అప్పుడు ఎంటర్ టెయిన్ మెంట్ సాంగ్ మొదలయింది.

 

    ఆఫీస్ సూపర్నెంట్ నిజంగా పాతికేళ్ళ కుర్రాడి లాగానే సీనియర్ లేడీ క్లర్క్ తో పాటు విగురుతూ, మా అందరి టేబుల్స్ మీద నుంచీ పరిగెడుతూ డాన్స్ చేశాడు.

 

    ఆయన ఆదేశాల మేరకు మేమంతా కూడా ఆ పాటకు కోరస్ పాడాం!

 

    పాట అయిపోయింది. అందరం తప్పట్లు కొట్టి విజిల్స్ వేశాం. అప్పుడు ఆఫీస్ పని మొదలయింది. స్పీకర్ తో బాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్లోగా మొదలయి, క్రమేపీ వేగం పుంజుకుని ఆఖరికి బాగా స్పీడ్ అయిపోతుంది.

 

    ఎందుకంటే మా ఆఫీస్ వర్క్ కూడా ఆ మ్యూజిక్ తగ్గట్టుగా ఫాస్ట్ గా చేయాలని మా సినిమా ప్రభుత్వం రూల్. అందరం మ్యూజిక్ కి తగ్గట్లుగా, ఫైల్స్ లో నోట్స్ రాసేస్తూ, ఫైల్స్ తీసుకుని ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ దగ్గరకు డాన్స్ స్టెప్స్ తో పరుగెడుథూ వర్క్ చేస్తున్నాం! మధ్యాహ్నం ఒంటిగంటకు హఠాత్తుగా మ్యూజిక్ ఆగిపోయింది.

 

    'హమ్మయ్య' అనుకున్నాం- అందరం చెమటలు తుడుచుకుంటూ.

 

    మేము కాంటీన్లో కెళ్ళగానే "ఇడ్లీ వడే మాకు విందు భోజనం- టీ నీళ్ళే అమృతం- వీటితోనే దేశాన్ని సేవిస్తాం! ప్రజలను నెత్తి కెక్కించుకుంటాం" అన్న పాట బాక్ గ్రౌండ్ లో వినబడుతోంది.

 

    సాయంత్రం అయిదయేసరికి రాష్ట్ర గవర్నర్ టీవీ స్క్రీన్ మీద కనిపించారు. అందరం లేచి నిలబడగానే గవర్నర్ విలన్ గా నటించిన ఓ చిత్రంలో గవర్నర్ స్వయంగా పాడిన పాట మొదలయింది.

 

    "మేరే అంగనేమే తుమ్హారా క్యా కామ్ హై" అనే ట్యూన్ లో ఉందా పాటంతా.

 

    పాట పూర్తవగానే గవర్నర్ విలన్స్ తో ఫైటింగ్ చేసిన కొన్ని సినిమాల్లోని దృశ్యాలు చూపించారు.

 

    అవన్నీ పూర్తవగానే అందరం "జై సినిమా! జై హింద్! శుభం" అంటూ నినాదం చేసి మేకప్ రూమ్ లోకి పరుగెత్తి మేకప్పూ, విగ్గులూ అన్నీ తీసేసి ఇళ్ళకు బయల్దేరాం.

 

    బస్ స్టాప్ లో ఎంతసేపు నిలబడ్డా 'నటసార్వభౌమ' అనే బస్ మాత్రం రాలేదు. అన్నట్లు సినిమా రాజ్యంలో బస్ లకు నెంబర్లుండవ్. సినిమా నటీనటుల పేర్లు, వాళ్ళ బిరుదులూ, ఇవే ఉంటాయి. మా కాలనీకి నటప్రపూర్ణ బస్ లో బయల్దేరాం. ఆ బస్ "సంసారసంగమం" బస్ డిపో మీదుగా ప్రతిఘటన కాలనీ, అమెరికా అల్లుడు నగర్, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం బ్రిడ్జి మీద నుంచీ మా కాలనీ చేరుకుంది.

