వేరే గది అద్దెకు తీసుకుంటే అంత కూడబెట్టలేనని అబద్ధం ఆడి, మీ ఇంట్లో ఉండిపోవలసి వచ్చింది.

 

    నిజానికి నాకు పెళ్ళికాలేదాంటీ.

 

    తరణి ఎవరో కూడా నాకు తెలీదు. యాదృచ్చికంగా కలిసింది. ఇల్లు ఖాళీచేయవలసిన ప్రమాదం నుంచి రక్షించింది...

 

    నే చెప్పిందంతా అక్షరాలా నిజం.

 

    ఇప్పుడు మీరే శిక్ష విధించినా భరించటానికి సిద్ధంగా వున్నాను" అన్నాడు తడిదేరిన కళ్ళు తుడుచుకుంటూ ఆంజనేయులు.

 

    తరణి కళ్ళు కూడా అశ్రుపూరితాలయ్యాయి ఆంజనేయులు చెప్పింది విని.

 

    కారు బంగ్లా ముందాగింది.

 

    అంతవరకూ భువనేశ్వరీదేవి ఏం మాట్లాడలేదు. దాంతో ఆంజనేయులు, తరణి ఆ ఇంటి మీద ఆశ వదిలేసుకున్నారు.

 

    ఆంజనేయులు, తరణి కారు దిగి అవుట్ హౌస్ కేసి నెమ్మదిగా వెళుతుండగా-

 

    "ఒక్కక్షణం" అంది భువనేశ్వరీదేవి.

 

    దాంతో ఆంజనేయులికి దడ వచ్చేసి ఆమె కాళ్ళ మీద పడిపోయాడు.

 

    "మీరు చేసిన మేలు నా జన్మలో మరువలేనాంటీ... అతి త్వరలోనే మీ అప్పు తీర్చేసుకుంటాను... ఇప్పటివరకు చేసిన తప్పుల్ని పెద్దమనసుతో దీవిస్తారని అర్ధిస్తున్నానాంటీ..." అన్నాడు ఆమె కాళ్ళవద్ద నుంచి లేవకుండానే.

 

    తరణి కూడా దాదాపు అదే పరిస్థితిలో వుంది.

 

    "నాకన్నీ తెలుసు..." అంది భువనేశ్వరీదేవి మెల్లగా, గంభీరంగా, ఒత్తిపలుకుతూ.

 

    ఇద్దరూ షాక్ తిన్నారు ఆమె మాటలు విని.


        
    వెంటనే నమ్మలేకపోయారు.

 

    "అవును... మీకు పెళ్ళి కాలేదని నాకు ఎప్పుడో తెలుసు. నిజమైన మొగుడూ పెళ్ళాలు అవునో కాదో తెలుసుకోలేని స్థితిలో లేను నేను. మంచి వాళ్ళకు నటన తెలీదు. నటించలేరు అది ఒక్క రాజకీయ నాయకులే చేయగలరు. వాళ్ళు నటిస్తేనే మోసపోతారెవరయినా..." అందామె ఎటో చూస్తూ.

 

    ఇద్దరి ముఖాలు నెత్తురు చుక్కలేనంతగా పాలిపోయాయి.

 

    "మరి... మరి... మమ్మల్ని అవుట్ హౌస్ లోంచి..." ఆంజనేయులు బేలగా చూస్తూ మాటల్ని మింగేసాడు.

 

    "తరిమేయలేదెందుకనా...? ముందనుకున్నాను, కానీ మిమ్మల్ని చూసి ఆ పని చేయలేకపోయాను. ఆ తరువాత మీ ఇద్దరూ నిజంగానే భార్యా భర్తలయితే బావుండనిపించింది. ఆ కోరిక నాలో బలీయమైపోయింది. అందుకే అంతా తెలిసినా, తెలియనట్లు నటిస్తూ, మీ ఇద్దర్నీ మానసికంగా దగ్గరచేసే ప్రయత్నాలు చేసాను... నాక్కూడా మా ఆయనలాగే మా అమ్మాయిని నీకిచ్చి చేయాలనుకున్నాను. కానప్పుడు ఒక ఆడపిల్ల అండలేక అన్యాయమై పోతుందనిపించి మనసు మార్చుకున్నాను" అందామె ఒకింత భారంగా.

 

    కృతజ్ఞతాభావంతో ఆ ఇద్దరి కళ్ళూ చెమర్చాయి.

 

    "వెళ్ళండి... వెళ్ళి సంతోషంగా వుండండి. ఆ కాశీబాంబు సంగతి నేను చూసుకుంటాను. త్వరలోనే మంచి ముహూర్తం పెట్టించి మీకు పెళ్ళి చేస్తాను" అంటూ ఆమె లోపలకు వెళ్ళిపోయింది.

