ఏమిటన్నట్టు చూశాడు మహంతి.
    
    "బేరర్ యాదగిరి, సేఫ్టీ గురించి వర్కవుట్ చెయ్యకుండా ఇక్కడ కొచ్చేశాను..." రెండు క్షణాలు మహంతి కూడా ఏం మాట్లాడలేకపోయాడు.
    
    "ఎందుకైనా మంచిది.... యాదగిరితో మీరు అర్జంటుగా మాట్లాడండి.....ఎందుకంటే..." ఆ వాక్యం ఇంకా పూర్తవలేదు. సూర్యవంశీ బేరర్ ని పిల్చి, బిల్లు పేచేసి, గబగబా బయటికొచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్ వేపు నడిచాడు.
    
    మొదట యాదగిరి పనిచేసే హైద్రాబాద్ లోని ప్రెస్ క్లబ్ కి ఫోన్ చేశాడు. ఆ టైమ్ లో బార్ ఉండదనే విషయం సడన్ గా గుర్తుకు రావడంతో - ఏ.సి.పి. నిరంజనరావుకి ఫోన్ చేశాడు.
    
    ఆ సమయంలో నిరంజనరావు స్టేషన్లో లేడు-ఇంట్లో ఉన్నాడు.
    
    "ఏమయ్యా.... ఎక్కడికి మాయమైపోయావ్..." కంగారుగా అడిగాడాయన.
    
    ఎక్కడున్నాడో చెప్పాడు సూర్యవంశీ.
    
    "నాతో చెప్పి వెళ్ళొచ్చుగా..." ఆ గొంతులో చికాకునీ, అసహనాన్నీ గమనించాడు సూర్యవంశీ.
    
    "ఏం సార్.... ఏమైందీ..."
    
    "బేరర్ యాదగిరిని మర్డర్ చేసారు...." ఏ.సి.పి నిరంజనరావు గొంతులోంచి వచ్చిన ఆ మాట వినగానే-
    
    "బాస్టర్స్..." గట్టిగా అరిచాడు సూర్యవంశీ అతని ముఖం ఒక్కసారి ఎర్రగా అయిపోయింది.
    
    "ఇప్పుడే... ఇమ్మీడియట్ గా వచ్చేస్తున్నాను...." ఫోన్ పెట్టేశాడు సూర్యవంశీ.
    
    విషయం తెలుసుకున్న మహంతి, బాధగా నిట్టూర్చాడు.
    
    మరో అరగంట తర్వాత-
    
    భువనేశ్వర్ ఎయిర్ ఫోర్ట్ లాంజ్ లో-
    
    "మీకెప్పుడూ ఏ అవసరం వచ్చినా, ఒక్క ఫోన్ చెయ్యండి.... ఓ.కే...." కరచాలనం చేసి, సూర్యవంశీ భుజం తట్టాడు ఇన్స్ పెక్టర్ మహంతి.
    
    మహంతికి కృతజ్ఞతలు తెలియజేసి, సూట్ కేసు అందుకుని లోనికి నడిచాడు సూర్యవంశీ.
    
                                                  *    *    *    *    *
    
    సరిగ్గా మూడుగంటల తర్వాత-
    
    ఎ.సి.పి. నిరంజనరావు ముందున్నాడు సూర్యవంశీ.
    
    వికారాబాద్ లో లాండ్రీ ఓనర్ ని కలవడం దగ్గర్నించి, భువనేశ్వర్ లో మర్డర్ - ఫోరెన్సిక్ రిపోర్ట్ వరకూ జరిగిందంతా చెప్పాడు సూర్యవంశీ.
    
    "ఎస్.... దిసీజ్ ఎ ఫర్ ఫెక్ట్ లీ పొలిటికల్ ప్లే.... సీనియర్ రిపోర్టర్ జగన్నాయకులు మర్డర్ లో ప్రధాన సాక్షి అయిన బేరర్ యాదగిరిని చంపారు- సల్మాని చంపారు.... సురేష్ చంద్రని చంపారు.... అసలు సల్మాకి జగన్నాయకులు మర్డర్ కి ఏమిటి సంబంధం...." ఆశ్చర్యంగా అడిగాడు ఎ.సి.పి. నిరంజనరావు....
    
    "సయ్యద్ కీప్ సల్మాకి కూడా ఆ విషయం తెల్సుంటుంది.... అందుకే.... లేపేసారు..."
    
    "మరి సయ్యద్ ఏవయ్యాడు..."
    
    "మార్చురీలో ఉన్న మొండెం సయ్యద్ దేనని నా అనుమానం...."
    
    "బతికున్నది బబ్లూ అంటావా..."
    
    "ఎస్... ఆ స్టీల్ రాడ్ వ్యక్తి బబ్లూ.... ఇట్స్ హండ్రెడ్ పర్సంట్ ట్రూత్....ఐ విల్ ఫ్రూవ్ యు సర్..." ఆవేశంగా అన్నాడు సూర్యవంశీ.
    
    "అసలు జగన్నాయకుల్ని ఎందుకు చంపారు.... బబ్లూగాడిచేత ఈ ప్లే ఆడిస్తున్నది ఎవరు? ఎందుకు?" ఆవేశపడ్డాడు నిరంజనరావు.
    
