట్టూ వున్న వాళ్ళతో నన్ను వాళ్ళంతా కలిసి ఎంత ప్రేమగా పెంచుకున్నారో కథలుగా చెప్తోంది. రచయిత్రి కావాల్సిన మనిషి.
    
    బాబు-రఘు ఎంత మోసగాడో నా డబ్బు మీద కన్నేసి ఎలా ప్లాన్ చేసాడో చెప్తున్నాడు అవన్నీ వాడి మనసులోని దురూహలు.
    
    పోలీస్ ఇన్స్ పెక్టర్ నన్ను సూటిగా అడిగాడు. "అహల్యగారూ ఈ పెళ్ళి మీ ఇష్టంమీద జరిగిందా? లేక ఎవరయినా బలవంతపెడితే జరిగిందా?"
    
    "నేను మేజర్ని అన్ని విధాలా రఘురాంని ఇష్టపడే చేసుకున్నాను" అని చెప్పేశాను.
    
    "దెన్...కంగ్రాట్స్!" అని రఘుకి చెయ్యి కలిపాడు ఆయన.
    
    అన్నయ్యలు మమ్మల్ని దుమ్మెత్తిపోస్తూ వెళ్ళిపోయారు.
    
    రఘు టికెట్స్ బుక్ చేసి వుండడంతో ఆ రోజే ఊటీ వెళ్ళిపోయాం.
    
                                                               * * *
    
    రఘుతో ఊటీలో గడిపిన రోజులు నా జీవితంలోనే మరిచిపోలేనివి. సంతోషం అంతా నా ఒంటిమీద కొచ్చి వాలినట్లు పరవశించిపోయాను.
    
    అహర్నిశలూ నాకు తోడుండే మనిషి....నావాడు....ఇతనివాళ్ళ నాకు పిల్లలు పుడతారు.... ఒక పరిపూర్ణత్వం చేకూర్తుంది అన్న వూహే నాకెంతో మధురంగా అనిపించింది.
    
    రఘు జలపాతాల దగ్గర నిలబెట్టి నాకెన్ని ఫోటోలు తీశాడో చెప్పలేను. చీర తీసేసి స్నానం చేస్తుండగా ఉట్టి లోపావడా, జాకెట్టుతో కూడా ఫోటోలు తీసాడు. నా పొట్టమీద గోరింటాకు పెట్టాడు. నన్ను క్రింద నడవనివ్వలేదు. తన చేతుల్లోనే తిప్పాడు. మంచినీళ్ళు కావాలని మారాం చేసినా నోట్లో పుక్కిట నిండా నింపుకున్న నీళ్ళని తన నోట్లోకి తీసుకునేవాడు. తెల్లవారగానే శరీరం మీద గాట్లని లెక్కపెట్టి ఎన్ని ముద్దులో అని మురిసిపోయేవాడు. అవి స్నానం చేస్తున్నప్పుడు చురచురలాడినా మధురంగానే వుండేవి.
    
    "అహల్యా....బ్రహ్మ నిన్నుపాలమీగడతో తయారుచేసి వుంటాడు. ఐయామ్ లక్కీ!" అని మురిసిపోయేవాడు.
    
    అతని మోటు శృంగారం తట్టుకోలేక నేను కెవ్వుమని అరిస్తే అవి టేప్ చేసి తర్వాత నాకు వినిపించేవాడు. సిగ్గు అన్న పదానికి నాకు అర్ధం తెలియకుండా చేశాడు. అతనితో శృంగారం జీవితం రంగులరాట్నంలా తమాషాగా, భయంగా, వేగంగా గడిచిపోయింది.
    
    మేం మద్రాసు వచ్చాం.
    
    దీపూ హాస్టల్ కి వెళ్తానన్నాడు. రఘు వెంటనే ఒప్పుకున్నాడు. అతను నాతో సరిగ్గా మాట్లాడపోవడం గురించి నేను రఘుతో చెప్పాను.
    