 

    కాలనీకి చేరుకునేసరికి మా కాలనీ లేడీస్ అందరూ అడవి కన్యల డ్రస్ వేసుకుని, అడవి జాతి స్త్రీలు చేసే ట్రైబల్ డాన్స్ చేస్తూ మా అందరికీ స్వాగతం పలికారు. ఆ పాట మధ్యలోనే అందరికీ 'టీ' కప్పులు కూడా అందించేశారు.

 

    ప్రభుత్వోద్యోగులందరూ ఇళ్ళు చేరుకునేటప్పటికి వాతావరణం ఆహ్లాదకరంగా కనిపించాలని ఇదంతా ప్రభుత్వ ఆస్థాన కొరియోగ్రాఫర్ చేసిన ఏర్పాటు! ఆ తరువాత కాలనీలో యంగ్ గాళ్స్ అందరూ కలసి లేటెస్ట్ సినిమా బూతుపాటని అంగాంగ అభినయంతో పాడి అందరిని అలరింపజేశారు. ఆ పాట రాసిన లిరిక్ రైటర్ వెంటనే టీవీ స్క్రీన్ మీద కనబడి తను ప్రభుత్వాదేశాల మేరకు ఎంత కష్టపడి ఆ పాట రాసిందీ వివరించాడు.

 

    "ఈ పాటను నేను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఎందుకంటే ఈ సినిమా రాజ్యానికి నావంతు తోడ్పాటు నేనందించాలి కదా!

 

    అందుకే దేశంలోని రెడ్ లైట్ ఏరియాస్ అన్నీ తిరిగి, బూతుపాటలన్నీ సేకరించి వాటి మీద రీసెర్చ్ చేసి మరీ ఈ పాట రాశాను-"

 

    ఆ కార్యక్రమం ముగుస్తూండగానే మా కాలనీలో కొంతమంది ప్రభుత్వం అఫీషియల్ గా ఏర్పాటు చేసిన సెకండ్ సెటప్ ఇళ్ళకు వెళ్ళిపోయారు. సెకండ్ సెటప్ లను ఎంకరేజ్ చేయటమే కాకుండా సెకండ్ సెటప్ ఉన్న ప్రతి ఉద్యోగికీ జీతం పైన మరో యాభైశాతం జీతం 'ఎక్ స్ట్రా అలవెన్స్' పేరు మీద ఇస్తుంది.

 

    ప్రతి మగాడికీ ఇద్దరు పెళ్ళాలున్న దేశంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయన్నది మా సినిమా రాజ్యం స్లోగన్.

 

    హఠాత్తుగా గోపాల్రావ్ వాళ్ళ చిన్నిగాడు కొంపలు మునిగిపోయినట్టు ఏడుపు మొదలెట్టేసరికి అందరం వాడింటివేపు పరుగెత్తాం.

 

    తీరా చూస్తే గోపాల్రావే వాడిని పట్టుకుని చితగ్గొడుతూ కనిపించాడు.

 

    శాయిరామ్, రంగారెడ్డి వాడిని పట్టుకుని చిన్నిగాడిని రక్షించారు.

 

    "సంగతేమిటి?" అడిగాన్నేను.

 

    "ఈ రాస్కెల్ ని చూడండి! ఫైనల్ ఎగ్జామ్స్ చెడగొట్టేశాడు..." అన్నాడు కోపంగా వాడి కొశ్చెన్ పేపర్ విసిరికొడుతూ.

 

    "లేదంకుల్ అన్నీ బాగానే రాశాను. ఒక్క కొశ్చెన్ రాయలేదు."

 

    శాయిరామ్ ఆ కొశ్చెన్ పేపర్ అందుకున్నాడు.

 

    "సినీ నటబ్రహ్మ- ప్రముఖ సినీనటుడు- నేటి మంత్రివర్యులు- శ్రీరంగ జీవిత చరిత్ర క్లుప్తముగా వ్రాయుము! దీనికేం రాశావ్ రా?"

 

    వాడు అడిగిందే తడవుగా గడగడ చదివేయసాగాడు.