    "ఆ రోజు జగన్నాయకులు మర్డర్ కావడానికి ముందు వాళ్ళిద్దరూ ఆయనకు చూపించిన పేపర్స్....ఏమిటో మనకు తెలిస్తే..." సాలోచనగా అన్నాడు సూర్యవంశీ.
    
    "ఇట్ మే బీ వన్ పాయింట్.. బట్.... సూర్యవంశీ... కేసు రోజు రోజుకీ జటిలమవుతోంది....ఈ కేస్ ని క్లోజ్ చెయ్యమని, హోం మినిస్టర్ జనార్ధన ఠాగూర్ డైరెక్టుగా నాకు వార్నింగిచ్చాడు-అందువల్ల నేను చెప్తున్నది జాగ్రత్తగా విను.....నేను భయపడను - నా కేరక్టర్ అదికాదు -కానీ....ఈ పొలిటికల్ సర్కిల్స్ తో మనం పోరాడలేం.... అందువల్ల... హాయిగా నీ ఉద్యోగం నువ్వు చేసుకో....అంతే...."
    
    ఎ.సి.పి. నిరంజనరావు నోటినుంచి అలాంటిమాట వస్తుందని ఊహించని సూర్యవంశీ నిర్ఘాంతపోయాడు.
    
    "సార్.... మీరు..." మరి మాట పెగల్లేదు సూర్యవంశీకి.
    
    అదే సమయంలో-
    
    పోర్టికోలో జీపు ఆగడంతో, డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్న నిరంజనరావు తల పక్కకు తిప్పిచూశాడు.
    
    హోం డిపార్ట్ మెంట్ కు చెందిన స్పెషల్ మెసెంజర్....లోనికొచ్చి సెల్యూట్ చేసి ఓ కవర్ ని నిరంజనరావుకి అందించి, వెనక్కి వెళ్ళిపోయాడు. గబగబా ఆ కవర్ని విప్పి, పేపర్ని తీసి చదివాడు-
    
    "ఇలా జరుగుతుందని నాకు తెలుసు...." ఆ పేపర్ని సూర్యవంశీకిస్తూ అన్నాడు నిరంజనరావు.
    
    "సడన్ గా మిమ్మల్ని ప్రమోషన్ మీద విశాఖపట్నానికి పోస్ట్ చేసారేమిటి?"
    
    "ఎందుకు చేసారో ఊహించలేవా..." బాధగా అన్నాడాయన.
    
    అయిదు నిమిషాలసేపు, ఒకరెదుట ఒకరు బొమ్మల్లా కూర్చుండి పోయారిద్దరూ.
    
    "మిమ్మల్ని వైజాగ్ ట్రాన్స్ ఫర్ చేసి, ఈ కేసుకి దూరంగా తరిమేసినా, నేనీ కేసుని వదలను సార్...." లేచి నిలబడుతూ అన్నాడు సూర్యవంశీ.
    
    ఆ మాటకు నిరంజనరావు ప్రతిస్పందన ఏమీలేదు.
    
    "వైజాగ్ లో ఎప్పుడు జాయినౌతున్నారు...." అడిగాడతను.
    
    "రేపు, గోదావరి ఎక్స్ ప్రెస్ కి బయలుదేరాలి..."
    
    "రేపు స్టేషన్లో కలుస్తాను...." చెప్పి, రెండడుగులు ముందుకేసి ఏదో అడగబోయి, మానేసి ముందుకు నడిచాడు....
    
    తను మనసులో అనుకున్నది సూర్యవంశీ, ఆ క్షణంలో నిరంజనరావుతో చెప్పి ఉంటే బాగుండేది...
    
    అది-భువనేశ్వర్ హోటల్లో జరిగిన మర్డర్ న్యూస్, పేపర్ కివ్వడమా? మానడమా? అన్నది....
    
    కానీ-ఆ వార్తను డిటైల్ గా రాసి, ఫోటోతో సహా పత్రికకు యిచ్చేసి, ఆఫీసులో ఓ రెండు గంటలు గడిపి, రూమ్ కి బయలుదేరాడు సూర్యవంశీ.
    
                                                 *    *    *    *    *
    
    రాత్రి సరిగ్గా 8-40 నిమిషాలు సూర్యవంశీ బాగ్ లింగంపల్లి చౌరాస్తాలోకొచ్చి వైన్ షాపు వేపు తిరిగాడు. హీరో హోండా ని పార్క్ చేసి, షాపు మెట్లెక్కుతుండగా, తనను రాసుకుని ఎవరో ఒకవ్యక్తి ముందుకు రావడంతో తలత్రిప్పి చూశాడు.
    
    నీలిరంగు కుర్తా, పైజామాలో తనని బావా అన్న అమ్మాయి!
    
    "క్యా భాయ్..... ఏంటిలా వచ్చారు.... బార్ స్టాండర్డ్ దగ్గర్నించి, బాటిల్ స్టాండర్డ్ కొచ్చిందా వ్యవహారం...." భుజాలమీద, ఫ్రీగా చెయ్యి వేసి అబ్బాయిలా మాట్లాడుతున్న ఊహవేపు, అనుమానంగా చూసాడు సూర్యవంశీ.