    "దీపూ చాలా చిన్నపిల్లాడిగా వున్నప్పుడే మా అమ్మ పోయింది. ఆ తర్వాత మా అక్క మాకు చెప్పకుండా ఎవర్నో పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయింది. అందుకే వాడికి ఆడవాళ్ళతో మాట్లాడడం అదీ అలవాటులేదు. నెమ్మదిగా సర్దుకుంటాడు" అన్నాడు.
    
    నేనే దీపూతో మాటలు కలపడానికి ట్రై చేసేదాన్ని. అక్కడినుండి పని వున్నట్లుగా లేచి వెళ్ళిపోయేవాడు.
    
    రఘు ఇల్లు ఖాళీ చేయించాడు.
    
    "నాన్నగారిని మనం తెచ్చుకుందాం" అన్నాను.
    
    అతనేం అనలేదు.
    
    ఆటోలో అన్నయ్యలే పని కుర్రాడినిచ్చి మా ఇంటికి నాన్నగార్ని పంపించేసారు.
    
    ఆయనకి ఒక రూం ఇచ్చాం.
    
    "ఇక్కడ ఎందుకు మన ఇంటికి వెళ్ళిపోదాం" అన్నాను రఘు వెంటనే ఒప్పుకున్నాడు.
    
    ప్రొడ్యూసర్లు నెలరోజుల తర్వాత ఫోన్లు చెయ్యడం, ఇంటికి రావడం చేసారు.
    
    ఆ రోజు నేను కళ్యాణిలో కంపోజ్ చేసిన పాట ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటూ వుండగా రూం బయట ఎవరో నిలబడ్డట్లుగా కర్టెన్ కదిలింది.
    
    "ఎవరూ?" అన్నాను.
    
    అడుగుల శబ్దం అయింది.
    
    గబగబా లేచి వెళ్ళి చూస్తే వరండాలో దీపూ వెళ్ళిపోతూ కనిపించాడు.
    
    మర్నాడు ఉదయం నాలుగింటికే లేచి ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ అలికిడి అయింది ఈసారి నన్ను చూసి వేగంగా వెళ్ళిపోతున్న దీపూని కేకేసి ఆపాను.
    
    "ఎందుకలా దొంగచాటుగా వినడం? ఎదురుగా కూర్చుని వినచ్చుగా!" అన్నాను.
    
    "నేను పాత వినడానికొచ్చాను. మిమ్మల్ని చూడడానికి కాదు!" అన్నాడు.
    
    ఆ మాట నాకు గుచ్చుకుంది.
    
    కానీ అతనికి నా పాట ఇష్టమని తెలిసి ఆనందం కలిగింది.
    
    ఆ తర్వాత దీపూ హాస్టల్ కి వెళ్ళిపోయాడు. అతనెళ్ళిపోయాకా చూసుకుంటే నావి చాలా గ్రామ్ ఫోన్ కాల్స్ కనిపించలేదు.
    
    నవ్వుకున్నాను.
    
                                                                 * * *
    
    నాన్నగారి ఆరోగ్యం బాగా క్షీణించసాగింది. ఏదో చెప్పాలని తపన పడేవారు. మాటరాదు. పని కుర్రవాడు వేళకి మందులు ఇస్తున్నాడో లేదో కూడా పట్టించుకోడానికి నాకు తీరిక లేదు. ఒకరోజు నేను ఇంటికి వచ్చేసరికి ఆయనకి ఫిట్స్ లా వచ్చి కొట్టుకుంటున్నారు. పని కుర్రాడు టీవీ చూస్తూ హాల్లో వున్నాడు. నేను ఆవేశం ఆపుకోలేక వాడ్ని లాగి లెంపకాయ కొట్టాను. వాడు ఏడుస్తూ "ఈ పని నేను చెయ్యను" అంటూ వెళ్ళిపోయాడు.