 

    మసక బారిన కళ్ళతో కృతజ్ఞతగా ఇద్దరూ వెళ్తున్న ఆమెకేసే చూస్తుండి పోయారు.


                                                    *    *    *    *


    జరిగిందంతా తెలుసుకొని మేరీ చాలా బాధపడిపోయింది. అదే విషయాన్ని ఆనందం ముందు వ్యక్తం చేసింది.

 

    "దాందేముందిలేండి... తప్పులు ఎవరయినా చేస్తారు. ఇప్పుడు చేయవల్సింది ఆలోచించండి. ఆ అప్పలరాజు బావమర్ది అంతమంచివాడు కాదు. ఆలోచించి అడుగు వేయండి" అన్నాడు ఆనందం.

 

    నిజానికి ఆనందానికి ఎప్పటినుంచో మేరీ మీద మక్కువ వుంది. చెప్పే ధైర్యమే లేక మూగగా వుండిపోయాడు. అది సూచాయగా మేరీకి తెలుసు.

 

    "పదండి... ముందు వెళ్ళి ఆంజనేయుల్ని, తరణిని చూసివద్దాం." అంది మేరీ ఒక నిశ్చయానికొస్తూ.

 

    ఆనందం బయటకు నడిచాడు. మేరీ అనుసరించింది ఏదో ఆలోచిస్తూ...


                               *    *    *    *


    "నీ వరసేం నాకు నచ్చలేదు భువనా.. మనమ్మాయికి ఆంజనేయులు లాంటి మంచి కుర్రాడు దొరుకుతాడా?" జరిగిందంతా తెల్సుకున్న భుజంగరావు భార్య మీద విరుచుకుపడ్డాడు.

 

    "నిజమే... కానీ తరణి అన్యాయమైపోతుంది. ఎవరికి ఎవరు ముడి పడతారన్నది మన చేతుల్లో లేదు. ఒక అనాధని ఆదుకున్న పుణ్యం, ఒక అమాయకుడ్ని దరిచేర్చిన పుణ్యం ఊరికే పోదు. ఆ పుణ్యమే మనమ్మాయికి మంచి మొగుడ్ని తెచ్చి పెడుతుంది. మనం మనుష్యులం. మనుష్యుల్లాగే ప్రవర్తించాలి. మృగాల్లా కాదు. తరణి వచ్చి కాళ్ళావేళ్ళా పడ్డా అంత నిర్ధాక్షిణ్యంగా ఎలా నెట్టి వేయగలిగారు? మన పనివాడు చెప్పబట్టి కాపాడగలిగాను? లేదంటే ఏమయిపోయేది? కోట్లున్నాయి మనకు... ఏం చేసుకుంటాం? ఒక్క కూతురు. ఆంజనేయులు ఎందుకు దొంగతనం చేశాడో తెల్సుకుంటే మీరు సిగ్గుపడకుండా వుండలేరు. ఇంక మీరేమీ మాట్లాడకండి. వాలు కుర్చీలో పడుకొని కాళ్ళూపుకోండి" అంది భువనేశ్వరీదేవి తెగేసినట్లు.

 

    "కాదు కాశీబాంబుగాడు..." నసిగాడు భుజంగరావు.

 

    "ఆ చింకోపాంజీగాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు చూస్తూ వుండండి చాలు" అంటూ అవుట్ హౌస్ కేసి వెళ్ళిపోయింది.


                                                    *    *    *    *


    కాశీబాంబు గొడుగు తీసుకొని తలుపుల్నీ, శక్తికపూర్ నీ, అమ్రేష్ పురినీ వెంటబడి మరీ కొట్టాడు.

 

    "ఇదెక్కడి గొడవయ్యా బాసు...? ఎస్.ఐ ఆంజనేయుల్ని వదిలేస్తే మమ్మల్నేం చేయమంటావ్? ఆ పిల్లని మేం పోలీస్ స్టేషన్ కి వెళ్ళమన్నామా?" ఆ వెనుకే భువనేశ్వరీదేవిని కూడా వెళ్ళమన్నామా?" తలుపులు విసుక్కున్నాడు.

 

    "వాడు జైలుకెళ్తే పిల్లని తీసుకెళ్ళొచ్చనుకున్నాను... ఇప్పుడెలా? గడువట్టే లేదు..." తనలో తను గొణుక్కుంటూ అటూ ఇటూ పచార్లు చేయసాగాడు కాశీబాంబు.

 

    "ఆఖరుసారి వెళ్ళి అసలు విషయం చెప్పి, ఎట్లాగో చేయాలి. వాళ్ళు భార్యాభర్తలనుకుంటున్న పెద్దావిడ కళ్ళు తెరిపిస్తే సరిపోతుంది. పదండి పోదాం" అన్నాడు శక్తికపూర్ రెచ్చిపోతూ.