 

    సినీ నటబ్రహ్మ శ్రీ రంగా- 1950లో రైతు-నాగలి చిత్రం ద్వారా సినిమా రంగమునందు ప్రవేశించి పదిహేను సంవత్సరాలపాటు మూడొందల తొంభయ్ చిత్రాల్లో నటించి భారతదేశానికీ, భారత ప్రజలకూ ఎనలేని సేవ చేశారు.

 

    వీరు నటించిన చిత్రంలో "రౌడీ వెధవ" మేనత్త చెల్లెలి మొగుడు-దానమ్మకు యముడు" "దగుల్బాజీ నాయాలు" "పొగరుబోతూ పుండాకోర్" చిత్రాలకు ఎన్నో ప్రభుత్వ అవార్డ్ లు వచ్చాయ్..."

 

    "చూశావా-చూశావా! దొంగబాడుకవ్, కత్తి పట్టిన కిరాతకపు ముండాకొడుకు" సినిమాల సంగతి మర్చిపోయాడు. రెండొందల డెభ్బై రోజులు ఆడిన మొదటి సినిమారా అది అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను. దీనికి భారత ప్రభుత్వ అవార్డులు కూడా వచ్చాయ్-" మండిపడుతూ అన్నాడు గోపాల్రావ్.

 

    "నాకా బూతుమాట గుర్తు రాలేదు డాడీ!-"

 

    "ఛట్ వెధవా! ఇప్పుడు చూడు ఎనిమిది మార్కులు గోవిందా-"

 

    శాయిరామ్ ఇంకో ప్రశ్న చదివాడు.

 

    "ప్రఖ్యాత నటి కాంతిశ్రీకి పద్దెనిమిదవ వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినది? మిగతా పదిహేడుగురు భర్తల పేర్లేమి? వారిలో ఇంకా ఇప్పటికీ బ్రతికున్నవారెవరు?"

 

    యాదగిరి చప్పున వాళ్ళబ్బాయి రమేష్ గాడిని ఈడ్చుకొచ్చాడు.

 

    "ఒరేయ్ నువ్ చెప్పరా దీనికి సమాధానం! నువ్వేం రాశావో- ఎలా రాశావో తేలుస్తానిప్పుడు" అన్నాడు వాడితో.

 

    రమేష్ కళ్ళు మూసుకుని ఓ క్షణం ఆలోచించి అప్పజెప్పసాగాడు.

 

    "శ్రీమతి కాంతిశ్రీకి పద్దెనిమిదవ వివాహము 'మురుగా మహేశన్'తో 1982వ సంవత్సరంలో వాళ్ళ ఊళ్ళోనే పాడుబడ్డ గుళ్లో జరిగెను, ఆమె పాత భర్తల పేర్లు సంపత్, కుమార్, శ్రీశైలేశ్వరరావ్........"

 

    శాయిరామ్ వాడి నోరు మూసేసి ఇంకో ప్రశ్న చదివాడు బిగ్గరగా.

 

    ఈ క్రింది ఖాళీలను పూరింపుము.

 

    'అడవిజలగ' చిత్రమునకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వారు- డాష్-డాష్-డాష్- ఎవర్రా!"

 

    "నువ్వు చెప్పరా!"

 

    నేను మా కిరణ్ గాడిని అడిగాను ఈసారి.

 

    "సన్యాసిరావ్" అన్నాడు తక్షణం వాడినెత్తిన ఒక్కటిచ్చాడు గోపాల్రావ్.

 

    "సన్యాసిరావ్ కాదురా వెధవా! సింగినాథ్ రావ్! రాత్రేగా మీ అందరకూ ఈ కొశ్చెన్స్ 'ఇంపార్టెంట్ రా' అని చెప్పింది?"

 

    వాడు ఏడ్పు మొఖం పెట్టాడు.

 

    "ఈ క్రింది వాక్యమునకు సందర్భము వ్రాయము-" అంటూ మరో ప్రశ్న చదవసాగాడు యాదగిరి.